రామాయణ కాలంనాటి అయోధ్య
వనం జ్వాలా నరసింహారావు
మన తెలంగాణ దినపత్రిక (08-08-2020)
సరయూ నదీతీరంలో వున్న కోసల దేశంలో, ఎక్కడ చూసినా ధనధాన్యాలు రాసులు-రాసులుగా ఇంటింటా పడివుండి, ఒకరి ధనాన్ని, ధాన్యాన్ని మరొకరు ఆశించాల్సిన అవసరం లేనటువంటి
స్థితిగతులుండేవి. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన ఆ దేశంలో ప్రజలంతా దేహ పుష్టి
కలిగి, సుఖసంతోషాలతో వుండేవారు. ధనధాన్యాది సంపదలతో మిక్కిలి భాగ్యవంతంగాను, మనువు
స్వయంగా నిర్మించినందున అందంగా, రమ్యంగాను, పన్నెండామడల
పొడవు, మూడామడల వెడల్పు,
వంకర టింకర లేని వీధులతోను, ఇరు ప్రక్కల సువాసనలు వెదజల్లే
పుష్పాలను రాలుస్తున్న చెట్లతోను, దారినపోయే వారి కళ్లల్లో దుమ్ము పడకుండా
తడుపబడిన రాజవీధులతోను అలరారుతుండే అయోధ్యా నగరమనే మహా పట్టణం ఆ కోసల దేశంలో
వుండేది.
చక్కగా తీర్చి దిద్దిన వీధి
వాకిళ్లతోను, తలుపులతోను, వాకిళ్లముందు మంగళకరమైన పచ్చని తోరణాలు కట్టేందుకవసరమైన
స్తంబాలతోను, నగరం మధ్యలో విశాలమైన అంగడి వీధులతోను, శత్రువులను ఎదుర్కొనేందుకు
కావాల్సిన రకరకాల ఆయుధ సామగ్రినుంచిన భవనాలతోను, శిల్ప కళాకారుల సమూహాలతోను, వందిమాగధులు, సూతుల జాతివారితోను, శ్రీమంతులైన పండితులతోను, ఎత్తైన మండపాల పై కట్టిన
ధ్వజాలతోను, భయంకర శతఘ్నుల ఆయుధాలతోను, నాట్యమాడే స్త్రీ సమూహాలతోను, తియ్య మామిడి
తోపులతోను,
అందాలొలికే అయోధ్యా పురం "లక్ష్మీ పురం" నే
మరిపించేదిగా వుండేది.
"అయోధ్యా పురి" అనే ఆ
స్త్రీ నడుముకు పెట్టుకున్న ఒడ్డాణంలా వున్న ప్రాకారం, అగడ్తలు,
మితిమీరిన సంఖ్యలో వున్న గుర్రాలు, లొట్టిపిట్టలు,
ఆవులు, ఎద్దులు, ఏనుగులు,
అనుకూలురైన సామంత రాజులు, కప్పం కట్టే విరోధులైన విదేశీ రాజులు, కాపురాలు చేస్తున్న నానా
దేశ వ్యాపారులు,
విశేష ధనవంతులైన వైశ్యులు, నవరత్న ఖచితమైన రాజుల ఇళ్లు, చంద్రశాలలున్న అయోధ్యా
నగరం స్వర్గ నగరమైన అమరావతిని పోలి వుంది.
నవరత్నాలతో చెక్కబడి విమానాకారంలో
కట్టిన ఇళ్లతోను, ఇంటినిండా ఆరోగ్యవంతులైన కొడుకులు, మనుమలు,
మునిమనుమలు, మనుమరాళ్లు, వయో వృద్ధులతోను, ఎత్తుపల్లాలు లేకుండా భూమిపై కట్టిన గృహాల్లో పుష్కలంగా
పండిన ఆహార పదార్థాల నిల్వలతోను, ఇంటింటా వున్న ఉత్తమ జాతి స్త్రీలతోను, నాలుగు
దిక్కులా వ్యాపించిన రాచ బాటలతోను, వాటి మధ్యనే వున్న రాచగృహాలతోను నిండి వున్న
అయోధ్యా నగరం జూదపు బీటలా వుండేది.(నగరం మధ్యన రాజగృహం, అందులో కట్టడాలు,
గాలి వచ్చేందుకు విడిచిన ఆరుబయలు,నలుదిక్కుల రాచబాటలుండడమంటే చూసేవారికి జూదపు బీటలా వుంటుందని అర్థం).
నగరంలోని నీళ్లు చెరకు పాలల్లా
తియ్యగా, తేలిగ్గా, మంచి ముత్యాల్లా కనిపించే లావణ్యం లాంటి కాంతితో వున్నాయి.
మద్దెలలు,
వీణలు, ఉడకలు, పిల్లన గ్రోవులు,
సుందరీమణుల కాలి అందియలు, వీటివల్ల కలిగే ధ్వనులు
ఆహ్లాదకరంగా వుండేవి. ఎల్లప్పుడు ఆటపాటలతో, ఉత్సవాలతో, అలంకరించుకున్న స్త్రీలతో, ఆహ్లాద భరితంగా వుండేదా
వూరు. ఘోర తపస్సు చేసి సిద్ధిపొందిన వారికి మాత్రమే లభించే స్వర్గంలోని విమానాకార
ఇల్లు, అయోధ్యా నగర వాసులకు ఏ కష్టం లేకుండా దొరికాయి.
ఆ నగరంలోని శూరులు అడవులకు వేటకు పోయేటప్పుడు, సింహాలను, అడవి పందులను, ఖడ్గ మృగాలను, ముఖాముఖి కలియబడి తమ భుజ
బలంతో-శస్త్ర బలంతో, ఒకే ఒక్క వేటుతో చంపగలిగే గొప్పవారు. అయినప్పటికీ, ఆయుధం లేకుండా, సహాయం చేసేవారు లేకుండా, ఒంటరిగా చిక్కిన బలవంతుడైన శత్రువును
కూడా క్షమించి విడిచిపెట్టగల దయా గుణమున్న శూరులు. భయంతో దాగిన వారినికూడా వదిలి
పెట్తారు.
అయోధ్యా పురంలోని బ్రాహ్మణులందరు
అవిచ్ఛిన్నంగా అగ్నిహోత్రం కలిగుండే వారే. శమ దమాది గుణ సంపన్నులే. ఆరంగాలతో, నాలు వేదాలను అధ్యయనం చేసిన వారే. సత్య వాక్య నిరతులే. వేలకొలది దానాలు చేసిన
వారే . గొప్ప మనసున్న వారే. వీరందరు సామాన్య ఋషులైనా, గృహస్తులైనా,
నగర వాసులైనా, అడవుల్లో వుండే ఋషులకు
సమానమైన వారు.
భగవంతుడు అక్కడ పుట్టినందువల్లే, ఆ పుణ్య నగరం "అయోధ్య" గా కీర్తించబడింది. భగవంతుడైన విష్ణువు
ఎక్కడుంటాడో,
అదే పరమ పదం. ఆయన సేవే మోక్షం. అదే సర్వ కర్మలను ధ్వంసం
చేస్తుంది. అయోధ్యలో మహా విష్ణువు పుట్టినందువల్లే మనుష్యులందరు ముక్తులయ్యారని
శివుడు పార్వతికి చెప్పాడు.
అయోధ్యా నగరాన్ని దశరథ మహారాజు
కీర్తివంతంగా పరిపాలించేవాడు. ఆయన ఇక్ష్వాకుల వంశంలోని రాజులందరిలోనూ అతిరథుడు, అగ్రగణ్యుడు.
సమస్త ప్రజలను తనకనుకూలంగా మలచుకోగల నేర్పరి. మహర్షులతో సరిసమానమైన వాడు.
రాజర్షులలో శ్రేష్టుడు. యావత్ ప్రపంచం కొనియాడదగిన శ్రీమంతుడు, కీర్తిమంతుడు.
వైవస్వత మనువువలె పరాక్రమవంతుడై, జగజ్జనులను పాలిస్తూ, సత్యవంతుడై,
ధర్మ-అర్థ-కామాలను రక్షించే విధానం తెలిసున్నవాడిలా, అయోధ్యా పురాన్ని పరిపాలించేవాడు దశరథ మహారాజు.
అయోధ్యాపురంలోని బ్రాహ్మణులు
బాహ్యేంద్రియాలను, అంతరేంద్రియాలను, జయించినవారు. పరులను
వంచించాలనే దురాచారానికి దూరంగా వుంటారు. ఎటువంటి అనాచారానికి లోనుకాకుండా, సత్యాన్నే పలుకుతూ,
భగవత్ కథలనే వల్లించి కాలయాపన చేస్తూ, యజ్ఞ యాగాదులను నిర్వహిస్తూ, నిర్మల బుద్ధితో వుంటారు.
వేదాల్లో చెప్పిన కర్మ కార్యాలను నెరవేరుస్తూ, అడిగిన వారికి లేదనకుండా
శక్తికొలది దాన ధర్మాలు చేస్తుంటారు. అక్కడి వారెవరికీ, ఇతరులను యాచించాల్సిన పనేలేదు. ఆరంగాల
(శిక్ష-వ్యాకరణం-ఛందస్సు-నిరుక్తం-జ్యోతిష్యం-కల్పం) వేదాధ్యయనం చేయడం వారికి
నిత్య కృత్యం. పెద్ద మనసుతో పుణ్య కార్యాలను చేస్తూ, దేవర్షులతో-మహర్షులతో సమానంగా, సూర్య చంద్రుల
తేజస్సుతో-వర్ఛస్సుతో భగవధ్యానం చేస్తూ, సదాచార సంపన్నులై
మెలగుతుండేవారు.
అయోధ్యా వాసులందరూ సంతుష్టిగల
మనసున్నవారే, ధర్మాన్నెరిగినవారే. శాస్త్ర సంబంధమైన ఆలోచనలు చెసే వారే.
దేవుడిచ్చిన దాంతోనే సంతృప్తి చెందేవారు. త్యాగ బుద్ధిగలవారు. నిజాన్ని మాత్రమే
చెప్పే గుణంగలవారు. తమకెంత అవసరమో అంత సంపాదన మాత్రమే చెసేవారు. అవసరాని సరిపోయే
ఆవులను, గుర్రాలను,
సిరి సంపదలను కలిగినవారు. కుటుంబం అంటే శాస్త్రాల్లో
ఎటువంటి నిర్వచనం చెప్పబడిందో, దానికనుగుణంగానే, పదిమంది (తను-తన తల్లి,
తండ్రి, భార్య-ఇద్దరు
కొడుకులు-ఇద్దరు కోడళ్లు-ఒక కూతురు-ఒక అతిథి) కంటే తక్కువున్న ఇల్లు ఆనగరంలో లేదు.
కొడుకులకు,
భార్యకు కడుపునిండా భోజనం పెట్టకుండా బాధించేవారు కానీ, దాన ధర్మాలు అనుదినం చేయనివారు కానీ, ఆ నగరంలో కనిపించరు.
అందమైన ఆ నగరంలో చెడ్డవారు కనిపించరు. పర స్త్రీలను ఆశించే వారు కానీ, భార్యతో కూడా నిషిద్ధ దినాలలో కామ క్రీడలు ఆడేవాడు కానీ, వేశ్యా లోలురు కానీ,
చదువురాదననివారు కానీ, నాస్తికులు కానీ అయోధ్యలో
లేనే లేరు.
అయోధ్యా వాసులందరూ ధర్మం, శీలం కలవారే. ప్రేమ స్వరూపులే. ఇంద్రియ నిగ్రహం కలవారే. మంచి స్వభావం వున్న
వారే. దోషరహితమైన నడవడిక గల వారే. ఋషితుల్యులే. నిష్కళంకమైన మనసున్నవారే. ముత్యాల
హారాలు ధరించి,
చెవులకు కుండలాలను అలంకరించుకున్నవారే. అందచందాలున్న వారే. కురూపులు
కాని వారే. మకుటాలు ధరించి,
చందనం పూసుకుని, కొరత లేకుండా భోగ
భాగ్యాలను అనుభవించే వారే. ఇష్టమైన ఆహారాన్ని తీసుకునే వారే. అన్న దాతలే. అవయవాలన్నిటినీ
అలంకరించుకునే వారే. ఇంద్రియ నిగ్రహంతో పాటు, ఇంద్రియాలను జయించిన
వారక్కడి జనులు. అందరూ సోమ యాగం చేసినవారే. అగ్నిహోత్రాలు కలవారే. వారి, వారి ఆచారం ప్రకారం వర్ణాశ్రమ ధర్మాలను పాటించేవారే. బ్రహ్మాన్ని ధ్యానిస్తూ, జప తపాలు చేసేవారే, దయాళులై, చక్కని నడవడి కలవారే.
దశరథ మహారాజు పరిపాలన చేసే రోజుల్లో, అగ్నిహోత్రం లేనివాడు
కానీ-సోమయాగం చేయని వాడు కానీ-అల్ప విద్య, అల్ప ధనం కలవాడు
కానీ-వర్ణ సంకరులు కానీ-దొంగలు కానీ లేనే లేరు అయోధ్యా పురిలో.
తమ వర్ణానికి, ఆశ్రమానికి శాస్త్రోక్తమైన విహిత కర్మ ఏదో, దానినే బ్రాహ్మణులు
శ్రద్ధతో ఆచరిస్తూ,
విద్యా దానంలో-అధ్యయనంలో ఉత్తములై, వశ్యేంద్రులై,
జితమనస్కులై, దానానికి పాత్రులై
వుండేవారు. దశరథుడు పరిపాలన చేసే సమయంలో, చపలచిత్తులు, ఐహికాముష్మిక కార్య సాధనకు అవసరమైన దేహ బలం-మనో బలం లేనివారు, ఆరంగాలెరుగనివారు,
అసత్యం పలికేవారు, ఈర్ష్య గలవారు, పాండిత్యం లేనివారు,
చక్కదనం లేనివారు, పదివేలు తక్కువగా దానం
చేసేవారు,
దుఃఖించే వారు, రాజభక్తిలేని వారు, ఇతరులను పరవశులను చేయగల చక్కదనం లేని స్త్రీ-పురుషులు, స్త్రీలను స్త్రీలు-పురుషులను పురుషులు కూడా పరవశులు చేయగల చక్కదనం లేనివారు
అయోధ్యా నగరంలో లేరు. అక్కడ నివసించే అన్ని వర్ణాలవారు దైవ పూజ చేయకుండా-అతిథిని
ఆదరించకుండా,
భోజనం చేయని దీక్షాపరులు.
అయోధ్యా పురవాసులు శౌర్య
పరాక్రమాలున్నవారు. సత్యమే ధనంగా కలవారు. ధనంలాగా సత్యాన్ని కాపాడుకునే శూద్రులు
తాంత్రిక మంత్ర్రాలతో దేవ పూజ-హిరణ్య దానంతో అతిథి పూజ చేస్తారు. బ్రాహ్మణులు
విద్యా శూరులు-వాద పరాక్రములు. బ్రాహ్మణులుపదేశించిన కార్యాలలో ఆసక్తి కలిగి
క్షత్రియులు నడచుకునేవారు. వైశ్యులు రాజులకు అనుకూలంగా వుండేవారు. వంచన-దొంగతనం
అనే వాటిని దరికి రానీయకుండా, శూద్రులందరు బ్రతుకు
పాటుకై కుల విద్యలు నేర్చుకుని, కులవృత్తులలో నిమగ్నమై
వుండేవారు. యుద్ధ భటులు కార్చిచ్చులాంటి దేహాలతో-తేజంతో, మందరం లాంటి ధైర్యంతో,
ఇబ్బందులెన్ని ఎదురైనా, అప్పగించిన పనిని
నెరవేరుస్తూ దేహ-మనో బలంతో ఉత్సాహంగా వుండేవారు.
వీరు-వారు అనే భేదం లేకుండా అయోధ్యా
నగరంలోని ప్రజలందరు సద్గుణవంతులే. దేహ పుష్ఠికలవారే. అసత్యాలాడనివారే. రాజు
మేలుకోరేవారే. అధికారులందరు రాజ్యంలో తాముచేయాల్సిన, చేయాలనుకున్న పనులను
కార్యరూపంలో పెట్టి చూపించేవారే కాని, ముందుగానే రహస్యాలు
వెల్లడించి కార్యభంగం చేయరు. ఇలా యావన్మంది తనను సేవిస్తుంటే, వేగులవారి ద్వారా లోకంలో జరుగుతున్న విషయాలను కళ్లార చూసినట్లు తెలుసుకుని, తదనుగుణంగా భవిష్యత్ కార్యక్రమాన్ని, మంత్రుల-పురోహితుల సూచనలతో-సలహాలతో
రూపొందించే వాడు దశరథ మహారాజు. ఇలా పరిపాలన చేస్తూ, బాలసూర్యుడు కిరణాలతో ప్రకాశించే విధంగా, దశరథ మహారాజు కూడా
ప్రకాశించేవాడు.
సూర్య బింబం కనిపించిన ఏడు నిమిషాల
తర్వాత, సూర్య కిరణాలు భూమిని తాకుతాయి. సూర్య బింబం కంటే, సూర్య కిరణాల మూలంగానే,
లోకానికి ప్రయోజనం చేకూరుతుంది. అదే విధంగా, రానున్న కాలంలో,
అవతరించనున్న రామ-లక్ష్మణ-భరత-శత్రుఘ్నలు, దశరథుడికి సూర్య కిరణాల లాంటివారు. ఉదయాన ఎరుపు రంగులో వుండే సూర్యుడు
దర్శనానికి పనికి రాడు. ఎండ వ్యాపించి-బింబం తెల్లగా మారిన తర్వాతే దర్శించడానికి
యోగ్యుడు. అలాగే,
రామాదుల వలనే దశరథుడు లోకమాన్యుడయ్యాడు. జాయానామ పూర్వుడు, స్వనామ పూర్వుడు,
పుత్రనామ పూర్వుడు అనే మూడురకాల పురుషులుంటారు. మొదటి
వాడికంటే రెండోవాడు-వాడికంటే మూడోవాడు శ్రేష్ఠుడు. దశరథుడు మూడో రకం వాడు.
ఇన్ని సద్గుణాలకు, సంపదలకు, సనాతన ధర్మానికి ఆలవాలమైనది
కాబట్టే ఇన్ని వందల, వేల సంవత్సరాల తరువాత కూడా, యుగాలు
మారినా అయోధ్య శోభ అలాగే నిత్యనూతనంగా వర్ధిల్లి, రామజన్మ
భూమి తరతరాలకు ఆదర్శం కాబోతున్నది ఇవ్వాళా జరిగిన భూమి పూజ ద్వారా.
No comments:
Post a Comment