పాండవుల స్వర్గారోహణ, పరీక్షిత్తు పాలన
శ్రీ మహాభాగవత కథ-4
వనం జ్వాలా నరసింహారావు
కంII చదివెడిది భాగవతమిది,
చదివించును
కృష్ణు, డమృతఝరి పోతనయున్
చదివినను
ముక్తి కలుగును,
చదివెద
నిర్విఘ్నరీతి ‘జ్వాలా’
మతినై
ఒకనాడు
ధర్మరాజు భీముడితో ఇలా అన్నాడు: “కాలం పోకడ చాలా వింతగా ఉన్నది. శ్రీకృష్ణుడిని
చూడడానికి అర్జునుడు వెళ్లి ఏడు నెలలు దాటింది. ఇంకా తిరిగి రాలేదు. మురారి
క్షేమంగా ఉన్నదీ, లేనిదీ అర్థం కావడం లేదు. నా మనస్సు
విచారంగా ఉన్నది. దుశ్శకునాలు కనపడుతున్నాయి. మాధవుడు అవతారాన్ని ఉపసంహరించుకుందామని
అనుకుంటున్నాడేమో? శ్రీకృష్ణుడి వృత్తాంతం తెలియడం లేదు” అని ధర్మరాజు భీముడితో
విచారించసాగాడు.
అదే సమయంలో
అర్జునుడు దుఃఖ భారంతో యాదవపురి నుండి తిరిగి వచ్చాడు. తన పాదాలమీద వాలిపోయిన
తమ్ముడు అర్జునిడిని చూసి ధర్మరాజు,
యాదవపురిలో అంతా క్షేమమే కదా అని పేరు పేరున అందరి గురించి అడిగాడు. ముఖ్యంగా
శ్రీకృష్ణుడిని గురించి మరీ-మరీ అడిగాడు. ఇలా అడిగిన అన్న గారితో అర్జునుడు, గద్గత
స్వరంతో, శ్రీకృష్ణుడు అందర్నీ విడిచి పెట్టి వెళ్లిపోయిన విషయం బయట పెట్టాడు.
వివిధ సందర్భాలలో ఆ మహానుభావుడు శ్రీకృష్ణుడు తమకు చేసిన సహాయాన్ని గుర్తు
చేసుకుంటూ ఆ మాటలు బాధాకరంగా చెప్పాడు అర్జునుడు.
నిండు సభలో ద్రౌపదిని ఆదుకున్న
సందర్భం, దుర్వాసుడి కోపాగ్ని నుండి తమను కాపాడిన
సందర్భాన్ని, పాశుపతాస్త్రాన్ని ఆయన దయతో పొందిన సందర్భాన్నీ, గోగ్రహణ విజయ సందర్భాన్నీ, కురుక్షేత్రంలో తనకు
సారథిగా ప్రోత్సహించిన సందర్భాన్నీ, తనను యుద్ధంలో భీష్మ, కృపాచార్య, అశ్వత్థామ, కర్ణ, ద్రోణ మహావీరుల నుండి కాపాడిన సందర్భాలనూ, సైంధవ
వధనాడు అండగా ఉండడాన్నీ అన్నగారితో పంచుకున్నాడు అర్జునుడు. శ్రీకృష్ణుడు
శరీరాన్ని విడిచిన తరువాత, ఆయన పదహారువేల మంది శుద్ధాంత స్త్రీలను
తీసుకొస్తున్నప్పుడు బోయలు చుట్టుముట్టి అల్లరి చేస్తుంటే,
చక్రిలేని కారణంగా తాను ప్రయోగించిన అస్త్రాలు వ్యర్థమైపోయిన సంగతి కూడా
ధర్మరాజుకు చెప్పాడు. హరి వచనాలను తలచుకుంటూ, తన మనస్సు పరమేశ్వరుడి మీదనే
ఉన్నాడని చెప్పి మౌనంగా ఉండి పోయాడు అర్జునుడు.
ధర్మరాజు భగవంతుడైన శ్రీకృష్ణుడు
వెళ్లిన మార్గాన్ని తెలుసుకుని, యాదవులు నాశనమైన
విషయాన్ని కూడా విని, నిశ్చలమైన చిత్తంతో లోకాన్ని విడిచి
పెట్టడానికి సిద్ధపడ్డాడు. మాధవుడి స్వర్గారోహణం విన్న కుంతీదేవి భక్తితో ఈ
లోకాన్ని విడిచి పెట్టింది. ఏ రోజునైతే శ్రీకృష్ణుడు ఈ భూమ్మీద తన శరీరాన్ని
విడిచి పెట్టేశాడో ఆ రోజు నుండి అశుభమైన కలియుగం ప్రారంభమైంది. ధర్మరాజు
హస్తినాపురంలో మనుమడైన పరీక్షిత్తును రాజుగా దీవించి అభిషేకం చేశాడు. అనిరుద్ధుడి
కుమారుడైన వ్రజుడిని మథురకు రాజుగా పట్టం కట్టాడు.
ఆ తరువాత ధర్మరాజు వైరాగ్య మార్గాన్ని
ఆశ్రయించాడు. ప్రాజాపత్యం అనే ఇష్టిని చేసి, అన్ని
బంధాలను తెగతెంపులు చేసుకున్నాడు. నార చీరెలు ధరించి, మౌనిగా, నిరాహారుడై, దేనిమీదా ఆసక్తిలేకుండా, ఉత్తర
దిక్కుగా ప్రయాణం సాగించాడు. ఆయన తమ్ములు అర్జున,
భీమసేనాదులు ఆయన్ను అనుసరించారు. నారాయణ స్థానానికి చేరుకున్నారు. తదనంతరం, విదురుడు శరీరాన్ని విడిచి పెట్టాడు. ద్రౌపదీ దేవి కూడా వాసుదేవుడి మీద
మనస్సు నిలిపి ఆ లోకాన్ని చేరుకుంది.
పట్టాభిషిక్తుడైన పరీక్షిత్తు సమస్త
విద్యలను నేర్చుకున్నాడు. మహాభాగవత శేఖరుడై రాజ్య పాలన చేస్తూ, ఉత్తరుడి కూతురు ఇరావతిని పెళ్లి చేసుకుని జనమేజయుడుతో సహా
నలుగురు కుమారులను కన్నాడు. మూడు అశ్వమేధ యాగాలను చేశాడు. కలిని శిక్షించాడు.
ఆ వివరాల్లోకి పోతే: పరీక్షిన్మహారాజు
తన రక్షణలో ఉన్న కురుజాంగల దేశంలోకి కలి ప్రవేశించాడని విన్నాడు. యుద్ధం చేయాలన్న
సంకల్పంతో ద్విగ్విజయ యాత్రకు బయల్దేరి తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణంలో ఉన్న కురుభూములను జయించాడు. ఈ
నేపధ్యంలో, ఒకనాడు, వృషభ రూపాన్ని
ధరించి ఒంటికాలితో సంచరిస్తున్న ధర్మదేవుడు, తన సమీపంలో ఆవు రూపంలో కన్నీరు
కారుస్తూ ఉన్న భూదేవితో ఎందుకు అలా ఉన్నావని అడిగాడు. ఆమెకు వచ్చిన ఆపద ఏమిటని
ప్రశ్నించాడు. జవాబుగా భూదేవి, ‘ఈ లోకంలో పూర్వం నాలుగు
పాదాలతో నడిచే నువ్వు ఈనాడు శ్రీవల్లభుడు లేని కారణంగా ఒంటికాలి మీద నడుస్తున్నావు
కదా! అలాగే, చక్రి అవతారం చాలించగానే పాప సమూహంతో నిండిన
జనాలను చూసి నేను దుఃఖిస్తున్నాను. దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు, నాకు, నీకు, ధీరులకు, నానా వర్ణాశ్రమాల వారికి, గోవులకు బాధలు కలుగుతున్నందు వల్ల నేను దుఃఖిస్తున్నాను’ అన్నది. ఇలా వారిద్దరూ తూర్పు దిక్కుగా ప్రవహించే సరస్వతీ నదీతీరంలో వృషభ, గోవు రూపాలలో మాట్లాడుకుంటున్నప్పుడు అక్కడికి పరీక్షిత్తు వెళ్లాడు.
అప్పుడు ఆ వృషభాన్ని, రాజు వేషంలో
ఉన్న ఒక క్రూరుడు, రాక్షసుడులాగా నేలమీద పడేట్లు తన్నాడు. అది అప్పుడు మూత్ర
విసర్జన చేస్తూ నేలమీద పడిపోయింది. ఆ తరువాత పరమ పవిత్రమైన గోవును కూడా బలంగా
తన్నాడు. ఇలా ఆ రెంటినీ దుర్మార్గంగా తన్నుతున్న రాజలక్షణాలతో ఉన్న పురుషుడిని
చూశాడు. వెంటనే తన కోదండాన్ని ఎక్కు పెట్టాడు. వాడిని దండిస్తానన్నాడు. తన బాణంతో
వాడిని చంపుతానని వృషభంతో, గోవుతో అన్నాడు. అలా భూదేవిని, ధర్మదేవతను బుజ్జగించి పరీక్షిత్తు తన ఖడ్గంతో ‘కలి’ ని
రూపుమాపాలని ప్రయత్నించాడు. అప్పుడు వాడు తన రాజవేశాన్ని విడిచి వాడిపోయిన ముఖంతో
భయపడి, పరీక్షిత్తు పాదాలమీద పడ్డాడు. శరణు వేడాడు. తనను
చంపవద్దని ప్రాధేయపడ్డాడు.
పరీక్షిత్తు అప్పుడు వాడిని మందలించి, తన దుర్జన భావాన్ని విడిచిపెట్టి వెళ్లమని చెప్పాడు. పాపులకు
బంధువైన వాడు తాను పాలిస్తున్న భూమ్మీద నిలవడానికి వీల్లేదన్నాడు. ఇక్కడ ఉండవద్దు
అన్నాడు. తాను ఎక్కడికి పోవాలో చెప్పమని అడిగాడు కలి. జవాబుగా రాజు, ప్రాణివధ, స్త్రీ, జూదం, మద్యపానం అనే నాలుగు స్తానాలను ఇచ్చాడు కలికి. అవి తనకు సరిపోవని
చెప్పేసరికి, సువర్ణం మూలంగా కలిగే అసత్యం, మదం, కామం, హింస, వైరం అనే అయిదు ప్రదేశాలను ఇచ్చాడు. మిగతా ప్రదేశాలను స్పృశించకూడదు అని
గట్టిగా చెప్పాడు. ఇలా కలిని నిగ్రహించి, వృషభ మూర్తి అయిన
ధర్మదేవుడికి ఆయన పోగొట్టుకున్న తపస్సు, శుచిత్వం, దయ అనే మూడు పాదాలను ఇచ్చాడు. అప్పుడు భూదేవి అపరిమితమైన ఆనందాన్ని
పొందింది.
ఆ తరువాత పరీక్షిత్తు హస్తినాపురంలో
కౌరవ సామ్రాజ్య లక్ష్మిని పాలించాడు. శ్రీహరి నిర్యాణం అనంతరం భూలోకం అంతా
వ్యాపించిన కలి, పరీక్షిత్తు కాలంలో మాత్రం అణగి, మణగి ఉన్నాడు. అలా కలిప్రభావం తన
రాజ్యంలో లేకుండా చేసినప్పటికీ, కలిని మాత్రం
ప్రాణాలతో విడిచి పెట్టాడు. (బమ్మెర పోతన శ్రీమహాభాగవతం, రామకృష్ణ మఠం ప్రచురణ ఆధారంగా)
No comments:
Post a Comment