Friday, August 7, 2020

కొండగాలికి తిలక్ వినిపించిన గుండె ఊసు ..... స్వర్గీయ కేబీ తిలక్ జ్ఞాపకాలు-అనుభవాలు : వనం జ్వాలా నరసింహారావు

 

కొండగాలికి తిలక్ వినిపించిన గుండె ఊసు

స్వర్గీయ కేబీ తిలక్ జ్ఞాపకాలు-అనుభవాలు

వనం జ్వాలా నరసింహారావు

ప్రజాతంత్ర, సంపూర్ణ స్వతంత్ర వారపత్రిక

(నవంబర్ 19-25, 2000)

         'ఓ పోయే పోయే చినదానా’..'ఉంగరాల జుట్టు వాడు - ఊరించే కన్నులవాడు', ‘కొండగాలి తిరిగింది-గుండె వూసులాడింది’, ...‘అట్లతద్దె రోజు ఆడపిల్లల మోజు, పూలో దారమై పూవులో రావియై’.. పాటలు-పాటల్లోని కొన్ని చరణాలు గుర్తుచేసుకొని పాత కాలంనాటి సినీ ప్రేక్షకులుండరంటే ఆతిశయోక్తి కాదేమో! సాదాసీదా కుటుంబ కథ ఆధారంగా, మృధు మధురమైన ‘పాటల’ ఆసరాతో ఆబాలగోపాలం మన్ననలనందుకున్న అపురూప చిత్రం తిలక్ గారి 'ఉయ్యాల జంపాల'. ఇక అందాల రాముడు-ఇందీవరశ్యాముడు-ఇనకులాబ్ది సోముడు-ఎందువలన దేముడు...’ అనే పాట, బహుశా ఆసినిమా చూడనివారికి కూడా తెలిసిన పాట, నచ్చిన పాట అనోచ్చేమో. ఈ పాట అందులో వుందని తెలియని వారు సైతం పాడుకునే పాటది.

         ప్రముఖ చలనచిత్ర రచయితలు ప్రదీప్, ముఖ్రం శర్మ, మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ సి రామచంద్ర గార్లు తిలక్ గారితో సన్నిహితంగా ఉండేవారు బొంబాయి నగరంలో ఉన్న రోజుల్లో, ఆ తర్వాత కూడా ఓ దశాబ్దంన్నర క్రితం, తిలక్ గారు, నాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్, తరువాత కాలంలో రాష్ట్ర కాంగ్రెస్ ఎన్నికల నిర్వహణ అధికారి శ్రీమతి కుముద్ బెన్ జోషి అధ్యక్షతన నెలకొల్పిన ‘నీసా’ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో రూపొందించిన ‘భారతరత్న ఇందిరమ్మ’ రూపవాణి కార్యక్రమం కొరకు, ప్రదీప్  గారితో చక్కటి పాటను కూడా వ్రాయించారు. ప్రదీప్ - తిలక్ - శర్మ - రామచంద్ర ఓ కాంబినేషన్, ఓ అనుబంధం వీరిది. ఆ రోజుల్లోనే ‘ఝూలా’ సినిమా లోని కొన్ని పాటలన్నా, సినిమా అన్నా తిలక్ గారు చాలా ఇష్టపడేవారు. ‘చల్ చల్ రేనౌ జవాన్- కహనా మేరేమాన్’ అన్న పాట ‘ఝూలో కె సంగె ఝూలో’..... అన్న పాటలు ఇప్పటికీ ఆయన బాగా జ్ఞాపకం చేసుకుంటారు తరచూ.

         వాసిరెడ్డి నారాయణ రావుగారు తిలక్ గారికి మంచి మిత్రుడు. ఆయనగారు ‘ఝాలా’ హిందీ సినిమాను తెలుగులోకి తీద్దామన్న ఆలోచనతో, దాని ప్రింట్ తెప్పించుకుని, మొత్తమంతా రికార్డు చేసి పెట్టుకున్నాడు, ఓ క్యాసెట్ మీద. అందులోని పాటల ఇన్స్పిరేషన్ తో ఆ మోస్తరు సినిమా తీస్తే బాగుంటుందనుకుని, చిత్రీకరణకు నేపథ్యం ఎలావుంటే బాగుంటుందన్న ఆలోచనతో, ఏం చేద్దామని రచయిత పినిశెట్టి గారిని సంప్రదించారు తిలక్. ఆయన సలహామీద-సూచనమీద, పశ్చిమ గోదావరి జిల్లాలోని నర్సాపూర్ - పరిసర ప్రాంతాలను ఎంపిక చేసుకున్నారు. 'ఉయ్యాల జంపాల' సినిమా తీయటం జరిగింది ఆవిధంగా.

         జగ్గయ్య-కృష్ణకుమారి (రవి-శశి) ఓ జంటగా, ప్రభాకర రెడ్డి-వాసంతి (మధు-సుశీల) ఓ జంటగా, చలం-మీనాకుమారి (కైలాసం-పార్వతి) మరో జంటగా, రమణారెడ్డి-సూర్యకాంతం (వైకుంఠం-గోవిందమ్మ) ఇంకో జంటగా నటించారీ చిత్రంలో. రవి, మధు ఒక కడుపున పుట్టక పోయినా, ఎవరు స్వంత కొడుకో-ఎవరు కాదో, ఇద్దరికీ తెలియకుండా, ఇద్దర్నీ కన్న కొడుకుల్లాగ పెంచుతారు జమీందారు శ్రీపతి (గుమ్మడి) గారు. మధుకు ఫోటోలు తీయటం, ఆడపిల్లలను వల్లో వేసుకుని మోసగించటం హాబీ. రవి భావుకుడు-కవి, ఉత్తముడు. వైకుంఠం, పోస్టు మాస్టరుగానూ, బడిపంతులుగానూ హాస్య నటనను అందించగా, ఆయన భార్య గోవిందమ్మ గయ్యాలి (కొంతమేరకే) పాత్రలో కనిపిస్తుంది. వారి కొడుకు కైలాసం. వారి దగ్గరే పోస్టురన్నర్‌గా పనిచేస్తున్న సుబ్బయ్య (చదలవాడ కుటుంబరావు) కూతురు పార్వతిని ప్రేమిస్తాడు కైలాసం. వైకుంఠం-గోవిందమ్మల కూతురు శశిని ప్రేమిస్తాడు రవి. కథ సుఖాంతం, ఆనాటి తెలుగు సినిమాలన్నింటిలో లాగానే.


         కథ ఆరంభంలోనే గోదావరి తీరంలో తిరణాల్లు జరుగుతుంటే చూసొస్తాం అని ఇద్దరు అన్న దమ్ములు అడిగితే సరేనంటాడు తండ్రి. వెళ్లేముందు (ఎక్కడికి వెళ్లేముందైనా) ఇంట్లో వున్న ఓ ఫోటోకు నమస్కరించిపోవటం అన్నదమ్ములిద్దరికీ అలవాటు చేస్తాడు తండ్రి. ఆ ఫోటోలోని వ్యక్తి కొడుకుకు వీళ్లిద్దరిలో ఒకరు. ఆ వ్యక్తి కొడుకు ఎవరు తమలో అని అడుగుతే ఇద్దరూ నా బిడ్డలే నంటాడాయన.

         తిరణాళ్లకు ఇంకో వూరునుండి వచ్చిన కృష్ణకుమారి (శశి)ని  చూస్తాడు జగ్గయ్య (రవి). ఈల వేసుకుంటూ తన భావుకతను పాటగా మలుస్తాడు-పాడుతాడు.

          ‘ఓ పోయే పోయే చినదానా - నీ తీయని మనసూనాదేనా

         కలలో పూచిన కమ్మని ప్రేమ-కాయా, పండా నెరజాణ ...

         సొగసుల మోమును ముడుచుకొని- చురచుర చూడకే వగలాడి ...

         ఇతగాడే జతగాడు-ఇద్దరమొకటే ఎపుడైనా ...

         ఘుమ ఘుమ  పూవులు జడలోన-గుసగుసలాడేను చెవిలోన ...

         ఆదియేమో తెలుసుకుని- అలుగుట తగునా నాపైన ...

         కులుకులు తళుకులు నీలోన-జిలిబిలి సరసములాడేన-ఒంటిగా ఆడుట సరియేనా?

         ఓ పోయే పోయే చినదానా-నీ తీయని మనసూ నాదేనా?

         పాట వినిపిస్తుందే కాని పాడుతున్న వాడు కనిపించడు శశికి. రుసరుస లాడుతూ సణుక్కుంటూ ముందుకెళ్తున్న శశికి, మధు కెమెరాతో తారసపడి ఆమె ఫోటో తీస్తాడు. ఆమెను సొంతం చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఆలా అన్నదమ్ముల మనస్సుల్లోకి ఒకరికి తెలియకుండా మరోకరిలోకి, జొరపడుతుందామె. కథ అప్పటినుండి మలుపులు తిరుగుతుంది, అసలు సంగతి బయటపడే వరకూ. మధ్యలో సుశీలను (వాసంతి) మభ్యపెట్టి, వివాహమాడి, చివరి వరకూ మోసం చేస్తాడు మధు (ప్రభాకరరెడ్డి).  విషయం బయటపడి ఇద్దరూ ఒకటవుతారు.

         ఈ అందాల రాసికి ఎటువంటి భర్త కావాలో అని రవి (జగ్గయ్య) శశినుద్దేశించి (కృష్ణకుమారి) అనుకుంటాడు మరో సీన్ లో. ఆ సందర్భంలోని ఓ పాట ఎంతో భావ గర్భితంగా, వినసొంపుగా వుంటుంది.

         ఉంగరాల జుట్టువాడు - ఊరించే కన్నులవాడు

         ఒయ్యారివి నీవే -ఒయ్యారివి నీవే అంటూ వియ్యమాడవస్తాడు

         దోరవయసు చిన్నవాడు - దొర చదువులు చదివినవాడు.

         దోబూచులు ఆడీ వలపు దొచుకుని పోతాడు.

         కొంటెతనపు కుర్రవాడు - కోరమీస మున్నవాడు - ఆహా ...

         చూపులలో ఊహలు చదివి - చవిసొగసుకొనుకిస్తాడు

         కమ్మనైన వన్నెలవాడు - కలుపుగోరు మాటలవాడు.

         కన్నెపిల్ల మదిలో నిలిచి - కాపురమే వుంటాడు...

         ఇదంతా తననుద్దేశించే పాడుతున్నాదామె అని అనుకుంటున్న సమయంలో ‘ఏమిట్రా పగటి కలలు కంటున్నావు’ అంటూ మిత్రుడు రవి స్వప్నాన్ని భగ్నం చేస్తాడు. ‘ఇన్ని లక్షణాలున్న అందగాడు దొరకటం కష్టంలే’ అనుకుంటూ మిత్రుడితో కదుల్తాడు.

         ‘చలం, మీనా కుమారి (కైలాసం-పార్వతి) మరో ప్రేమజంట ఈ సినిమాలో. ఒకర్ని చూడకుండా మరోకరు వుండలేరు. కైలాసం తండ్రి వైకుంఠం పోస్టుమాస్టరైతే, ఆయన దగ్గర పోస్టురన్నర్ గా మీనా కుమారి తండ్రి సుబ్బయ్య పనిచేస్తుంటాడు. సుబ్బయ్య తల్లి సూరమ్మగా తిలక్ గారు లోగడ తన ఓ  సినిమాలో పరిచయం చేసిన 'పువ్వుల లక్ష్మీకాంతమ్మ' నటిస్తుంది. ఈమె సాధారణంగా నటించే పాత్రలన్నీ, ఆ తర్వాత కాలంలో 'నిర్మలమ్మ’ చేస్తుండేదని తిలక్ అంటారు. అయితే ఆ ఒరవడి తన క్రియేషన్ అన్న భావన ఆయన మాటల్లో వ్యక్తమవుతుంది.

         కైలాసం-పార్వతి (చలం-మీనాకుమారి) ల ప్రేమ జంటకో చక్కని పాట పెట్తారు సినిమాలో. 'కాయందునూ ఓరినాయనా-పూవందునూ ఓరినాయనా' అన్న ఆ పాట సరదాగా వుంటుంది. అందులోనే ‘ఉన్నవారి కోడరికం-లేనివారికి యమనరకం' అనే ఓ చరణం కూడా వుంటుంది. కృష్ణార్జున యుద్ధం నాటకంలో, అర్జునుడు గయునికి అభయం ఇచ్చినప్పుడు చదివిన ఓ పర్వంలోని ఓ పాదాన్ని ఇందులో డ్యూయట్ లో చొప్పించారు సమయోచితంగా. ‘నిటలాక్షుండిపుడెత్తివచ్చినా, పటుదర్పమ్మున తగవు పెంచినా, నిన్ను విడుతునా ఎపుడైనా, నన్ను నమ్మవా ఇపుడైనా...’ అని పార్వతికి అభయమిస్తాడు కైలాసం.  ఆరుద్ర-కొసరాజులు వ్రాసిన పాటలన్నీ వినసొంపైన పాటలే.

         కైలాసాన్ని ప్రేమిస్తున్న పార్వతికి అండగా రవి (జగ్గయ్య), రవి ప్రేమను అర్థం చేసుకుని, అతన్ని-శశిని దగ్గరచేసే ప్రయత్నంలో పార్వతి (మీనాకుమారి) చక్కగా నటిస్తుంటే కథ ముందుకు సాగుతుంది మలుపులు-వలపులతో.

(మరిన్ని విశేషాలు మరోసారి)

No comments:

Post a Comment