Sunday, August 2, 2020

శ్రీ మహాభాగవతము, సప్తమ స్కందం:వనం జ్వాలా నరసింహారావు

శ్రీ మహాభాగవతము, సప్తమ స్కందం

(మహాకవి బమ్మెర పోతనామాత్య ప్రణీత, రామకృష్ణ మఠం, హైదరాబాద్ ప్రచురణ)

భగవదనుగ్రహంతో చదవడం పూర్తయింది

వనం జ్వాలా నరసింహారావు

          కంII    చదివెడిది భాగవతమిది,

                   చదివించును కృష్ణు, డమృతఝరి పోతనయున్

                   చదివినను ముక్తి కలుగును

                   చదివెద నిర్విఘ్నరీతి ‘జ్వాలా మతినై

శ్రీ మహాభాగవతం అనే ఈ మహా పురాణాన్ని, అందులో భాగంగా సప్తమ స్కందాన్ని సహజ పాండిత్యుడు, బమ్మెర పోతనామాత్యుడు రచించాడు, తెనిగించాడు. డాక్టర్ బి రుక్మిణి గారు అనువదించారు. 162 పేజీల ఈ సప్తమ స్కందంలో ధర్మరాజుకు నారద మహర్షి చెప్పిన గాథలు వివరించడం జరిగింది. ఇందులో నారాయణుడి వైషమ్యా భావాన్ని తెలపడం దగ్గర నుండి నారదుడి పూర్వ జన్మ వృత్తాంతం వరకు 17 అంశాలున్నాయి. ఈ స్కందంలో ప్రత్యేకంగా చదవాల్సింది ప్రహ్లాదుడి చరిత్ర, నృసింహావతారం, హిరణ్యకశిపుది సంహారానికి సంబంధించిన వివరాలు. క్లుప్తంగా ఆ 17 అంశాల వివరమైన వివరాలు:

నారాయణుడి వైషమ్యా భావాన్ని తెలిపే అంశం నుండి ఈ స్కందం ఆరంభం అవుతుంది. ఆ తరువాతా వరుసగా, శ్రీమహావిష్ణువు ద్వారపాలకులను సనకసనందాదులు శపించడం, హిరణ్యాక్ష-హిరణ్యకశిపుల పూర్వ జన్మ వృత్తాంతం, దితి-హిరణ్యకశిపుల సంభాషణ, సుయజ్ఞోపాఖ్యానం, యమసల్లాపం, బ్రహ్మదేవుడు హిరణ్యకశిపుడికి వరాలు ఇవ్వడం, వరబలంతో గర్వించి సంచరించిన హిరణ్యకశిపుడు, ప్రహ్లాదుడి చరిత్ర, ప్రహ్లాదుడి విద్యాభ్యాసం, హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని అనేక విధాలుగా హింసించడం, రాక్షస బాలకులకు ప్రహ్లాదుడు తెలిపిన తన జన్మ వృత్తాంతం, భక్తి తత్త్వం, ప్రహ్లాద హిరణ్యకశిపుల సంవాదం ఉన్నాయి.

ఇంకా: ప్రహ్లాదుడి మాట నిలబెట్టడానికి విష్ణువు నరసింహ స్వామి రూపంలో-నృసింహావతారంలో స్తంబంలో ఆవిర్భవించడం, నృసింహమూర్తి హిరణ్యకశిపుడిని సంహరించడం, బ్రహ్మాది దేవతలు నరసింహమూర్తిని స్తుతించడం, ప్రహ్లాదుడికి నరసింహదేవుడి వరప్రదానం,  ప్రహ్లాదుడు నరసింహమూర్తిని స్తుతించి శాంతపరచడం, నరసింహస్వామి అంతర్థానం, త్రిపురాసుర సంహారం, త్రిలోచనుడు త్రిపురాలను దహించడం, నారదుడు ధర్మరాజుకు వర్ణాశ్రమ ధర్మాలను తెలియచేయడం, ప్రహ్లాద-అజగర మహాముని సంవాదం, చతుర్విధ ఆశ్రమాల ధర్మాల వివరాలు, గృహస్తుడు మోక్షం పొందే మార్గం, నారదుడి పూర్వజన్మ వృత్తాంతం అనే వివిదాంశాలు ఈ సప్తమ స్కందంలో ఉన్నాయి.   

సప్తమ స్కందంలో అత్యంత ప్రాముఖ్యమైనది, తప్పక చదవాల్సింది, ఆసక్తికరమైనది ప్రహ్లాద చరిత్ర, నృసింహావతారం, హిరణ్యకశిపుడి సంహారం.

హిరణ్యకశిపుడుకీ-లీలావతికీ ప్రహ్లాదుడు జన్మించి పుట్టుకతోనే విష్ణు భక్తుడు అవుతాడు. అతడు భగవంతుడైన విష్ణువును అనుదినం ఆరాధిస్తూ, ధ్యానిస్తూ ఉండేవాడు. అన్నీ మరచిపోయి నిశ్చేష్టుడి లాగా, జడుడిలా కనిపించేవాడు. ఇది చూసి చింతించిన ఆతడి తండ్రి హిరణ్యకశిపుడు రాక్షసుల గురువైన శుక్రాచార్యుడి కొడుకులు చండుడు, అమర్కుడులను పిలిపించి తన కొడుక్కు విద్య నేర్పి, నీతిశాస్త్రంలో నేర్పరిని చేయమని కోరాడు. ప్రహ్లాదుడు గురువులు చెప్పినవన్నీ నేర్చుకున్నప్పటికీ విష్ణుభక్తి మాత్రం మానలేదు. కొడుకు ఎలా చదువుతున్నాడో తెలుసుకుందామని ఒకనాడు ప్రహ్లాదుడిని గురువులతో సహా పిలిచాడు. ఆయన చదివిన విషయాలు చెప్పమనగా విష్ణు సంబంధమైన విషయాలనే చెప్పాడు ప్రహ్లాదుడు. “హరి-గిరి అంటూ అంధకారంలో ఎందుకు పడ్డావు” అని ప్రశ్నించాడు కొడుకును. జవాబుగా ప్రహ్లాదుడు:


సీ:       మందార మకరంద మాధుర్యమున దేలు, మధుపంబు పోవునే మదనములకు ?

నిర్మల మందాకినీ వీచికల దూగు, రాయంచ చనునే ? తరంగిణులకు

లలిత రసాల పల్లవ ఖాది యై చొక్కు కోయిల సేరునే కుటజములకు ?

బూర్ణేందు చంద్రికా స్పురిత చకోరకం, బరుగునే సాంద్రనీహారములకు?

తే:       నంబుజోదర దివ్య పాదారవింద, చింతనా మృత పాన విశేషమత్త

చిత్త మేరీతి నితరంబు జేర నేర్చు? వినుత గుణశీల ! మాటలు వేయునేల ?

         ఇది విన్న హిరణ్యకశిపుడు, గురువులని చూసి, కొడుకును తీవ్రంగా దండించి మరీ చదువు నేర్పమన్నాడు. కొన్నాళ్ళ తరువాత మళ్లీ గురువులు ప్రహ్లాదుడిని ఆయన తండ్రి గారి దగ్గరకు తీసుకుపోయారు. విష్ణు సంబంధమైన విషయాలు రాక్షస రాజు దగ్గర వల్లె వేయవద్దని అతడికి చెప్పారు. కుమారుడి విద్యా కౌశలాన్ని పరిశీలించమని రాజును కోరారు. ధర్మ శాస్త్రాలు, అర్థ శాస్త్రాలు అనేకం గురువుల దగ్గర నేర్చుకున్నాననీ, చదువులలోని రహస్యార్థమంతా గ్రహించాననీ, దాని ప్రకారం శ్రీహరిని నమ్ముకోవడమే క్షేమకరమనీ, ఇలా అంటాడు ప్రహ్లాదుడు తండ్రితో.

సీ:       కమలాక్షు నర్చించు కరములు కరములు, శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ,

సురరక్షకునిఁ జూచు చూడ్కులు చూడ్కులు, శేషశాయికి మ్రొక్కు శిరము శిరము,

విష్ణునాకర్ణించు వీనులు వీనులు, మధువైరిఁ దవిలిన మనము మనము;

భగవంతు వలగొను పదములు పదములు, పురుషోత్తముని మీఁది బుద్ధి బుద్ధి

తే.       దేవదేవుని జింతించు దినము దినము, చక్రహస్తునిఁ బ్రకటించు చదువు చదువు,

కుంభినీధవుఁ జెప్పెడి గురుఁడు గురుఁడు, తండ్రి! హరిఁ జేరు మనియెడి తండ్రి తండ్రి!

         తన మార్గానికి రాని కొడుకును హిరణ్యకశిపుడు అనేక విధాలుగా హింసించాడు. అయినా ప్రహ్లాడుడిలో మార్పు రాలేదు. చివరకు తండ్రీ-కొడుకులకు మధ్య శ్రీహరి విషయంలో సంవాదం జరిగింది. విసిగిపోయిన హిరణ్యకశిపుడు తన తమ్ముడిని చంపిన నారాయణుడి కొరకు ఎంత వెతికినా కనపడలేదని, మరి వాడు ఎక్కడున్నాడురా! అని ప్రహ్లాదుడిని నిలదీశాడు. జవాబుగా ప్రహ్లాదుడు ఇలా చెప్పాడు:

మ:      కలడంభోది గలండు గాలి, గల డాకాశంబునం. గుంభినిం

గల డగ్నిన్ దిశలం బగళ్ళ నిశలన్ ఖద్యోతచంద్రాత్మలం

గల, డోంకారమునం ద్రిమూర్తుల ద్రిలింగవ్యక్తులం దంతటం

గల దీశుండు గలండు తండ్రి! వెదకంగా నేల యీ యా యెడన్

క:       ఇందు గల డందు లేడని, సందేహము వలదు, చక్రి సర్వోపగతుం,

డెం దెందు వెదకి చూచిన, నందందే కలడు, దానవాగ్రణి ! వింటే.

         ఇలా అనగానే పక్కనే వున్న స్తంబాన్ని చూపించి అందులో ఉన్నాడా అని అడిగాడు. ఉన్నాదని చెప్పగానే ఆ స్తంబాన్ని గట్టిగా పగలగొట్టాడు హిరణ్యకశిపుడు. వెంటనే ఆ స్తంబాన్ని చీల్చుకుంటూ శ్రీ నరసింహదేవుడు ఆవిర్భవించాడు. ఆయనది అప్పుడు మానవ రూపం కాదు, సింహాకృతీ కాదు; మానవ-సింహ రూపంగా ఉన్నది. విష్ణుమాయ వల్ల నిర్మితమైన దివ్యరూపం అది. ఆ ఆకృతిని చూడగానే తన మరణం తధ్యం అనిపించింది హిరణ్యకశిపుడికి. అయినా తన బలశౌర్యాలు ప్రదర్శించాడు. చివరకు నరసింహుడికి హిరణ్యకశిపుడు లొంగిపోయాడు. అతడిని పట్టుకుని తన తొడల మీదకు చేర్చి తన గోళ్లతో హిరణ్యకశిపుడి హృదయాన్ని చీల్చి వేశాడు. గర్వంతో అతడి ప్రేగులను మెడలో హారంలాగా ధరించాడు.

          కాసేపటికి బ్రహ్మాది దేవతలు వచ్చి నృసింహుడిని స్తుతించారు. ప్రహ్లాదుడు నరసింహమూర్తిని స్తోత్రం చేసి శాంతపరిచాడు. తన నరసింహావతారాన్ని, ప్రహ్లాదుడి స్తుతి గీతికలను మననం చేసినవారికి పునర్జన్మ ఉండదని చెప్పి నరసింహస్వామి అంతర్థానం అయ్యాడు.   

ఇవన్నీ చదవగలగడం నా పూర్వజన్మ సుకృతం.  


No comments:

Post a Comment