పూతన, శకటాసుర, తృణావర్తుల సంహారం చేసిన చిన్ని కృష్ణుడు
శ్రీ మహాభాగవత కథ-52
వనం జ్వాలా నరసింహారావు
కంII చదివెడిది భాగవతమిది,
చదివించును
కృష్ణు, డమృతఝరి పోతనయున్
చదివినను
ముక్తి కలుగును,
చదివెద
నిర్విఘ్నరీతి ‘జ్వాలా’
మతినై
కంసుడు పంపిన పూతన అనే రాక్షసి శ్రీమహావిష్ణువు అవతరించిన వ్రేపల్లెకు
ఆకాశమార్గాన వచ్చింది. మారురూపంలో, అందమైన
యువతి వేషాన్ని ధరించి, ఇల్లిల్లూ పసివారిని వెతుక్కుంటూ, బాలకృష్ణుడు వున్న నందగోపుడి ఇంటికి సమ్మోహనంగా బయల్దేరి వచ్చింది పూతన.
ఆమెను చూసిన గోపికలు, ఆమె అందానికి ఆశ్చర్యపోయి, శృంగార వేషంలో వచ్చిన లక్ష్మీదేవేమో ఈమె అని భావించారు. ఇంట్లో పడుకున్న
పరాత్పరుడిని చూసింది. ఆమె బాలింత వేషంతో చనులకు విషం పూసుకుని తనను చేరడానికి
వచ్చిన విషయాన్ని గ్రహించాడు చిన్ని కృష్ణుడు. గురకపెట్టుతూ నిద్రిస్తున్నవాడిలాగా
నటించసాగాడు. పూతన బాలుడిని ఎత్తుకుని ముద్దాడుతూ రొమ్ముకు అదుముకుని
పాలివ్వడానికి సిద్ధపడింది. యశోదారోహిణులు వారిస్తున్నా,
వారి మాటలు లక్ష్యం చేయలేదు. తన చన్ను బాలుడి నోట్లో పెట్టింది.
బాలకృష్ణుడు మెల్లగా కన్నులు విప్పి, ఓరకంటితో
చూశాడు. బద్దకంగా ఆవులించాడు. పూతన చంనును పట్టుకుని గుటుకు-గుటుకుమంటూ, రెండు
గుక్కలలో ఆమె శరీరంలోని సత్తువంతా పీల్చేసి, చివరకు
ప్రాణాలను కూడా పీల్చేశాడు. భయంకరమైన ధ్వనితో పూతన నేలమీద పడిపోయింది. దాని
పర్వతాకృతి దేహాన్ని చూసి గొల్లలంతా భయపడుతూ దూరదూరంగా వుండిపోయారు. ఆ మాయలాడి
పొట్టమీద ఆడుకుంటున్న చిన్నవాడిని రోహిణీ, యశోదలు
ఎత్తుకున్నారు. అతడి అవయవాలకు గోమయాన్ని పట్టించారు. గోపకాంతలు బాలుడికి
రక్షకట్టుతూ, విష్ణునామస్మరణం చదువుతూ దీవించారు. యశోదాదేవి చన్ను ఇస్తూ జోలపాడి
నిదురపుచ్చింది. ఆ తరువాత నందుడు, మొదలైన గోపకులు వచ్చి, పూతన కళేబరాన్ని గొడ్డళ్లతో నరికి దూరంగా దహనం చేశారు.
చిన్ని కృష్ణుడు ఒత్తిగిలి బోర్లాపడుతున్నాడని, వేడుకతో, అతడి పుట్టిన నక్షత్రం రోజున పొరుగునున్న గోపికలను పేరంటానికి
పిలిచింది యశోద. వేడుక అయిన తరువాత బాలుడిని పానుపు మీద పడుకోబెట్టి
నిదురపుచ్చింది. నిద్రలేవగానే బాలుడికి ఆకలేసి, మృదువైన తన పాదంతో, పక్కనున్న ఒకానొక బండిని తన్నాడు. అలా తన్నేసరికి ఆ బండి ఒక్కసారిగా పైకి
ఎగిరి నేలమీద పడింది. ముక్కలు-ముక్కలుగా అయిపోయింది. బండి అమాంతంగా గాలిలోకి
లేచిందని పక్కనే ఆడుకుంటున్న బాలురన్నారు. బాలుడి ఏడుపు విని, యశోద పరుగెత్తుకుంటూ
వచ్చి, పిల్లవాడికి చన్ను కుడిపింది.
ఒకనాడు యశోద బాలకృష్ణుడిని తన తొడమీద పెట్టుకుని ముద్దాడుతుంటే, ఆ శిశువు చాలా
బరువుగా అనిపించాడు. అప్పుడామె ఒడి నుండి నేలమీదకు దించింది. ఇంతలోనే, తృణావర్తుడు అనే రాక్షసుడు, కంసుడు
పంపగా, చల్లటి సుడిగాలి రూపంలో, వింతగొల్పుతూ అక్కడికి వచ్చి, శిశువును ఎగరేసుకుని పోయింది. ఆ సుడిగాలి వేగానికి,
భయంకర ధ్వనికి దిక్కులు దద్దరిల్లాయి. యశోదాదేవి ఇది చూసి,
కన్నీరు మున్నేరుగా ఏడ్వసాగింది. ఆమెతో పాటే గోపస్త్రీలు కూడా విలపించసాగారు.
గాలిరూపంలో వచ్చిన రాక్షసుడు బాలకృష్ణుడిని ఆకాశమార్గంలో చాలా దూరం తీసుకుపోయాడు.
క్రమక్రమంగా బాలుడు బరువెక్కసాగాడు. ఆ బరువు మోయలేకపోయాడు రాక్షసుడు. వాడి మెడను
పట్టుకుని కొండంత బరువుతో కిందకు వేల్లాడాడు చిన్ని కృష్ణుడు. రాక్షసుడు
గిలగిలలాడసాగాడు. చివరకు కంసుడి అనుచరుడు తృణావర్తుడు నేలకూలాడు. ఇది చూసి
గోపకాంతలు పరుగెత్తారు అక్కడికి. వాడి రొమ్ముమీద ఆడుకుంటున్న బాలుడిని
ఎత్తుకున్నారు.
ఒకనాడు యశోద ముద్దుల కృష్ణుడిని చేరదీసి ఒడిలో కూర్చోబెట్టుకుని, ముద్దాడి పాలు తాగించి, ప్రేమతో
ముఖాన్ని నిమిరింది. అప్పుడు బాలుడు నిద్ర వస్తున్నట్లుగా ఆవులించాడు. అప్పుడా
నోరు గుహద్వారం లాగా అగుపించి, అందులో సముద్రాలు, దిక్కులు, నేల, అడవులు, దీవులు, కొండలు, నదులు, గాలి, సూర్యుడు, చంద్రుడు, అగ్ని, ఆకాశం, నక్షత్రాలు, గ్రహాలూ, లోకాలు, సమస్త ప్రాణికోటి సమూహం కనిపించాయి. ఆమె కన్నులు అరమోడ్పులు కాగా
నివ్వెరపోయింది.
ఇదిలా వుండగా ఒకనాడు యాదవ పురోహితుడైన గర్గుడు, వాసుదేవుడు పంపగా వ్రేపల్లెకు
వచ్చాడు. ఆయన్ను ఉచితరీతిన సత్కరించాడు నందుడు. ఆయన రాకకు కారణం అడిగాడు.
కుమారులిద్దరికీ వేదోక్త మంత్రాలతో నామకరణం చేయమని గర్గుడిని కోరాడు నందుడు. ఇలా
చెప్పి తన కుమారుడిని, రోహిణి కుమారుడిని గర్గ మహర్షికి
చూపించాడు. కంసుడికి ఇక్కడి విషయాలు తెలిసే ప్రమాదమున్నందున పసివారి సంస్కారాలు
రహస్యంగా చేయడం మంచిదని అన్నాడు గర్గుడు. తరువాత ముందుగా రోహిణీదేవి కుమారుడికి
నామకరణం చేశాడు. అతడి పేరు రాముడని, బలరాముడుగా
ప్రసిద్ధికెక్కుతాడని చెప్పాడు. సంకర్షణుడుగా కూడా పిలవబడుటాడని అన్నాడు.
ఆ తరువాత కృష్ణుడిని చూసి, నల్లటి వర్ణం కలవాడు
కాబట్టి అతడిని కృష్ణుడని పిలవమని, వసుదేవుడికి పుట్టాడు
కాబట్టి వాసుదేవుడు అని కూడా అంటారని అన్నాడు గర్గుడు.
(బమ్మెర
పోతన శ్రీమహాభాగవతం, రామకృష్ణ మఠం ప్రచురణ ఆధారంగా)
No comments:
Post a Comment