Sunday, August 2, 2020

గ్రంథకర్త (వాసుదాసుగారి) స్వవిషయం-1 ..... శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-19 : వనం జ్వాలా నరసింహారావు

గ్రంథకర్త (వాసుదాసుగారి) స్వవిషయం-1

శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-19

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (03-08-2020)

         నాది భారద్వాజ గోత్రం. ఆపస్తంబ సూత్రం. గోల్కొండ వ్యాపారి శాఖకు చెందినవాడిని. సుకవులకు స్నేహితుడను. నా తల్లి పేరు కనకమ్మ. తండ్రి రామచంద్ర రావు. వారికి కలిగిన ముగ్గురు కుమారులలో నేను నడిమి వాడిని. మండపాక పార్వతీశ్వర శాస్త్రులు-వారి కుమారుడు, దేవులపల్లె సుబ్బరాయ శాస్త్రులు-తమ్ముడు తమ్మన శాస్త్రులు, తిరుపతి వేంకటేశ్వర కవులు, మాడభూషి వేంకటాచార్యులు, కొక్కొండ వేంకటరత్నం పంతులు, వేదం వేంకట రాయ శాస్త్రులు, అద్దంకి తిరుమల తాతాచార్యులు, ఆత్మకూరు శ్రీనివాసాచార్యులు మొదలైన పలువురు నా స్నేహితులు.

         గురువులై, దయా వంతులై, కళ్లకు కనిపించే దేవతలై, నాకు ధర్మ సాధనమైన దేహాన్నిచ్చిన తల్లి-తండ్రులను కొలిచి పాపం సమూలంగా నాశనం చేసుకుంటాను. దేహం లేకపోతే జీవుడే కార్యం చేయలేడు. ఏ ధర్మ కార్యం చేయాలన్నా, ఏ యోగం సాధించాలన్నా, దేహం అవసరం. అవి చేయకపోతే తరించే మార్గం లేదు. అట్టి దేహాన్నిచ్చి, ఉపకారం చేసిన తల్లి-తండ్రులు,  జీవించినా-మరణించినా సర్వదా పూజ్యులే. నా చిన్నతనంలో, పదకొండో ఏటనే, మా తండ్రి చనిపోతే, మా అన్నదమ్ములను, తల్లిని రక్షించిన మా పినతండ్రి ప్రశంసనీయుడు. ఆయన పేరు లక్ష్మణరావుగారు. ఆయనే చదువు నేర్పించారు. పదిహేనవ ఏటనే క్షయ వ్యాధికి గురైతే, తన దగ్గర వుంచుకుని, నానా విధ చికిత్సలు చేయించి బ్రతికించారు నన్ను. నీతి మార్గంలో, సుగుణంతో ప్రవర్తించడం నేర్పారు. నాకు ఆయనపై నున్న గౌరవం కొద్ది, కృతజ్ఞత చూపేందుకు "వంశావళి" రాసి ఆయన్ను స్తుతించాను.  దాని పేరే "కుమారాభ్యుదయం".

         నా అన్నగారి పేరు శేషగిరిరావు. నాకంటే చిన్నవాడి పేరు రంగారావు. నా భార్య రంగనాయకి. మాకు సంతానం లేదు. ఋణానుబంధం కొద్దీ పుట్టే మనుష్య రూప సంతానం లేదు కాని, ఇహ-పర సాధకమైన మానస సంతానం ఇంకా కలుగుతూనే వుంది. ఈ సంతానంలో పెద్దవాడు శ్రీరామచంద్రమూర్తే. ఆయన కలిగిన పిమ్మటే తక్కిన సంతానం కలిగింది. ఆయనే నాకు సంస్కర్త. ఈ గ్రంథ రచనారంభం 1900 వ సంవత్సరంలో జరిగింది.1904లో నా తల్లిగారు మరణించారు.నన్ను గురించి రాబోవు చరిత్రకారులు-కవులు పొరబడకుండా, నా విషయాలను  శ్రీకుమారాభ్యుదయంలో వివరంగా రాసాను.

         కళ్ల కలక లాంటి మనసును విషం లాగా బాధపెట్టే ధనం నా వద్ద లేదు. బిడ్డల జంజాటమూ లేదు. భోగభాగ్యాలూ లేవు. పేదరికం వలన భయం లేనేలేదు. రాముడిని తలచుకునేందుకు దీర్ఘ రోగముండనే వుంది. భగవంతుడు ఇచ్చింది వేళకింత వండి పెట్టేందుకు భార్య వుంది. ఇన్ని అనుకూలతలు వున్నప్పుడు శ్రీరాముడిని స్మరించాలి కదా!. విస్తార ధనం లేకపోవడం,బిడ్డలు లేకపోవడం,భోగాలు లేకపోవడం, ఇబ్బంది లేని పేదరికం, రోగ బాధ, భార్య వునికి, భగవన్నామ చింతనకు అనుకూలాలే కాని ప్రతికూలాలు కావు.

         పోయే ప్రాణాలు సుఖంగా పోనీ కుండా బంధువులు లబో-దిబో మొత్తుకుంటుంటే రామనామం స్మరించలేం కదా. శరీర రుగ్మతలు బాధ కలిగించక ముందే, బుద్ధిబలం చెడక ముందే, బంధువులు ఈసడించుకోక ముందే, యమ కింకరుల దర్శనం కాకముందే, శ్రీరామ-శ్రీరామ అని ఎవడు ధ్యానిస్తాడో వాడే సార్థక జన్ముడు. తక్కినవారి బ్రతుకు వ్యర్థం. మనస్సుకు ప్రియమైన మాటలతో హృదయ ప్రదేశంలో వుండే రఘురాముడిని భక్తితో స్మరించడంకంటే శ్రేష్టమైన మార్గం లేదు. తక్కిన మోక్ష మార్గాలన్నీ దీనికంటె తక్కువే.


         శ్రీరాముడిని స్మరించడం శ్రేయస్కరమే కాని అదెలా చేయాలి? ఉరికే రామ-రామ అంటుండాలా? లేక ఇంకేదైన మార్గముందా? రామ-రామ అని స్మరించిన వారిని మాత్రమే అది తరింప చేస్తుంది కాని, తరించాల్సిన ఇతరుల విషయమేంటి? మధురాహారం తానొక్కడే తినరాదు-నలుగురికి పెట్టి తను తినాలికదా! అందుకు తనతోపాటు లోకులు కూడా బాగుపడాలి. ఆ మార్గమేంటని ఆలోచించాను. పూర్వ రామాయణం-ఉత్తర రామాయణం పూర్తిగా తెనిగించిన పూర్వ కవులెవరూ లేరు కనుక, ఆరెండింటినీ పూర్ణంగా లోకానికి చెప్పాలి అనుకున్నాను. నారదుడు వాల్మీకికి రామ చరిత్రను ఉపదేశించింది మొదలు, రావణ వధానంతరం అయోధ్యలో శ్రీరామ పట్టాభిషేకం వరకున్న కథ పూర్వ రామాయణం. అక్కడినుంచి నిర్యాణం వరకు ఉత్తర రామాయణం. ఈరెండింటినీ సమగ్రంగా-యథామూలంగా పలికినవారు పూర్వ కవులలో-నేటికవులలో ఎవరూలేరు. నేడున్న (వాసుదాసుగారి రోజుల్లో) రామాయణాల్లో మూలానుసరణం గా వుంటే అది సమగ్రంగా లేదు. సమగ్రంగా వున్నవనుకుంటే అవి మూలానుసరణం కాదు."తనది కొంత-తాళ్లపాక వారిది కొంత" అన్న చందాన వుంటే అది వాల్మీకి పలికిందెట్లా అవుతుంది?

         భగవత్ కథ రచించడం శ్రేయస్కరమని, భగవత్ చరిత్ర రచించే సుకవి తాను తరించి లోకులను తరింపచేస్తాడని భావించాను.అయితే,భగవత్చరిత్రలెన్నోవుండగా రామాయణరచనకే పూనుకోవడ మెందుకని అడుగవచ్చు.జనన-మరణరూపకమైన సంసారబంధంనుండి విముక్తిచేసేది రామకథ. భయంకరమైన సంసారమనే పగ్గాలను తెంచి వేసేందుకు, శాశ్వతమైన గొప్ప సౌఖ్యం పొందేందుకు, నాశనం లేంది-బాధలేంది అయిన వైకుంఠ ప్రాప్తి కలిగి, భగవత్ సాయుజ్యాన్ని పొందడానికి శ్రీ రామాయణం రాయడం ప్రారంభించాను. వాస్తవంలో కవికి, యోగికి భేదంలేదు. యోగి అనుభవించే ఆనందాన్ని, కవికూడా, ప్రతిపద్యంలో, ప్రతి పదంలో అనాయాసంగా అనుభవిస్తాడు. కవిత్వం చెప్పడం మొదలుపెట్టిన కవికి సుఖ దుఃఖాలు మనస్సులోకి రావు. ఎన్ని సద్గ్రంథాలు రాసినా మనస్సు నిర్మలంగా లేకపోతే పూర్ణ ఫలం రాదు. అందుకే ఎల్లప్పుడూ రామ కథ అనే పాల సముద్రంలో, జనన-మరణ బాధ తొలగి పోయేందుకు, స్నానం చేస్తుంటాను. రోగిని కాబట్టి, రామ కథ అనే మందు తీసుకుంటూ, మరల దుఃఖం-రోగం లేకుండా శాశ్వత సౌఖ్యం అనుభవిస్తాను.

2 comments:

  1. రాముడే వైద్యు డతడి నామమె మందు మన
    పామరత్వవ్యాధి కదే పసందైన మందు

    ReplyDelete
    Replies
    1. పై పల్లవితో పూర్తి రామకీర్తనను శ్యామలీయం బ్లాగులో ఇప్పుడే ప్రకటించా నుండి.

      Delete