రామాయణం లక్ష్య గ్రంథమైతే, భగవద్గీత లక్షణ గ్రంథం
శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-22
వనం జ్వాలా నరసింహారావు
సూర్యదినపత్రిక (24-08-2020)
ధర్మా-ధర్మ లక్షణ జ్ఞానం విషయంలో రెండు రకాలవారున్నారు.
మొదటివారు,
శాస్త్ర జ్ఞానం పరిపూర్ణంగా సంపాదించి, ప్రతి పని దాని ప్రకారం వుందా-లేదా అని పరిశోధించేవారు. రెండో రకం వారు, పూర్వపు మహాత్ములీప్రకారం ఆచరించారు కాబట్టి మనం కూడా అలానే చేద్దామనేవారు.
తల్లి తండ్రులనూ,
గురువులనూ అనుకరించేవారు ఈ కోవకు చెందినవారు. అంటే, మనం ఎవరినైతే అనుకరిస్తామో వారు కూడా నిర్దుష్టులై వుంటేనే మనం చెడిపోం.
ఈవిధంగా ఉభయ విధమైన ధర్మానుష్టానాన్ని రామాయణంలో నేర్చుకోవచ్చు. యుగధర్మాలు మారుతూ
వస్తున్నాయి.
ధర్మం, అధర్మం సమ బలంగా వున్నప్పుడు, ఏది ధర్మమో, ఏది అధర్మమో తెలియ చెప్పేవాడుండాలి. అదే జరిగింది కృష్ణావతారంలో. అదే
భగవద్గీత. ఇది కలికాలం-కలహకాలం. ఈ రోజుల్లో రాముడైనా, కృష్ణుడైనా చెప్తే వినే వాళ్ళు తక్కువ. నువ్వు చెప్పేదేంది, నేను వినేదేంది అనేవాళ్లే ఎక్కువ. ఇలాంటివారిని చక్కపెట్ట గలిగేది
కల్క్యావతారమేనేమో. కాబట్టి శ్రీరామావతారం అనుష్టానావతారం. శ్రీకృష్ణావతారం
ఉపదేశావతారం. శ్రీరాముడు దేనిని అనుష్టానంతో ధర్మమని నిరూపించాడో, దాన్నే శ్రీకృష్ణుడు ఉపదేశంతో స్థాపించాడు. రామాయణం లక్ష్య గ్రంథమైతే, భగవద్గీత లక్షణ గ్రంథం. తక్కిన శాస్త్రాలు చదివినా చదవకున్నా ఈరెండూ చదివితే
చాలంటారు అందుకేనేమో.
వాసుదాసస్వామి
రామాయణ రచనా కాలంలో,
ఒంటిమిట్టకు చేరడానికి ముందు, అక్కడున్న రామాలయంలో ఒక వింత జరిగింది. దేవుడి ఉయ్యాల పీటకు కావాల్సిన
గొలుసులు కొనేందుకు చందాలు వసూలుచేయడానికి, గ్రామస్తులు
సమావేశమయ్యారు. ఏ ఒక్క పెద్దమనిషికూడా చందా ఇచ్చేందుకు ముందుకు రాకపోవడంతో, ఒక దళితుడు అందరికంటే ముందుగా తన వంతు చందాగా పది రూపాయలు ప్రకటించాడు. తనిచ్చే
చందా పనికొస్తుందనుకుంటే తీసుకోమని అన్నాడు. గ్రామస్తులు ఆక్షేపణ చేయనందున తను
ఇస్తానన్న చందా తెచ్చేందుకు ఇంటికి పోయాడు. అతడొచ్చేలోపున సిగ్గుపడిన ఇతరులు కూడా
తమవంతు చందాలను ప్రకటించి ఇచ్చారు. " సమ్మారజనీధ్వజుడైన" తనూ, మాల దాసుడననే,
ప్రకటించుకున్నారు వాసుదాసుగారు. తనపై స్పర్థతోనన్నా, తన వ్యాఖ్యానానికి మించిన వ్యాఖ్యానాన్ని పండితుడైన వాడు రాయాలని ఆయన కోరిక.
వారికిది మార్గదర్శి అవ్వాలనీ విజ్ఞప్తిచేశాడు. గోడంటూ కట్టితే బొమ్మలేసేవారెందరో
దొరకక పోతారా అనేదే ఆయన అభిలాష.
సామాన్య ధర్మం
విషయంలో శ్రీమద్రామాయణానికి వ్యాఖ్యానమే శ్రీ మహాభారతం. మోక్ష ధర్మం విషయంలో శ్రీ
భాగవతం వ్యాఖ్యానం. గ్రంథ రచన పూర్తయ్యేవరకు తనకు ఆరోగ్యం-ఆయుష్షు ఇచ్చి
శ్రీరామచంద్రమూర్తి తన వద్దకు రమ్మని పిలవకపోతే యథా శక్తితో పైన చెప్పిన విషయాలను
వివరిస్తానంటారు. లోపాలను మహాజనులు క్షమించాలనీ, ఇదే దాసుడైన తన ప్రార్థన అనీ, తన అవతారికలో కోరుతారు
వాసుదాసుగారు.
No comments:
Post a Comment