అక్రూరుడితో శ్రీకృష్ణుడు మథురకు ప్రయాణం
శ్రీ మహాభాగవత కథ-63
వనం జ్వాలా నరసింహారావు
కంII చదివెడిది భాగవతమిది,
చదివించును కృష్ణు, డమృతఝరి పోతనయున్
చదివినను
ముక్తి కలుగును,
చదివెద నిర్విఘ్నరీతి ‘జ్వాలా’ మతినై
కంసుడి ఆజ్ఞానుసారం అక్రూరుడు రథం ఎక్కి వ్రేపల్లెకు పయనమయ్యాడు. ఈ లోపున కేశి
అనే రాక్షసుడు కూడా అశ్వరూపంలో, వాయువేగంతో వ్రేపల్లెకు బయల్దేరాడు. వాడు
వ్రేపల్లెకు రాగానే అతడి భయంకరమైన సకిలింపుల వల్ల వెలువడిన ధ్వనికి గోవులు, ఆడవారు, మగవారు,
పసిబిడ్డలు భయభ్రాంతులయ్యారు. ఆ మందలో కృష్ణుడు ఎక్కడున్నాడా అని వెతికాడు
రాక్షసుడు. అతడిని చూసి గుర్తించిన కృష్ణుడు వాడిని యుద్ధానికి పిలిచాడు. ఇద్దరి
మధ్య యుద్ధం జరిగింది. కృష్ణుడు తన చేతిని వాడి నోట్లోకి చొప్పించి, వాడి పండ్లన్నీ రాలిపోయేట్లు చేశాడు. చివరకు వాడు తన మాయారూపాన్ని వదిలి
తన్నుకుంటూ, అరుస్తూ, నేలకూలాడు. వాడి
దేహం రెండుగా చీలిపోయింది. అలా కృష్ణుడు కేశి అనే ఆ రాక్షసుడిని సంహరించాడు.
అప్పుడక్కడికి నారద మహర్షి వచ్చాడు. భూభారాన్ని తగ్గించడానికి అవతరించాడు
కృష్ణుడని స్తుతించాడు. ఇంకా ఆయన చేతుల్లో చావడానికి చాణూరుడు, ముష్టికుడు, కువలయాపీడమనే ఏనుగు, కంసుడు, శంఖుడు, కాలయవనుడు,
మురాసురుడు, నరకాసురుడు, పౌండ్రక
వాసుదేవుడు, శిశుపాలుడు, దంతవక్త్రుడు, సాల్వుడు మొదలైన వారున్నారని అన్నాడు. ఇంకా ఆయన చేయాల్సిన పనులు అనేకం
వున్నాయని, అవన్నీ లెక్కపెట్టడం ఎవరి తరం కాదని అన్నాడు
నారదుడు. ఇలా చెప్పి నారదుడు కృష్ణుడిని స్తోత్రం చేసుకుంటూ వెళ్లిపోయాడు.
ఒకనాడు గోపబాలురు కృష్ణుడితో కలిసి అడవికి పోయి పశువులను మేపుతుంటే మయుడనే
రాక్షసుడి కొడుకు వ్యోముడు ఒక గొల్ల పిల్లవాడిలాగా వచ్చి వారిలో కలిశాడు. పిల్లలు
ఆడుకునే దొంగాటలో చేరి, నలుగురైదుగురిని తప్ప మిగతా పిల్లలను కొండగుహలోకి
తీసుకుపోయాడు. వారందరినీ దాంట్లో వుంచి పెద్ద బండతో ద్వారాన్ని కప్పేసి ఏమీ
తెలియనివాడిలాగా వెనక్కు వచ్చాడు. ఇది గ్రహించిన శ్రీకృష్ణుడు వాడిని ఒడిసి
పట్టాడు. విడిపించుకోవడానికి వాడికి బలం సరిపోలేదు. కృష్ణుడు వ్యోమాసురుడిని
చంపాడు. తరువాత పర్వత గుహ దగ్గరికి వెళ్లి బండను తొలగించి, గొల్ల పిల్లలను బయటకు తెచ్చి అంతా కలిసి వ్రేపల్లెకు
వెళ్లారు.
ఇది జరిగిన నాటి మర్నాడు రథం ఎక్కి గోకులానికి పోతూ అక్రూరుడు, శ్రీకృష్ణ దర్శనానికి పోతున్న తన అదృష్టానికి ఆనందించాడు. అలా
తాను పోవడానికి కారణమైన కంసుడు తనకు నిజమైన స్నేహితుడని భావించాడు. తనను చూసి
కృష్ణుడు ఏవిధంగా తలుస్తాడోనని విచారించసాగాడు. వ్రేపల్లెకు చేరుకుంటూ, కృష్ణ బలరాములు సంతోషంగా సంచరించే బృందావనం చూశారు. చూసి అందులోకి
ప్రవేశించాడు. అక్కడ గొల్లవారు గోవులను పిలిచే శబ్దాలను వినసాగాడు. పశువుల వెంట
లేగదూడలను ఎత్తుకుని నడుస్తున్న గొల్లవారిని చూశాడు. మరింత ముందుకు పోయి కృష్ణ
ధ్యానంలో వుండి అతడి కొరకు ఎదురుచూస్తున్న గోపికా స్త్రీలను చూశాడు. ఈ విధంగా
బలరామకృష్ణుల రక్షణలో వున్న వ్రేపల్లెలోకి అక్రూరుడు ప్రవేశించాడు.
రథం దిగి కృష్ణుడిని చూడాలన్న తహతహతో వున్న అక్రూరుడు ఒకేసారి బలరామకృష్ణులను
చూశాడు. కన్నుల నుండి ఆనంద భాష్పాలు రాలుతుంటే వారి పాదాలకు వినయంగా మొక్కాడు.
భక్తులంటే ప్రేమ గల కృష్ణుడు హస్తం చాచి అక్రూరుడిని కౌగలించుకున్నాడు. ఆ తరువాత
అక్రూరుడు బలరాముడికి నమస్కారం చేశాడు. ఆయన కూడా అక్రూరుడిని కౌగలించుకుని, చేయి పట్టుకుని, కృష్ణుడితో సహా ఇంటికి
పోయారు. కుశల ప్రశ్నల అనంతరం నందుడు అక్రూరుడితో సంభాషించాడు. మామ కంసుడిని
గురించి, తల్లితండ్రులు దేవకీ-వసుదేవుల గురించి అక్రూరుడిని
అడిగాడు కృష్ణుడు. అక్రూరుడు వచ్చిన కారణం కూడా చెప్పమన్నాడు. నారదుడు కంసుడి
దగ్గరికి వచ్చి బలరామకృష్ణుల సంగతి చెప్పడం దగ్గరనుండి,
ధనుర్యాగం పేరు చెప్పి వారిద్దరిని తీసుకురమ్మని కంసుడు తనను పంపడం దాకా అన్ని
విషయాలు చెప్పాడు అక్రూరుడు.
ఇదంతా విన్న కృష్ణుడు తన చుట్టూ వున్న నందుడు మొదలైన గోపకులను చూసి, కంసుడు యాగానికి పిలిచాడు కాబట్టి తప్పక వెళ్లాలి కదా!
అన్నాడు. పాలు, పెరుగు, నెయ్యి, కట్నకానుకలు తీసుకుని వాహనాలలో బయల్దేరమని వారికి చెప్పాడు. అక్రూరుడు
కృష్ణుడిని మధురకు తీసుకు పోతున్నాడని తెలిసి గోపికలు కలత చెందారు. ఆయన పోకుండా
చేసే ఉపాయమేమైనా వున్నదా అని ఆలోచించారు. విరహతాపంతో భ్రాంతిని పొందారు. గోవిందా!
దామోదరా! మాధవా! అంటూ స్వరబద్ధంగా పాటలు పాడారు. తన వెంట వస్తానన్న గోపికల
ప్రయాణాన్ని నిలిపి వేశాడు కృష్ణుడు. నందుడు మొదలైన గోపాలురంతా తన వెంట రాగా
అక్రూరుడు నడుపుతున్న రథాన్ని ఎక్కి మథురా పట్టణ మార్గాన బయల్దేరాడు కృష్ణుడు.
దారి మధ్యలో బలరామకృష్ణులు, అక్రూరుడు యమునానదిని చూశారు. కాలింది మడుగులో
నీళ్లు తాగి బలరామకృష్ణులు చెట్టునీడన రథం మీద కూచోగా, అక్రూరుడు నదిలో దిగి వేదమంత్రాలను జపిస్తూ స్నానం చేశాడు.
అక్రూరుడికి బలరామకృష్ణులు కాసేపు నీళ్లలో రథం మీద కూచున్నట్లు, కాసేపు చెట్టుకింద రథం మీద కూచున్నట్లు కనిపించారు. అక్రూరుడికి ఆశ్చర్యం
వేసింది అలా చూడగానే. కాసేపైన తరువాత అక్రూరుడు నదీ జలాల్లో ఆదిశేషుడిని చూశాడు.
స్తోత్రం చేశాడు ఆయన్ను చూసి. తనను పలుపలు విధాలుగా స్తోత్రం చేస్తున్న
అక్రూరుడికి యమునా నదీ జలాల్లో చతుర్భుజ శంఖ చక్రాది చిహ్నాలతో తన స్వరూపాన్ని
చూపించి అంతర్థానమయ్యాడు కృష్ణుడు. ఆ తరువాత అక్రూరుడు నీళ్లలో నుండి బయటకొచ్చాడు.
‘విచిత్రాలన్నీ నీలోనే వున్నాయి మహాత్మా!’ అని కృష్ణుడికి చెప్పి, సాయం సమయానికి మథురా పట్టణానికి చేరుకునేట్లుగా రథాన్ని తోలాడు. చేరి, రథాన్ని తీసుకు పొమ్మని అక్రూరుడికి చెప్పాడు కృష్ణుడు.
(బమ్మెర
పోతన శ్రీమహాభాగవతం, రామకృష్ణ మఠం ప్రచురణ ఆధారంగా)
No comments:
Post a Comment