ఉయ్యాల జంపాల
స్వర్గీయ కేబీ తిలక్ జ్ఞాపకాలు-అనుభవాలు
వనం జ్వాలా నరసింహారావు
ప్రజాతంత్ర, సంపూర్ణ స్వతంత్ర వారపత్రిక
(డిసెంబర్ 3-9, 2000)
ఉయ్యాల జంపాల సినిమాలో
ఏ సన్నివేశం గురించి ప్రత్యేకంగా బాగుందని చెప్పుకోవాలి, పోనీ ఏ పాట అన్నింటికన్నా మంచి పాటుగా
చెప్పుకోవచ్చు అని అడిగితే, సినిమా
మొత్తానికి మొత్తం ఓ ప్రత్యేకత అని జవాబిచ్చారు తిలక్. దానికదేసాటి, అని తాను ఆనటం కాదు, ఆరోజుల్లో హేమాహేమీ దర్శకులే అన్నారని
స్పష్టంచేసారు తిలక్. మూగమనసులు సినిమా రిలీజ్ అయిన తర్వాత తానీ సినిమాను తీసాననీ, లొకేషన్స్ విషయంలో దానికన్నా ప్రత్యేకత, బాగుండాలన్న
తాపత్రయంతో ఎంతో శ్రమించానన్న తృప్తి ఇప్పటికీ వుందని చెప్తూ ఆదుర్తిగారి
మెప్పుకోలు గురించి ప్రస్తావించారాయన. నూతనత్వం, గ్రామీణ
జీవన శైలి, లొకేషన్ ఎంపిక
విషయాల్లో తన మూగ మనసులకన్నా,
తిలక్
ఉయ్యాల జంపాలే మెరుగని ఆదుర్తి స్వయంగా
అన్నారట. అన్నింటికన్నా మించి,
ఆరుద్ర
వ్రాసిన ప్రతి పాట పినిశెట్టి గారి ప్రతిమాట వినసొంపైనదే. మొట్ట మొదటి సారిగా
మంగళంపల్లి బాలసుబ్రహ్మణ్యం గారితో సాంప్రదాయేతర సాంఘిక పాట పాడిస్తారందులో.
సినిమాలో అన్ని పాటలు ప్రత్యేకత
సంతరించుకున్నవే అని అన్నాకొన్ని మరింత ప్రత్యేకతని అని అనటంలో తప్పులేదంటానికి
ఉదాహరణగా ‘కొండగాలి..' పాటను
చెప్పుకోవచ్చు. రవి (జగ్గయ్య) ఇంటి నుండి వెళ్లిపోయి శశి (కృష్ణకుమారి) వూళ్లో
గోపి పేరుతో బడిపంతులుగా ఉంటాడు. కృష్ణకుమారి ప్రేమలో పడి భావుకతను, ఎన్నో కవితలుగా మలుస్తుంటాడు. శశి
తల్లి-దండ్రులు తమ కుమారుడు కైలాసం పోస్ట్ రన్నర్ కూతురు పార్వతీల ప్రేమను గురించి
చర్చిస్తూ, శశి పెళ్లి జరిగేవరకూ వారి వివాహం కూడా వాయిదా
వేయాలన్న నిర్ణయం తీసుకున్నప్పుడు బడిపంతులు గోపి కూడా అక్కడే వుంటాడు. శశిని
సరదాగా ఆటపట్టిస్తుంటాడు. ఆ తర్వాత సీన్లో ప్రతి రోజులాగానే మర్రి చెట్టు తొర్రలో
ఉత్తరం వేసి, తన వుత్తరం
కొరకు వెతుక్కుంటుంది శశి. నది ఒడ్డున
దూరంగా పడవలో గోపి-రవి. ఆ నేపథ్యంలో జగ్గయ్య పాటకు, కృష్ణకుమారి
స్పందన చాలా చక్కగా చిత్రీకరించారు తిలక్.
ఆపాట:
కొండగాల తిరిగిందీ - గుండె వూసులాడింది
గోదావరి వరదలాగ - కోరిక చెలరేగింది.
పుట్టమీద పాలపిట్ట పొంగిపోయి కులికింది
గట్టుమీద కన్నె లేడి గంతులేసి ఆడింది
పట్టపగలు సిరివెన్నెల భరతనాట్యమాడింది.
పట్టరాని లేత వలపు పరవసించిపాడింది
మొగలి పూల వాసనతో జగతి మురిసిపోయింది.
నాగమల్లె పూలతో నల్లనిజడ నవ్వింది.
పడుచుదనం అందానికి, తాంబూల మిచ్చింది
ప్రాప్తమున్న తీరానికి, పడవసాగిపోయింది
మోసపోయిన సుశీల (వాసంతి) మధు (ప్రభాకర్
రెడ్డి)ను వెతుక్కుంటూ ఆయనున్న స్థలానికి వస్తుంది. ఆమె ఎవరో తెలియనట్లు నటిస్తాడు
మధు. యజమానికి మద్దతుగా నౌకరు కూడా సుశీల ఎవరో తెలియదన్నట్లే ప్రవర్తిస్తాడు.
గత్యంతరం లేక నదిలో దూకుతుంది ఆత్మహత్యా ప్రయత్నంలో సుశీల. అది గమనించిన గోపి-రవి
(జగ్గయ్య) ఆమెను రక్షించి (ఆమె ఎవరో తెలియకపోయినా) తనుంటున్న సుబ్బయ్య ఇంటికి
తీసుకొస్తాడు. సుశీల-గోపీల మధ్య ఏదో ఉందని అనుమానిస్తారు. శశితో సహా, తను నడుపుతున్న పాఠశాలలోనే మనశ్శాంతి
కొరకు పనిచేయమని కోరతాడు సుశీలను గోపి.
ఆ పాఠశాలలోనే మొదటి నుంచి పనిచేస్తున్న
వైకుంఠం (రమణా రెడ్డి)ను పిల్లలు ఎప్పుడూ ఆటపట్టిస్తుంటారు. ‘శ్రీరామచంద్రుడు
అవతార పురుషుడు. అనగా దేముడు భగవంతుడు' అని
ఆయన పిల్లలకు బోధిస్తుంటే ఆయన దేముడెందుకయ్యాడండి అని పిల్లలు ప్రశ్నిస్తే జవాబు
చెప్పలేడు వైకుంఠం. పిల్లలతో ఆడుతూ-పాడుతూ చేస్తే వాళ్లకర్థం అవుతుందని తను
వ్రాసిన పాటను పాడమంటాడు. ఆ పని తాను చేస్తానని సుశీల అంటుంది. ఈ నేపథ్యంలో మరో
చక్కని పాట:
'అందాల
రాముడు-ఇందీవరశ్యాముడు
ఇనుకులాబ్ది సోముడు-ఎందువలన దేముడు
తండ్రిమాటకై పదవులు త్యాగమే చేసెను
తనతమ్ముని బాగుకై తాను బాధపొందెను
అందాలరాముడు-అందువలన దేముడు
అందాల రాముడు-ఇందీవరశ్యాముడు
ఇనుకూలాబ్ది సోముడు-ఇలలో మనదేముడు....
అనుభవించతగినవయసు - ఆడవిపాలు చేసెను
అడుగుపెట్టినంతమేర - ఆర్యభూమి చేసెను
ధర్మపత్ని చెరబాపగా-ధనుజునే దునుమాడెను
అందాల రాముడు - ఇందువలన దేముడు’
కోలాటం శైలి డాన్సు ఆధారంగా వుంటుందీ
పాట. చివరికి అందరూ కలిసి కోరస్ గా పాడుతారు.
శశిని వెదుక్కుంటూ ఆమె వూరు చేరుకున్న
మధు (ప్రభాకర్‌రెడ్డి) అట్లతద్ది నాడు పాడుకుంటూ ఊయ్యలూగుతున్న శశిని చూస్తాడు.
ఆరాతీస్తాడు. ఆయనొచ్చిన విషయం పసిగట్టిన సుశీల మధును కల్సి హెచ్చరిస్తుంది.
‘సుశికి-శశికి అక్షరాల్లో అట్టే తేడా లేదు. సుశి శూన్యంకాగా, శశి మీ చీకటి జీవితంలో ఉదయిస్తుందని
మురుస్తున్నారేమో కానీ అది జరగనిపని' అని
బెదిరిస్తుంది. గోపీకి సుశీలకు అక్రమసంబంధమున్నదని ఆమెతో అంటూ బ్లాక్ మెయిల్
చేస్తాడు. గోపీ బ్రతకాలంటే ఈ రహస్యం (తమ ఇద్దరి వివాహం గురించి) బయటపడకూడదని
తిరిగి ఎదురు బదిరిస్తాడు మధు.
మధు-శశి కలుసుకుంటారు. తనకు వుత్తరాలు
(మర్రి చెట్టు తొర్రలో వేస్తున్న) వ్రాస్తున్న రవి ఇతనే అనుకుంటున్న శశి, మధుతో ఆ ప్రస్తావన తెస్తుంది. ఆయన
వ్రాస్తున్న వుత్తరాలకు తనను తానే మర్చిపోయేదాన్ననీ అంటూ, ఒక ఉత్తరంలో వ్రాసిన ఒక పాటను మధు నోట
వినాలని వుందని, పాడమని
ఆడుగుతుంది. అదే సమయంలో అక్కడకు వచ్చిన నౌకరు, నీళ్లు
నముల్తున్నమధును, 'మధుబాబు' అని పిలిచి బయటకు తీసుకెళ్తాడు. 'మధుబాబు యీయనైతే-రవిబాబు ఎవరు?’ అన్న ప్రశ్న వేసుకుంటుంది శశి. ఏదో
అర్ధమైనట్లు ఆమెలో ఆమే గొణుక్కుంటుంది. రవీ-గోపీ ఒకరేనన్న అనుమానం
కలుగుతుంది. పార్వతి ద్వారా నిజం
తెలుసుకుంటుంది. తన్నురవీ-గోపి గాఢంగా ప్రేమిస్తున్నాడన్న సంగతి, ఉత్తరాలు
వ్రాస్తున్నాడన్న సంగతి తన పెట్టెలోని ఉత్తరాలను (శశి జవాబులు) శశి తీసుకెళ్లిన
సంగతి కూడా తెల్పుకుంటాడు గోపి-రవి.
రవి-గోపి, శశి
కల్సుకుంటారు. చిరుకోపాలతో ఒకర్నొకరు అర్థం చేసుకుంటారు. తెలియకుండా
ప్రేమించుకున్న సంగతి తెలుసుకుని,
ప్రేమను
పెంచుకుంటారు. ఈ నేపథ్యంలో 'జంగ్లీ' హిందీ సినిమాలోని ఓ పాట స్ఫూర్తితో అదే
తరహా పాటను పెట్తారు తిలక్. మ్యూజిక్ కాపీ చేసారా అంటే కాపీ అని తను అనుకోవటం
లేదనీ, ఆమోస్తరు
ట్యూనింగ్ అంటే సరిపో తుందని భావిస్తున్నానని అంటారు తిలక్. ఇన్స్పిరేషన్‌కు ఓ రిథమ్ ఉంటుంది. ఆది కాపీ కాదు
అంటారారాయన. ‘దాచిన దాగదు’.... అనే ఆ పాటలోని ఆఖరి చరణాన్ని ఏదో కారణాల వల్ల తిలక్
దర్శకత్వంలో షూటింగ్ చేయలేకపోవటం జరిగింది. నర్సాపూర్ ప్రాంతంలో కాకుండా, మద్రాసు ఇలియట్స్ రోడ్డులోని ఓ
ఉద్యానవనంలో, శ్రీ కె ఎస్
ప్రకాశరావు గారు దాన్ని పూర్తి చేయించారు. ఇద్దరూ సన్నిహితులు కదా! ఇక ఆ పాట ఇలా
సాగుతుంది!
'దాచిన
దాగదు వలపు-ఇక దాగుడుమూతలు వలదు
చక్కనీ కోపమూ - చల్లనీ తాపమూ -ఎందుకు
మనలో మనకు
కనుచూపుల కమ్మని కులుకు-ననుదోచుట మునుపే
తెలుసు
మనసంతా తనదైతే-మరి చోరీ ఎందులకు
పూసలో దారమై-పూవులో తావియై-కలిసెను మనసూ
మనసు ..
ఒక తీయని మైకము కలిగి -నెలవెన్నెల
కనులుపెలిగె
కలలందు హృదయాలు - వినువీధులలో ఎగిరె
ఇరువురూ ఏకమై - ఒక్కటే ప్రాణమై
ముచ్చట గొలపగవలయు-దాచినదాగదు వలపు .....
"
తను మధును చేసుకోనని స్పష్టంచేస్తుంది
శశి. శశి మనసు మారిన తర్వాతనే ఆమెను వివాహమాడతానని మరో ఎత్తు వేయటం చేస్తాడు మధు.
శశికి-మధుకు పెళ్ళి నిశ్చయం జరుగుతున్నదని తెలుసుకున్న పార్వతి, సుశీల, గోపీని
ఆ పెళ్లి ఆపుచేయమని దబాయిస్తారు. నిష్ఠూరాలు ఆడుతారు గోపీ నిర్లిప్తతను చూసి.
మరో సీన్ లో శ్రీపతి (గుమ్మడి) గారికి
నిజం తెలుస్తుంది. రవి పేరుతో మధు ఆడిన నాటకం, సుశీలకు
చేసిన అన్యాయం అంతా అర్ధమౌతుంది. ఆయనా శశి వాళ్ల పూరుకే బయలుదేర్తాడు. అటు సుశీలను
కల్సిన శశికి, సుశీలను మోసం
చేసిన వ్యక్తీ మధు అని తెలుస్తుంది. ఈ గొడవలేమి ఇష్టపడని గోపి-రవి మళ్లీ వూరు
విడచి వెళ్లే ప్రయత్నంలో సుశీల,
మధుభార్య
అని తెలుసు కుంటాడు.
అన్నా తమ్ములు ఘర్షణ పడతారు. గోదావరిలో ఓ
లాంచిమీద ఫైటింగ్ సీన్ చాలా చక్కగా చిత్రీకరించారు.
చివరకు శ్రీపతి గారి స్వంత కుమారుడు, ఆయన వెళ్ళగొట్టిన 'రవి' (జగ్గయ్య)
గానూ, పెంపుడు
కొడుకు ఇంట్లో ఉంచుకున్న మధు (ప్రభాకర్ రెడ్డి) గానూ బయటపడ్తుంది. అందరూ
కలుస్తారు. కథ సుఖాంతం.
తిలక్ గారు, ఈ
సినిమా తీస్తున్న రోజుల్లో, రబ్బర్
సాక్స్ వేసుకుని బురదల్లో షూటింగ్ చేయించేవారు. కారు గట్టు (కాలువ గట్టు) మీద
వెళ్లటం కష్టమయ్యేది. ఏమాత్రం అటిటు ఆయినా గోదావరిలో పడ్తుంది. ఏటిగట్టున కొబ్బరి
మొక్కలు-కంట్రాక్టు పద్ధతి-లాంటి కథా వస్తువుగా మరో సినిమా తీయాలని వుందంటారు
తిలక్. ఫలించేనా కల?
(మరిన్ని విశేషాలు మరోసారి)
No comments:
Post a Comment