‘రెంజిమ్’
పాట, జయప్రదకు
సినిమా బాట
స్వర్గీయ కేబీ తిలక్ జ్ఞాపకాలు-అనుభవాలు
వనం జ్వాలా నరసింహారావు
ప్రజాతంత్ర, సంపూర్ణ స్వతంత్ర
వారపత్రిక
(జనవరి 28 - ఫిబ్రవరి 3, 2001)
కళ్యాణిని పెళ్లి చేసుకున్న రౌడీరాఘవులు
కన్పించకుండా పోయి, ఆయన
ఆనవాళ్లతో వున్న శవం, గుర్తుపట్టని రీతిలో బయట పడుంది,
ఆ శవం రాఘవులే అని నిర్ధారించి, సూర్యం-రాజశేఖర్
లపై హత్యానేరం మోపుతారు. సూర్యం తప్పించుకొని అడవుల్లోకి పోగా రాజశేఖర్‌ను అరెస్టు
చేస్తారు పోలీసులు. బెయిలు ఇవ్వటానికి న్యాయమూర్తి అంగీకరించరు, సూర్యం రహస్యంగా కళ్యాణిని కలుస్తాడు. రాఘవుల్ని తాము చంపలేదని, అతన్ని చంపిందెవరో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నానని అంటాడు.
రాజశేఖర్-సూర్యంల మార్గాలు వేరయినా
దెయ్యం ఒకటే. వారి వారి బాటల్లో పయనిస్తూ ప్రజలను వారి హక్కుల గురించి ప్రభావితం
చేస్తూ ఉంటారు. రాజశేఖర్ సోదరి సుశీల మేనత్త రాజేశ్వరికి మాత్రం అప్పుడుప్పుడూ
జగదీశ్వర భూపతి గారి వంశం గుర్తు కొచ్చినా,
మళ్లీ మనసు జనం వైపు మళ్లిస్తుంటుంది. గ్రామాల్లో కక్షలు సృష్టించే
భూస్వాములు, తమ మాటవినని ప్రజల్ని ఇబ్బందులకు గురిచేసే ఆయుధం
"బైండోవర్ కేసులు" ఇరువర్గాలు ఘర్షణ పడ్డప్పుడు, పోలీసులు
బైండోవర్ కేసుల్లో ప్రజల్ని ఇరికించి, విచారణ పేరుతో ప్రయాణ
సౌకర్యాలు లేని సుదూర ప్రాంతాలకు నెలల తరబడి తిప్పుతూ నానా తిప్పలు పెడ్తారు. ఈ
విషయాన్నే రాజశేఖర్ ఎత్తి చూపుతాడు. "రెక్కాడితే గాని డొక్కాడని
నిర్భాగ్యులెందరో చెప్పుకునే దిక్కు లేక, చేసేదిలేక, పనుల్ని మానుకుని, వాయిదాల కోసం మైళ్లకు మైళ్లు
నడిచి విచారణకు హాజరవుతున్నారు. ఇళ్ల దగ్గర భార్యాపిల్లలు ఆకలితో అలమటించి
పోతున్నారు" అని అంటూ ఈ పద్ధతికి స్వస్తి చెప్పాలని కోర్టుకు
విన్నవించుకుంటాడు.
ఇదిలా వుండగా సూర్యాన్ని ఆయనకు తెలియకుండా, అదే గ్రామానికి చెందిన కల్యాణి
ప్రేమిస్తుంటుంది. ఆమె తనకు చెల్లెలు లాంటిదని స్పష్టం చేస్తాడు సూర్యం. తామిద్దరూ
ఒకే ఆశయం కోసం పాటుపడ్తున్నందున, ఆశయసాధనకోసం, జంటగా చేయిచేయి కలిపి ఒకరికొకరు తోడు కావాలని సుశీల - సూర్యంలు
నిశ్చయించుకుంటారు. మేనత్త రాజేశ్వరమ్మ, ఈతరానికి తగినట్లు
అందరి ఇష్టం ప్రకారమే ఆదర్శవివాహం జరిపించేందుకు అంగీకరిస్తుంది. ఇది తెల్సుకున్న
కళ్యాణి, ఇష్టం లేకపోయినా, తల్లి
కుదిర్చిన ఓ రౌడీషీటర్ రాఘవులుతో పెళ్లి చేసుకునేందుకు అంగీకరిస్తుంది. సూర్యం
-సుశీలల పెండ్లి ఆదర్శ వివాహం కాగా, కళ్యాణి రాఘవుల పెళ్లి
సాంప్రదాయంగా ఆర్బాటంగా జరుగుతుంది ఒకేసారి.
కళ్యాణిని పెళ్లి చేసుకున్న రౌడీ రాఘవులు
కన్పించకుండాపోయి, ఆయన
ఆనవాళ్లతో వున్న శవం, గుర్తుపట్టని రీతిలో బయటపడుతుంది. ఆ
శవం రాఘవులే అని నిర్ధారించి, సూర్యం-రాజశేఖర్ లపై హత్యానేరం
మోపుతారు. సూర్యం తప్పించుకొని అడవుల్లోకి పోగా రాజశేఖర్ ను అరెస్టు చేస్తారు
పోలీసులు. బెయిల్ ఇవ్వటానికి న్యాయమూర్తి అంగీకరించరు. సూర్యం రహస్యంగా కళ్యాణిని
కలుస్తాడు. రాఘవుల్ని తాము చంపలేదని, అతన్ని చంపిందెవరో
తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నానని అంటాడు. తనభర్త బ్రతికే వున్నాడని ఎక్కడో
తెలియదని నిజం చెప్తుంది కళ్యాణి. అతన్ని వెదకటానికి పూనుకుంటాడు. చివరకు
రాఘవుల్ని పట్టుకుంటాడు. జడ్జిమెంట్ ఇచ్చే సమయానికి అతన్ని కోర్టులో హాజరు
పరుస్తారు. రాజశేఖరును విడుదల చేస్తారు.
గ్రామంలో రైతు-కూలి పోరాటం సాగుతుంది.
భూస్వాముల దోపిడీ విధానం కొనసాగుతూనే వుంటుంది, వారేదో దోపిడీకి గురైన ఓ కుటుంబాన్ని
పరామర్శించటానికి వచ్చిన సుశీలకు, ఓ వృద్ధ మహిళ ‘చెల్లి చంద్రమ్మ’
కథ వివరిస్తుంది. పాటగా వివరించిన ఆ కథకు పాత్రాభినయం చేసింది అనుపమ కథానాయిక
జయప్రద. రెంజిమ్ పేరుతో నక్సలైట్ నాయకుడు
సత్యమూర్తి రచించిన ఆపాటను, సుశీల, వల్లం
బృందం పాడారు. ఆ పాట ఇలా సాగుతుంది.
ఆ.... చిన్నారి చిలకమ్మా చెల్లెలు
చంద్రమ్మ
రాకాసి గుండెల్లో గునపాము చంద్రమ్మ
చంద్రమ్మ కథ మీకు చెబుతాను వినరమ్మా
చెవులారా వినరమ్మా-
లిల్లీ పువ్వు వంటిది - చెల్లి మన
చెంద్రమ్మ
మొగిలిపువ్వు వంటి జతగాడు మొగిలన్న
ఆమెకు పెనిమిటి మొగిలన్న
ఓహో చూడచక్కని జోడు
అన్నిట చేదోడువాదోడు
నిజమిది దెమ్మదేవుని తోడు
కాని రెడ్డనువాడు - గ్రామపెద్దట చూడు
బార్ల మేడలవాడు - నూర్ల ఎకరాల వాడు
బార్ల మేడలవాడు - ఒట్టి బాజిగాడు
రాగిమీసం వాడు - రాకాసిరా వాడు-
ఏమి చెప్పుదు గోడు - ఏమి చెప్పుదు కీడు
ఆలమందలు కాయ - ఆవగింజా యిచ్చు
నూతులు తవ్వంగ నువ్వుగింజా యిచ్చు
కాల్వలే తవ్వంగ కాసిగడ్డి యిచ్చు
దుక్కుల్లుదున్నంగ దుబ్బుగడ్డి యిచ్చు
పంట పండించగ పరిగపంచి యిచ్చు
అయ్యో ! యెట్టిచాకిరితోడు - మట్టి గలిపిన
కూడు
ఏమి చెప్పుదు గోడు - ఊరు వల్లకాడు
అ... ఏకాదశినాడు - రాకాసి కాసిరెడ్డి
పిల్లగాలిమీద పికిలి కూసిందని
జొన్నకంకి నున్న - సుంకురాలిందని
మొక్క పెరడులోన - కుక్క మొరిగిందని
దెబ్బమీది దెబ్బ - కసికొద్ది విసిరాడా
దెబ్బ దెబ్బకు మొగిలి - బొబ్బరించినాడా
కారెటి నెత్తురు - కాల్వలై పారిందా -
అయ్యో
ఆ పల్లె పల్లెంతా - తల్లడిల్లిపోయిందా
చెంద్రి చేతిలో చేయివేసి యిక సెలవని
అన్నాడా
బావా .... మనకిది ఏమి పాపమని - చెంద్రి
బావురుమన్నదా
చెంద్రి కనులలో కన్నులుంచి - ఆ కన్ను
మూసినాడా
చుక్క పొద్దు లేనప్పుడు మొగిలి చుక్కల్లో
కలిశాడా
నాచెల్లి శోకమ్ము ఏరులై పారిందా
నాచెల్లి శోకమ్ము వరదలై పొంగింది - అయ్యో
నాచెల్లి శోకమ్ము సంద్రమై లేచిందా -
అయ్యయ్యో
నాచెల్లి శోకమ్ము ఆకసము తాకింది - వగచి
వగచి పగబట్టి లేచిందా చంద్రమ్మ తల్లి
కసలి కసలి కసికొద్ది కదలిందా చంద్రమ్మ
తల్లి
నీలి కనులలో నిప్పులు రాల్చిందా చంద్రమ్మ
తల్లి
అరెరెరె - భగ భగ భగ భగ గుండెలు మండగ
ప్రతిజ్ఞ పట్టిందా - చంద్రమ్మ తల్లి
ఏమని..?
ఓరి కాసిరెడ్డి నువ్వు చేసిన పాపము
పండెరా
భలే భలే - ఓరి కాసిరెడ్డి నీకిలలో నూకలు
నిండెరా
భలే భలే - ఓరి కాసిరెడ్డి - నా ఉసురే నీ
ఉరితాడురా - వహువ్వా!
ఓరి
కాసిరెడ్డి - నీ చావే ప్రజలకు పండుగరా – వహావ్వారే
ఇలా కొంతకాలం గడిచింది. ఒకనాడు
పొద్దుగుంకిన వేళ, సద్దుమణిగిన
వేళ పొలము బుట్ర చూసుకొని తిరిగి వచ్చే దొరకు దారిలో వంటరిగా తారసిల్లింది
చంద్రమ్మ. పాములాగ పగపట్టి ఎలాగైనా కాటు వేయాలని చూస్తున్నాడు దొర. అలాంటి
వాతావరణం ఎలా వుందంట, మసక మసకగా మబ్బులు ముసరగ - కాసిరెడ్డి గుండె గుబగుబలాడే
చిటపట చిటపట చినుకులు కురియగ కాసిరెడ్డి వళ్లు చిటపిటలాడే మొగిలి పూ బొదల మాటున
చేరిన ముసి ముసి నవ్వుల చంద్రిని చూసి:
ముసి ముసి నవ్వుల చంద్రిని చేరి జారు కొప్పుదానా
- జాగిరీ నడుముదానా హో, దానిజోరు
హెచ్చె - ఓ లలనా - గాలి హోరు రెచ్చె నీ మొగుడు పోతేపోయె - ఓ లలనా నీలోటు తీరిపోయె
పసుల కొట్టము చెంత ఓ లలనా మసలుకొందాము రావే - ఓదొరా - ఓదొరా వగలమారి నా దొరా -
దొరికినా అదునిది వదలుకోలేనురా - ఓదొరా నాదొరా ! నా దొరా | రా
దొరా
ఉరికి పులిగాని గొడ్డలికి పులిగాదు
దోపిడికి దొరగాని కత్తికి దొరగాదు
కత్తిపోటుకు రెడ్డి నెత్తుర్లు చిమ్మంగ
కత్తి వేటుకు రెడ్డి నెత్తురు దొర్లంగ
చిందిన నెత్తురు దోసిటా తీసుకొని
జోరు కొప్పుముడుచుకొని
చిటికలో చంద్రమ్మ చీకటిలో కలిసే -
ఆవలిగట్టున జాలారు జంగయ్య
చంద్రమ్మ తల్లికి దండాలు పలికే -
నాచేత సాయమిది చంద్రమ్మ తల్లి
వెళ్లి రావే తల్లి వెళ్లి రావమ్మా
నాబిడ్డలకు నీ పేరు పెట్టుకుంటానే
వేయేళ్లు చల్లంగ వర్థిల్లు తల్లి
వెళ్లిరావే తల్లి వెళ్లిరావమ్మా
అడవిలో అన్నలకు దండాలు పలుకు
వెళ్లి నీ అన్నలకు దండాలు తెలుపు
వెళ్లి వాళ్లందరికి జేజేలు పలుకు
భళ్లుభళ్లుమని తెల్లవారిందండి
ఎందుకో ఆ పొద్దు పల్లె నవ్విందండి
గాలి వీచిందండి - గరిక పూచిందండి
కోడె దూడ మెడలో గంట మోగిందండి
సారి తిరిగిందండి - కదురు కదిలింది
రావిచెట్టుకింద - కొలిమి మండిందండి
భూస్వాముల పెత్తందారి వ్యవహారం ఇంతటితో
ముగియలేదు. ప్రజలను విప్లవ పంథాలోకి ప్రోత్సహిస్తున్నాడన్న ఆరోపణపై రాజశేఖర్ ను
మరలా అరెస్టు చేయిస్తారు, తమ
పూర్వీకుల వారసత్వంగా సంక్రమించిన ఇంటిని ఖాళీ చేయాల్సిందిగా రాజేశ్వరమ్మ -
సుశీలలకు కోర్టు నుండి ఉత్తర్వులు వచ్చేటట్లు భూస్వామి భూపాలరావు చేస్తాడు. చుట్టు
ప్రక్కల గ్రామాలకు వెళ్లి సాయుధ పోరాట భావాలను ప్రచారం చేయకుండా వుండేటందుకు,
వారిద్దరూ ఆగ్రామాలకు వెళ్లకుండా నిషేధాజ్ఞలు కూడా వారికిస్తారు.
ఇవేవీ వారి మనోస్థైర్యాన్ని దెబ్బతీయవు. వారు మరింత పట్టుదలతో కర్షక కార్మిక
వర్గాలతో కల్పి పనిచేస్తుంటారు.
అదే గ్రామానికి చెందిన పోలీసు అధికారి
జకరయ్య కూడా తన ఉద్యోగానికి రాజీనామా చేసి,
లోగడ వివాహమాడుదామనుకొని, కులమత పట్టింపుల
కారణాన చేసుకోలేకపోయిన కృష్ణవేణిని పెళ్లి చేసుకొని గ్రామంలో స్థిరపడతాడు అదే
సమయంలో.
అడవుల్లో అజ్ఞాతవాసం గడుపుతున్న సూర్యంను
కలుస్తారు రాజేశ్వరమ్మ సుశీలలు. సుశీల అప్పటికే గర్భవతి. తమనే శక్తి విడదీయ లేదని
చెప్తుంది సూర్యంతో ఆమె. పుట్టబోయే కొడుక్కు ఉపాధ్యాయుడు జగన్నాథంగారి పేరు, తండ్రి రాజశేఖర్ పేరు కలసేటట్లుగా
జగన్నాధరాజశేఖరం అని పెట్టాలని వారిరువురు అనుకుంటారు.
దోపిడీదారుల ఆగడాలు మితిమీరుతాయి
ఆగ్రామంలో. ప్రజలు ఎదురు తిరుగుతారు. ఒక్కొక్క దోపిడీదారున్ని ప్రజలు
అవమానపరుస్తారు. చివర్లో సూర్యం భూపాలరావుల మధ్య దట్టమైన అడవిలో పోరాటం
జరుగుతుంది. తన తుపాకి దెబ్బకు పడిపోయిన సూర్యం చనిపోయాడనుకుని దగ్గరకు వచ్చిన భూపాలరావు, ఆయన తుపాకే లాక్కొని కాల్చి చంపి, తానూ తుదిశ్వాస విడుస్తాడు సూర్యం ,
సూర్యం భౌతికకాయాన్ని పెద్ద ఊరేగింపుగా
అంత్యక్రియలకు మృతవీరులకిచ్చే గౌరవలాంఛనాలతో తీసుకెళ్తారు. బెయిలు మీద విడుదలైన
రాజశేఖర్ ఊరేగింపుకు అగ్రభాగాన్నుండి,
ఆ తరువాత "చలో హైదరాబాద్" నినాదం ఇచ్చి, రాజధానికి పయనం చేస్తాడు. వేలాది కార్మిక కర్షక వర్గాల వారు, చుట్టు ప్రక్కల గ్రామాల నుండి తరలివచ్చి హైదరాబాద్ కు వెళ్లే ఆ ఊరేగింపులో
పాల్గొంటారు. భూసంస్కరణలు తక్షణం అమలు చేయాలని నినాదాలు ఇస్తారు. సుశీల
మగపిల్లవాడిని కంటుంది. సూర్యం చావుతో ఆగిన పోరాటాన్ని కొడుకు కొనసాగిస్తాడని శపథం
చేస్తుంది సూర్యం వర్ధంతినాడు. ప్రజలంతా ఆయన సమాధి వద్ద గుమికూడి పోరాటాన్ని
కొనసాగిస్తామని ప్రతిజ్ఞ పూనుతారు "అంతంకాదిది - ఆరంభం" అని
నినాదాలిస్తారు మిన్నుముట్టేలా. End
No comments:
Post a Comment