గోపికా వస్త్రాపహరణం
శ్రీ మహాభాగవత కథ-58
వనం జ్వాలా నరసింహారావు
కంII చదివెడిది భాగవతమిది,
చదివించును
కృష్ణు, డమృతఝరి పోతనయున్
చదివినను
ముక్తి కలుగును,
చదివెద
నిర్విఘ్నరీతి ‘జ్వాలా’
మతినై
ఉత్తరం నుండి గాలి వీస్తూ, ఆకాశంలో చల్లగా
ప్రకాశించే చంద్రుడు భాదిస్తూ, మంచు సర్వత్రా వ్యాపిస్తూ
అందమైన హేమంత ఋతువు వచ్చింది. పగటి కాలం నిడివి తగ్గి,
రాత్రి కాలం హెచ్చింది. చలితో లోకం వణక సాగింది. ఇలాంటి హేమంత ఋతువులో మొదటిదైన
మార్గశిర మాసంలో శుక్ల పాడ్యమి నాడు, నందుడి గొల్లపల్లెలో కల గొల్ల పడుచులంతా
వేకువనే బయల్దేరి, యమునానదీ తీరాన్ని చేరుకున్నారు.
నదీతీరానికి పోయిన గోపికలు జనులెవ్వరూ లేనిచోట వస్త్రాలను విడిచారు. స్నానాలు
చేద్దామనే ఉద్దేశంతో నీళ్లలోకి దిగారు. కృష్ణ సంబంధమైన పాటలు పాడుకుంటూ తమలో తమకే
వినోదం కలిగే విధంగా జలక్రీడలు ఆడారు. ఆ సమయంలో వీరి విషయం తెలుసుకున్న కృష్ణుడు
దూరంగా వున్నప్పటికీ, తన చెలికాండ్రతో కూడి అక్కడికి చేరుకున్నాడు.
తన వెంట వచ్చిన వారిని కొంచెం దూరంగా నిలిపి,
మెల్లమెల్లగా అడుగులు వేసుకుంటూ, నోరు మెదల్పకుండా, పొదలచాటున పొంచి-పొంచి, సమయం చూసి దగ్గరికి వచ్చి
గోపికలు గట్టుమీద వుంచిన చీరలను దొంగిలించాడు. గోపికా వస్త్రాలను తీసుకుని గట్టునే
వున్న కడిమి చెట్టును ఎక్కాడు. అప్పుడా గోపికలు ఇలా పలికారు:
క: మామా వలువలు ముట్టకు, మామా! కొనిపోకు పోకు మన్నింపు తగన్
మా మాన మేలకొనియెదు? , మా మానసహరణ మేల? మానుము కృష్ణా!
తమ చీరలు దొంగిలించడం గొప్ప అని భావించవద్దని,
ఆది ఆయనకు శోభను ఇవ్వదని, గౌరవాన్ని ఇవ్వదని అన్నారు. ఇంకా
ఇలా అన్నారు:
క: కొంటివి మా హృదయంబులు; గొంటివి మా మనము; లజ్జఁ గొంటివి; వలువల్
గొంటి;
విఁక నెట్లు చేసెదొ; కొంటెవు గద; నిన్ను నెఱిఁగికొంటిమి
కృష్ణా!
శ్రీకృష్ణుడు చేసే చెడ్డ పనులను నంద మహారాజుకు తెలియచేస్తామని, తమ చీరలను ఇవ్వమని అడుగుతే ఇవ్వడం లేదని పిర్యాదు చేస్తామని
నన్నారు. సమాధానంగా కృష్ణుడు, ఆడవారు రాజులతో వారిలాగా ప్రవర్తించరని, కొంచెమైనా మొగమాటం లేకుండా తనను దూషిస్తున్నారని,
వారిలోని తప్పు తెలుసుకోవడం లేదని, నీళ్లలోనుండి శీఘ్రంగా
వచ్చి ఎవరి వస్త్రాన్ని వారే తీసుకోవచ్చని, వచ్చినవారికి
ఆలశ్యం చేయకుండా తానే స్వయంగా ఇస్తానని అన్నాడు. కృష్ణుడి మాటలకు గోపికలు ఒకరి
ముఖాలు ఇంకొకరు చూసుకున్నారు. నవ్వుకుంటూ బదులివ్వడానికి సిగ్గుపడ్డారు. ఇలా
అన్నారు:
క: మా వలువ లాగడంబున, నీ వేటికిఁ బుచ్చుకొంటి? నీ వల్పుఁడవే?
నీ వెఱుఁగని దేమున్నది?, నీ వందఱిలోన ధర్మనిరతుఁడవు గదే?
కృష్ణుడు రమ్మన్న చోటుకు వస్తామని,
ఇమ్మన్నది ఏదైనా సంకోచం లేకుండా ఇస్తామని, ఆయనెక్కడికి
పొమ్మన్నా పోతామని, ప్రస్తుతానికి తమ చీరలను ఇచ్చి తమ
మానాన్ని రక్షించమని వేడుకున్నారు గోపికలు. జవాబుగా, నవ్వుతూ కృష్ణుడు, ఏ పడుచువాడు పతిగా కావాలని కోరుతూ వారక్కడ కాత్యాయనీ వ్రతం చేస్తున్నారో
చెప్పమని అడిగాడు. వారెవరిని చూసి వలచారని, ఎవరు వారి
మనస్సులను ఆకర్షించారని, ఎవని మీద వారి స్నేహం వృద్ధి
పొందుతూ ఉన్నదో తనతో చెప్పకూడదా, తాను పరాయివాడినా అని ప్రశ్నించాడు. ఆ మాటలకు
గోపికలు ఒకరినికరు సంతోషంగా చూసుకున్నారు. కృష్ణుడిని చూసి నవ్వుతూ నోటమాట రాక
వుండిపోయారు. తన ఇంట్లో, తన ఉత్తర్వుల ప్రకారం సేవ చేస్తూ
వుండేట్లయితే, వారి వస్త్రాలు వారికిస్తానని, బయటకు రమ్మని చెప్పాడు కృష్ణుడు. వెళ్లాలా, వద్దా అన్న సందిగ్దంలో
పడిపోయారు గోపికలు. చివరకు నీళ్లనుండి బయటకొచ్చారు.
అవయవాలు దాచుకుంటూ మడుగు నుండి వరుసగా బయటకొచ్చిన గోపికలు చిరు నవ్వుతో
శ్రీకృష్ణుడి ఎదుట నిలబడ్డారు. అప్పుడు ఇలా అన్నాడు కృష్ణుడు. “సిగ్గెందుకు మీకు? మీతో కలిసి నేను చిన్నతనం నుండి పెరిగాను కదా? మీలో నేను ఎప్పుడూ వున్నాను కదా? నేను చూడని రహస్యం
ఏమిటి? వ్రతంలో నిష్టగా వున్న మీరు చీరలు లేకుండా నియమాన్ని
ఉల్లంఘించి, నీళ్లలోకి పోవచ్చా?
కాత్యాయనీదేవిని మోసం చెయ్యడం కాదా? వ్రత ఫలం మీకు దక్కాలనుకుంటే, చక్కగా మీరంతా చేతులెత్తి, మొక్కి, నాదగ్గరకు వచ్చి చీరలు తీసుకుపోండి. సిగ్గు పోయేట్లు చెప్పడం ఎందుకు? నన్ను నిందించడం దేనికి?”.
అభిమానవతులైన ఆ యువతులు కృష్ణుడి మాటలు విన్నారు. ఆయన్ను తనివితీరా
వీక్షించారు. వస్త్రాలు విడిచి ఆ రోజున స్నానం చెయ్యడం తమ తప్పని ఒప్పుకున్నారు.
కృష్ణుడి ఆనతి మేరకు తమ హస్తాలను నుదుట వుంచుకుని నమస్కారం చేశారు. చలిగాలి వల్ల
వణుకుతున్న ఆ గొల్ల పడుచులకు కృష్ణుడు వస్త్రాలను ఇచ్చేశాడు. తమ చీరలను
దొంగిలించినప్పటికీ, తమ అభిమానం తొలగించయినా చేస్తున్న నోముకు
భంగం కాకుండా కాపాడాడు అని సంతోషించారు.
ఇలా కృష్ణుడు ఇచ్చిన వస్త్రాలను కట్టుకున్నారు గొల్ల పడుచులు. వాళ్ల అభిప్రాయం
అర్థం చేసుకున్నవాడిలాగా వారితో ఇలా అన్నాడు కృష్ణుడు. “మీ అంతరంగంలో వున్న విషయం
నాకు తెలుసు. మీరు నన్ను కొలవాలని వ్రతం చేస్తున్నారు కాబట్టి మీ కోరిక
నెరవేరింది. ఇక మీరు కోరినవన్నీ నెరవేరుతాయి. నన్ను కొలిస్తే తప్పక మోక్షం
లభిస్తుంది. మోక్షప్రదమైన గౌరీ వ్రతాన్ని చేశారు మీరు. ఇక నుండీ రాత్రుల్లో మీరు
నన్ను పొందగలరు. నామాటలు నమ్మి మీరు ఇక ఇండ్లకు పొంది”. ఇలా కృష్ణుడు చెప్పగా వారంతా
వ్రేపల్లెకు వెళ్లిపోయారు.
(బమ్మెర పోతన శ్రీమహాభాగవతం, రామకృష్ణ మఠం ప్రచురణ ఆధారంగా)
No comments:
Post a Comment