Sunday, October 11, 2020

చోరదండనమే రావణ వధ .... శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-29 : వనం జ్వాలా నరసింహారావు

 చోరదండనమే రావణ వధ

శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-29

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (12-10-2020)

(ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రంతో హనుమంతుడిని పడగొట్టాడు. అస్త్ర బంధనం అభేద్యమని తెలియని మూఢులు అతడి అనుచరులు. వూరికే కిందపడ్డాడని అనుకున్నారు వాళ్ళు. తటాలున పైనబడి హనుమంతుడిని తాళ్లతో కట్టేసారు. నీచ సాంగత్యాన్ని, తనపైన విశ్వాసం లేకపోవడాన్ని ఓర్చుకోలేని బ్రహ్మాస్త్రం హనుమంతుడి కట్లు వదిలించింది. అది రాక్షసులకు తెలవదు. హనుమంతుడికి తెలిసినా రావణుడిని చూసి మాట్లాడాలని, కట్లున్నవాడిలాగానే నటించాడు. ప్రపత్తికి మహా విశ్వాసమే ప్రాణం. విశ్వాస లోపం జరుగుతే ప్రపత్తి చెడుతుంది. బ్రహ్మాస్త్రం బంధాలకన్న తాళ్లు గట్టివనుకున్నారు మూఢ రాక్షసులు. అట్లాగే భగవంతుడికి శరణాగతులైనవారు, ఆయనమీద నమ్మకం లేక, ఇతర ఉపాయాలను వెదికితే భ్రష్టులవుతారు. ఇంకో విషయం: "చూసితి సీత" నంటాడు. ఇక్కడ చూడడం ప్రధానం. అందుకే మొదలు చూసిన సంగతి చెప్తాడు. అయితే ఆ చూసింది సీతనే సంగతి తర్వాతొచ్చే విధంగా చూసితి సీత నంటాడు. ఇక ఇక్కడినుంచి యుద్ధ కాండ వృత్తాంతం చెప్తాడు నారదుడు).

"సూర్యవంశంలో జన్మించిన శ్రీరామచంద్రుడు, సూర్యుడి కొడుకైన సుగ్రీవుడితో-అతడి సైన్యంతో, దక్షిణసముద్రపు తీరం చేరి, దాటేందుకు దారిమ్మని సముద్రుడిని ప్రార్తిస్తాడు. దారివ్వని సముద్రుడిపై కోపించిన రాముడు, సూర్యుడితో సమానమైన బాణాలను వేసి సముద్రాన్ని అల్లకల్లోలం చేస్తాడు. ఆ క్షోభకు గురైన సముద్రుడు, తన భార్యలైన నదులతో సహా నిజ స్వరూపంతో వచ్చి, రామచంద్రమూర్తి పాదాలపై పడి, క్షమించమని వేడుకుని, నలుడితో సేతువు కట్టించమని ఉపాయం చెప్తాడు. అదే ప్రకారం చేసి, దానిపై సేనలతో నడచిపోయి, లంకలో నిర్భయంగా ప్రవేశించి, యుద్ధభూమిలో రావణుడిని చంపి, సీతాదేవిని చూసి, ఇన్నాళ్ళూ పగవాడింట్లో వున్న ఆడదానిని ఎట్లా స్వీకరించాలా అని సిగ్గుపడి, సీతాదేవిని కఠినోక్తులాడుతాడు. పతివ్రతైన సీత, తన పాతివ్రత్య మహిమను లోకానికంతా తెలపాలని తలచి, లక్ష్మణుడు పేర్చిన చితిలో మండుటెండలో ప్రవేశిస్తుంది. అప్పుడు అగ్నిహోత్రుడు సీతను బిడ్డలాగా ఎత్తు కొచ్చి, సీతాదేవి వంటి పతివ్రతలు లోకంలో లేరనీ, ఆమెలో ఎట్టి లోపంలేదనీ, ఆమెను గ్రహించమని శ్రీరామచంద్రమూర్తికి అప్పగిస్తాడు. శ్రీరాముడామెను మరల స్వీకరించి, బ్రహ్మ రుద్రాదిదేవతలందరు మెచ్చుకుంటుంటే సంతోషిస్తాడు".

"దేవతా సమూహాల గౌరవం పొందిన శ్రీరామచంద్రమూర్తి, తను చేసిన పని, లోకోపకారం-లోక సమ్మతమైన పనైనందున, సంతోషపడ్తాడు. రావణాసుర వధనే ఆ మహాకార్యాన్ని చూసిన దేవతలు-మునులు- ముల్లోక వాసులు, రావణుడి బాధ తొలిగిందికదా అని సంబరపడ్డారు. తదనంతరం విభీషణుడిని లంకా రాజ్యానికి ప్రభువుగా చేసి, వీరుడై, కృతకృత్యుడై, మనో దుఃఖం లేనివాడయ్యాడు శ్రీరాముడు.



(రావణ వధ, సీతా ప్రాప్తి, ప్రధానం కాదని, విభీషణ పట్టాభిషేకమే ప్రధానమని సూచించబడిందిక్కడ. ప్రధాన ఫలం ప్రాప్తించినప్పుడే ఎవరైనా కృతకృత్యుడయ్యేది - మనో దుఃఖం లేనివాడయ్యేది. సీతా ప్రాప్తి స్వకార్యం. దొంగలెత్తుకొని పోయిన తన సొమ్ము తాను తిరిగి రాబట్టుకోవడంలాంటిది. చోరదండనమే రావణ వధ. తనపని తాను చేయడంలో గొప్పేముంది? విభీషణ పట్టాభిషేకం ఆశ్రిత రక్షాధర్మకార్యం. ఆ అశ్రిత రక్షాభిలాషే రావణ వధకు ముఖ్య కారణం. సీతా ప్రాప్తి స్వంత కార్యం. అందుకే సీతను నిరాకరించగలిగాడుగాని, విభీషణుడి పట్టాభిషేకానికై ఉత్కంఠ వహించాడు శ్రీరాముడు).

ఇంద్రాది దేవతల వరాలు పొంది, ఆ వర బలంతో యుద్ధంలో మరణించిన వానరులకు ప్రాణం పోసి బ్రతికించి, మిత్రులైన సుగ్రీవ విభీషణులతో కలిసి సార్థక నామధేయమైన అయోధ్యకు పుష్పక విమానంలో బయల్దేరి పోతాడు శ్రీరాముడు. త్రోవలో భరద్వాజుడి ఆశ్రమంలో దిగి, తనరాక విషయం భరతుడికి చెప్పాల్సిందిగా ముందు హనుమంతుడిని ఆయన వద్దకు పంపుతాడు. తర్వాత పుష్పక మెక్కి అయోధ్యకు పోతూ, దారిలో గతంలో జరిగిన వృత్తాంతమంతా సుగ్రీవుడికి చెప్తాడు. సాధుచరిత్రుడైన భరతుడుండే నందిగ్రామంలో దిగి, తమ్ములతో సహా జడలు తీసేస్తాడు".

"సీతామహాలక్ష్మి తోడుండగా, సూర్యతేజుడైన శ్రీరామచంద్రమూర్తి రాజ్యలక్ష్మిని తిరిగి యదార్థంగా పొందడంతో ముల్లోకాలు మిక్కిలి సంతోషించాయి. శ్రీరామచంద్రుడు రాజ్యం చేసేటప్పుడు లోకాలన్నీ సంతోషించాయి. సంతోషాతిశయంతో కలిగిన గగుర్పాటుతో సాదువులు, ధర్మాత్ములు బలపడ్డారు. శ్రీరామరాజ్యంలో సాదువులు చేసే శ్రీరామ సేవకు విరోధమైన మనోవేదనలుకాని, రోగబాధలుకాని, యీతిబాధలుకాని లేవు. పుత్రశోకం ఏ తల్లితండ్రులకు కలగలేదు. స్త్రీలు పాతివ్రత్యాన్ని విడవలేదు. వారికి వైధవ్య దుఃఖం లేదు. ఎక్కడా అగ్నిభయంలేదు. శ్రీరామరాజ్యంలో నీళ్లలో పడి చనిపోయినవారు లేరు. పెద్దగాడ్పులతో ప్రజలు పీడించబడలేదు. దొంగలు లేరు. ఆకలికి-జ్వరానికి తపించినవారు లేరు. నగరాలలో, గ్రామాలలో, నివసించే జనులు ధన-ధాన్యాలు విస్తారంగా కలిగి, భోగభాగ్యాలతో కృతయుగంలో లాగా మిక్కిలి సుఖమనుభవించారు. శ్రీరాముడు అనేక అశ్వమేధ యాగాలను, యజ్ఞాలను చేసి, బ్రాహ్మణులకు లెక్కపెట్టలేనన్ని ఆవులను, ధనాన్ని దానమిచ్చి, తనసుఖాన్ని వదులుకోనైనా ప్రజలకు సుఖం కలిగేటట్లు ధర్మ పద్ధతిలో రాజ్యపాలన గావించి, వైకుంఠ లోకానికి పోయాడు. శ్రీరామచంద్రమూర్తి, రాజ్య హీనులై నానా దేశాలలో తిరుగుతున్న పూర్వ రాజుల వంశాల వారిని పిలిపించి, వారి పెద్దల రాజ్యాన్ని వారికిచ్చి, వారంతా స్వధర్మాన్ని వీడకుండా కాపాడాడు. బ్రాహ్మణ-క్షత్రియ-వైశ్య-శూద్రులనే నాలుగు వర్ణాల వారిని చక్కగా పరిపాలించాడు. స్వధర్మానుష్ఠానమే మోక్షకారణమనీ, పరధర్మానుష్ఠానం పతనకారణమనీ తెలియచేశాడు. శ్రీరామచంద్రమూర్తి పదకొండువేల సంవత్సరాలు ఇలా రాజ్యాన్ని పాలించి విష్ణు లోకానికి చేరుకుంటాడు".

No comments:

Post a Comment