Monday, August 3, 2020

పురాణాలు ఆయనకు అచ్చి రాలేదు! ..... స్వర్గీయ కేబీ తిలక్ జ్ఞాపకాలు-అనుభవాలు : వనం జ్వాలా నరసింహారావు

పురాణాలు ఆయనకు అచ్చి రాలేదు!

స్వర్గీయ కేబీ తిలక్ జ్ఞాపకాలు-అనుభవాలు

వనం జ్వాలా నరసింహారావు

ప్రజాతంత్ర, సంపూర్ణ స్వతంత్ర వారపత్రిక

(అక్టోబర్ 22-28, 2000)

         శ్రీకృష్ణార్జున సినిమా తీద్దామనుకున్నప్పుడే 'నరనారాయణులు’ థీమ్ తో మరో సినిమా తీసే పథకం కూడా వేసారు తిలక్.  దానికి ఆరుద్రగారి ప్రోత్సాహం కూడా వుంది. ఆ ఆలోచన కార్యరూపం దాల్చకముందే 'కాంభోజ రాజుకథ' సినిమా తీసే కార్యక్రమం చేపట్టారు. గోపీచంద్ గారి బావమరిది అట్లూరి పిచ్చేశ్వర రావుగారు దానికి కథ రాసారు. ట్రీట్మెంట్ అంతా 'శని' నేపథ్య నాయకుడిగా వుంటుంది. సినిమా దాదాపు పూర్తయ్యే వరకు తిలక్ గారే తీసినా ఆఖరి రెండు రీళ్ళు తీయటం కామేశ్వరరావు గారి వంతు అయింది.

         ఎందుకో కాని మైథాలజీకి చెందిన సినిమాలకు కథ రూపొందించటం, స్క్రిప్ట్ తయారు చేయించటం, చివరకు దాన్ని ‘క్యాష్’ చేసుకోలేకపోవటం తిలక్ దురదృష్టం. ఆయన తలపెట్టిన 'భీమ సేన' పాండవ వనవాసంగా ఒకరు తీయటం, ‘కృష్ణార్జున’, శ్రీకృష్ణా ర్జున యుద్ధంగా ఇంకొకరు తీయటం, ‘నర నారాయణులు' ముందుకు సాగక పోవటం, ‘ఉత్తరగోగ్రహణం', నర్తనశాలగా లక్ష్మీరాజ్యం తీయటం జరిగింది. ఈ సినిమాలన్నీ విజయవంతం కావటం మటుకు తిలక్ కు ఓ రకంగా సంతృప్తినిచ్చింది.

         అక్కినేని నాగేశ్వరరావుగారితో సినిమా తీయలేక పోయిన తిలక్ కోరిక ఇంకో విధంగా నెరవేరింది. ‘నమ్మిన బంటు' సినిమాలో ఆయన హీరో, సావిత్రి హీరోయిన్. ఆదుర్తి సుబ్బారావుగారి దానికి దర్శకత్వం వహించారు. అయితే అనుకోని అవాంతరంవల్ల ఆదుర్తి గారు, నమ్మిన బంటు షూటింగ్ ‘ఫుల్ స్వింగ్’లో వున్న ఒకానొక సమయంలో 2-3 రోజులు దర్శకత్వం చేయలేని పరిస్థితి కలిగింది. ఆయనకు సన్నిహితుడు, స్నేహితుడు అయిన తిలక్ ఆ బాధ్యత స్వీకరించి, సినిమాలో చెరువుకట్ట తెగటం, వరదలు రావటం సీన్ ను, ఎఎన్ఆర్, సావిత్రిలపై చిత్రీకరించారు. అంతే కాకుండా శంభువాళ్ల కొరకై తయారు చేసిన నమ్మినబంటు అంతర్జాతీయ కాపీని ఆయనే ఎడిట్ చేసారు, ఆదో తృప్తి

         ఇక చిట్టి తమ్ముడు సినిమా విషయాని కొస్తే, దాన్ని హిందీలో 'చాంగ్ అవుర్ బిజిలి’  అనే పేరుతో తీసారు. సంజీవ కుమార్ అందులో నటించారు. బెంగాలీలో కూడా తీసారు. అయితే తెలుగు లోనే బాగుందని పలువురితోపాటు స్వయంగా సంజీవకుమారే అన్నారు.

         స్టూవర్టుపురం సెటిల్ మెంట్ థీమ్. అలీవర్ ట్విస్ట్ కథ ఆధారంగా నిర్మించిన చిట్టి తమ్ముడు సినిమా తీసిన పదేళ్ల తర్వాత కూడా, తిలక్ గారికి స్టూవర్టుపురంపై ఆసక్తి తగ్గలేదు. ఆ విషయాలు ప్రస్తావిస్తూ, అక్టోబర్ 11, 2000న సర్వోదయ నాయకుడు స్వర్గీయ జయప్రకాశ్ నారాయణ్ 98వ జన్మదిన వేడుకల సందర్భంగా హైదరాబాద్ లో ఓ కార్యక్రమంలో కల్సిన శ్రీ లవణం, శ్రీమతి హేమలతా లవణంలతో 1970 రోజుల్లో కల్సి పనిచేసిన విషయాలను గుర్తుచేసుకున్నారు తిలక్.

         నాస్తికోద్యమ ఆద్యుడు స్వర్గీయ గోరా, ఆయన కుమారుడు శ్రీ లవణం, భార్య శ్రీమతి హేమలత, స్టూవర్ట్ పురం సెటిల్ మెంట్ కు చెందిన గ్యాంగ్ తో సన్నిహితంగా మెలిగి, వారిలో పరివర్తన చేసే ప్రయత్నాలు చేసారు. సరిగ్గా అదే రోజుల్లోనే తిలక్ ఆ ప్రాంతానికి వెళ్లారు మరోమారు. కొల్లేటి కాపురం సినిమా షూటింగ్ పూర్తి చేసిన రోజులవి. కమ్యూనిస్ట్ ముక్కామల నాగభూషణం, లిటరరీ క్రిటిక్ హరిపురుషోత్తం, తిలక్ కలిసి, గోరా-లవణం గార్లతో సంప్రదించి, స్టూవర్ట్ పురం వారి జీవన విధానంపై ఓ డాక్యుమెంటరీ తీయాలన్న నిర్ణయానికి వచ్చారు. అనుకున్నదే తడవుగా ఆలోచనను కార్యరూపంలోకి తేవటానికి ఓ పక్షం రోజులు మకాం వేసారు అక్కడనే, తిలక్ తన తోటివారితో. అప్పట్లో (ఉమ్మడి అంధ్రప్రదేశ్) రాష్ట్ర ముఖ్యమంత్రిగా వున్న శ్రీ జలగం వెంగళరావు, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి శ్రీ భాట్టం శ్రీరామమూర్తిల ఆదేశం మేరకు, జిల్లా పోలీస్ సూపరింటెండెంట్‌గా వున్న శ్రీ థామస్, స్టూవరపురం ప్రక్కనే ప్రవహిస్తుండే ఓ వాగుపై ఎత్తిపోతల పథకం ద్వారా, సేద్యం చేపట్టి, స్టూవర్ట్ పురం సెటిలర్స్ కు జీవనోపాధి కలిగించే ప్రయత్నాలు జరుపుతున్నారు.

         ఆ సందర్భంలో అక్కడ మకాం వేసిన తిలక్ గారు అక్కడుండే పలువురితో సన్నిహితంగా మెలగటం, వారితో ఎన్నో సందర్భాల్లో ముచ్చటించటం, వారి జీవన విధానంపై ఆసక్తి కలగటంతో... వారు మాట్లాడుకునే ఓ రకమైన భాష-యాసలో ఓ నాటకం వ్రాయించి-వేయించటం జరిగింది. స్టూవర్టుపురంలో 'గుండమ్మ' అనే ఒకావిడ వుండేది. ఆమె తమ్ముడి పేరు ప్రసాద్. ఇద్దరూ నోటెడ్ క్రిమినల్స్. పరిచయమయ్యారు-సన్నిహితులయినారు. ప్రసాద్ తన పూర్వాశ్రమ విశేషాలను వినిపించేవాడు. ఆ వివరాలు చెప్పినప్పుడు ఆసక్తికరమైన ఓ విషయం తెలిసింది తిలక్ గారికి.  ఓ పర్యాయం తిలక్ మిత్రుడు శ్రీ గోగినేని పెద వెంకటసుబ్బయ్యగారు, వాళ్ల అల్లుళ్లు కారులో బెజవాడ నుండి వెళ్తున్నారు. దారిలో మానికొండ  దగ్గరున్న కాలువ సమీపంలో వీళ్లకారుకు ఆడ్డంగా వచ్చిన దొంగల ముఠాను చూసి, చాకచక్యంగా డ్రైవర్ రివర్స్ చేసుకుని కారును వెనక్కు తిప్పారు. ఆ గ్యాంగ్ లీడర్ 'ప్రసాదు’ ఇలా తాము ఎక్కడెక్కడ దొంగతనాలు, ఎలా చేసిందీ వివరించి చెప్పేవాడు ఆయన తిలక్ కు.


         సింహాచలంలో ఎన్నో దొంగతనాలు చేసిన గజ్జెల ప్రసాద్, ఆయన భార్య కలిసారు. వారు చెప్పిన విషయాలు ఇంకా సరదాగా వున్నాయి. స్టూవర్ట్ పురంలో సెటిల్ అయిన తమకు పునరావాసం కల్పించిన తర్వాత, వ్యవసాయం చేసుకోమని చెప్పారనీ, అందుకొరకై పెట్టుబడి అవసరమయిందనీ, అది సమకూర్చుకునేందుకు 'ఆఖరు' సారిగా దొంగతనం చేద్దామనుకున్నామని చెప్తూ, అది విఫలమయిన సంగతి వివరించాడు గజ్జెలప్రసాద్. రాయలసీమలో ఓ బ్యాంక్ లూటీ చేయటం, పట్టుబడటం, మళ్లీ తమపై వత్తిడి రావటం అంతా చెప్పాడతను.

         స్టూవర్ట్ పురం గ్యాంగ్ లో దొంగతనాలు చేసే దొంగలతో పాటు, చేయించే దొరలు కూడా వున్నారు. ఆ చుట్టు ప్రక్కల దొంగతనాలు చేయించి, దానికి పెట్టుబడులు, అడ్వాన్లు ఇచ్చేవారు కూడా వున్నారు. కనీసం అప్పట్లో వున్నారు అని తిలక్ అభిప్రాయం. ఈ విషయం తిలక్ కు చెప్పింది అక్కడి వారందరు ముద్దుగా 'లేడీ' అని పిలుస్తుండే సామ్రాజ్యరావు అనే ఓ గజదొంగ. అతగాడిని పోలీసులు పట్టుకోవటం కష్టం. లేడిలాగా చిక్క కుండా పరుగెత్తేవాడు. తిలక్ దగ్గరయ్యాడు. ఇంటికి తీసుకెళ్లాడు. తాము అమావాస్య రోజుల్లోనే దొంగతనాలు చేస్తామని, పున్నమి రోజుల్లో విశ్రాంతి తీసుకుంటామని చెప్పాడతను. అమావాస్య రోజుల్లో కూడా ఏ టైమ్ లో, ఎక్కడికి వెళ్లాలనేది నిర్ణయించేది తమతోనూ, చుట్టు ప్రక్కల్లోనూ వుండే 'దొంగల్లో దొరలు' అని కూడా చెప్పాడు సామ్రాజ్యరావు. అంతేకాదు తనకు పెట్టుబడులు పెట్టి దొంగతనాలు చేయటానికి అడ్వాన్లు ఇచ్చే మోతుబరులకు, తాము 'ధర్మంగా’ వాటా ఇచ్చేవారమని కూడా వెల్లడిచేసాడు. పట్టణాల్లో దొంగతనాలు చేసేటప్పుడు తమకు సమాచారం ఇస్తుండే వాళ్లకూ వాటా వుండేదట.

దొంగ తనాలు విజయవంతంగా చేసేటందుకుపయోగించే ఓ 'బహుళార్దసాధక పరికరం' చాలా చిన్న సైజులో వుండేదాన్ని, ఓ రకమైన ఆయుధాన్ని తిలక్ కు చూపించాడు ‘లేడి'. దాంతో కన్నం వేయటం, తాళం తీయటంతో సహా మనుషులను గాయపర్చటానికి వీలవుతుంది.

         కారు చీకట్లో కాంతిరేఖ' (డార్క్ నెస్ టు లైట్) అనే డాక్యుమెంటరీని, ముక్కామల నాగ భూషణం గారితో తయారు చేయించి, ప్రగతి ఆర్ట్స్ పేరుమీద తీసారు తిలక్. అప్పట్లో ఢిల్లీలోని దూరదర్శన్ అధికారి శ్రీ హరీష్ ఖన్నాకు చూపించటం దాన్ని ఆయన బాగుందని కితాబు ఇవ్వటం కూడా జరిగింది. ఆ తర్వాత ముక్కామలగారు చనిపోయారు. దాని సంగతి ఏమయిందో గుర్తు లేదన్నారు తిలక్.  డాక్యుమెంటరీ తీయటం కొరకు తిలక్ తన యూనిట్ మొత్తాన్ని స్టూవర్ట్ పురంలో 2-3 వారాల పాటు వుంచారు.

         స్టూవర్ట్ పురం దొంగల మనస్తత్వం విశ్లేషించి, శాస్త్రీయ పద్ధతిలో సమస్యకు సరియైన పరిష్కారం కనుక్కొని, అసలుసిసలైన పునరావాసం జరుగుతున్నదా, లేదా అనే విషయం ఆలోచించాలని తిలక్ అంటారు.

         స్టూవర్ట్ పురం సెటిలర్స్ ను క్రిమినల్ ట్రైబ్స్ గా బ్రిటీషు ప్రభుత్వం డిక్లేర్ చేసిందని, వారికొరకై కొన్ని సెటిల్ మెంట్లను ఇచ్చారని, అవి, విజయవాడ ప్రక్కన సీతానగరం, కావలి, బిట్రగుంట దగ్గర వూళ్లు, చీరాల దగ్గర స్టూవర్ట్ పురం అనీ అన్నారు తిలక్.  ఎప్పుడు, ఎక్కడ దొంగ తనాలు జరిగినా, పోలీసులు ముందుగా ఈ సెటిల్ మెంట్స్ దగ్గరకు వెళ్లి విచారణ చేసేవారు. పోలీస్ స్టేషన్లో ప్రతిరోజు వెళ్లి సంతకం పెట్టాలి. రికార్డు చేయాలి. తిలక్ గారు స్టూవర్ట్ పురంలో డాక్యుమెంటరీ తీస్తున్న రోజుల్లో 103 సంవత్సరాల ఓ వృద్ధుడిని ఇంటర్వ్యూ చేసారు. ఆయన చెప్పిన దాన్ని బట్టి వీళ్లంతా వుప్పు తీసుకుని, నైజాం ప్రాంతానికి వచ్చి అమ్ముకుండేవాళ్లట. రవాణాకు గాడిదలను ఉపయోగించేవారు. వారి భాషకూడా ఓ రకమైన కాస్మో పాలిటన్-తమిళం, తెలుగుల యాస. బ్రిటీషు ప్రభుత్వం వాళ్లను పెటిల్ చేయటానికి సాల్వేషన్ ఆర్మీకి బాధ్యతను అప్పగించింది. అప్పట్లో వాళ్ల కొరకై ఓ చర్చి కట్టించి, వాళ్లను కన్వర్ట్ చేయించి, ఎడ్యుకేషన్ సౌకర్యాలు కూడా కలిగించింది బ్రిటీషు ప్రభుత్వం. ఎన్ని చేసినా, ఎంత చెప్పినా, వాళ్లు దొంగతనాల నుండి బయట పడాలనుకున్నా, వారి చుట్టూ వున్న సాలెగూడు సమాజం తమ స్వార్థానికి, వీళ్లలో దొంగతనాలు చేయించటానికి పురికొల్పేవారు.

         క్రిమినల్ ట్రైబ్స్ గా, ఓ అంటరాని వారిగా సమాజం ముద్రవేసిన స్టూవర్ట్ పురం వాసులు కాలగమనంలో జనజీవన స్రవంతిలో కల్సిపోతూ, అభివృద్ధి ప్రక్రియలో అందరితో పాటు తామూ తమవంతు పాత్రనిర్వహించే స్థితి గతులు ఇప్పుడప్పుడే నెలకొంటున్నాయని, ఇది గమనించాల్సిన విషయమని, ఆ దిశగా వారికి తగిన ప్రోత్సాహం అందించాల్సిన బాధ్యత సమాజంపైనా, ప్రభుత్వం పైనా వున్నదని చెప్పారు తిలక్.

(మరిన్ని విశేషాలు మరోసారి)

No comments:

Post a Comment