శ్రీకృష్ణుడి లీలా మాయను అర్థం చేసుకున్న బ్రహ్మ
శ్రీ మహాభాగవత కథ-55
వనం జ్వాలా నరసింహారావు
కంII చదివెడిది భాగవతమిది,
చదివించును కృష్ణు, డమృతఝరి పోతనయున్
చదివినను
ముక్తి కలుగును,
చదివెద నిర్విఘ్నరీతి ‘జ్వాలా’ మతినై
దూడలన్నీ పరుగెత్తిపోయి ఎక్కడో మేస్తున్నాయని గ్రహించిన శ్రీకృష్ణుడు,
గోపకులతో చెప్పి, వాటిని వెతికి తీసుకు రావడానికి అడవికి
బయల్దేరి పోయాడు. దూడలను వెతుకుతూ అడవిలో చాలా దూరం నడిచాడు. లేగదూడల జాడలను
అనుసరించి పోయాడు. అలా వెతుకుతున్న బాలుడి సామర్థ్యం పరీక్షించాలనుకున్నాడు
బ్రహ్మదేవుడు. తన మాయతో దూడలను, గోపబాలురను రహస్యంగా
దాచిపెట్టాడు. బ్రహ్మదేవుడి మోసం కనిపెట్టాడు కృష్ణుడు. తనలో తానే చిరునవ్వు
నవ్వుకున్నాడు. గోపబాలుర రూపంలోనూ, లేగదూడల రూపంలోనూ, అన్నీ తానే అయి శ్రీకృష్ణుడు బృందావనానికి బయల్దేరి వెళ్లాడు. అలా
గోకులానికి తిరిగి వచ్చాడు. అందరి ఇండ్లలో వివిధ రూపాలలో ప్రవేశించాడు. అంతా
ఎప్పటిలాగా ఆనందించారు. ఇలా ఒక సంవత్సరం గడిచింది.
ఒకనాడు ఆవులను, వాటిని మేపుతున్న గోపకులను గమనించిన
బలరాముడికి ఏదో వింతగా కనపడ్డది. అంతా మహాద్భుతంగా అనిపించింది. ఇది విష్ణుమాయ అని
అర్థం చేసుకున్నాడు. ఏడాది పాటు జరుగుతున్నది తెలియకపోయినా,
అంతకాలం ఆ లీలకు కారణం తెలియకున్నా, అప్పుడు మోహం నుండి
విడివడి తన దివ్యదృష్టి ద్వారా గోపబాలకులుగ, దూడలుగ వున్నది
శ్రీకృష్ణుడే అని గ్రహించాడు. దీనికి కారణం ఏమిటని కృష్ణుడిని ‘మహాత్మా’ అని సంభోదిస్తూ ప్రశ్నించాడు. కృష్ణుడు అన్నను గౌరవించి వాస్తవాన్ని
తెలియచేశాడు. బలరాముడు జరిగినదానికి సంతోషించాడు.
అప్పుడు బ్రహ్మ వచ్చి దూడలను, బాలురను చూశాడు. తాను
మాయచేసినవారెలా అక్కడ వున్నారో ఆయనకు అర్థం కాలేదు. సృష్టికర్త అయిన తన ప్రమేయం
లేకుండా దూడలు, బాలురు ఎలా పుట్టారని ఆశ్చర్యపోయాడు. బ్రహ్మ
ఆ రహస్యాన్ని భేదించలేకపోయాడు. ఇంతవరకూ తనకు తెలియకుండా మరో సృష్టి జరగలేదు కదా, మరి ఇలా రెండవ సృష్టి ఎలా జరిగిందని ఆలోచనలో పడ్డాడు. ఆయన చూస్తున్న
బాలురంతా కోటి సూర్యుల తేజస్సులాంటి తేజస్సుతో మహా వైభవంగా కనిపించారు. పరమాత్మ
స్వరూపాన్ని కలిగి వున్నారు. శ్రీమహావిష్ణువు వంటి ఆకృతి కలిగి మనోహరంగా
వెలిగిపోతున్నారు. చివరకు బ్రహ్మదేవుడి సకలేంద్రియాలకు ఆ బాలుర తేజస్సు సహించరానిదై
పోయింది. ఆయన సంతాపాన్ని పొందుతూ చేష్టలుడిగి అలా వుండిపోయాడు. ఆ పరిస్థితిలో
ఆయన్ను శ్రీకృష్ణుడు చూశాడు.
ఇంతలో బ్రహ్మకు ఒక్కసారిగా చలనం వచ్చినట్లుగా అయిపోయి, చుట్టుపక్కల చూశాడు. బృందావనాన్ని తేరిపార చూశాడు. అందులో
కృష్ణపరమాత్మను చూశాడు. ఆయన సర్వజ్ఞుడై వుండికూడా ఏమీ తెలియనివాడిలాగా తోటి
బాలురను పిలుస్తున్నాడు. గొల్లపిల్లవాడిలాగా వున్న గోపాల కృష్ణుడిని చూశాడు
బ్రహ్మ. భూమ్మీద సాగిలపడి ఆయనకు మొక్కాడు. కన్నుల నుండి కారిన ఆనంద బాష్పాలతో
స్వామి పాదాలను కడిగాడు. అతడిపట్ల తాను చూపిన మహిమాతిశయాన్ని తలచుకుని
సిగ్గుపడ్డాడు. ఆ తరువాత శ్రీకృష్ణుడిని స్తుతించాడు అనేక విధాలుగా. తనను కరుణతో
రక్షించమని వేడుకున్నాడు. తన పుట్టుకతో పాటు తన ఓటమి కూడా పుట్టిందన్నాడు. భగవంతుడి
లీలలు అనంతమనీ, వాటిని తెలుసుకోవడం ఎవరికీ శక్యం కాదనీ, ఆయన
స్వరూప-స్వభావాలు బ్రహ్మజ్ఞానులు మాత్రమే తెలుసుకోగలరనీ, ఆయన తత్త్వం తెలుసుకోవడం తేలికైన విషయం కాదనీ
అన్నాడు. తన అపరాధాన్ని మన్నించమని వేడుకున్నాడు. ఇలా చెప్పి, మూడు సార్లు శ్రీకృష్ణుడికి ప్రదక్షిణ నమస్కారం చేసి, పాదాలమీద పడి సెలవు తీసుకుని బ్రహ్మ వెళ్లిపోయాడు.
బ్రహ్మ వెళ్లిన తరువాత మాయమై తిరిగి తనవద్దకు వచ్చిన దూడలను, గొల్లపిల్లలను ఇసుక తిన్నెల వద్దకు చేర్చాడు. బ్రహ్మ మోసం
చేసి తమను దాచిపెట్టిన సంవత్సర కాలాన్ని బాలకృష్ణుడి మాయ వల్ల వారంతా రెప్పపాటు
కాలంగా భావించారు. గోపబాలకులతో కలిసి చల్ది తిని వనం నుండి బయల్దేరారు. గోకులానికి
చేరుకున్నారు.
బలరామకృష్ణుల వయస్సు అయిదు సంవత్సరాలు దాటింది. ఎప్పటిలాగే పశువుల కాపరులతో
చేరుకొని బృందావనంలో పశువులను మేపడం ఆరంభించారు. ఒకనాడు కృష్ణుడు పొద్దున్నే
నిద్దుర లేచాడు. బలరాముడు, గోపబాలకులతో సహా పిల్లనగ్రోవి వూదుకుంటూ
ఆవుల గుంపును తోలుకుంటూ బయల్దేరాడు. వనంలో ఆటలాడుదామనుకున్న కృష్ణుడు బలరాముడితో ఆ
మాటే చెప్పాడు. అంతా కలిసి ఆటపాటల్లో మునిగి తేలారు.
బాలకృష్ణుడు పశువులను మేపుతూ, ఒక చోట తుమ్మెదల
ఝుంకారంతో గొంతు కలిపి వాటిలాగే ఝుంకారం చేసేవాడు. హంసలతో కలిసి వాటిలాగే
క్రేంకారాలు చేసేవాడు. నెమళ్లతో కలిసి తానూ నృత్యం చేసేవాడు. ఏనుగులను చూసి వాటి
వెనుకనే హొయలుగా నడిచేవాడు. క్రౌంచ పక్షులు, చక్రవాక పక్షులు, ధ్వని చేస్తుంటే తాను కూడా వాటిలాగే ధ్వని చేసేవాడు. సింహాలు, పెద్దపులులను చూసి పరుగెత్తే జింకలతో పాటే తానూ పరుగెత్తేవాడు. దూరంగా
మేసే ఆవులను చక్కటి సుస్వరంతో పేరుపేరునా పిలిచేవాడు. అలసిపోయిన అన్న బలరాముడు
విశ్రాంతి తీసుకుంటుంటే ఆయన చేతులు, కాళ్లు ఒత్తి సపర్యలు
చేసేవాడు. తాను శ్రీమహావిష్ణువుననే విషయాన్ని మరచి,
శ్రీకృష్ణ పరమాత్మ గొల్లవారితో సమానంగా ప్రవర్తించేవాడు.
ఒకనాడు గాడిద రూపంలో వున్న ధేనుకుడు అనే రాక్షసుడి ఉనికిని, అతడు తోపులోని తాటి చెట్ల కింద వుండి ఎవరినీ పండ్లు తిననీయక
పోవడాన్ని శ్రీదాముడు అనే బాలకుడు, ఇతర గోపాలకులు
శ్రీకృష్ణుడికి చెప్పారు. వెంటనే బలరామకృష్ణులిద్దరూ చిరునవ్వుతో తాటి తోపుకు
వెళ్లారు. వీళ్ల చప్పుడు విని ధేనుకాసురుడు అక్కడికి వచ్చి బలరాముడి వక్షస్థలాన్ని
బలంగా తన్నాడు. అప్పుడు బలరాముడు వాడి కాళ్లను పట్టుకుని గిర-గిరా తిప్పుతూ వాడిని
పడేసి చంపేశాడు. వాడి బంధువులు అంతా గాడిద రూపాలలో వచ్చి వీరిమీద పడ్డారు. అందరినీ
చంపేశారు బలరామకృష్ణులు. ఆ తరువాత తాటి పండ్లను తనివితీరా బక్షించారు. గోపకులంతా
రామకృష్ణులను కీర్తించారు.
ఇదంతా జరిగిన తరువాత ఎప్పటిలాగే శ్రీకృష్ణుడు అందరితో కలిసి వ్రేపల్లెలో
ప్రవేశించాడు. రోహిణీ యశోదలు పుత్రులను తనివితీరా దీవించారు.
(బమ్మెర పోతన శ్రీమహాభాగవతం, రామకృష్ణ మఠం ప్రచురణ ఆధారంగా)
No comments:
Post a Comment