Thursday, August 6, 2020

శ్రీ మహాభాగవతము, నవమ స్కందం:వనం జ్వాలా నరసింహారావు

శ్రీ మహాభాగవతము, నవమ స్కందం

(మహాకవి బమ్మెర పోతనామాత్య ప్రణీత, రామకృష్ణ మఠం, హైదరాబాద్ ప్రచురణ)

భగవదనుగ్రహంతో చదవడం పూర్తయింది

వనం జ్వాలా నరసింహారావు

          కంII    చదివెడిది భాగవతమిది,

చదివించును కృష్ణు, డమృతఝరి పోతనయున్

                   చదివినను ముక్తి కలుగును,

చదివెద నిర్విఘ్నరీతి ‘జ్వాలా మతినై

శ్రీ మహాభాగవతం అనే ఈ మహా పురాణాన్ని, అందులో భాగంగా నవమ స్కందాన్ని సహజ పాండిత్యుడు, బమ్మెర పోతనామాత్యుడు రచించాడు, తెనిగించాడు. డాక్టర్ వై బాలగంగాధర రావు గారు అనువదించారు. 205 పేజీల ఈ నవమ స్కందం సూర్యవంశారంభంతో మొదలై, వసుదేవుడి వంశక్రమానువర్ణన వరకు 35 అంశాలు కలిగి ఉన్నది. ఈ స్కందంలో ప్రత్యేకంగా చదవాల్సింది అంబరీషోపాఖ్యానం, శ్రీరామచరిత్ర, పరశురాముడి చరిత్ర, శకుంతల-దుష్యంతుల కథ మొదలైనవి. క్లుప్తంగా ఆ 35 అంశాల వివరమైన వివరాలు:

నవమ స్కందం సూర్యవంశారంభం నుండి  ఆరంభం అవుతుంది. ఆ తరువాత వరుసగా, వైవశ్వత మనువంశ కథ, వైవస్వత మనువు పుట్టడం, హైమచంద్రుడి వృత్తాతం, సుద్యుమ్నాదుల చరిత్ర, మరుత్తుడి చరిత్ర, తృణబిందు చరిత్ర, శర్యాతి చరిత్ర, రైవతుడి చరిత్ర, నాభాగుడి వృత్తాంతం, అంబరీషోపాఖ్యానం, అంబరీషుడి మీద దుర్వాస మహర్షి ప్రయోగించిన కృత్య నిరర్థకం కావడం, ఇక్ష్వాకు వంశానుక్రమం, మాంధాత వృత్తాంతం, హరిశ్చంద్రుడి కథ ఉన్నాయి.

ఇవికాకుండా, సగర చక్రవర్తి కథ, భగీరథుడి ప్రయత్నం, గంగా ప్రవాహ వర్ణన, కల్మాషపాదుడి వృత్తాంతం, ఖట్వాంగుడి చరిత్ర, శ్రీరామచరిత్ర, ఆయన వంశ పరంపరా పరిగణన, నిమి కథ, భవిష్యద్రాజేతిహాస వర్ణన, చంద్రవంశ రాజుల ఇతిహాసం, బుధ-పురూరవుడి కథ, జమదగ్ని వృత్తాంతం, పరశురాముడి కథ, విశ్వామిత్రుడి కథ ఉన్నాయి.

ఇంకా, నహుష చరిత్ర, యయాతి చరిత్ర, దేవయాని యయాతిని వరించి పెళ్లి చేసుకోవడం, శుక్రాచార్యులు యయాతిని శపించడం, యయాతి దేవయానికి బస్తోపాఖ్యానం అనే నెపంతో స్వవృత్తాంతాన్ని చెప్పడం, శకుంతల-దుష్యంతుల కథ, భరతుడి చరిత్ర, రంతిదేవుడి చరిత్ర, పాంచాలాదుల వంశం, బృహద్రుద-శంతను చరిత్ర, భీష్మ, పాండవ, కౌరవ ప్రముఖుల వృత్తాంతం, ఋష్యశృంగుడి కథ, ఆయన వ్రతభంగం, ద్రుహ్యువు, అనువు, తుర్వసుల వంశ చరిత్రలు, యదువంశ చరిత్ర, కార్తవీర్యుడు, శశబిందుడు, జమదగ్నిల చరిత్ర, వసుదేవుడి వంశక్రమాను వర్ణన, శ్రీకృష్ణుడి అవతార కథా సూచన అనే వివిదాంశాలు ఈ నవమ స్కందంలో ఉన్నాయి.

సుద్యుమ్నాదుల చరిత్రలో ఉన్న ఒక విశేషం, కుమార్తెగా పుట్టిన మనువు శిశువును వశిష్టుడు తన మంత్ర శక్తితో కుమారుడుగా మార్చడం. ఇళగా జన్మించిన కన్య కుమారుడుగా మారి సుద్యుమ్నుడు అనే పేరుతో రాజ్యం చేశాడు. అంటే ఎప్పుడో భాగవత కథారోజుల్లోనే స్త్రీని పురుషుడుగా, పురుషుడిని స్త్రీగా మార్చే లింగమార్పిడి ప్రక్రియ ఉందని, అది ఈనాడేదోకొత్తగా కనుక్కున్నది కాదని అర్థం అవుతున్నది. అలాగే కల్మాషపాదుడి వృత్తాంతంలో, సుదాసుడి అనే వ్యక్తి భార్య మదయంతి గర్భిణీగా ఉన్న సమయంలో, ఆమె ప్రసవ వేదన పడుతూ, కష్ట పడుతున్న సమయంలో, వశిష్టుడు ఒక రాతి మొనతో ఆమె కడుపును చీల్చగా మగ శిశువు జన్మించాడు. అంటే, అప్పట్లోనే శస్త్ర చికిత్సలు, సీజీరియన్ ఆపరేషన్లు ఉండేవని అర్థం చేసుకోవచ్చు.   

ఇక పోతే, నవమస్కందంలో అత్యంత ప్రాముఖ్యమైనది, తప్పక చదవాల్సింది, ఆసక్తికరమైనది, మనోహరంగా పోతన గారు వర్ణించి రాసినదీ అంబరీషోపాఖ్యానం. ఆ వివరాలు:

అంబరీషోపాఖ్యానం “సప్తద్వీప విశాల భూభరము దోఃస్తంభంబునం బూని సంప్రాప్త....డంబరీషు డిలన్” అనే ఒక చక్కటి పద్యంతో మొదలవుతుంది. అంబరీషుడి గుణగణాలను వర్ణించే పద్యం ఇది. ఆయన తనకున్న అంతులేని సంపదను దుర్వినియోగం చేయకుండా వైష్ణవార్చనలకు ఉపయోగించేవాడు. ఎల్లప్పుడూ అతడు తన మనస్సును శ్రీహరి సేవలోనే సంలగ్నం చేసేవాడు. యజ్ఞమూర్తి శ్రీమహావిష్ణువును గురించి ఆయన్ను తలచుకుంటూ, వశిష్టాది మహామునులను కూర్చుకుని సరస్వతీ నదీ తీరాన అనేక సార్లు అశ్వమేధయాగాలు చేశాడు. అంతులేని ధనాన్ని దక్షిణలుగా ఇచ్చేవాడు. ఇంత దైవ భక్తీ ఉన్నప్పటికీ రాచకార్యాలను నెరవేర్చడంలో ఎంతో జాకరూతతో ఉండేవాడు. అసలు-సిసలైన రాజర్షి అనే పేరు తెచ్చుకున్నాడు.

అలా కొంతకాలం గడవగా, ఎప్పటిలాగా అంబరీషుడు భగవంతుడి మీద దృష్టి నిలిపి ఏకాగ్ర చిత్తంతో ఉన్న సమయంలో, పురుషోత్తముడు, శ్రీమహావిష్ణువు, శత్రువులను శిక్షించడంలోనూ, స్వజనులను రక్షించడంలోనూ సమర్థమైన, తిరుగులేని తన చక్రాన్ని అంబరీషుడికి ప్రసాదించి వెళ్లాడు. ఆ తరువాత భార్యతో కలిసి అంబరీషుడు ఏడాదిపాటు శ్రీమహావిష్ణువును గూర్చి ద్వాదశీ వ్రతాన్ని ఆచరించాడు. వ్రతాంతంలో, కార్తీకమాసంలో, మూడు రాత్రులు ఉపవాసం చేసి, నదిలో స్నానం చేసి, శ్రీహరికి అభిషేకం చేసి, వేదపండితులకు దానాలిచ్చి, భోజనాలు పెట్టి, ఉపవాస విరమణ చేసే ప్రయత్నంలో ఉండగా, దుర్వాస మహర్షి అక్కడికి అతిథిగా వచ్చాడు. వచ్చిన అతిథిని సన్మానించి, తన ఇంట్లో ఆతిథ్యం స్వీకరించాలని విజ్ఞప్తి చేశాడు అంబరీషుడు.


సరేనని ఒప్పుకున్న దుర్వాస మహర్షి, స్నానార్థం కాలిందీ నదికి వెళ్లాడు. ఆ నది జలాలలో ధ్యానం చేస్తూ ఎంతసేపటికీ రాలేదు. ఇంతలో ద్వాదశీ తిథి అతిక్రమించే వేళ దగ్గరపడింది. దుర్వాస మహర్షి రాకుండా పారణ కావిస్తే దోషం కాబట్టి ఏంచేయాలని బ్రాహ్మణుల సలహా కోరాడు. మధ్యే మార్గంగా మంచినీటిని తీసుకొని పారణ కావిస్తే సరిపోతుందని బ్రాహ్మణులు చెప్పారు. రాజు అలాగే చేశాడు. ఇంతలో దుర్వాస మహర్షి స్నానం చేసి వచ్చాడు. వచ్చి దివ్యదృష్టితో జరిగిన విషయం తెలుసుకుని, తనను అవమానించాడని అంబరీషుడి మీద ఆగ్రహించాడు. భయంకర రూపం దాల్చి, తన జడ మొదలంటగా పెరికి, దానితో శూలాయుధ సహితంగా ‘కృత్య ను (అభిచారిక హోమాలలో క్షుద్ర ప్రయోగం చేసినప్పుడు ఆవిర్భవించే ఒక రాక్షస శక్తి. ఇది స్త్రీ-పురుష రూపంలో, జ్వర అంటే జీవాయుధ రూపంలో ఆవిర్భవిస్తుంది) ఆవాహనం చేసి రాజుమీద ప్రయోగించాడు. అది తన పాదాలతో నేలమీద బలంగా తన్నుకుంటూ రాజును సమీపించింది.

ఈ వెర్రి చేష్టను గమనించిన శ్రీమహావిష్ణువు దాన్ని చక్కదిద్ది రమ్మని తన చక్రాయుధాన్ని ప్రేరేపించాడు. ఆ చక్రాయుధం క్రుత్యను దగ్ధం చేసి, దుర్వాస ముని వెంట పడింది. ఆ మహర్షి వెంట ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి అనుసరించింది. గుహలోకి పోయినా, సముద్రంలోకి పోయినా, దిగంతాలకు పోయినా, చివరకు ముల్లోకాలకు పోయినా వెంట పడింది. బ్రహ్మను, శివుడిని, చక్రాయుధం బారి నుండి తన్ను కాపాడమని వేడుకున్నా ఫలితం కలగలేదు. శ్రీహరిని శరణు వేడమని వాళ్లు సూచించారు. వైకుంఠ౦ పోయి ఆయన శరణు కోరాడు. అంబరీషుడినే ఆశ్రయించమని విష్ణుమూర్తి సలహా ఇచ్చాడు. వెంటనే అంబరీషుడి వద్దకు చేరుకున్నాడు. ఆయన పాదాలు పట్టుకున్నాడు. చక్రాయుధాన్ని ప్రస్తుతించాడు అంబరీషుడు. దాని తేజస్సును ఉపసంహరించి మునిని రక్షించమని వేడుకున్నాడు. ఆయన ప్రార్థనను మన్నించి, చక్రాయుధం మునిని ఇంకా బాధపెట్టకుండా వెనుతిరిగి వెళ్లిపోయింది. తన తప్పును మన్నించినందుకు రాజుకు సర్వ శుభాలు కలగాలని ఆశీర్వదించాడు దుర్వాసుడు. అంబరీషుడు గౌరవంతో మునికి భోజనాన్ని వడ్డించాడు. ముని తృప్తిగా తిన్నాడు. అంబరీషుడిని దీవించి వెళ్ళాడు దుర్వాసుడు.

ఈ అంబరీషుడి చరిత్రను విన్నా, చదివినా, అతడు బుద్ధి సంపన్నుడు అవుతాడని, భోగాలను అనుభవిస్తాడని, పుణ్యాత్ముడై వెలుగొందుతాడని భాగవత కథ చెప్పమని కోరిన పరీక్షిన్మహారాజుకు శుకుడు చెప్పాడు.         

ఇవన్నీ చదవగలగడం నా పూర్వజన్మ సుకృతం. 


No comments:

Post a Comment