వాల్మీకికి రామాయణాన్ని ఉపదేశించిన నారదుడు
శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-23
వనం జ్వాలా నరసింహారావు
సూర్యదినపత్రిక (31-08-2020)
వేదాధ్యయనంలో సుసంపన్నుడు, వేదాంతవేత్త,
బ్రహ్మజ్ఞాననిష్టుడు, జపపరుడు, వ్యాకరణాది వేదాంగాలను తెలిసినవాడు, సరస్వతీ పుత్రులలో శ్రేష్టుడు, పరమాత్మ స్వరూపాన్ని బోధించేవాడు, యోగవేత్తలలో ముఖ్యుడైన
నారదుడొస్తాడు వాల్మీకి దగ్గరకు. భగవద్విషయాన్ని బోధించే యోగ్యతున్న గురువు
దొరకలేదనే నిర్వేదంతో శుష్కించిన మనన శీలుడు, తపశ్శాలి వాల్మీకి ఆయనకు
సాష్టాంగ నమస్కారం చేసి ఈ విధంగా ప్రశ్నించాడు.
" తపమున స్వాధ్యాయంబున,
నిపుణుని వాగ్విద్వరేణ్యు నిఖిల మునిజనా
ధిపు నారదుసంప్రశ్నము,
తపస్వి
వాల్మీకి యిట్టు, తమి గావించెన్ "
వాసుదాసుగారు కంద పద్యంలో రాసిన ఈ ప్రశ్నకు ప్రతి పదార్థ
తాత్పర్యంతో పాటు 500 పంక్తుల వ్యాఖ్యానం జోడిస్తారు."తపమున స్వాధ్యాయంబున" అని అనడమంటే, ఆచార్యుడికుండాల్సిన గుణ సంపత్తిని తెలపడమే. అంటే నారదుడు తపశ్శీలుడని, వేదాధ్యయన సంపన్నుడని అర్థం. అదేవిధంగా నారదుడి సంయమన శక్తీ చెప్పబడింది. ఆయన
అష్టాంగ యోగసిద్ధి కలవాడనే అర్థమూ వస్తుంది. పర బ్రహ్మం ధ్యానించడంలో సమర్థుడనే
మరో అర్థం కూడా వుంది. నారదుడు గుణాతీతుడైన మహాయోగి-భక్తుడు.దీన్నిబట్టి ఈ
గ్రంథంలోని ముఖ్యవిషయం భగవత్ స్వరూపాను సంధానం అని బోధపడుతున్నది.
"వాగ్విద్వరేణ్యుడు" అంటే, కేవలం వేదమే కాకుండా అర్థ
జ్ఞానం కూడా నారదుడికి ఉన్నదని అర్థమొస్తుంది. "నిఖిల ముని జనాధిపు" అనే
విశేషణం సమాహితత్వమనే ఆచార్య గుణాన్ని తెలియచేస్తుంది. మునులు మనన స్వభావులు.
నిఖిల శబ్దం శేషంలేమిని తెలుపుతుంది. జన శబ్దం అనేక తత్వాన్ని తెలుపుతుంది.
వాగ్విద్వరేణ్యుడు అనేది మననాన్ని తెలుపుతుంది. ఇలా ఇవన్నీ కలిపితే నారదుడికి
"శ్రవణ మనన నిధి ధ్యాసనాత్మకమైన యోగ పూర్తి" ఉందని అర్థం చేసుకోవాలి.
"తపమున నిపుణుడు" అంటే
జ్ఞానాధికుడని-"ముని జనాధిపుడు" అంటే ఉపాసుకులందు శ్రేష్ఠుడని, నారదుడిలో ఈ రెండూ పూర్ణ శక్తులుగా వున్నాయనీ అర్థం.
నారదుడు
భగవత్తత్వాన్ని సాక్షాత్కరించుకున్నాడని ఆతర్వాత చెప్పిన పదాల్లో వుంది. నరుడికి
సంబంధించిన అజ్ఞానాన్ని ఖండించేవాడే నారదుడు. జ్ఞానాన్నిచ్చేవాడూ ఆయనే. ఇట్లా
నారదుడిలోని ఆచార్య లక్షణాలను సంపూర్ణంగా వర్ణించడం జరిగింది. ఇక వాల్మీకిలోని
శిష్య లక్షణాలను చెప్పడం కూడా జరిగింది. నిర్వేదం లేనివాడు ముముక్షువు కాలేడు.
ఉపదేశార్హుడూకాడు. వాల్మీకి నిర్వేదం కలవాడు-ఉపదేశ యోగ్యుడు. వల్మీకంలోనుండి
పుట్టడం వల్ల ఇతనికి వాల్మీకుడు అనే పేరొచ్చిందని బ్రహ్మంటాడు. భృగువంశంలోని
ప్రచేతసుండనే ఋషి పదో కొడుకు వాల్మీకనే సమాధానం కూడా వుంది. ఆయన వంశంలో
పుట్టినందువల్ల వాల్మీకి జాతి బ్రాహ్మణుడే అనాలి. బ్రహ్మ కూడా వాల్మీకిని ఓ
సందర్భంలో "బ్రాహ్మణుడా" అని సంబోధిస్తాడు.
“సంప్రశ్నము” అన్న పదంద్వారా మిక్కిలి శ్రేష్ఠమైనప్రశ్న అడిగి, మంచివిషయాన్ని రాబట్టదలిచాడన్న అర్థం స్ఫురిస్తుంది. ఆంధ్ర వాల్మీకిరామాయణం
వేదార్థాన్ని విశదీకరిస్తుంది.
తపశ్శక్తిగల వాల్మీకి పరబ్రహ్మనిష్టుడైన నారదుడిని ప్రశ్నించిన విషయమూ పర
బ్రహ్మమే. కాబట్టి ముముక్షువులకు రామాయణం అవశ్య పఠనీయం. వాల్మీకి రచించిన
శ్రీమద్రామాయణానికి ఇరవైనాలుగువేల గ్రంథాల పరిమితుంది. ముప్పై రెండక్షరాలను
గ్రంథమంటారు. వెయ్యికి ఒకటి చొప్పున 24,000 గ్రంథాలలో 24 గాయత్రీ వర్ణాలు చేర్చబడ్డాయి. అందులో మొదటి వేయి మొదటి గాయత్రి అక్షరంలో
మొదటిదైన "త" కారముంది. గ్రంథం రచించేవారికి, పఠించేవారికి "త" కారం శుభ ప్రయోగం. రామాయణంలో గాయత్రి
ఇమడ్చబడిందంటే,
గాయత్రితో విస్తరించబడిందనే అర్థం. భగవంతుడు బ్రహ్మకు
"దప తప" అని ఉపదేశించాడు. ఈ రెండక్షరాలనే వాల్మీకి గ్రంథం ఆరంభంనుండే
పాఠకులకు ఉపదేశిస్తాడు.
గురువు శిష్యుడిని ఏదాదిపాటు
పరీక్షించిన తర్వాతే ఉపదేశించాలని శాస్త్రం చెపుతున్నది. అలాంటప్పుడు వాల్మీకి
అడగంగానే నారదుడెట్లా ఉపదేశించాడన్న సందేహం కలగొచ్చు. అయితే శిష్యుడు గురువు
దగ్గరకొచ్చినప్పుడు,
వచ్చినవాడు ఉపదేశించ బడడానికి అర్హుడా-కాదా అనేది గురువు
నిర్ణయించుకున్నవెంటనే ఉపదేశించవచ్చు. అర్హుడుకాదని భావిస్తే, వాడియోగ్యతను బట్టి,
మూడుమాసాలనుండి పన్నెండేళ్లవరకు తన దగ్గరుంచుకుని, వ్రతానుష్ఠానాలతో-ఆహార వ్యవహారాలతో వాడికి తగిన యోగ్యత వచ్చిందని భావించిన
తర్వాతే గురువు ఉపదేశిస్తాడు. హనుమదాచార్యుడు సీత దగ్గరకు పోయిన విధంగానే, కొందరు గురువులు అర్హులైన శిష్యులను వెదుక్కుంటూ పోతారని శాస్త్రాలు
చెపుతున్నాయి. బ్రహ్మ ఆదేశానుసారం నారదుడు వచ్చి వాల్మీకికి ఉపదేశించాడు కనుక
శిష్యుడినిక్కడ పరీక్షించాల్సిన అవసరం లేదు.
వాల్మీకి చరిత్ర గురించి కూడా ఇందులో
ఇమిడి వుంది. సీతా రామ లక్ష్మణులు చిత్రకూటంలో వాల్మీకిని కలిసినప్పుడు ఆయనే
తనగురించి ఇలా చెప్పుకున్నాడు: "రామా, నేను పూర్వం పరమ
కిరాతకులతో పెంచబడ్డాను. పుట్టుకతో బ్రాహ్మణుడనైనా, ఆచారరీత్యా శూద్రుడనయ్యాను. శూద్ర స్త్రీని పెళ్లి చేసుకుని కొడుకులను
పొందాను. దొంగల్లో చేరి దొంగనయ్యాను. జంతువుల పాలిటి యముడనయ్యాను. నేనున్న భయంకర
అడవిలో ఓ రోజు సప్తఋషులు కనిపిస్తే, వాళ్లను దోచుకుందామని, వారివెంట పరిగెత్తాను. ’నీచ బ్రాహ్మణుడా, ఎందుకొచ్చావు?’ అని వారడిగారు. నాపుత్రులు ఆకలితో వున్నారు-వాళ్ల సంరక్షణ కై ఈ కొండల్లో
అడవుల్లో తిరుగుతున్నాను-వాళ్ల ఆకలి తీర్చేందుకు మీదగ్గరున్నవి దోచుకుందామని
వచ్చానని జవాబిచ్చాను. నన్నింటికి పోయి, నా పాపంలో వాళ్లు భాగం
పంచుకుంటారేమో కనుక్కుని రమ్మన్నారు మునులు. నేనొచ్చేవరకుంటామనికూడా చెప్పారు.
వాళ్ల మాటలు నమ్మి ఇంటికి పోయి వారు చెప్పినట్లే నా భార్యా-పిల్లలను ప్రశ్నించాను.
నేను తెచ్చింది తింటామన్నారే కాని నా పాపంతో సంబంధం లేదన్నారు. వెంటనే మునుల
వద్దకు పరుగెత్తుకుని పోయి,
వాళ్ల పాదాలపై పడి నన్ను రక్షించమని కోరాను. ఈ
బ్రాహ్మణాధముడికి మోక్ష మార్గం ఉపదేశిద్దామని తలచిన వారు ’రామ’ నామాన్ని తలకిందులు
చేసి, వాళ్లు మరల వచ్చేవరకు,
’మరా మరా’ అని ఎల్లవేళలా జపించమని ఆదేశించి పోయారు. ఆ
విధంగానే సర్వసంగ విహీనుడనై, నిశ్చలుడనై దీర్ఘకాలం
జపించాను. నాపైన పుట్ట పెరిగింది. నా తపోబలంతో, నేనక్కడ నాటిన దండమే
వృక్షమయింది. ఇలా వేయి యుగాలు గడిచిపోయాయి. ఋషులు మళ్లా వచ్చి లెమ్మని పిల్చారు.
పుట్టనుండి బయట కొచ్చిన నన్ను చూసిన మునులు నన్ను ’మునీశ్వర వాల్మీకీ ’ అని పిలిచారు.
నాకది రెండవ జన్మన్నారు".
No comments:
Post a Comment