Saturday, October 31, 2020

సుభద్రా పరిణయం, మిథిలా నగరానికి పోయిన శ్రీకృష్ణుడు .... శ్రీ మహాభాగవత కథ-82 : వనం జ్వాలా నరసింహారావు

 సుభద్రా పరిణయం, మిథిలా నగరానికి పోయిన శ్రీకృష్ణుడు

శ్రీ మహాభాగవత కథ-82

వనం జ్వాలా నరసింహారావు

కంII             చదివెడిది భాగవతమిది,

చదివించును కృష్ణు, డమృతఝరి పోతనయున్

                             చదివినను ముక్తి కలుగును,

చదివెద నిర్విఘ్నరీతి ‘జ్వాలా మతినై

సముద్రం పాలైన గురువుగారి కుమారుడిని బలరామకృష్ణులు తీసుకువచ్చిన విషయాన్ని విన్న దేవకీదేవి, కంసుడు వధించిన తన కొడుకులను కూడా తీసుకువచ్చి తనకు చూపమని బలరామకృష్ణులను కోరింది. అలా చూపించి తన దుఃఖాన్ని పోగొట్టమని ప్రార్థించింది. ఆమె కోరిక తీర్చడానికి ఇద్దరూ సుతల లోకానికి వెళ్లారు. సుతల లోకాధిపతి అయిన బలి చక్రవర్తి బలరామకృష్ణులను చూసి, వారికి స్వాగతం చెప్పి, వారిని స్తుతించి, శ్రీకృష్ణుడి దర్శన భాగ్యానికి మురిసిపోతూ, తానేం చేయాల్నో ఆజ్ఞాపించమన్నాడు.

దేవకీదేవి గర్భంలో జన్మించిన ఆరుగురు కొడుకులను కంసుడు చంపాడని, దానికి తన తల్లి విపరీతమైన బాధకు గురైందని, తన పుత్రులను చూడాలనే కోరికతో వారిని తెచ్చి ఇమ్మని తమను ప్రార్థించిందని, ఆ కారణంగా మాతృమూర్తి కోరిక తీర్చడానికి సుతల లోకానికి వచ్చామని, బలి చక్రవర్తి అధీనంలో వున్న ఆ ఆరుగురిని తీసుకునిపోయి తల్లికి చూపించి ఆమె బాధ పోగొట్టుతామని చెప్పాడు శ్రీకృష్ణుడు. అలా చూపించి వారి శాపాన్ని పోగొట్టి, వారికి సద్గతి ప్రసాదిస్తానని అన్నాడు. అలా చెప్పి, వారిని తీసుకుపోయి తల్లికి చూపించాడు. ఆమె ఎంతగానో మురిసిపోయింది. కొడుకులను ముద్దాడింది. ఒడిలోకి తీసుకుని చనుబాలిచ్చింది. వారు కూడా వైష్ణవమాయకు వశులై, తల్లిపాలు తాగారు. ఆ తరువాత ఆ ఆరుగురు దేవకీదేవికి నమస్కరించి తమతమ నివాసాలకు వెళ్లిపోయారు.

ఇదిలా వుండగా, అర్జునుడు తీర్థయాత్రలు చేద్దామనే ఆలోచనతో అంతటా తిరుగుతూ, ఒకనాడు ప్రభాస తీర్థానికి చేరుకున్నాడు. అక్కడ కొంతకాలం వుండి ప్రశాంతంగా కాలం గడిపాడు. అప్పుడే, సుభధ్ర మీదున్న అనురాగంతో ఆమెను చూద్దామనుకున్నాడు. ఆమెను దుర్యోధనుడికి ఇచ్చి పెళ్లి చేయాలని బలరాముడు భావిస్తున్నట్లు విన్నాడు. బలరాముడికి తెలియకుండా సుభద్రను చూడడానికి, సన్న్యాసి వేషంలో ద్వారకానగరం చేరుకున్నాడు అర్జునుడు. ఆయన నిజమైన సన్న్యాసి అనుకున్నారు ద్వారకానగర వాసులు. భక్తితో ప్రతిరోజూ పూజించారు. ఒకనాడు బలరాముడు కపట సన్న్యాసిని నిజమైన సన్న్యాసి భావించి తన ఇంటికి తీసుకువచ్చాడు.

బలరాముడి ఇంటికి పోయిన అర్జునుడు సుభద్ర కోసం వెతకసాగాడు. ఆమె కనబడగానే అర్జునుడి ప్రేమైక దృష్టి ఆమె మీద పడింది. సుభద్ర మీద తన మనస్సును లగ్నం చేశాడు. సుభద్ర కూడా ఆర్జునుడిని చూసింది. సుభద్రార్జునులిద్దరూ ఒకరిమీద ఒకరు మనసు పడ్డారు. అలా వుండగా, ఒకనాడు, సుభద్ర అంతఃపురం నుండి బయటకు వచ్చింది. అర్జునుడు, శ్రీకృష్ణుడు, దేవకీవసుదేవుల అనుమతితో సుభద్రను సమీపించాడు. ఆమెను తన రథం మీద కూచోబెట్టుకుని తీసుకుపోతుంటే యాదవ వీరులు అడ్డుతగిలారు. వారందరినీ ఓడించి సుభద్రను ఖాండవప్రస్థ పురానికి తీసుకెళ్లాడు.

ఈ వార్త బలరాముడికి తెలిసింది. అర్జునుడి మీద మండిపడ్డాడు. కృష్ణుడు అతడిని శాంతింప చేశాడు. సుభద్రార్జునుల వివాహానికి అతడిని సుముఖుడిని చేశాడు. బలరామ కృష్ణులు చెల్లెలు మీద ప్రేమతో దాసదాసీ జనాన్ని, సమస్త వస్తు సముదాయాన్ని అరణంగా ఇచ్చారు.

ఇదిలా వుండగా, విదేహదేశంలో వున్న మిథిలాపురంలో శ్రుతదేవుడనే బ్రాహ్మణుడు వుండేవాడు. ఆయన అఖండ విష్ణు భక్తుడు. ఆరోజుల్లో ధర్మ మార్గంలో సంచరించే బహుళాశ్వుడనే రాజు మిథిలానగరాన్ని పాలించేవాడు. వారిద్దరి మీదా శ్రీకృష్ణుడికి అపారమైన కరుణ కలిగింది. వారిని చూడాలని బయల్దేరాడు ఒకనాడు. ఆయన వెంట నారదాది మహర్షులు కూడా వున్నారు. శుక మహర్షి కూడా వున్నాడు. విదేహ నగరాన్ని చేరుకోగానే బహుళాశ్వుడు, శ్రుతదేవుడిని వెంటబెట్టుకుని శ్రీకృష్ణుడికి కానుకలివ్వడానికి ఎదురుగా వెళ్ళాడు. శ్రీకృష్ణుడి పాదపద్మాలకు అంతా నమస్కరించారు. బహుళాశ్వ శ్రుతదేవులిద్దరూ పరమాత్ముడిని ప్రార్థించారు.

బహుళాశ్వ శ్రుతదేవులిద్దరి కోరికలు, ఒకరికి తెలియకుండా మరొకరివి తీర్చాలనుకుని మహర్షులను వెంటబెట్టుకుని వారిద్దరి మందిరాలకు వెళ్లాడు శ్రీకృష్ణుడు. బహుళాశ్వుడి మందిరంలో ఆయన శ్రీకృష్ణుడికి, ఆయన పరివారానికి సకల సపర్యలు చేశాడు. శ్రీకృష్ణుడిని, మహర్షులను తన ఇంట్లో కొంతకాలం వుండమని కోరాడు. ఆయన కోరినట్లే మిథిలానగరంలో కొన్ని దినాలు గడిపాడు. మరో వైపు శ్రుతదేవుడు కూడా తన ఇంటికి శ్రీకృష్ణుడి రాకకు మహాదానందపడ్డాడు. పరమాత్మను పూజించాడు. సంతోషంతో తన పైనున్న ఉత్తరీయాన్ని తీసి గిరగిరా తిప్పుతూ నృత్యం చేయసాగాడు. శ్రీకృష్ణుడిని పరిపరి విధాల స్తుతించాడు. శ్రీకృష్ణుడి సూచన మేరకు ఆయన వెంట వచ్చిన మహర్షులందరినీ సద్భక్తితో పూజించాడు.

మహాభక్తులైన బహుళాశ్వ శ్రుతదేవులిద్దరి చేత పూజలందుకున్న శ్రీకృష్ణుడు వారికి సకల సిరిసంపదలు, శుభాలు, అత్యంత భక్తి ప్రసాదించి, వారి దగ్గర సెలవు తీసుకుని ద్వారకానగారానికి వెళ్లాడు.        

          

       (బమ్మెర పోతన శ్రీమహాభాగవతం, రామకృష్ణ మఠం ప్రచురణ ఆధారంగా)

No comments:

Post a Comment