శ్రీకృష్ణాష్టమి ప్రత్యేకం
వ్యాస మహర్షి భాగవతం ఎందుకు రాశాడు?
శ్రీ మహాభాగవత కథ-1
వనం జ్వాలా నరసింహారావు
కంII చదివెడిది భాగవతమిది,
చదివించును
కృష్ణు, డమృతఝరి పోతనయున్
చదివినను
ముక్తి కలుగును,
చదివెద
నిర్విఘ్నరీతి ‘జ్వాలా’
మతినై
మహర్షి వేదవ్యాసకృతమైన శ్రీమద్భాగవతం
‘జన్మాద్యస్య యతో’ అనే శ్లోకంతో ప్రారంభం అవుతుంది. అలాగే పోతనగారి
తెలుగు భాగవతం ‘విశ్వజన్మస్థితివిలయంబు లెవ్వని వలన’ అనే పద్యంతో
మొదలవుతుంది. జగత్తు సృష్టి,
స్థితి, లయలు ఆ పరమాత్ముడి తోనే ఏర్పడ్డాయన్న అర్థంతో రాయడం
జరిగింది వీటిని. పరమాత్మ ఉనికితోనే సృష్టికి ఉనికి ఏర్పడిందని దీని భావన.
అందువల్ల ఆ పరమ సత్యమైన పరమాత్మను రచయితలు(సంస్కృతంలో వ్యాస మహర్షి, తెలుగులో బమ్మెర పోతనామాత్యుడు) ధ్యానించారు. వ్యాస మహర్షి శ్లోకం, బమ్మెర పోతన పద్యం ఇవే:
శ్లో: జన్మాద్యస్య
యతో న్వయాదితరతశ్చార్థేష్వభిజ్ఞః స్వరాట్
తేనే బ్రహ్మ హృదా య
ఆదికవయే ముహ్యన్తి యత్సూరయః
తేజోవారిమృదాం యథా
వినిమయో యత్ర త్రిసర్గోऽమృషా
ధామ్నా స్వేన సదా
నిరస్తకుహకం సత్యం పరం ధీమహి
సీ: విశ్వజన్మస్థితివిలయంబు
లెవ్వని వలన నేర్పడు ననువర్తమున
వ్యావర్తనమునఁ గార్యములం దభిజ్ఞుడై తాన రాజగుచుఁ
జిత్తమునఁజేసి
వేదంబు లజునకు విదితముల్ గావించె నెవ్వఁడు బుధులు
మోహింతురెవ్వ
నికి నెండమావుల నీటఁ గాచాదుల నన్యోన్యబుద్ధి దా నడరునట్లు
ఆ: త్రిగుణసృష్టి యెందు దీపించి
సత్యము, భంగిఁదోఁచు స్వప్రభానిరస్త
కుహకుఁడెవ్వఁడతని గోరి చింతించెద, ననఘు సత్యుఁబరుని ననుదినంబు
అరణ్యాలన్నింటిలోకి నైమిశారణ్యం
ప్రశస్తమైనది. ఆ నైమిశారణ్యంలోని విష్ణు క్షేత్రంలో శౌనకాది మహామునులు
సత్రయాగాన్ని చేయడం మొదలు పెట్టారు. వారంతా తమకు హరికథలు వినిపించమని కోరారు
సూతమహామునిని. వారి కోరికను అర్థం చేసుకున్న సూతమహాముని నరనారాయణులకు నమస్కారం
చేసి, భారతీదేవికి మొక్కి,
వ్యాస భగవానుడి పాదాలకు ప్రణామం చేసి చెప్పడం
ప్రారంభించాడు. దాని సారాంశమే ఇది.
ఈ విశ్వానికి పరమ పురుషుడు ఒక్కడే!
ఆయనే పుట్టించడం, పాలించడం, నాశనం
చెయ్యడం అనే పనులను బ్రహ్మ, విష్ణు,
శివుడు అనే పేర్లతో చేస్తూ ఉంటాడు. ఆ ముగ్గురిలోనూ హరి చరాచర కోటికి శుభాలను
ఇస్తాడు. భగవంతుడు 21 అవతారాలను ఎత్తాడు. ఈ కలియుగ-కృతయుగ సంధిలో 22 వ అవతారంలో
విష్ణుయషుడు అనే బ్రాహ్మణుడికి కల్కి అనే పేరుతో అవతరిస్తాడు. ఈ అవతారాలన్నీ
విష్ణువు అంశతో జన్మించిన వారే. శ్రీరాముడైనా,
శ్రీకృష్ణుడైనా, వామనుడైనా,
నృసింహస్వామి అయినా అంతా ఆయన అవతారాలే. ఆయన అవతారాల చరిత్ర సమస్తాన్ని భాగవత గ్రంథ
రూపంలో వేదవ్యాస మహర్షి చెప్పాడు. శునకుడు అనే తన కొడుకుతో చదివించాడు. సకల వేదాల
సారభూతమైనదీ పురాణం. దీనిని శుక మహర్షి పరీక్షిన్మహారాజుకు చెప్పాడు.
అవే విషయాలను తనకు వచ్చిన రీతిలో
శౌనకాది మహామునులకు చెప్తానన్నాడు సూతుడు. సూతమహాముని ఈ విషయం చెప్పగానే, భాగవత
రచనలోని అంతరార్థం, ఎలా వ్యాసుడు భాగవత రచన చేశాడు, ఎందుకు చేశాడు, ప్రేరణ ఎవరిదీ, ఎందుకీ పురాణ గాథను పరీక్షిత్తుకు శుకుడు చెప్పాడు అని అడిగారు వారంతా.
ఆవిషయాలను చెప్తూ ఇలా అన్నాడు:
ఒకనాడు సకల లోకసంచారి నారద మహర్షి
అశాంతితో వున్న వేదవ్యాసుడి దగ్గరకు వచ్చాడు. యధావిధిగా పూజలు అయిన తరువాత వారు
సంభాషించారు. తన అశాంతికి కారణం తెలవడం లేదన్నాడు వ్యాసుడు. వ్యాసుడు సకల ధర్మాలను
చెప్పినప్పటికీ, విష్ణు కథలను కొంచెమే చెప్పాడనీ, కేవలం ధర్మాలు చెప్తే సరిపోదనీ, గుణవిశేషాలు కూడా
చెప్పాలనీ, శ్రీమహావిష్ణువును పొగడక పోవడమే ఆయన అశాంతికి
కారణమనీ అన్నాడు నారదుడు. తెలియనివాడికి తెలిసేట్లుగా ఈశ్వరలీలలు గురించి
వివరించమని చెప్పాడు. తన జన్మ వృత్తాంతాన్నీ, తానూ ముల్లోకాలు విష్ణు కథా గానం
చేస్తూ తిరుగుతున్న వైనాన్నీ వివరించి నారదుడు వెళ్ళిపోయాడు.
నారదుడు వెళ్ళిపోయిన తరువాత ఆయన మాటలు
అర్థం చేసుకున్న వ్యాస మహర్షి, ఆ తరువాత, ఏం
చేశాడో చెప్పాడు సూతుడు శౌనకాది మహామునులకు ఇలా.
సరస్వతీ నది పడమటి తీరంలో ఋషులు
యాగాలు చేసుకోవడానికి వీలుగా బదరీ వృక్షాలతో కూడిన ‘శమ్యాప్రాసం’ అనే ప్రసిద్ధమైన ఆశ్రమం ఉన్నది. అక్కడ కూర్చుని వేదవ్యాసుడు
జలాలను వార్చి, తన మనస్సును స్థిరం చేసుకుని, భక్తితో పూర్ణుడైన ఈశ్వరుడిని చూశాడు. నారాయణుడి మీద భక్తి మినహా తనకు
వేరే ఉపశమనం లేదని నిశ్చయించుకున్నాడు.
ఈ భూమండలం మీద ఏ మహా గ్రంథాన్ని విన్న
మాత్రం చేతనే లోకాలకు ఆధారభూతుడైన మాధవుడి మీద భక్తి విశేషాలు పుడతాయో, అలాంటి, ద్వాదశ స్కంద భాగవతం అనే మహా
గ్రంథాన్ని వ్యాస మహర్షి నేర్పుతో వ్రాశాడు. రాసి, దాన్ని
నిర్మించి, మోక్షార్థి అయిన శుక మహర్షితో చదివించాడు.
శ్రీహరి గుణాలను వర్ణించడం అంటే ఆసక్తికలవాడు, ఆయనమీద అమితమైన
భక్తి కలవాడైన శుక మహర్షి ముల్లోకాలకు మంగళకరమైన భాగవత సంహితను పఠించాడు. వేదాలు
వేయి సార్లు చదివినా ముక్తి లభ్యం కాదు కాని, భాగవతాన్ని
ఒక్కసారి పఠిస్తే ముక్తి లభిస్తుంది.
(బమ్మెర పోతన శ్రీమహాభాగవతం,
రామకృష్ణ మఠం ప్రచురణ ఆధారంగా)
No comments:
Post a Comment