Friday, August 14, 2020

ఎవరో వస్తారని - ఏదో చేస్తారని ..... స్వర్గీయ కేబీ తిలక్ జ్ఞాపకాలు-అనుభవాలు : వనం జ్వాలా నరసింహారావు

 ఎవరో వస్తారని - ఏదో చేస్తారని

స్వర్గీయ కేబీ తిలక్ జ్ఞాపకాలు-అనుభవాలు

వనం జ్వాలా నరసింహారావు

ప్రజాతంత్ర, సంపూర్ణ స్వతంత్ర వారపత్రిక

(జనవరి 21-27, 2001)

         ప్రముఖ హిందీ చలన చిత్ర నటుడు పద్మ శ్రీ అశోక్ కుమార్ తిలక్ పై వున్న  అభిమానంతో గెస్ట్ ఆర్టిస్ట్ గా 'భూమికోసం'  సినిమాలో ప్రప్రథమంగా తెలుగు వెండితెర ప్రేక్షకులకు పరిచయం అవుతారు. అదే సినిమా ద్వారా తిలక్ గారు సినీరంగానికి మరో ఆణిముత్యాన్ని అందించారు. నేటి రాజ్యసభ సభ్యురాలు, తెలుగు-హిందీ-తమిళ సినిమాల హీరోయిన్, మేటి నటీమణి శ్రీమతి జయప్రదను ‘కాబోయే కథానాయకి-కుమారి జయప్రద' గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేస్తారు తిలక్ తన భూమికోసం సినిమా ద్వారా.

         అశోక్ కుమార్ జమీందారు భూపతిగా, ఆయన కొడుకు-కూతురుగా జగ్గయ్య-జమున (రాజశేఖర్, రాజేశ్వరమ్మ) నటిస్తారీ సినిమాలో.  ప్రముఖ స్టేజీనటుడు శ్రీ ఆచంట వెంకటరత్నం నాయుడు, అలనాటి పలువురు వర్ధమాన నటీ నటులు, ఔత్సాహిక నటీ నటులు, స్టేజీనటులు ఎందరో ఈ సినిమాలో కనిపిస్తారు. సుంకర మాటలు వ్రాయగా, ఆయనతో పాటు శ్రీశ్రీ, ఆరుద్ర, శ్రీకాంత్, రెంజిమ్ లు పాటలు రచించారు. పెండ్యాల సంగీత దర్శకత్వంలో నేపథ్య గాయకులుగా ఘంటసాల, బాలసుబ్రహ్మణ్యం, జయదేవ్, అనుపమ విల్సన్, సుశీల జానకిలు ప్రతి పాటను మధురంగా పాడతారు.  జయప్రద పోషించిన చెల్లిచంద్రమ్మ, పాత్రకనుగుణంగా పాడిన పాట 'చిన్నారి చిలకమ్మా చెల్లెలు చంద్రమ్మ’... ను రెంజిమ్ పేరుతో ప్రముఖ నక్సలైట్ నాయకుడు సత్యమూర్తి రచించారని తిలక్ చెప్పారు.

         చిత్రం ఆరంభంలోనే ‘దున్నేవాడిదే భూమి హక్కు- దున్నే వాడిదే భూమిహక్కు’  అని నినాదాలిస్తూ ఊరేగింపుగా సాగుతున్న జనానికి రాజశేఖర్ సారధ్యం వహించుతాడు. ‘భూమికోసం, భుక్తికోసం సాగే రైతుల పోరాటం అనంత జీవిత సంగ్రామం’ అన్న నేపథ్యగానం (శ్రీశ్రీ రచన) మధ్యలో జమీందారు భూపతి. ఊరేగింపులోని రైతులను కసరుకుంటాడు. ‘సెంటు భూమిలేని ఈ రైతులంతా రైతులట రైతులు, వీళ్లకు తోడు ఒక మహాసభ, కొన్ని హక్కులు....’ అని ఎద్దేవా చేస్తూ వాళ్లను కొరడా దెబ్బలు కొట్టండని పురమాయిస్తాడు కిరాయి గుండాలను. దీనికి స్వయానా కొడుకే ఎదురు తిరుగుతాడు. జమీందారీ వ్యవస్థను తూలనాడుతాడు. వంశ ప్రతిష్టను మంట కలిపావని కోపంతో తన కళ్లెదుటనుండి వెళ్లిపొమ్మని కొడుకును శాసిస్తాడు భూపతి. విలపిస్తున్న చెల్లెలితో-ఆమె ఓ ఇంటిదైన తర్వాత వచ్చి కలుస్తానని ఇల్లొదిలి వెళ్తాడు రాజశేఖర్. ఇది కథలోని తొలి మలుపు జమీందారు భూపతిగా అశోక కుమార్ కనిపించిన సీన్ ఇదే.

         మరో సన్నివేశంలో కూడా అనుపమ విల్సన్ కంఠంతో వినిపించే శ్రీశ్రీ టైటిల్ సాంగ్ పూర్తిగా ఇలా సాగుతుంది.

         'భూమికోసం భుక్తి కోసం - సాగే రైతుల పోరాటం

         అనంత జీవిత సంగ్రామం- రాజులు మారి, రోజులు మారి

         పాలన చేసే పద్ధతి మారి -మారనిదొకటేరా

         అది-దున్నే రైతుల బ్రతుకేరా

         సంపద పెంచే తీరులు మారి - పంటకాలలో రీతులు మారి

         మారనిదొకటేరా - అది పేదల ఆకలి మంటేరా ...

         తూరుపు దిక్కున వీచే గాలీ - పడమటి కడలిని పిలిచే గాలి

         తూరుపు పడమర లేకంచేసే - తుఫానులా చెలరేగేదాకా ...

         భూమికోసం భుక్తి కోసం-సాగేరైతుల పోరాటం

         అనంత జీవిత సంగ్రామం- అంతం కాదిది ఆరంభం’

         కథ విషయానికొస్తే, ఆంధ్రప్రదేశ్ లోని-ఆ మాటకొస్తే దేశంలోని-ప్రతి గ్రామంలో నిరంతరం జరుగుతుండే సంఘటనల అల్లికే అనవచ్చు. ఉన్నవాడికీ-లేనివాడికీ, ధనవంతుడికీ-పేదవాడికీ, ఆహర్నిషలూ జరిగే పోరాటమే కథా వస్తువు. వేల ఎకరాల భూస్వామి భూపాల రావు మోజుపడి తస్కరించిన ఓ బీద మహిళ గోవును, ఆయన గోశాలనుండి విడిపించే ప్రయత్నం చేసిన మరో గ్రామస్థుడు సూర్యాన్ని-తనను కొట్టిన సూర్యాన్ని తుపాకి గుండుతో గాయపరుస్తాడు భూపాలరావు.  సరిగ్గా అదే రోజున పాతికేళ్ల క్రితం తండ్రిని ఎదిరించి గ్రామాన్ని వదిలిన రాజశేఖర్. చెల్లెలు రాజేశ్వరమ్మ కోరిక మేరకు తిరిగి తన స్వగ్రామం చేరుకుంటాడు. ఈ మధ్య కాలంలో రాజశేఖర్ (జగ్గయ్య) కలకత్తాలో న్యాయశాస్త్రం చదువుకొని, ఓ బెంగాలీ అమ్మాయిని పెళ్లి చేసుకుని, క్రిమినల్ లాయర్ గా పేరు ప్రతిష్టులు-ఆస్తి పాస్తులు సంపాదించుకుంటాడు. భార్య చనిపోతుంది. కూతురు సుశీల మెడిసిన్ చదువుతుంటుంది. ఇవన్నీ వదిలి చెల్లెలు కోరిక మేరకు కూతురు సుశీలతో సహా స్వగ్రామం చేరుకుంటాడు. ఆ పాటికే తన భూమిలో చాలా భాగం భూస్వామి భూపాలరావు ఆక్రమించుకున్నట్లు గ్రహిస్తాడు. వచ్చిన నాడే భూస్వామితో తలపడతాడు సూర్యం విషయంలో. ఇద్దరి మధ్య ఘర్షణ మొదలయి రాబోయే సంగ్రామానికి నాంది పల్కుతుంది.


         రాజశేఖర్ గ్రామ పరిస్థితిని త్వరలోనే ఆకళింపు చేసుకుంటాడు. తనకున్న మిగిలిపోయిన భూమిని కూడా పేదలకు పంచుతాడు. స్వయంగా నాగలి పెట్టి భూమిని దున్నుతాడు. ఇంట్లో సోమరిపోతుల్లా పని పాటలేని మిగులు సిబ్బందిని వెళ్లిపొమ్మంటాడు. వాళ్లు చెల్లెలికి ఫిర్యాదు చేస్తే,  రాజీ  అవసరం లేకపోయినా హంగూ ఆర్బాటం కోసం వీళ్లను పనిలో పెట్టుకుని, దొంగలుగా, సోమరిపోతులుగా తయారు చేస్తున్నాం-ఒకడు పశుగ్రాసం అమ్ముకుంటే, మరొకడు పశువునే అమ్ముకున్నాడు. ఇంకొకడు  అదిరించి బెదిరించి బ్రతుకుతున్నాడు-ఫలితం వాళ్ల జీవితాలు నాశనం అవుతున్నాయి. మనమూ నష్టపోతున్నాం’ అని నచ్చచెప్పుతాడు. ఆ విధంగా వాళ్ల బాధ్యతను గుర్తు చేసే డైలాగిది. తన తండ్రి కాలం నుండి, తన ఆస్తి వ్యవహారాలను చూస్తున్న లక్ష్మన్న అనే దళారీ, రైతులను మోసగిస్తున్న సంగతి కనుక్కుని ఆయన్ను కాదంటాడు రాజశేఖర్. తన భూమిని పేదలు దున్నుకోవచ్చని చెప్తాడు. అయితే తాను ఇచ్చే భూమిని అమ్ముకోడానికి కాదనీ, ఆధారమూ లేని వాళ్ల చెమటోడ్చి పనిచేసి పండించి అనుభవించటానికి మాత్రమేనని స్పష్టం చేస్తాడు. ఈ తతంగం భూస్వామి భూపాలరావుకు గిట్టదు. రాజశేఖర్ ను దెబ్బతీసేందుకు పథకం వేస్తుంటాడు.

         గ్రామానికి చెందిన మాజీ ఉపాధ్యాయుడు భూపాలరావు ప్రమేయంతో ఉద్యోగం పోగొట్టుకున్న బడిపంతులు జగన్నాథం, సూర్యాన్ని రాజశేఖర్‌ కు పరిచయం చేస్తూ, ఆయన తండ్రి భూములను భూపాలరావు ఎలా ఆక్రమించుకుంది వివరిస్తాడు.. సూర్యం ఎలా అనాథయింది తెలియచేస్తాడు. పొలాల్లో పని చేస్తున్న సుశీల, సూర్యంల మధ్య ప్రేమ చిగురిస్తుంది. సుశీల తండ్రి, మేనత్తలు వారి ప్రేమను ప్రోత్సహిస్తారు.

         అందరికి ఇచ్చినట్లే సూర్యానికి కూడా భూమి ఇస్తానంటాడు రాజశేఖర్ దున్నుకోవడానికి, ‘ఒకరిచ్చేది నాకక్కర్లేరు. ఏనాటికైనా నా భూమి నాచేతికి రావాలి. అందాక కూలి చేసుకునే బ్రతుకుతాను’ అంటాడు సూర్యం. అతను చేసిన పనిని మెచ్చుకుంటూ, భూపాలరావు లాంటి వాళ్లు గ్రామ గ్రామాన వున్నారనీ, అలాంటి వారివల్ల నష్టపోయిన కష్టజీవులను మేల్కొపాలనీ, ఆపని సూర్యం లాంటి వాళ్ళు చేస్తే తాను సాయపడతాననీ అంటాడు రాజశేఖర్.

         ఈ నేపథ్యంలో, ఇది నాయకులను నమ్మేకాలం కాదని, ప్రజలను మేల్కొలిపి వాళ్లకేం కావాలో తెలుసుకునేటట్లు చేయుటమే తమ కార్యక్రమమనీ, అంతేకాని, ఎవరో వస్తారని, ఏదో చేస్తారని కాదనీ రాజేశ్వరి అంటుంది. ఈ భావం స్ఫురిస్తూ - ఓ చక్కని గేయాన్ని ఇక్కడ, శ్రీశ్రీ వ్రాయగా ఘంటసాల పాడతారు. ఆపాట:

         ఎవరో వస్తారని-ఏదో చేస్తారని

         ఎదురు చూసి మోసపోకుమా - నిజం మరచి నిదురపోకుమా..

         బడులే లేని పల్లెటూళ్లలో - చదువేరాని పిల్లలకు

         చవుడురాలే చదువుల బడిలో - జీతాలేరాలని పంతుళ్లకు

         చాలీ చాలని పూరి గుడిసెలో- కాలే కడుపుల పేదలకు

         మందులు లేని ఆసుపత్రిలో- పడిగాపులు పడురోగులకు

         తరతరాలుగా మూఢాచారపు వలలో చిక్కిన వనితలకూ...

         అజ్ఞానానికి, అన్యాయానికి బలియై పోయేపడతులకూ....

         కూలీ డబ్బుతో లాటరీ టికెట్-కొనే దురాశా జీవులకు

         దురలవాట్లతో బాధ్యత మరచి చెడే నిరాశా జీవులకు

         సేద్యంలేని బీడు నేలలో పనులే లేని ప్రాణులకు

         పగలు రేయి శ్రమ పడుతున్నా- పలితం దక్కని దీనులకు

         ఎవరో వస్తారనీ - ఏదో మేలు చేస్తారనీ - ఎదురుచూసి మోసపోకుమా!

         గ్రామాభివృద్ధి జరుగుతుంటుంది. వ్యసనాలనుండి గ్రామస్తులను మార్చివేస్తారు. ఇది సహించలేని భూపాలరావు, చుట్టుప్రక్క గ్రామాలకు చెందిన ఇతర భూస్వాములు రాజశేఖర్‌ను          అప్రతిష్ట పాలు చేసే ప్రయత్నం మొదలెట్తారు. గ్రామాల్లో కక్షలు రేకెత్తిస్తారు. ఎదురు తిరిగిన వారి పొలాలకు నీళ్లు ఆపు చేయిస్తారు. భూస్వాములకు వ్యతిరేక వర్గంలోని వారి జీవితం దుర్భరం చేస్తారు. ఇది సహించలేని సూర్యం విప్లవ మార్గం అనుసరించాలని అంటే, రాజశేఖర్ అహింసామార్గం ఎంచుకుందామంటాడు. సమరం మొదలవుతుంది. కొనసాగుతుంటుంది. అనంత జీవిత సంగ్రామం ఆరంభమవుతుంది.

(మరిన్ని విశేషాలు మరోసారి)

 

 

No comments:

Post a Comment