జయ-విజయులకు సనక సనందనాదుల శాపం
శ్రీ మహాభాగవత కథ-10
వనం జ్వాలా నరసింహారావు
కంII చదివెడిది భాగవతమిది,
చదివించును
కృష్ణు, డమృతఝరి పోతనయున్
చదివినను
ముక్తి కలుగును,
చదివెద
నిర్విఘ్నరీతి ‘జ్వాలా’
మతినై
ఒక పర్యాయం బ్రహ్మ
మానసపుత్రులైన సనక సనందనాదులు భువనాలన్నీ తిరుగుతూ,
శ్రీహరిని కొలవాలని బయల్దేరారు. వెళ్లి-వెళ్లి దివ్యమైన శోభతో వెలిగిపోతున్న అందమైన
వైకుంఠాన్ని చూశారు. శ్రేష్టమైన ఆ వైకుంఠమే ఒక జలజాకరం. దివ్యమైన బంగారు మంటపాలతో,
గోపురాలతో, సౌధములతో నిండిన అ భవనమే ఒక దివ్యమైన పద్మం. ఆ
మందిరాంతరంలో ప్రకాశించే ఆదిశేశుడే తామరదుద్దు. శేషుడు తల్పంగా శయనిస్తున్న
మాధవుడే తుమ్మెద. ఆ వైకుంఠ ధామాన్ని సనక సనందనాదులు సమీపించారు. వచ్చి, ఇద్దరు ద్వారపాలకులను చూశారు. వృద్ధులైన సనక సనందనాదులు ఐదేళ్ల బాలుర
లాగా కనబడుతూ ద్వారపాలకుల దగ్గరికి వచ్చారు. వారిని ద్వారపాలకులు అడ్డుకున్నారు.
మందబుద్ధులైన కారణంగా తమను అడ్డుకున్నారని వారిని దూషిస్తూ,
దానికి వారు శాపార్హులని అంటూ, భూలోకంలో జన్మించమని
శపించారు.
సత్పురుషులను పరాభవించినందుకు
తాము శిక్షార్హులమే అని అంటూ, ఎల్లప్పుడూ తాము
శ్రీహరి నామం మరచిపోకుండా ఉండేట్లు అనుగ్రహించమని సనక సనందనాదులను ప్రార్థించారు
జయ-విజయులు అనే ఆ ద్వారపాలకులు. వారిలా అంటున్న సమయంలో బయట కలకలం విన్న శ్రీహరి
అంతఃపుర ద్వారాలు దాటి, పాదచారిగా బయటకు వచ్చాడు. ఆయన వెనుకనే శ్రీమహాలక్ష్మి కూడా
వచ్చింది. వచ్చిన వారిద్దరూ సనక సనందనాదులకు తృప్తితీరా దర్శనం ఇచ్చారు. తమ
చూపులను శ్రీహరి పాదారవిందాల మీద నిలిపి, శ్రీహరిని కనులారా
వీక్షించి, అభివందనం చేశారు సనక సనందనాదులు. ‘పద్మదళాక్ష!
భక్తజనవత్సల! దేవా!’ అంటూ ఆయన్ను స్తుతించారు. ఆయన యథార్ధ స్వరూపాన్ని తామిప్పుడు
తనివితీరా చూడగలిగామనీ, ఆయనకు మొక్కుతున్నామనీ, తమని ఆదరించమనీ నుతించారు. అప్పుడు ఆ మునివరులకు గోవిందుడు ఉద్బోధ చేస్తూ
ఇలా అన్నాడు.
‘జయ-విజయులనే నా ఇద్దరు ద్వారపాలకులు
మిమ్మల్ని లేక్కచేయనందుకు, నా ఆజ్ఞను అతిక్రమించి అపరాధం చేసినందుకు మీరు
వారికి తగిన దండన విధించారు. వాళ్లు చేసిన తప్పుకు నామీద గౌరవం ఉంచి నన్ను
మన్నించి మీరు ప్రసన్నులు కండి. నా మనస్సులోని భావాన్ని తెలుసుకోలేక మీ ఆనతి
మీరినందుకు వారిని క్షమించండి. వీళ్లు భూమ్మీద పుట్టి, కొంతకాలం ఉండి,
అచిరకాలంలోనే నాదగ్గరకు తిరిగి వచ్చేవిధంగా మీరు అనుమతించండి’. ఇలా అన్న శ్రీహరితో
సనక సనందనాదులు జవాబుగా ఈ విధంగా చెప్పారు.
‘మహాత్మా! ఒక విన్నపం! ఈ
జయ-విజయుల మీద కోపంతో మేము శపించాం. నువ్వు అంతకంటే అధికంగా ఆజ్ఞాపించాలనుకుంటే
అలాగే చెయ్యి. అలా కాకుండా ఎక్కువ సిరి సంపదలను ఇచ్చి రక్షించాలని అనుకుంటే ప్రభూ
అలాగే రక్షించు. నువ్వు ఎలా చేసినా మాకు ఇష్టమే. వీళ్ల విషయంలో మేమేదైనా తప్పుచేసినట్లయితే
నీ మనస్సుకు వచ్చినట్లు ఆజ్ఞాపించు’ అని చేతులు జోడించి నమస్కారం చేశారు.
జయ-విజయులిద్దరూ భూలోకానికి వెళ్లి రాక్షసులుగా జన్మిస్తారనీ, దేవతలకు, మానవులకు బాధలు కలిగిస్తారనీ, తనతో వైరంగా జీవిస్తారనీ, తనతో పోరాడుతారానీ, చివరకు తన చేత సంహరించబడ్డాక ఉత్సాహంతో, పాపరహితులై తన చెంతకు చేరుతారనీ
అన్నాడు శ్రీహరి. అలా మూడు జన్మల అనంతరం భూమ్మీద ఇక ఎప్పటికీ వారికి పుట్టుక లేదని
కూడా చెప్పాడు. ఇది విని, శ్రీమహావిష్ణువును స్తుతించి, ఆయన
దివ్యమంగళ శరీరాన్ని, వైకుంఠ ధామాన్ని దర్శించి, లక్ష్మీదేవిని కూడా స్తుతించి, తమ నివాసాలకు
వెళ్లారు సనక సనందనాదులు.
ఆ తరువాత లక్ష్మీకాంతుడు
జయ-విజయులను ఊరడిస్తూ, వారు విధిగా అసుర జాతిలో జన్మించాల్సిన స్థితి వచ్చిందనీ, అందువల్ల దనుజులై జన్మించి, వారి
మనస్సులో ఎప్పుడూ తనను తలచుకుంటూ, తన చేతిలో మరణించి తిరిగి వైకుంఠానికి
వస్తారనీ, ఇక వారిద్దరూ వెళ్లవచ్చనీ ఆజ్ఞాపించాడు. అలా
చెప్పి తన మందిరానికి వెళ్ళాడు శ్రీహరి. వెంటనే తమ తేజస్సును కోల్పోయిన జయ-విజయులు
నేలమీద పడిపోయారు. కస్యపుడి భార్య దితి గర్భంలో ప్రవేశించారు.
ఇదంతా తన భర్త కశ్యపుడి ద్వారా
విన్న దితి చాలా దుఃఖించింది. తన కొడుకులు దేవతలను బాధిస్తారని తలచుకుంటూ దితీదేవి
నూరు సంవత్సరాల కాలం గడిపింది. అప్పుడు లోక కంటకులైన ఇద్దరు కుమారులను కన్నది.
వారు పుట్టినప్పుడు ధరణీ మండలం గడగడలాడింది. కులపర్వతాలు కంపించాయి. సముద్రాలు
క్షోభించాయి. నక్షత్రాలు నేలరాలాయి. ఆకాశం చీలిపోయింది. భూమ్మీద పిడుగులు పడ్డాయి.
అలా ఎన్నో మహోత్పాతాలు కలిగాయి. వారిని చూడడానికి వచ్చిన కశ్యపుడు దితి పుత్రులకు
‘హిరణ్యకశిపుడు’, ‘హిరణ్యాక్షుడు’ అని
పేర్లు పెట్టాడు. వారిద్దరూ బ్రహ్మ వల్ల వరాలు పొంది బలగర్వంతో నిర్భయంగా
తిరగసాగారు.
హిరణ్యాక్షుడు, తనను ఎదిరించి
యుద్ధం చెయ్యగలిగిన వీరుడి కొరకు భూలోకం అంతా గాలించినా కనపడక పోయేసరికి,
స్వర్గలోకం మీద దాడి చేశాడు. దేవతలు పలాయనం చేశారు అతడిని చూసి. వారిని భీరువులు
అని నిందించి సముద్రంలో ప్రవేశించాడు. అక్కడ వున్న వరుణుడి బలగాలు సముద్ర మధ్య
భాగంలో దాక్కున్నాయి. చాలా సంవత్సరాలు హిరణ్యాక్షుడు సముద్ర మధ్యలో శత్రు
సైన్యాన్ని చంపే క్రీడలో ఆడుకున్నాడు. చివరకు వరుణుడిని చూశాడు. హిరణ్యాక్షుడిని ఎదుర్కొనగలవాడు ఒక్క ముకుందుడే అనీ, అతడు ఇప్పుడు వైకుంఠంలో ఉన్నాడనీ,
అక్కడికి వెళ్తే అతడి కోరిక నెరవేరుతుందనీ అన్నాడు వరుణుడు. తక్షణమే వైకుంఠం
మీదికి దండయాత్రకు బయల్దేరాడు హిరణ్యాక్షుడు. అతడికి నారద మహాముని ఎదురై
విష్ణుమూర్తి అప్పుడు వైకుంఠంలో లేడనీ, భూభారాన్ని భరించడం కోసం ఆది
వరాహావతారాన్ని ఎత్తి రసాతలంలో ఉన్నాడనీ, అక్కడికి వెళ్తే యుద్ధం చేయవచ్చనీ
అంటాడు.
హిరణ్యాక్షుడు త్రుటిలో
పాతాళానికి వెళ్లాడు. అక్కడ వరాహరూపంలో ఉన్న విష్ణువును చూశాడు. అప్పుడు శ్రీహరి
కేవలం తన చూపులతోనే హిరణ్యాక్షుడి శరీర కాంతిని క్షణంలో హరించి వేశాడు. వరాహం తన
ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ చెలరేగి పోతుంటే అది చూసిన దానవుడి గుండె తల్లడిల్లి పోయింది.
వెంటనే ఒక భయంకర సూకర రూపాన్ని ధరించి హిరణ్యాక్షుడు, విష్ణువుతో, ధరణీ మండలం అంతా తన
గుప్పిట్లో ఉందనీ, దాన్ని తీసుకుపోయే ప్రయత్నం చేస్తే
ప్రాణాలు తీస్తాననీ అన్నాడు. వాడి మాటలను లెక్కచేయకుండా,
ధరణీదేవితో సహా బయటకు వచ్చిన ఆదివరాహాన్ని హిరణ్యాక్షుడు వెంబడించాడు. వాడిని
ఎదుర్కోవడానికి వీలుగా జలంమీద భూమిని తన ప్రభావంతో నిలిపాడు శ్రీహరి. వెంటనే సమర
సన్నద్ధుడై నిలిచాడు. హిరణ్యాక్షుడిని యుద్ధానికి రమ్మని సవాలు విసిరాడు. హిరణ్యాక్షుడు
అతి భయంకరంగా, సాహసంతో శ్రీహరికి ఎదురు వెళ్లాడు. ఇద్దరూ గదా
యుద్ధం చేశారు. ఇద్దరూ గెలవాలనే పట్టుదలతో యుద్ధం చేశారు. దేవతలు ఆ యుద్ధాన్ని
చూడడానికి వచ్చారు.
విష్ణువు గదను హిరణ్యాక్షుడు
సాగర మధ్యలో పడేట్లుగా కొట్టడంతో, వాడిని వధించడం కోసం, తన ఆయుధమైన సుదర్శన చక్రాన్ని స్మరించాడు శ్రీహరి. అప్పటికీ
హిరణ్యాక్షుడు ఎదురు నిలిచి భీకరంగా పోరాడాడు. తన బాహువులు సాచి వరాహమూర్తి
వక్షస్థలాన్ని పొడవగా, వాడిని తన అరచేతితో చెంపమీద కొట్టాడు
శ్రీహరి బలంగా. ఆ దెబ్బకు హిరణ్యాక్షుడు సోలి కింద పడ్డాడు. వెంట-వెంట రాక్షసుడి
గూబ మీద దెబ్బ మీద దెబ్బకొట్టాడు శ్రీహరి.
వాడు దైన్యంగా కళ్ళు తేలేసి నేలకూలాడు. చివరకు ప్రాణాలు వదిలాడు. ఆ విధంగా
యజ్ఞవరాహమూర్తి రాక్షస రాజైన హిరణ్యాక్షుడిని చంపినందుకు బ్రహ్మాది దేవతలు
సంతోషించారు.
(బమ్మెర పోతన శ్రీమహాభాగవతం,
రామకృష్ణ మఠం ప్రచురణ ఆధారంగా)
No comments:
Post a Comment