సత్యభామతో కలిసి నరకాసురుడిని వధించిన శ్రీకృష్ణుడు
పారిజాతాపహరణం
శ్రీ మహాభాగవత కథ-71
వనం జ్వాలా నరసింహారావు
కంII చదివెడిది భాగవతమిది,
చదివించును కృష్ణు, డమృతఝరి పోతనయున్
చదివినను
ముక్తి కలుగును,
చదివెద నిర్విఘ్నరీతి ‘జ్వాలా’ మతినై
భూదేవి ప్రియపుత్రుడైన నరకాసురుడు స్వర్గ లోకం వెళ్లి, అమరుల స్థానమైన మణిపర్వతాన్ని స్వాధీనం చేసుకున్నాడు. వరుణ
ఛత్రాన్ని, అదితిదేవి కుండలాలను తీసుకుపోయాడు. ఇంద్రుడు నరకుడి దురాగతాన్ని
కృష్ణుడికి మనవి చేసుకున్నాడు. వెంటనే గరుడ వాహనం ఎక్కి నరకాసురుడిని
సంహరించడానికి బయల్దేరాడు కృష్ణుడు. ఆ సమయంలో, కృష్ణుడి భార్య సత్యభామాదేవి ఆయన్నో
కోరిక కోరింది. ఆయన రణకౌశలాన్ని చూడాలని కుతూహలంగా వుందనీ, కాబట్టి
తనను ఆయన వెంట యుద్ధ రంగానికి తీసుకుపోమ్మనీ, తాను ఆయన శౌర్య
ప్రతాపాలను కళ్లారా చూసి, ద్వారకకు వచ్చి తన సవతులందరికి
వివరిస్తానని అన్నది.
సుందర సుకుమారమైన సత్యభామ రణరంగానికి రావడం తగదని, భయంకరమైన యుద్ధ భూమిలో ఏనుగుల ఘీంకార నినాదాలు, గుర్రాల గిట్టల పెనుధూళి, శత్రువుల బాణపరంపరలు, సైన్య సమూహాలు వుంటాయని
కాబట్టి ఆమెని ఇంటివద్దనే వుండమని అన్నాడు కృష్ణుడు. అప్పుడు సత్యభామ కృష్ణుడు
వుండగా తనకు భయం లేదని ఆయనతో వస్తానని అంటుంది ఈ విధంగా:
ఉ: దానవులైన నేమి? మఱి దైత్యసమూహములైన నేమి? నీ
మానిత బాహు దుర్గముల మాటున నుండగ నేమి శంక? నీ
తో నరుదెంతు నంచు గరతోయజముల్ ముకుళించి మ్రొక్కె న
మ్మానిని, దన్ను భర్త బహుమాన
పురస్సరదృష్టి జూడగన్
ఇలా అంటూ తనకు మొక్కిన సత్యభామను లేవనెత్తి,
తనతో గరుడ వాహనాన్ని ఎక్కించాడు. ఆకాశమార్గంలో ప్రయాణం చేసి నరకుడి రాజధానైన
ప్రాగ్జ్యోతిషపురం చేరాడు. దాని చుట్టూ అయిదు శత్రు దుర్భేద్యమైన దుర్గాలున్నాయి.
అదనంగా మురాసురుడు ప్రాగ్జ్యోతిషపురం చుట్టూ పాశాలు కట్టి మరో కొత్త దుర్గం
నిర్మించాడు. శ్రీకృష్ణుడు తన గదతో గిరి దుర్గాలను ముక్కముక్కలు చేశాడు.
శస్త్రదుర్గాలను విడగొట్టాడు తన బాణాలతో. సుదర్శన చక్ర ప్రయోగంతో వాయు దుర్గాలను, జల దుర్గాలను, అగ్ని దుర్గాలను నేలమట్టం చేశాడు. మురుడు
ఏర్పాటు చేసిన ప్రచ్ఛన్న పాశాలను ఖడ్గంతో తుంచేశాడు. నరకాసురుడి కోటగోడను గదతో
పగలగొట్టాడు. తన పాంచజన్యాన్ని గట్టిగా పూరించాడు. మురాసురుడు ఆ శంఖధ్వని
విన్నాడు. శ్రీకృష్ణుడిని చూసి మండిపడి, ఆయన్ను సమీపించాడు. తన శూలాన్ని గరుడిమీద
ప్రయోగించాడు.
మురాసురుడు వేసిన శూలాన్ని కృష్ణుడు విరిచి పారేశాడు. వాడైన బాణాలను అతడిమీద ప్రయోగించాడు.
రాక్షసుడు రెచ్చిపోవడం చూసి తన చక్రాయుధంతో మురాసురుడి అయిదు తలలు నరికివేశాడు.
మురాసురుడు నీటిలో పడిపోయాడు. ఇది చూసి,
మురాసురుడి ఏడుగురు కొడుకులు కృష్ణుడి మీదికి యుద్ధానికి వచ్చారు. వారందరినీ
సంహరించాడు కృష్ణుడు. నరకాసురుడు నీటి నుండి బయటకొచ్చి మల్లీ యుద్ధభూమికి తరలి
వచ్చాడు. సత్యభామా సహితుడై వున్న శ్రీకృష్ణుడిని తేరిపార చూశాడు. వెంటనే
యుద్ధానికి దిగాడు. నరకాసురుడిని చూసిన సత్యభామ కృష్ణుడి ముందు నిలబడింది ఇలా:
శా: వేణిం జొల్లెము వెట్టి సంఘటిత నీవీబంధయై భూషణ
శ్రేణిం దాల్చి ముఖేందుమండల మరీచీజాలముల్ పర్వఁగాఁ
బాణిం బయ్యెదఁ జక్కగాఁ దుఱిమి శుంభద్వీరసంరంభయై
యేణీలోచన లేచి నిల్చెఁ దన ప్రాణేశాగ్ర భాగంబునన్
సత్యభామ శౌర్యాన్ని చూసి శ్రీకృష్ణుడు సరస వచనాలు పలుకుతూ, తన ధనస్సును సత్యభామ చేతికిచ్చాడు. ఆ విల్లు అందుకున్నది
సత్యభామ. ఆమెలో రణోత్సాహం పెల్లుబికింది. ధనుష్ టంకారం చేసింది. నారి
ప్రయోగించింది. ఆమె యుద్ధం చూడ ముచ్చటగా వుంది. వీర, శృంగార
రసాలను ఒకే సమయంలో ప్రదర్శిస్తూ ఒక ఆటగా యుద్ధం చేయసాగింది. ఆమె ధనుస్సు నుండి
వెలువడుతున్న బాణ సమూహంతో శత్రువులను హతమారుస్తూ చక్కగా యుద్ధం చేస్తోంది.
అప్పుడామె ప్రదర్శిస్తున్న రణకౌశలం అతి రమ్యంగా వుందీ విధంగా,
శా: జ్యా వల్లీధ్వని గర్జనంబుగ, సురల్ సారంగయూథంబుగా;
నా విల్లింద్రశరాసనంబుగ, సరోజాక్షుండు మేఘంబుగాఁ,
దా విద్యుల్లతభంగి నింతి సురజిద్దావాగ్ని మగ్నంబుగాఁ
బ్రావృట్కాలము సేసె బాణచయ మంభశ్శీకరశ్రేణిగాన్
సత్యభామ చేస్తున్న యుద్ధంలో ఆమె హావభావాలు శ్రీకృష్ణుడికి శృంగారరసాన్ని, నరకాసురుడికి వీరరసాన్ని చూపించాయి. సత్యభామ కురిపిస్తున్న
బాణ వర్షం కృష్ణుడికి ఎనలేని సంతోషాన్ని కలగచేస్తే, నరకాసురుడికి మహారోషాన్ని
కలిగించింది. సత్యభామ ధాటికి రాక్షస వీరులంతా నరకాసురుడి మాటున దాగారు. సైన్యమంతా
కకావికలై పోయింది. అప్పుడు కృష్ణుడు సత్యభామ శౌర్యప్రతాపాలు చూసి సంతోషించాడు.
ఆమెనిక యుద్ధం నుండి విరమింపచేయాలని ఇలా అన్నాడు:
క: కొమ్మా! దానవ నాథుని, కొమ్మాహవమునకుఁ దొలఁగె గురువిజయముఁ గై
కొమ్మా! మెచ్చితి నిచ్చెదఁ, గొమ్మాభరణములు నీవు గోరిన వెల్లన్
కృష్ణుడు సత్యభామను ఎంతగానో గౌరవించి, ఆమె చేతి
నుండి ధనస్సును తీసుకున్నాడు. ఆ తరువాత నరకాసురుడి యోధుల మీద శతఘ్ని అనే
దివ్యాస్త్రాన్ని ప్రయోగించాడు. తన బాణ ప్రయోగంతో గుర్రాలను నేలకూల్చాడు. ఆయన
ధాటికి ఆగలేక నరకుడి సైన్యమంతా ప్రాగ్జ్యోతిషపురంలోకి పారిపోయింది. నరకాసురుడు
అప్పుడు పట్టపుటేనుగునెక్కి వచ్చి కృష్ణుడితో యుద్ధం చేయడానికి సిద్ధపడ్డాడు.
శ్రీకృష్ణుడి మీద శూలాయుదాన్ని ప్రయోగించబోయాడు. శ్రీకృష్ణుడు తన సుదర్శన చక్రంతో
నరకాసురుడి శిరస్సును ఖండించి వేశాడు. తన తల్లి భూదేవిని ఆక్షేపిస్తూ, నరకాసురుడు యుద్ధభూమ్మీద పడిపోయాడు. శ్రీకృష్ణుడి విజయవార్త విన్న భూదేవి
అక్కడికి వచ్చి, శ్రీకృష్ణుడికి కానుకలిచ్చి, ఆయన్ను స్తోత్రం చేసింది. ఆమె కోరినట్లే నరకాసురుడి కుమారుడైన
భగదత్తుడికి సర్వ సంపదలు ప్రసాదించాడు.
ఆ తరువాత శ్రీకృష్ణుడు నరకాసురుడి అంతఃపురంలోకి ప్రవేశించాడు. ఆయన చెరలో వున్న
పదహారు వేల మంది రాజకన్యలను చూశాడు. శ్రీకృష్ణుడి దివ్యమంగళ స్వరూపాన్ని వారు కూడా
చూశారు. ఆయనే తమ ప్రాణనాథుడని తలపోశారు. శ్రీకృష్ణుడిని తమలో తామే రకరకాలుగా
అభివర్ణించుకున్నారు. ఎవరికివారే శ్రీకృష్ణుడు తనవాడే అని మురిసిపోయారు.
శ్రీకృష్ణుడిని పతిగా భావించి తన్మయత్వం చెందారు. ఆ పదహారు వేల మంది రాజకన్యలను
చెర విడిపించి, సగౌరవంగా ద్వారకానగారానికి పంపించాడు
శ్రీకృష్ణుడు.
ఆ తరువాత భూదేవి ఇచ్చిన కుండలాలను తీసుకుని స్వర్గలోకానికి సత్యాసమేతంగా
బయల్దేరాడు. అమరావతీ నగరం చేరుకున్నాడు. అదితీదేవి మందిరానికి వెళ్లి ఆమెకు ఆనందం
కలిగించాడు. దేవేంద్రుడు తన భార్యైన శచీదేవితో కలిసి శ్రీకృష్ణుడిని, సత్యభామను గౌరవించి, సత్కరించారు.
నందనవనంలో తిరుగుతూ అక్కుడున్న పారిజాతవృక్షాన్ని సత్యభామ కోరిక మీద పెళ్లగించి గరుత్మంతుడి
మీద పెట్టాడు. తిరుగు ప్రయాణంలో ఇంద్రుడు అడ్డుపడి పారిజాత వృక్షాన్ని
విడిచిపెట్టమని, లేకపోతే యుద్ధం చేస్తానని అన్నాడు. యుద్ధానికి తలపడ్డాడు. ఆయననూ, దేవతలనూ ఓడించి పారిజాతంతో, సత్యభామతో ద్వారకకు
వెళ్లాడు. సత్యభామతో విహరించే సుందరోద్యానవనంలో అ అపారిజాతాన్ని నాటించాడు.
నరకాసురుడి దగ్గరనుండి తెచ్చిన పదహారువేల మంది రాకుమార్తెలకు పదహారు వేల
మేడలను నిర్మించి ఇచ్చాడు. సకల సదుపాయాలను సమకూర్చాడు వారికి. ఒక సుముహూర్తంలో
పదహారు వేల రూపాలు ధరించి శ్రీకృష్ణుడు, వారి-వారి ఇండ్లలో అందరినీ శాస్త్రోక్తంగా
వివాహమాడాడు. ఎవరికీ ఏమాత్రం తక్కువ చేయకుండా, ఉత్తమ
గృహస్తుడిగా, తన ధర్మాన్ని నిర్వహిస్తూ, శ్రీకృష్ణుడు తాను రమిస్తూ, వారిని రమింపచేశాడు.
పదహారువేల మంది భార్యలు శ్రీకృష్ణుడిని అత్యంత భక్తి భావంతో సేవించారు.
(బమ్మెర పోతన శ్రీమహాభాగవతం, రామకృష్ణ మఠం ప్రచురణ ఆధారంగా)
No comments:
Post a Comment