చారు మజుం‘దారి’లో
తమ్ముడు
స్వర్గీయ కేబీ తిలక్ జ్ఞాపకాలు-అనుభవాలు
వనం జ్వాలా నరసింహారావు
ప్రజాతంత్ర, సంపూర్ణ స్వతంత్ర వారపత్రిక
(నవంబర్ 5 -11, 2000)
ఈడూ జోడూ సినిమా తర్వాత తిలక్ 'ఊరికే పెదపాలేరు' అనే సినిమా తీసే ఆలోచనలో పడి దానికి పినిశెట్టిగారితో
స్ర్కిప్ట్ తయారు చేయించారు. కొసరాజు రాఘవయ్య చౌదరిగారితో, ఆరుద్రతో, శ్రీశ్రీతో
పాటలు వ్రాయించి ట్యూన్ కూడా చేయించారు. ఈ చిత్రానికి స్ఫూర్తినిచ్చింది తిలక్
స్వగ్రామంలో వ్యవసాయం చేయించే ‘లండన్ రిటర్న్ సుబ్బయ్య'గారు. ఆయన విదేశాల్లో వుండి వచ్చి
స్వగ్రామంలో వ్యవసాయం పై దృష్టి కేంద్రీకరించారు. ఆయనకో చదువుకున్న కూతురు. ఆయన
కారెక్టర్ బేస్ గా తీసుకుని చిత్రానికి కథ రూపొందించారు. అక్కినేని నాగేశ్వర్
రావుగారిని ప్రధాన భూమిక పోషించమని తిలక్ కోరారు. దానికి ఆయన సుముఖత చూపలేదు.
సినిమా తీయటం కూడా జరుగలేదు. పినిశెట్టిగారు, కారెక్టర్లు
మార్చుకుని, వేరే పద్దతిలో
సినిమా తీసుకుంటానంటే, అదీ వేరేద్వారి ద్వారా ఒప్పేసుకున్నారు తిలక్.
లండన్ సుబ్బయ్య ప్రధాన భూమికైతే, ఆయనగారి చదువుకున్న అమ్మాయి వ్యవసాయం
పనులు చూసుకుంటూ వుండటం, వారి
పెదపాలేరు-నిక్కచ్చిమనిషి-ఆ చదువుకున్న అమ్మాయిని గేలిచేయటం, గిల్లి కజ్జాలాడటం, చివరికి ప్రేమలో పడటం-ఇలా-వుందా సినిమా
థీమ్. తీద్దామనుకుని, తీయలేక పోయిన ఆ సినిమా పాటలు. అవి
వ్రాసిన వ్రాయించినతీరు, తిలక్ గారికి
రైతుల సమస్యలపైన వున్న అవగాహనను,
ఆయన
తపనను ప్రస్పుట పరిచే లాగా వుంటాయి. అయితే అప్పటికీ-ఇప్పటికీ రైతు పరిస్థితి
మారలేదని, వారిపై
రుణభారం పెరిగి పోతూనే వున్నదని తిలక్ ఆందోళన వ్యక్త పరిచారు.
తీయని ఆ సినినూ పాటలు, ఆముద్రితమైన ఆణిముత్యాలు, అందులో ఓ పాట తొలకరి నాటి రైతు పాడుకునే
పాట. కోస రాజు రచించారు. ఆపాట ఇలా సాగుతుంది.
తొలికారు వానకురిసే-పొలమంతా పదును గలిసే
నువ్వు దున్నుకుందామంటే కొండ్రేది
పేదరైతా?
గోదారి పొంగులెత్తి-పరుగెత్తుతున్నదయ్యా
క్రిష్ణమ్మ అంగలేసి-పరవళ్లు తీసెనయ్యా
మనగొప్ప చెప్పుకోను-మురిసేందుకుగాని
నీకేమీ ఒరుగునయ్యా - ఓ పిచ్చి బాగులయ్యా?
దున్నేటి వానిదే భూమీ అనగానే నిజమని
నమ్మీ
కౌలయిన చేసుకోని బ్రతుకెళ్లమోస్తామంటే
ఏడాది చివరకుండ-లాగేసిరయ్య కొండ్ర!
నీవెంత మొత్తుకున్నా-దిక్కేది లేదురన్న
చట్టాలు ఎన్నియున్నా-దిట్టాలుగావురన్నా
నువు రుజువు చెయ్యకున్న-ఫలితమ్ము
బండిసున్న
నీ మూజువాణి మాట-చెల్లేది వట్టిమూట
కాగితము మీద వ్రాత-ఉంచేనే గట్టివాత
పదిమంది కలిసి మెలసీ-ఒక త్రాటి మీద
నిలిచీ
ఆందోళనమ్ము చేస్తే-దొరతనము కదలివస్తే
అపుడున్నదోయి ఫలం-అందాకలేదు జయం
నీ శక్తి చూపు సమయం- వచ్చింది మంచికాలం
నాట్లువేసే రోజుల్లో, పట్నం నుండి వచ్చినమ్మాయి నాటు కార్యక్రమాన్ని
పర్యవేక్షించే సమయంలో, ఆ అమ్మాయిని
కించపరుస్తూ, సరదాగా, ఓ పాట వ్రాయించారు. అది కొసరాజు
గారితోనే. అందులోనూ ఎంతో భావం వుంటుంది. ఆ పాట ఇలా సాగుతుంది.
‘బస్తీలలో చదివి, పల్లెలకు ఎగిరీ
పంట చేను గట్టుపై వాలు తుమ్మెదా
ఈ మట్టి బిసికే రైతు కష్టాలు తెలుసుకో
తుమ్మెదా...
వినవమ్మ వినవమ్మ తుమ్మెదా... నీకు
వివరించి చెబుతానే తుమ్మెదా
కరువు కాటకాలు మావంతూ- కష్టాలు నష్టాలు
మావంతూ
మనసు విప్పీ కాస్త చెబుతామంటే-వినిపించనే
బోదు మా గొంతు
ధాన్య కటకంలోన తుమ్మెదా-ఇంత ధాన్యమే
కరువాయే తుమ్మెదా
పాలకొల్లులోన తుమ్మెదా -బుడ్డి పాలైన
దొరకవే తుమ్మెదా
రాజులందరూ కూడ మారిపోయీ బొమ్మ రాజులైరి
నేడు తుమ్మెదా
ఆ రాజులకు మారుగా, రక రకాలుగా- కొత్తరాజులే వచ్చారు
తుమ్మెదా...
పాట చెయ్యండని అన్నారూ -దేశ భాగ్యమంతా
మదెయన్నారు,
పండిన పంటంతా భాగాలు వేసుక-తన్నూక పోతూ
వున్నారూ
రోజులు మారిన వన్నారు తుమ్మెదా-మా రోజులు
మారేనన్నారు తుమ్మెదా
రోజుకు రోజుకు పన్నులు పెంచీ-రోగం
కుదురుస్తున్నారు తుమ్మదా
ఆలాగా వరిచేను కోతలప్పుడూ ఓ పాట
వుంటుంది. శ్రీశ్రీతో ఓ యుగళగీతం కూడా వ్రాయించారు. రెండూ చక్కటి పాటలే.
ఆలా ‘ఊరికే పెదపాలేరు' సినిమా దానికి సంబంధించిన వ్యవహారాల
గురించి ఆలోచనల్లో వున్న తిలక్ గారికి తన సోదరుడు రామనరసింహారావు, తన ఇంట్లోనే వెనుక వైపునున్న ఓ గదిలో
సమాజాన్ని ఎలా బాగుచేయాలన్న ఆలోచనతో చేపట్తున్న కార్యకలాపాల గురించి ఆంతగా
పట్టించుకునే వాడు కాదు. అలా అని,
అతని
ధోరణి ఆతనిదే అని నిర్లిప్తంగా వుండనూలేదు. అడపా, దడపా
తన అభిప్రాయాలను విడమర్చి చెప్పటం, ఆయన
భావాలను తెలుసుకుని అర్థం చేసుకునే ప్రయత్నం చేయటం జరుగుతుండేది. ఇవన్నీ గుర్తుకు
వచ్చాయి, అనుకోకుండా 'టీవీ' గారిని
కలవటంతో, హైదరాబాద్లో.
అఖిల భారత కార్టూనిస్టుల సమావేశం
నిర్వహించారు హైదరాబాద్ లుంబినీ పార్కులో. ఆ సందర్భంగా కల్పుకున్నారు ప్రముఖ
రాజకీయ కార్టూనిస్టు ‘టివి’ గారిని తిలక్. ఆయన్ను చూస్తూనే ఎన్నటికీ మరువలేని తన
సోదరుడు స్వర్గీయ కామ్రేడ్ రామ నరసింహారావు గుర్తుకు వచ్చారు తిలక్ గారికి. తిలక్ మద్రాసు చేరుకున్న తొలిరోజుల్లో, తనదగ్గరనే వుంటుండే తమ్ముడు
నరసింహారావును సినిమా రంగంలోకి రావద్దని సలహా ఇచ్చారు. పూర్తిగా కాకపోయినా, సినిమాకు చెందిన వృత్తిలోనో వుంటూ, ప్రముఖ సినీ కళాకారుడు శ్రీ మహారథి
గారితో కల్సిమెల్సి, ఆయన గారి
దగ్గరే, వారింట్లోనే
ఎక్కువగా గడుపుతుండేవారాయన.
మొదటినుండి తన తమ్ముడిది ఓ నిర్దిష్టమైన
అభిప్రాయాలతో కూడిన మనస్తత్వమనీ,
సమాజం-సామాజిక
న్యాయం అనే విషయంలో నరసింహారావుకు స్పష్టమైన అవగాహనుండేదనీ అన్నారు తిలక్. మహారధి గారితో కల్సి ఆలోచన చేసి, సినీ పరిశ్రమకు చెందిన కళాకారుల
ఫెడరేషన్‌ను నెలకొల్పారట. మహారథి గారితో పాటు విశ్వేశ్వరరావుగారితో కల్సి
తిరుగుతుండేవాడు. ఆలానే ఎన్టీరామారావు గారి దగ్గరకూ తరచూ వెళ్లేవాడు. ఎమ్ బి
శ్రీనివాస్, వినయ్ బోస్
లకు సన్నిహితమై ట్రేడ్ యూనియన్ కార్యకలాపాలు సాగించేవాడు. అలాగే తిలక్ గారి
సన్నిహితుడు, ఆయన
అసిస్టెంట్ శ్రీ బిఎస్ నారాయణ గారికీ ట్రేడ్ యూనియన్ తో సంబంధాలుండేవి. తిలక్ గారు
మాత్రం ఏ యూనియన్‌లో సభ్యుడు కాకపోయినా, పెడరేషన్
కార్యకలాపాలు శ్రద్ధగా గమనించేవారు.
అదే రోజుల్లో తిలక్ ఆఫీస్ మారారు. ఇంకా
పెద్ద ఇల్లు తీసుకున్నారు. మూసా స్ట్రీట్
నుండి, మూడు
రామస్వామి స్ట్రిట్ కు మారారు. మారటానికి ఓ కారణం వుంది. తిలక్ గారు జ్యోతి సినిమా
తీస్తున్నప్పుడు, ఏదో విషయంపై
బి నాగిరెడ్డి గారితో ఘర్షణ పడ్డారు. ల్యాబ్ లో లో ప్రింట్స్ విషయంలో మాటా మాటా
వచ్చి ఘర్షణకు దారి తీసింది. అప్పుడు వారి ఆఫీస్ కాంగ్రెస్ అభిమాని రంగనాథన్ గారి
స్వంత ఇంటిలో వుండేది. చాలా పెద్ద ఇల్లు, తిలక్ కు బాగా నచ్చింది. అది ఎప్పుడు
ఖాళీ అయినా తనకు కావాలని చెప్పారు తిలక్. ఎంఎల్ఎ తీసిన తర్వాత కొత్త ఇంటికి
మారారు. నాగిరెడ్డి గారు మకాం వాళ్ల స్టూడియోకు మార్చిన తర్వాత అప్పట్లో కెఎస్
ప్రకాశరావు గారికి సాంథోమ్ లో ఆఫీస్ వుండేది. ఆ ఆఫీస్ లోనే తన ముద్దు బిడ్డ
రిహర్సల్స్ చేయించేవారు తిలక్. కెఎస్ గారు మేలుకొలుపు తీస్తున్నప్పుడు, తిలక్ గారూ షూటింగ్ లకు వెళ్తూ ఆయనకు
సహాయపడేవారు, కెఎస్ గారు
స్టూడియో పెట్టుకున్నప్పుడు ఆర్థిక ఇబ్బందులు కలిగితే, ఇల్లు అవసరమైతే, తానుండే 7 మూసా స్ట్రీట్ ఇల్లు ఆయనకు
ఇచ్చి, తాను
రామస్వామి స్ట్రీట్ కు మకాం మార్చారు తిలక్.
అంత పెద్ద ఇంట్లో తమ్ముడి కార్యకలాపాలు
పూర్తిగా తెలిసేవి కావు. వెనుకనున్న ఓ గదిలో ఏవో సమాలోచనలు, సమావేశాలు జరుపుకుంటుండేవారు. మధ్య
మధ్యలో తిలక్ తో జాతీయ అంతర్జాతీయ విషయాలు చర్చించేవాడు ఓ రోజున కాశ్మీర్ సమస్య
గురించి ప్రస్తావించి, అక్కడ
ఫ్లెబిసైట్ నిర్వహించక పోవటం తప్పని అన్నగారితో వాదించారు. తిలక్ ఆ వాదనను ఖండించి, కాశ్మీర్ భారత దేశంలో అంతర్భాగమని
స్పష్టంగా చెప్పారు. అయితే తదనంతర పరిస్థితులు గమనిస్తుంటే, వాడే కరెక్టేమోనని అనిపిస్తుందంటారు
తిలక్. కాశ్మీర్ లో పొరపాటు జరిగింది. తాను తీసిన ‘కంగన్' సినిమా ప్రస్తావన వచ్చినప్పుడు, తనకు షేక్ అబ్దుల్లాకు ఎలా పరిచయమయిందీ చెప్తానని, అప్పుడే కాశ్మీర్ విషయం వివరాలలోకి
వెళ్తానని అన్నారు తిలక్.
ఓరోజు హఠాత్తుగా తన ఆఫీసు నుండి
వెళ్లిపోయాడు తమ్ముడు రామనరసింహారావు.
ఎక్కడికెళ్లింది తెలియదు.
తాను తిద్దామనుకున్న ‘పూరికే పేదపాలేరు' తీయటం మానుకున్న తర్వాత హైదరాబాదు రావటం
జరిగింది. ‘తలాక్' అనే సినిమా
తీసిన పండిట్ ముకర్రమ్ శర్మ,
మహేష్
కౌల్ లు పరిచయమయ్యారు. నాగేంద్రనాథ్ అనే పంపిణీ దారుడు కామన్ ఫ్రెండ్. మహేష కౌల్ మంచి
ఎడిటర్, డైరెక్టర్. అలానే ముకర్రమ్ శర్మ మంచి రచయిత, వారు తిలక్ ను ఆయన తీసిన ‘అత్తా ఒకింటి
కోడలు‘ హిందీలో తీయడానికి అనుమతి అడిగితే ఒప్పుకోలేదు. ఆ పరిచయాలద్వారానే 'భల్లులుల్లా" అనే అతనితో పరిచయం
స్నేహం కలిగింది. ఆయన ప్రముఖ మరాఠి-హిందీ సినిమాల ప్రొడ్యూసర్ లక్షణ్ లుల్లా
తమ్ముడు. వాళ్లు హైదరాబాద్లో హిందీ సినిమాలు తీయటానికి ఓ ఆఫీస్
నిర్వహిస్తుండేవారు. వాళ్లు ఈడూ జోడూ సినిమాను మరాఠీలో తీస్తామంటే, రైట్స్- డబ్బు గొడువ లేకుండానే
ఒప్పుకున్నారు. తిలక్, వాళ్లతో
బొంబాయి వెళ్లారు. అక్కడే పరిచయమయింది. సంగీత దర్శకుడు శ్రీ చితోల్కర్ రామచంద్ర
గారితో. చాలా సన్నిహితులయ్యారు. శాంతాక్రజ్ లోని ఆయన ఇంటికి తరచూ పోయేవారు తిలక్.
ఆయన రెండో భార్య కూతురు పూనాలో వుండే చోటుకు ఇద్దరూ పెళ్లి వస్తుండేవారు
అప్పుడప్పుడు.
‘ధర్మపత్ని’గా ఈడూ జోడూను మరాఠీలో
తీయాలనుకున్నప్పుడు శ్రీ సి రామచంద్ర, గుమ్మడి
వేషం తాను వేస్తానన్నారు. మరాఠీలో డైరెక్టర్ జ్ఞానేకర్. డాక్టర్ కాశీనాథ్ షునేకర్
హీరో. కామ్మా కదమ్ హీరోయిన్. తిలక్ మధ్య మధ్య హైదరాబాద్ వస్తుండేవారు అప్పట్లో.
ముఖ్యంగా కడపకు చెందిన కొందరు నిర్మాతలు సదరన్ స్టూడియోస్ లో తీస్తుంటే సినిమా
విషయంలో రావాల్సి వచ్చేదాయనకు. హైదరాబాద్ వచ్చినప్పుడు మొదట్లో ఫతేమైదాన్ క్లబ్ లో
మకాం చేసేవారు. నూకల రామచంద్రారెడ్డి గారు ఆ క్లబ్ కు ప్రెసిడెంట్ గా వున్నప్పుడు
తిలక్ అక్కడ సభ్యుడయ్యారు. అప్పుడే సికింద్రాబాద్ క్లబ్ లో మెంబర్ కమ్మని సురేంద్ర
రెడ్డి గారు ప్రొత్సహించినా ఎందుకోకాలేదు. అయితే 'భల్లులుల్లా’
ద్వారా నిజాం క్లబ్ సభ్యుడయ్యారు. హసన్ అనే ఆయన పరిచయం కూడా తోడ్పడింది. నిజాం
క్లబ్ జాయింట్ సెక్రటరీగా వీరి స్నేహితుడు మదన్ మోహన్ రెడ్డి వుండేవారప్పుడు.
ఆయనకు యాకూత్ పురాలో థియేటర్ వుండేది. అట్లా అట్లా నిజాం క్లబ్ మెంబర్ అయ్యి
ఫతేమైదాన్ ను వదిలారు.
ఓ రోజున ఫతేమైదాన్ క్లబ్ లో అనుకోకుండా, తమ్ముడు నరసింహారావు ప్రత్యక్షమైనాడు.
చేతిలో ఓ వార్తా పత్రిక. ఏంరా... ఏమయినావు... మద్రాసునుండి ఎటు వెళ్లావు... అని
అడుగుతే ఒకటే సమాధానం. తాను ఓ ఆశయం కోసం తిరుగుతున్నానని. కుటుంబం మీద మమకారం-ఆశ
లేదు అన్నాడు. తన్ను గురించి తెలుసుకోవాలంటే సారధిలో ఆపరేటర్ గా వున్న ఒకతనికి
చెప్తే -ఆయన సుబ్బయ్య అనే మరో వ్యక్తి ద్వారా తనకు సమాచారం అందుతుందని చెప్పాడట.
తాను ఏం సమాచారం పంపిందీ లేనిదీ చెప్పలేదు కాని తన తమ్ముడిపైన గౌరవంతో, తన మీద నున్న అభిమానంతో ఆ సుబ్బయ్యగారు 'అనుపమా ప్రింటర్స్’ అని ప్రెస్
పెట్టుకున్నారని అన్నారు తిలక్.
కమెంట్ మెంట్ తో ఉద్యమంలో తిరిగే తన
తమ్ముడు ఆదిలో నక్సలైట్ పోరాటానికి నిజమైన మోటేవేటర్ అని అంటూ, తానెప్పుడూ, అతనితో వ్యక్తిగత హత్యలు చేయరాదని
వాదించేవాడినన్నారు. ఉద్యమంలో చేరటానికి కామత్ హోటల్ లో పనిచేస్తున్న ఓ సర్వర్‌ను
ఎలా మోటివేట్ చేసింది ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు తిలక్.
మద్రాసులో తన తమ్ముడి కార్యకలాపాలు
గురించి గుర్తుచేసుకుంటూ వాడి దగ్గరకు కొల్లా వెంకయ్య, తరిమెల నాగిరెడ్డి, భీమిరెడ్డి నరసింహారెడ్డిగార్లు
వచ్చేవారన్నారు. ఓసారి స్వర్గీయ పుచ్చలపల్లి సుందరయ్యగారూ, మాస్కో వెళ్తుంటే ఎయిర్ పోర్టుకు
కాట్రగడ్డ రాజగోలరావుగారితోపాటు తిలక్ గారు కూడా వెళ్లారు. అక్కడే కలిసారు
సంజీవరెడ్డి గారని కూడా. అప్పుడు అన్నాడు తమ్ముడు నరసింహారావు తిలక్ గారితో ‘అన్నయ్యా, సుందరయ్యగారు మాస్కో నుండి రాగానే
ఎవరికీ తెలియకుండా మేం తీసుకెళ్తాం’ అని. తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ, సుందరయ్యగారు అతివాద కమ్యూనిస్ట్ అయినా
‘గాంధీయన్' లాంటి వారని
తిలక్ అన్నారు.
తిలక్ గారి దగ్గరుండే తబలా నేర్చుకునే
నారాయణ అనే కుర్రవాడిని కొరియర్ గా ఉపయోగించుకునే వాడు నరసింహారావు. మధ్య మధ్య
విజయవాడ వెళ్లి వస్తుండేవాడు. అప్పుడే అక్కడే టివి గారితో పరిచయం పెరిగింది.
ఆయన్ను ఉద్యమం వైపు ప్రోత్సహించారు. తమ్ముడు కలకత్తాలో జరిగిన ఓ సభలో నక్సలైట్
పాంప్లెట్లు పంచాడన్న విషయం మోటూరు హనుమంతరావు గారు చెప్పారొకసారి తిలక్ కు. అదే
విధంగా డాక్టర్ రామదాసు గారనే స్నేహితునికి ఉత్తరాలు వ్రాస్తూ, ఎలా ఆదిలాబాద్ జిల్లాను బేస్ చేసుకుని
ఉద్యమాలు చేయాలనుకున్నాదీ వివరించారట ఓసారి. ఆ వుత్తరం ఆయన తిలక్ కు చూపించి
తీసుకున్నారు.
ఓసారి మద్రాసులో చారుముజుందార్ ను తిలక్
గారి ఆఫీసుకు తీసుకువచ్చి మీటింగ్ పెట్టించాడు నరసింహారావు, తమిళియన్ గ్రూపులతో. ముజుందార్ కది
ట్రాన్సిట్ హాల్ట్. ఏం మీటింగ్ అని ఎవరైనా
అడిగితే ఓ జర్నలిస్టు వచ్చాడని చెప్పేవారు. అప్పటికే ఆయన ఆరోగ్యం బాగా లేదు.
పరిచయం కలిగిన తర్వాత తిలక్ గారు ఆయనతో చాలా విషయాలు చర్చించానన్నారు.
అప్పట్లో పశ్చిమ బెంగాల్ రెవెన్యూ మంత్రి
శ్రీ హరేకృష్ణ కోనార్ వైఖరే సంతాల్ తిరుగుబాటుకు దారి తిసిందని ముజుందార్ చెప్పారు
తిలక్ గారితో. ఉద్యమం వ్యాప్తి చేసే
విధానం సరియైంది కాదని తిలక్ అంటే జవాబు ఇవ్వలేదు. అన్నింటినీ మౌనంగా విన్నారు. 'ఇది నా నమ్మకం, మేం చేస్తున్న విధానం సరియైనదని మా
అభిప్రాయం' అని జవాబిచ్చారు.
తమ్ముడు ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన తర్వాత అన్ని
రకాల వామ పక్షాలు ఐక్యం కావాలన్న ధీమాతో తీసారు ‘భూమికోసం' అనే సినిమా. దీన్ని నరసింహారావుకు
అంకితం చేసారు.
ఇవన్నీ చెప్తూ ఉద్యమాలు అసంతృప్తికి
పర్యాయపదం అనీ, నక్సలిజం ఆంటే
ఆసంతృప్తికి మరో పేరు అని అన్నారు తిలక్. ఈ విషయాన్నే ఓసారి బహిరంగ సభలో కూడా
చెప్పానని, తాను చెప్పిన
దాన్ని కొండపల్లి సీతారామయ్య వాళ్లు అంగీకరించారని చెప్పారు తిలక్.
ఏదేమైనా ఇజాలుపోయి 'అజం’ పెరిగిపోతున్న సమాజం బాగుపడేలా
చూసే ఉద్యమాలు మాత్రం అవసరమే అంటారు తిలక్
(మరిన్ని విశేషాలు మరోసారి)
No comments:
Post a Comment