Sunday, October 11, 2020

గంధర్వ శాప విమోచన, వృషభాసుర సంహారం .... శ్రీ మహాభాగవత కథ-62 : వనం జ్వాలా నరసింహారావు

 గంధర్వ శాప విమోచన, వృషభాసుర సంహారం  

 శ్రీ మహాభాగవత కథ-62

వనం జ్వాలా నరసింహారావు

కంII             చదివెడిది భాగవతమిది,

చదివించును కృష్ణు, డమృతఝరి పోతనయున్

                             చదివినను ముక్తి కలుగును,

చదివెద నిర్విఘ్నరీతి ‘జ్వాలా మతినై

ఒక రోజున నందుడు మొదలైన గొల్లలంతా, అంబికా వనం అనే అడవికి బండ్లెక్కి జాతర కోసం వెళ్లారు. అక్కడ సరస్వతీ నదిలో స్నానాలు చేసి, పార్వతీ పరమేశ్వరులను పూజించారు. కానుకలు అర్పించారు. దానాలు చేశారు. వ్రత నిష్టలో వున్న సమయంలో ఒక మహా సర్పం వచ్చి నిద్రపోతున్న నందుడిని మింగడానికి ప్రయత్నం చేయగా ‘కృష్ణా రక్షించు అను అరిచాడాయన. అప్పుడు కృష్ణుడు ఆ పామును కాలితో తన్ని తొక్కాడు. వెంటనే అది పాము రూపాన్ని వదిలి విద్యాధర రూపాన్ని ధరించి శ్రీకృష్ణుడికి మొక్కింది. ఆయన ఎవరని అడిగిన కృష్ణుడి ప్రశ్నకు సమాధానంగా, తాను సుదర్శనుడు అనే విద్యాధరుడిననీ, ఋషుల శాపం వల్ల మహాసర్పంగా పుట్టాననీ, ఆ దయామూర్తులు చెప్పినట్లు కృష్ణుడి పాద స్పర్శ వల్ల సర్పదేహాన్ని వదిలి మునుపటి దేహాన్ని పొందాననీ అన్నాడు. ఇలా చెప్పి, శ్రీహరికి ప్రదక్షిణ చేసి వెళ్లాడు.

ఇంకొక రోజున వెన్నెల రాత్రిలో కృష్ణ బలరాములిద్దరూ, అడవికి పోయి, తుమ్మెదల గానాన్ని వింటూ, గోపసుందరులు తమ చుట్టూ కూర్చుని వుండగా ఇంపుగా ఒక గీతాన్ని పాడారు. ఆ పాట విన్న గోపస్త్రీలంతా ఆనంద పారవశ్యంలో మునిగిపోయారు. ఆ సమయంలో కుబేరుడి భటుడైన శంఖచూడుడు అక్కడికి వచ్చి, గోపికలను తన యోగ బలంతో ఉత్తర దిక్కుగా తీసుకుని పోయాడు. రక్షించమని వారు పెట్టుకున్న మొర విన్నాడు కృష్ణుడు. బలరామకృష్ణులిద్దరూ వెంటనే మద్ది చెట్లను పెకలించి వాడి వెంటబడగా ఆ గుహ్యకుడు గోపికలను విడిచి పారిపోయాడు. గోపికలను రక్షిస్తూ అక్కడే వుండమని అన్నకు చెప్పి ఆ గుహ్యకుడి వెంటబడ్డాడు కృష్ణుడు. వాడిని చంపి, అతడి తలమీద వున్న దివ్యమైన రత్నాన్ని తీసుకుని అన్న బలరాముడికిచ్చాడు.

ఒకనాడు కృష్ణుడు అడవికి పోగా గోపికలు అతడి ఎడబాటు వల్ల కలిగిన వేదనకు తపిస్తూ, అతడి లీలలను తెలిపే పాటలు పాడుకున్నారు. ఆ విధంగా పాడుతూ, కబుర్లు చెప్పుకుంటూ అనేక విధాల పొద్దు పుచ్చుతూ, అతి కష్టం మీద పగలంతా గడిపి సాయంకాలం అయ్యేసరికి చీకటి పడుతున్నది కదా అని సంతోషంగా నిట్టూర్పు విడిచారు. శ్రీకృష్ణుడు వస్తున్నాడు కదా అని అతడి కొరకు ఎదురు చూశారు. ఆయన కోసం ఎదురేగారు. తనకు ఎదురుగా వచ్చిన గోపస్త్రీల ఇష్టాన్ని అనుసరించి కృష్ణుడు వారిని తగురీతి ఆదరించాడు.

మరో నాడు ఇంకో సంఘటన జరిగింది. గోపాలురు ఆవులను మేపుతుండగా, వృషభ రూపంలో అరిష్టుడు అనే అసురుడు, శ్రీహరికి కీడు చేయాలనుకుని, తనను చూసి బెదురుతున్న ఆవుల మంద దగ్గరికి వచ్చాడు. గొల్లలతో సహా ఆవుల మందను వెంబడించి తరుముతున్న వృషభాసురుడిని కృష్ణుడు చూశాడు. వాడిని బెదిరిస్తూ ఆ రాక్షసుడి దగ్గరిగా పోయి నిలుచున్నాడు. వృషభాసురుడు శ్రీకృష్ణుడిని ఎదుర్కున్నాడు. వాడి రెండు కొమ్ములను పట్టుకున్నాడు కృష్ణుడు. వెనక్కు నెట్టాడు. తరువాత భూమ్మీద పడదోశాడు. వాడి కొమ్మును పెరికి దానితోనే వాడిని కూల్చాడు. నోట్లోంచి నెత్తురు కారుతుంటే వాడు ప్రాణాలు వదిలాడు. ఇదంతా జరిగిన తరువాత కృష్ణుడు అన్న బలరాముడితో, గోపబాలకులతో కలిసి వ్రేపల్లెకు వచ్చాడు.

ఒకనాడు మహానుభావుడైన నారద మహర్షి మధురకు వచ్చాడు. యశోదకు కూతురు జన్మించిన విషయం, ఆ సమయంలోనే దేవకీదేవి కొడుకును ప్రసవించిన విషయం, ఆ కొడుకును వసుదేవుడు తీసుకుపోయి నందుడి ఇంట్లో వదిలిన విషయం, అక్కడున్న ఆడ శిశువును ఎత్తుకుని వచ్చిన విషయం వివరంగా కంసుడికి చెప్పాడు నారదుడు. అదే విధంగా బలరాముడు రోహిణీదేవికి కొడుకై పుట్టడం, బలరామకృష్ణులు వ్రేపల్లెలో పెరగడం వివరించాడు. కంసుడు కోపంతో భగ్గుమన్నాడు. వెంటనే వసుదేవుడిని చంపడానికి సిద్ధమయ్యాడు కాని నారదుడు వారించాడు. ఆ తరువాత నారదుడు దేవలోకానికి వెళ్లిపోయాడు.

కంసుడు కోపం మానక దేవకీ వసుదేవులను సంకెళ్లతో బంధించాడు. కేశి అనే రాక్షసుడిని బలరామకృష్ణులను చంపిరమ్మని పంపాడు. హితులతో, సన్నిహితులతో, మంత్రులతో కొలువు కూటంలో సమావేశమయ్యాడు. బలరామకృష్ణుల విషయం వారికి చెప్పాడు. మల్లరంగానికి ఏర్పాటు చేయమన్నాడు. ఆ విషయం నగరంలో బాగా ప్రచారం చెయ్యమన్నాడు. చాణూర, ముష్టికులను పిలిచి బలరామకృష్ణులతో మల్ల యుద్ధం చేసి తన మన్ననలను పొందమన్నాడు. కువలయాపీడ అనే తన పట్టణంలోని గజరాజాన్ని అదిలించి బలరామకృష్ణుల మీదికి తోలమని మావటి వాడికి చెప్పాడు.

ఇలా అందరినీ వారి-వారి పనులలో నియమించి, యాదవ వంశ శ్రేష్టుడైన అక్రూరుడిని పిలిచాడు. వ్రేపల్లెకు పోయి బలరాముడు, కృష్ణుడు అనే గొల్ల పిల్లలు తనను సంహరించాలని ఆసక్తితో వున్నారని, వారిని తెచ్చి తనకు అప్పగించమని అడిగాడు. నారాయణుడే గొల్లవారి ఇంట్లో కృష్ణుడు అనే పేరుతో వసుదేవుడి కొడుకుగా పుట్టినట్లు విన్నానని అన్నాడు. వ్రేపల్లెకు పోయి పన్నులు వసూలు చేసుకుని, నందాదులైన గొల్లవారిని ఒప్పించి, బలరామకృష్ణులను ధనుర్యాగం చూడడానికని చెప్పి తీసుకురమ్మని అన్నాడు కంసుడు అక్రూరుడితో. తాను వారిని చంపడానికి వేసిన పథకాలన్నీ వివరించాడు. ఎలాగైనా వారిని తీసుకువస్తే వారిని చంపిస్తానని, ఆ తరువాత వసుదేవుడిని, ఇతరులను పరిమారుస్తానని చెప్పాడు.

కంసుడు చెప్పినట్లే వెళ్లి వస్తానని, ఈశ్వరేచ్చను ఎవరూ తప్పించలేరని, ఆయన పగవాడి కొడుకులను తీసుకువస్తానని అన్నాడు అక్రూరుడు.                       

         (బమ్మెర పోతన శ్రీమహాభాగవతం, రామకృష్ణ మఠం ప్రచురణ ఆధారంగా)

No comments:

Post a Comment