వాసుదేవుడిలో ఐక్యమైన భీష్మాచార్యుడు
శ్రీ మహాభాగవత కథ-2
వనం జ్వాలా నరసింహారావు
కంII చదివెడిది భాగవతమిది,
చదివించును
కృష్ణు, డమృతఝరి పోతనయున్
చదివినను
ముక్తి కలుగును,
చదివెద
నిర్విఘ్నరీతి ‘జ్వాలా’
మతినై
సూతుడు శౌనకాది మహామునులకు భాగవత కథ
చెప్పడం కొనసాగిస్తూ, పరీక్షిన్మహారాజు జన్మ, ఆయన చేసిన కర్మలు, ఆయన పొందిన ముక్తి, పాండవుల మహా ప్రస్తానం, కృష్ణుడి కథ ఒకటి వెంట
మరొకటి వినిపించాడు. కురుపాండవ యుద్ధంలో కౌరవ సేన, నాయకులు
అంతా మరణించిన తరువాత, భీముడి గదాఘాతానికి ధుర్యోధనుడు తొడలు
విరిగి నేలకూలాడు. అప్పుడు అశ్వత్థామ, రాజును సంతోష పరచడానికి, ద్రౌపది కొడుకుల
తలలు క్రూరంగా నరికి తెచ్చి చూపించాడు ధుర్యోధనుడికి. దుఃఖిస్తున్న ద్రౌపదిని
ఓదార్చి, తన గాండీవంతో అశ్వత్థామ శిరస్సును ఖండించి
తెస్తానని ఆమెకు చెప్పాడుఅర్జునుడు అర్జునుడు. ఇది తెలుసుకున్న అశ్వత్థామ భయంతో
ప్రాణాలు కాపాడుకోవడం కొరకు పరుగెత్తసాగాడు.
అశ్వత్థామ తన ప్రాణాలను
రక్షించుకోవడానికి సమాధిలో కూర్చుని, ప్రయోగమే
తప్ప ఉపసంహారం తెలియని, ‘బ్రహ్మశిరోనామక అస్త్రాన్ని’ అర్జునుడి మీద వేశాడు. బ్రహ్మాండమైన తేజస్సుతో వేగంగా వస్తున్న దాని
వివరాలు కృష్ణుడిని అడిగాడు అర్జునుడు. దాన్ని ఉపసంహరించడానికి బ్రహ్మాస్త్రం
ప్రయోగించమని అర్జునిడికి సూచించాడు పరమాత్మ కృష్ణుడు. అలాగే చేశాడు అర్జునుడు.
రెండు అస్త్రాలు భీకరంగా పోరాడుతుంటే, దానిమూలాన ముల్లోకాలకు భయం కలుగుతుంటే, కృష్ణుడి ఆజ్ఞానుసారం రెండు అస్త్రాలనూ ఉపసంహరించాడు అర్జునుడు. ఆ వెంటనే
అశ్వత్థామను వెంటాడి పట్టుకున్నాడు. తాడుతో బంధించి తమ శిబిరం దగ్గరకు తీసుకువచ్చి
అతడిని చంపుతానన్నాడు. ప్రాణ భయంతో పారిపోతున్న అతడిని కనికరించమని, కఠినంగా
దండించవద్దని కృష్ణుడు అన్నాడు. బ్రాహ్మణుడు అపరాధం చేసినప్పటికీ అతడిని
చంపకూడదన్న ధర్మాన్ని పాటించి అర్జునుడు అశ్వత్థామను చంపకుండా బంధించి తెచ్చి
ద్రౌపది ముందు పడేశాడు.
సిగ్గుతో తల వంచుకున్న ఆశ్వత్తామను
అనాల్సిన మాటలన్నీ అన్నది ద్రౌపది. అతడు చేసింది చాలా అన్యాయమని చెప్పింది. ‘బాలుర
ప్రాణాలు తీయడం అసుర కృత్యం కదా తండ్రీ’ అన్నది.
పుత్రశోకంతో తాను బాధపడుతున్నట్లే అశ్వత్థామ తల్లి ఆయనను బంధించి తెచ్చినందుకు, చంపుతారేమోనని బాధపడుతుండవచ్చు కదా! అని అంటుంది ద్రౌపది. అతడిని
చంపకుండా విడిచి పెట్టమని అంటుంది. ఒక్క భీముడు తప్ప అందరూ దానికి అంగీకారం
తెలియచేశారు. ‘బ్రాహ్మణుడిని చంపకూడదని వేదం చెప్తున్నది. వేద ధర్మాన్ని దృష్టిలో
వుంచుకుని అతడిని రక్షించడం తక్షణ కర్తవ్యం’ అని కృష్ణుడు భీముడికి సలహా ఇచ్చాడు.
భీముడు కూడా ఒప్పుకున్నాడు. అప్పుడు అర్జునుడు తన కత్తితో అశ్వత్థామ శిరోజాలను
ఖండించాడు. ఆ తరువాత తాళ్లను విప్పి తన శిబిరంలో నుండి బయటకు ప్రాణాలతో ఆయన్ను
వెళ్ళగొట్టాడు. ఆ తరువాత పాండవులు మృతులైన బంధువర్గానికి దహన కృత్యాలు
నిర్వర్తించి, తిలోదకాలు ఇచ్చారు.
ఇదంతా జరిగిన తరువాత శ్రీకృష్ణుడు
ద్వారకకు బయల్దేరుతున్న సమయంలో సుభద్ర-అర్జునుడి కోడలు, అభిమన్యుడి భార్య ఉత్తర ఆయన దగ్గరకు తత్తరపడుతూ వచ్చింది. తన
కడుపులో ఉన్న బిడ్డడిని కాల్చేయడానికి ఒక బాణం ప్రయత్నం చేస్తున్నదని, దాన్నుండి శిశువును
రక్షించమని ప్రార్థించింది. ఆ బాణం అశ్వత్థామ వేసిన దివ్యాస్త్రం అని
తెలుసుకున్నాడు కృష్ణుడు. ఆ బ్రహ్మాస్త్రాన్ని అడ్డుకోవడం కోసం తన సుదర్శన
చక్రాన్ని అడ్డువేశాడు కృష్ణుడు. పాండవ వంశాంకురాన్ని రక్షించడం కోసం వైష్ణవ
మాయతో కప్పి అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని
అణచి వేశాడు కృష్ణుడు. అలా అది నిరర్థకం అయిపోయింది. ఇదంతా గమనించుతున్న కుంతీదేవి
శ్రీకృష్ణుడిని పరి-పరి విధాలుగా స్తుతించింది. ఆ మహానుభావుడు పాండవులకు చేసిన
ఉపకారాలను గుర్తుచేసింది. తనను కీర్తిస్తూ ఉన్న కుంతీదేవి మాటకు అంగీకరించి, మరి కొంతకాలం హస్తినాపురంలో ఉండడానికి అంగీకరించాడు కృష్ణుడు. కురుపాండవ
యుద్ధంలో కొన్ని అక్షౌహిణుల సైన్యం చనిపోవడం ధర్మరాజుకు బాధాకరం అనిపించింది. ఆయన
ఆహారాన్ని తీసుకోకుండా అంపశయ్య మీద భీష్మాచార్యుడు పడి వున్న చోటుకు వెళ్లాడు
ఒకనాడు.
ఆ సమయంలో కృష్ణార్జునులు, తక్కిన పాండవులు ధర్మరాజుతో కూడి కురుక్షేత్రానికి వెళ్లారు. అక్కడ భీష్ముడికి నమస్కారం చేశారు.
అప్పుడే అనేకమంది బ్రహ్మర్షులు, రాజర్షులు అక్కడికి వచ్చారు.
భీష్ముడు పాండవులతో గత విషయాలను నెమరు వేసుకుంటూ సంభాషించాడు. తాను ప్రాణాలు విడవక
ముందే సర్వేశ్వరుడు, దేవతా సార్వభౌముడు అయిన శ్రీకృష్ణుడు తన
ముందర సాక్షాత్కరించడం వల్ల తన భాగ్యం పండిందని అన్నాడు భీష్ముడు. ఆ తరువాత
స్వచ్చందంగా మరణించే వారు కోరుకునే ఉత్తరాయణం వచ్చిందని ఆయన తెలుసుకున్నాడు.
భీష్ముడు ఆ తరువాత శ్రీకృష్ణుడిని స్తుతించసాగాడు అనేక విధాలుగా. యుద్ధ రంగంలో తన
బందు మిత్రులను చంపడానికి మనసొప్పక వెనక్కు పోదామన్న అర్జునిడికి గీతను చెప్పి, యుద్ధానికి పురిగోల్పే సందర్భాన్ని గుర్తు చేసుకున్నాదు. అక్కడ పోతన గారు
రాసిన పద్యం:
సీ. కుప్పించి
ఎగసినఁ గుండలంబుల కాంతి గగన భాగంబెల్లఁ గప్పి కొనఁగ!
నుఱికిన నోర్వక
యుదరంబులోనున్న జగముల వ్రేఁగున జగతి గదలఁ!
జక్రంబుఁ జేపట్టి
చనుదెంచు రయమునఁ బైనున్న పచ్చని పటము జాఱ!
నమ్మితి నాలావు నగుఁబాటు
సేయక మన్నింపు మని క్రీడి మఱల దిగువఁ!
తే. గరికి
లంఘించు సింహంబు కరణి మెఱసి, నేఁడు భీష్మునిఁ జంపుదు నిన్నుఁ గాతు
విడువు మర్జున! యనుచు
మద్విశిఖ వృష్టిఁ దెరలి చనుదెంచు దేవుండు దిక్కు నాకు
తనను మన్నించమని అర్జునుడు వేడుకోవడం, ‘నేడు భీష్ముడిని చంపి నిన్ను రక్షిస్తాను. నన్ను విడిచి
పెట్టు....’ అని శ్రీకృష్ణుడు అనడం గుర్తు తెస్తూ ఆ శ్రీకృష్ణుడే తనకు రక్ష
అన్నాడు భీష్మాచార్యుడు. ఇలా మనస్సు ద్వారా, వాక్కు ద్వారా, దర్శించడం ద్వారా పరమాత్ముడైన కృష్ణుడిని హృదయంలో నిలుపుకుని, వాసుదేవుడిలో ఐక్యమైపోయాడు భీష్ముడు. మృతుడైన భీష్మాచార్యుల వారికి
ధర్మరాజు పరలోక క్రియలు చేయించి, కృష్ణుడితో కలిసి
హస్తినాపురానికి వెళ్లిపోయాడు. రాజ్యాన్ని ధర్మ మార్గంలో పాలించాడు ధర్మరాజు. ఆయన
పాలన చేస్తున్నప్పుడు ప్రజలంతా హాయిగా ఉన్నారు.
(బమ్మెర పోతన శ్రీమహాభాగవతం,
రామకృష్ణ మఠం ప్రచురణ ఆధారంగా)
No comments:
Post a Comment