దక్షుడి యాగాన్ని ధ్వంసం చేసిన రుద్రుడి చరిత్ర
శ్రీ మహాభాగవత కథ-14
వనం జ్వాలా నరసింహారావు
కంII చదివెడిది భాగవతమిది,
చదివించును
కృష్ణు, డమృతఝరి పోతనయున్
చదివినను
ముక్తి కలుగును,
చదివెద
నిర్విఘ్నరీతి ‘జ్వాలా’
మతినై
బ్రహ్మజ్ఞాన సంపన్నులైన బ్రహ్మలు
చేసిన సత్ర యాగంలో శివుడిని దక్షుడు, అతడి మార్గాన్ని అనుసరించే బ్రాహ్మణులను
నందీశ్వరుడు, ఆ నందీశ్వరుడిని భృగుమహర్షి ఒకరినొకరు
శపించుకుని ఎక్కడివారక్కడికి వెళ్ళిపోయారు. దక్షుడికి,
ఈశ్వరుడికి మధ్య పరస్పర విరోధం చాలాకాలం కొనసాగింది. ఈ వైరం నేపధ్యంలో
ప్రజాపతులందరి మీద అధినాయకత్వాన్ని వహించాడు దక్షుడు. రుద్రహీనమైన ‘వాజపేయం’ అనే
యజ్ఞాన్ని చేశాడు. ఆ తరువాత ‘బృహస్పతి సవనం’ అనే యజ్ఞం
చేయడానికి ఉపక్రమించాడు. ఆ యజ్ఞాన్ని చూడడానికి మునులు,
ప్రజాపతులు, దేవతలు, మహర్షులు
సతీసమేతంగా వచ్చారు. వారంతా తమ దీవెనలిచ్చి, ఆయన చేసిన
పూజలను అందుకున్నారు. ఇదంతా దక్షుడి కూతురు, ఈశ్వరుడి భార్య
సతీదేవి దృష్టికి వచ్చింది. దంపతులు-దంపతులుగా దేవ, గంధర్వ, కిన్నర, కింపురుషులు ఆకాశమార్గాన అక్కడికి పోవడం
చూసింది ఆమె.
ఈ విషయాన్ని భర్తకు చెప్పి
అక్కడకు తాము ఇద్దరం వెళ్దామని అన్నది సతీదేవి. తండ్రి, గురువు, స్నేహితుడు, ప్రభువు అయిన వారి గృహాలకు పిలవకుండానే సజ్జనులు వెళ్తారు కదా! అన్నది.
సత్రయాగంలో జరిగిన విషయాన్ని గుర్తు చేస్తూ శివుడు,
కుటిలులైన దుర్జనులున్న ఇంటికి బంధుత్వాన్ని పాటించి వెళ్లడం వినయ సంపన్నులకు
అనుచితం అన్నాడు సతీదేవితో. ఇష్టమైన బంధువులు మనస్సుకు తగిలేట్లు దుర్భాషలాడితే
అవి బాధ కలిగిస్తాయని కూడా అన్నాడు. ఆమె దక్షుడి ప్రియ పుత్రిక అయినప్పటికీ, తన భార్య అయిన కారణాన, ఆమె తండ్రి గౌరవాన్ని పొందలేదని
చెప్పాడు. తన మాటలు అతిక్రమించి ఒకవేళ ఆమె అక్కడికి వెళ్లితే, ఆమెకు పరాభవం
కలుగుతుందని హెచ్చరించాడు.
భర్త ఇంత చెప్పినప్పటికీ, తండ్రిని చూడాలన్న కోరికతో సతీదేవి పుట్టింటికి వెళ్లింది.
ఆమె వెంట వేలాది రుద్రుడి అనుచర గణం కూడా వెళ్లింది. నందీశ్వరుడు ముందు నడిచాడు.
అంతా కలిసి యజ్ఞం జరిగే ప్రదేశం దిక్కుగా ప్రయాణించారు. యజ్ఞశాలను సమీపించింది
సతీదేవి. ఆమెను అక్కడ తల్లి, తోబుట్టువులు తప్ప మిగిలిన
వారెవ్వరూ పలకరించలేదు. తల్లి, పినతల్లి ఆమెను కౌగలించుకుని
క్షేమ సమాచారాలు అడిగారు. తండ్రి పలకరించనందుకు మౌనంగా వుండిపోయిందామె. తండ్రి
అనాదరణకు గురైన ఆమె బాధను చూసి, కోపంతో, భూత గణాలు ఆవేశపడ్డాయి. దక్షుడిని హతమారుస్తామంటూ లేచిన గణాలను సతీదేవి
వారించింది. తన రోషాన్ని వ్యక్తం చేస్తూ, తండ్రి ఈశ్వరుడి
పట్ల పాపబుద్ధితో దోషాన్ని ఆపాదించాడనీ, ఆయన లాంటి వారు
మహాత్ములను నిందించడం ఆశ్చర్యం కాదనీ, బ్రహ్మాది దేవతలు ఆయన
పాదపద్మాలను ఆశ్రయిస్తారనీ, దుష్టబుద్ధితో ఈశ్వరుడిని
నిందించిన ఆయన కూతురునని అనిపించుకోవాలని లేదనీ, ఆయన వల్ల
సంప్రాప్తించిన శరీరాన్ని విడిచి పరిశుద్ధురాలినవుతాననీ అన్నది.
ఈ విధంగా మాట్లాడి యజ్ఞసభా
మధ్యలో నిలబడి, శరీర త్యాగం చెయ్యాలని భావించి, దేహాన్ని విడిచి పెట్టాలనే ఆలోచనతో యోగాగ్నిని రగుల్కొలిపింది. యోగ
సమాధిలో జన్మించిన అగ్నిలో ఆ క్షణమే దగ్ధమైపోయింది సతీదేవి. ఇది చూసిన రుద్రుడి
అనుచరులు దక్షుడిని చంపడానికి పూనుకున్నారు. అప్పుడు అక్కడే వున్న భృగుమహర్షి హోమం
చేసి, ఋభులనే వేలాది దేవతలను సృష్టించగా, వారు, రుద్ర గణాలను పారద్రోలారు. జరిగిన విషయమంతా
వివరంగా శివుడికి చెప్పాడు నారదుడు.
శివుడికి పట్టరాని కోపం
వచ్చింది. జటాజూటం నుండి ఒక జడను పెరికి భూమ్మీద విసిరికొట్టాడు. అందులోనుండి లోక
భయంకరుడైన వీరభద్రుడు రుద్రుడి ప్రతిబింబంలాగా ఉద్భవించాడు. తానేంచెయ్యాలో
ఆజ్ఞాపించమని అడిగిన వీరభద్రుడిని, దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేసి, దక్షుడిని సంహరించమని చెప్పాడు శివుడు. ఆయన యజ్ఞవాటికకు
చేరుతుంటే, భయంకరమైన కారుచీకటి కమ్మింది. దూళి పుట్టింది.
ప్రభంజనం వీచింది. అప్పుడు అక్కడున్న వారంతా దక్షుడితో సహా భయపడ్డారు. సతీదేవికి
కీడుచేసిన దక్షుడి పాపకృత్యపు ఫలమే ఈ చీకటి అని అక్కడి స్త్రీలన్నారు. అనవసరంగా
రుద్రుడికి కోపాన్ని కలిగించాడు దక్షుడని అన్నారు. అదే సమయంలో రుద్రుడి అనుచరగణం
యజ్ఞవాటికను తారుమారు చేశారు. అంతా విధ్వంసం కలిగించారు. యజ్ఞ సదస్సులోని దేవతలను, ఋత్విక్కులను నానారకాలుగా బాధ పెట్టారు. భగుమహర్షి కళ్ళుపీకాడు
నందీశ్వరుడు. భృగుమహర్షి మీసాలు పెరికాడు వీరభద్రుడు. అంతటితో ఆగకుండా, వీరభద్రుడు సాటిలేని మహాదర్పంతో చెలరేగి దక్షుడిని పడతోసి, కంఠాన్ని నులిమి, శిరస్సును తుంచి, మహాకోపంతో దక్షిణాగ్నిలో హోమం చేశాడు. ఇలా వీరభద్రుడు శివుడి ఆజ్ఞానుసారం
దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేసి కైలాసానికి వెళ్లిపోయాడు.
ఇదంతా దేవతలు బ్రహ్మదేవుడికి
చెప్పి ఆయనకు మొరపెట్టుకున్నారు. వారు పరమేశ్వరుడి విషయంలో చేసిన తప్పును ఎత్తి
చూపిస్తూ, బ్రహ్మదేవుడు, వారిని
వెల్లి ఆ శివుడినే కలిసి, ప్రార్థించమని సలహా ఇచ్చాడు.
బ్రహ్మ కూడా వాళ్లతో కలిసి వస్తాననన్నాడు. అలా, వారంతా
కైలాసాన్ని దర్శించారు. అక్కడ వారు శత యోజనాల పొడవు,
డబ్బైఅయిదు యోజనాల వెడల్పున్న ఒక వట వృక్షాన్ని చూశారు. అక్కడే ధర్భాసనం మీద
కూర్చున్న ఈశ్వరుడిని చూశారు. బ్రహ్మాది దేవతలు ఆయన్ను చూడగానే, దక్షిణామూర్తి రూపుడైన ఆయన్ను స్తుతించారు. స్తుతించి ఇలా అన్నారు:
‘యజ్ఞభాగాన్ని పొందే అర్హతగల
నీకు యజ్ఞాభగాన్ని సమర్పించక పోవడం వల్ల, నీవల్ల ధ్వంసం చేయబడి, అసంపూర్ణంగా మిగిలిపోయిన ఈ దక్షుడి యాగాన్ని మళ్లీ ఉద్ధరించి, దక్షుడిని పునఃజీవితుడిని చెయ్యాలని ప్రార్థన. భగుడికి నేత్రాలు, భృగుమహర్షికి మీసాలు, పూషుడికి దంతాలు ప్రసాదించు.
అవయవాలు కోల్పోయిన దేవతలను అనుగ్రహించు. మిగిలిన యజ్ఞాన్ని పరిపూర్తి చేసి ఈ
యాగాన్ని నీ యజ్ఞ భాగంగా స్వీకరించు’.
బ్రహ్మాది దేవతలు కోరిన
విధంగానే శివుడు చేశాడు. ఆ తరువాత ఇంద్రాది దేవతలు,
ఋషులు వెంటరాగా బ్రహ్మ దేవుడు రుద్రుడిని తీసుకుని దక్షయజ్ఞ వాటికకు వచ్చాడు.
దక్షుడిని గోర్రెతల వాడిగా చేయడంతో, అతడు నిద్ర నుండి
లేచినవాడిలాగా లేచి సంతోషించాడు. రుద్రుడిని ద్వేషించడం వల్ల కలిగిన పాపాల నుండి
విముక్తి పొందాడు. అప్పుడు తన కూతురు సతీదేవి గుర్తుకు వచ్చింది. శివుడిని
స్తుతించాడు. తనను క్షమించమని వేడుకున్నాడు. ఆ తరువాత యజ్ఞకార్యాన్ని
నిర్వహించడానికి సిద్ధమయ్యాడు. యజ్ఞపరిసమాప్తి అవుతుంటే,
సర్వేశ్వరుడైన శ్రీమన్నారాయణుడు ప్రసన్నుడయ్యాడు. అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఆయన్ను
చూసి బ్రహ్మ, ఇంద్రుడు, శివుడు, దేవతలు, అగ్నిదేవుడు, గంధర్వులు, విద్యాధరులు, బ్రాహ్మణులు మొదలైనవారంతా భక్తితో నమస్కారం చేశారు.
స్తోత్రం చేశారు. ఋత్విక్కులు స్తుతించారు. దక్షుడి భార్యైన ప్రసూతి రక్షించమని
వేడుకుంది. లోకపాలకులు స్తుతించారు.
ఇలా సమస్త జనులు హరిని
కీర్తిస్తుంటే, రుద్రుడు ఆటంకపరచిన దక్షుడి యజ్ఞాన్ని శ్రీహరి పూర్తి చేశాడు. దక్షుడిని
చూసి తాను తృప్తి చెందానని అన్నాడు. ఆ తరువాత దక్షుడు శ్రీహరిని పూజించాడు.
యజ్ఞానికి అంగభూతమైన మరికొన్ని యాగాలను చేశాడు. దేవతలను, రుద్రుడిని పూజించాడు. ఆ తరువాత శ్రీమహావిష్ణువు, శివుడు తమ-తమ నివాసాలకు వెళ్లిపోయారు.
దక్షుడి కుమార్తె సతీదేవి
పూర్వదేహాన్ని వదిలి, హిమవంతుడి పుత్రికగా మేనకకు జన్మించి, ఈశ్వరుడిని వరించింది. ఇది దక్షుడి యాగాన్ని ధ్వంసం చేసిన రుద్రుడి
చరిత్ర.
(బమ్మెర పోతన శ్రీమహాభాగవతం, రామకృష్ణ మఠం ప్రచురణ ఆధారంగా)
No comments:
Post a Comment