Friday, July 31, 2020

బృహత్తర విద్యా సంస్కరణలు : వనం జ్వాలా నరసింహారావు

బృహత్తర విద్యా సంస్కరణలు

వనం జ్వాలా నరసింహారావు

మన తెలంగాణ దినపత్రిక (01-08-2020)

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నూతన జాతీయ విద్యా విధానం చర్చనీయాంశమైంది.  ఈ విద్యావిధానంలో భాగంగా పలు మార్పులకు శ్రీకారం చుట్టేందుకు కేంద్రం నడుంబిగించింది. కొన్ని ఆశించతగినవే అయినప్పటికీ, పూర్తిగా అమలయ్యే నాటికి, ఈ నూతన విద్యా విధానం ఏవిధంగా ఉండబోతోంది, పిల్లల చదువులు ఏవిధంగా సాగుతాయనే అంశాలపై పలు అనుమానాలు కలుగుతున్నాయి.

ఈ నేపధ్యంలో తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కొద్ది రోజుల క్రితం రాష్ట్రంలోని విద్యారంగం పనితీరును సమీక్షిస్తూ, నేటి సమాజంలో నిరంతరం వస్తున్న మార్పులకు అనుగుణంగా బృహత్తరమైన సంస్కరణలు చేపట్టాలనే అభిప్రాయం, ఆవశ్యకత వెలిబుచ్చారు.  ముఖ్యంగా ప్రభుత్వ విద్యాసంస్థలలో పాఠ్యాంశాలు, పరీక్షా విధానాలు, పరిపాలన, మొదలైనవి సమూలంగా సంస్కరించాలని ముఖ్యమంత్రి సూచించారు. 

అటు జాతీయ విద్యావిధానం భావిస్తున్నట్లు, ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి సూచిస్తున్నట్లు,  సమగ్ర ప్రక్షాళన తక్షణ అవసరమే. ఇవన్నీ పరిగణలోకి తీసుకుని సుమారు పదిహేను సంవత్సరాలు రాష్ట్ర-కేంద్ర పాతశాలల్లో పనిచేసిన అనుభవంతో అధ్యయనం చేస్తే కొన్ని సూచనలు చేయాలని అనిపించింది. పర్యవసానమే ఈ వ్యాసం.

ప్రస్తుతం భారతదేశంలో 50% జనాభా 25 సంవత్సరాలకంటే తక్కువ వయసు వారు ఉన్నారు.  65% కంటే ఎక్కువ జనాభా 35 సంవత్సరాలకంటే తక్కువ వయసు వారు.  ఈ సంవత్సరం (అంటే 2020) చివరకల్లా భారతదేశ జనాభా సగటు వయస్సు 29 సంవత్సరాలు ఉంటుందని ఒక అంచనా.  2030 నాటికి అక్షరాశ్యులు 75 శాతం వరకూ ఉండవచ్చు. అందుబాటులో ఉన్న గణాంకాలనుబట్టి చూస్తే పెరుగుతున్న జనాభా, అధికమౌతున్న విద్యాసంస్థలూ సామాజిక విధానాలలో గణనీయమైన మార్పు తీసుకువచ్చే శక్తి కలిగి ఉండడం తప్పదని అర్థమౌతోంది.  ఈ పరిస్థితిని అనుకూలంగా, ఒక సదవకాశంగా మార్చుకోవడం అత్యవసరం.  అందుకే విద్యారంగంలో భారీ మార్పుల ఆవశ్యకత ఎంతైనా ఉన్నది.  

ప్రాథమిక పాఠశాల స్థాయినుంచి విశ్వవిద్యాలయాల స్థాయి వరకు ఇప్పుడు అమల్లో, ఆచరణలో ఉన్న విద్యావిధానం, విద్యార్థులను పరీక్షలు మాత్రం రాసేందుకు తగ్గట్టుగా, ఎక్కువ మార్కులు ఎదో విధంగా సంపాదించుకునేలా తయారు చేస్తోంది తప్ప వాస్తవిక ప్రపంచానికి అనుగుణంగా సిద్ధపరిచే విధంగా లేదు. దురదృష్టవశాత్తు మనమింకా ఆంగ్లేయుల పరిపాలనా కాలంలోని బోధనా పద్ధతులనే యధాతథంగా కాకపోయినా, ఏదోవిధంగా అనుసరిస్తున్నాము. లార్డ్ మెకాలే ఆలోచనలకు అనుగుణంగా రూపుదిద్దుకున్న ఆ విద్యావిధానం బ్రిటీష్ ప్రభుత్వానికి కావాల్సిన గుమాస్తాలను తయారుచేయడానికి, బ్రిటన్ రాణీగారిని సేవించడానికి మాత్రమే అనుకూలంగా ఉన్నాయి తప్ప స్వతంత్ర్యదేశానికి, మారుతున్న పరిస్థితులకీ  అవసరమైనట్లుగా లేవు.  అలాగే పాఠ్యాంశాలూ, పరీక్షావిధానాలూ కూడా పాత మూస పద్ధతిలోనే నడుస్తున్నాయి. కొఠారీ కమీషన్ లాంటివి ఎన్ని నియమించినా పరిస్థితిలో మార్పులేదు.

అందుకే ప్రాథమిక పాఠశాల స్థాయినుంచి విశ్వవిద్యాలయాల స్థాయి వరకు ఇప్పుడున్న పాఠ్యాంశాలనూ, ఇతర వ్యాసంగాలనూ, వ్యాపకాలనూ, పరీక్షా పద్ధతులను సమూలంగా ప్రక్షాళణ చెయ్యవలసిన అవసరం ఎంతైనా ఉంది. 60వ దశకంలో ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థులకు వారాంతంలో రకరకాల చేతి పనులలో శిక్షణ ఇచ్చేవారు.  అలాగే నైతిక విలువలు బోధించేవారు.  అప్పట్లో ఆనాటి పియుసి (ప్రీ యూనివర్సిటీ కోర్స్) లోనూ, డిగ్రీకంటే కిందిస్థాయిలోనూ ఉండే వివిధ కోర్సులలో జనరల్ ఎడ్యుకేషన్ (సామాన్య శాస్త్రం) అనబడే అంశం తప్పనిసరిగా బోధించేవారు. దానివల్ల ఐచ్చికంగా విద్యార్ధి తీసుకునే సబ్జక్టులకు అదనంగా అన్ని విషయాలలోనూ స్థూల అవగాహన, అంతో-ఇంతో లోక జ్ఞానం కలిగేది.  అలాగే 70వ దశకం తొలినాళ్లలో ఇంటర్మీడియేట్ తరగతుల్లో లెక్కలు ముఖ్యాంశంగా ఎన్నుకున్నవారికి జీవ-జంతుశాస్త్ర పరిచయం కలిగేలా ఒక తరగతి ఉండేది.  అలాగే జీవ-జంతు శాస్త్రం చదువుకునేవారికి లెక్కలు పరిచయం చేసేవారు.  కేంద్రీయ విద్యాలయాల్లో ‘సోషల్లీ యూజ్ఫుల్ ప్రొడక్టివ్ వర్క్’ (సమాజానికి ఉపయోగపడే ఉత్పాదక అంశాలు) అనే సబ్జెక్ట్ ఉండేది. అంటే సామాజిక అవసరాలకు అనుగుణంగా ఉండే విషయాలపై కొంత అవగాహన, ప్రయోగాత్మకంగా పరిచయం కల్పించేవారు. అవన్నీ ఏమైనాయో ఇప్పుడు?

తలపెడుతున్న సంస్కరణలలో భాగంగా ప్రభుత్వ, ప్రభుత్వేతర, గుర్తంపు పొందిన ప్రైవేట్ పాఠశాలలలో ప్రాథమిక పాథశాల స్థాయిలో, అంటే నర్సరీ నుంచి నూతన విద్యావిధానం సూచించినట్లు ఐదవ తరగతి వరకు పరీక్షావిధానాన్ని పూర్తిగా రద్దుచేయాలి.  విద్యార్థులకు వివిధ భాషలు, గణితశాస్త్రం, సైన్సు, పరిశుభ్రత, మంచి అలవాట్లు మొదలైనవి బోధించాలి.  పాఠ్యాంశాలు సరదాగా, ఆటపాటలతో, పదిమందితో కలసి పనిచేసే విధంగా ఉండాలి.  ఐదారు తరగతులలోకి వచ్చిన పిల్లలను బయటి ప్రపంచంతో పరిచయం ఏర్పడే విధంగా స్థానిక మార్కెట్లకీ, దుకాణాలకీ, వ్యవసాయ క్షేత్రాలకీ, రాబోయే రోజుల్లో జీవితాసరాలకు పనికొచ్చే ప్రదేశాలకూ తీసుకువెళ్లాలి.  లలిత కళలలో ప్రవేశం కలిగేలా చూడాలి. అలా చెయ్యడం వలన వారికి ప్రకృతి, ప్రజా జీవితం, తోటివారి గురించి అలోచించడం, సహాయపడటం మొదలైన విషయాలు బోధపడతాయి.  హోమ్ వర్కు సాధ్యమైనంత తక్కువ వుండాలి.  కంప్యూటర్ యుగంలో విద్యార్థులే స్వయంగా నేర్చుకునే ఈ రోజుల్లో హోమ్ వర్క్ కు కేటాయించే సమయాన్ని వారు కంప్యూటర్ మీద కూర్చుని నేర్చుకునే అవకాశం ఇవ్వాలి. నిజానికి అసలు హోమ్ వర్క్ లేకపోయినా ఫరవాలేదు.


మాధ్యమిక స్థాయికి వచ్చేటప్పటికీ (అంటే ఆరునుంచి తొమ్మిదవ తరగతి వరకు) పిల్లలకు వివిధ రకాలైన వృత్తి విద్యలతో పరిచయం కలిగించాలి. అంటే వడ్రంగిపని, చేనేత, టైలరింగు, భవననిర్మాణం, ఎలెక్ట్రీషియన్, మొదలైనవన్నమాట. దానివల్ల వారికి శ్రమ యొక్క విలువ తెలుస్తుంది.  వారంలో ఒక తరగతి నైతిక విలువలు నేర్పడం కోసం కేటాయించాలి.  ఇప్పటిలా పొద్దున్న 9 గంటలనుంచీ సాయంత్రం 5 గంటల దాకా తరగతి బోధనల పద్ధతికి స్వస్తి చెప్పాలి,  బోధన అన్నది కేవలం లంచ్ పూర్వం క్లాసులకే పరిమితం చేయాలి.  మధ్యాహ్న భోజన విరామం తరువాత ప్రయోగాత్మక విషయాలలో శిక్షణ ఇవ్వాలి. కంప్యూటర్ రంగంలో ప్రవేశం ఇక్కడే ప్రారంభం కావాలి. ఇలా చెయ్యడం వలన పదవతరగతి పాసై బయటికి వచ్చేసరికి పిల్లలకి పరిపక్వత వస్తుంది.  కొద్దిపాటి మార్గదర్శకత్వం ఉంటే తమకు అనువైన దారి ఎన్నుకోగలరు. భవిష్యత్ ప్రణాళికల గురించి ఆలోచించే సామర్థ్యం వారికి స్వయంగా వస్తుంది. తల్లితండ్రుల, గురువుల సలహాలతో, తమ స్వంత తెలివితేటలతో భవిష్యత్ ప్రణాలికను రూపొందించుకోగలరు.

ఇంటర్మీడియేట్ స్థాయికి వచ్చేసరికి మామూలుగా అలవాటైన ఎంపీసీ (గణిత శాస్త్రం, భౌతికశాస్త్రం, రసాయన శాస్త్రం కాంబినేషన్), బైపీసీ (జీవ-జంతుశాస్త్రం, భౌతికశాస్త్రం, రసాయన శాస్త్రం), సీఇసీ (పౌరశాస్త్రం, అర్థశాస్త్రం, వాణిజ్య శాస్త్రం), ఎంఇసీ (గణిత శాస్త్రం, అర్థశాస్త్రం, వాణిజ్య శాస్త్రం) మొదలైన మూసలో పోసిన కాంబినేషన్ విద్యలే కాకుండా విద్యార్థికి నచ్చిన విధంగా రకరకాల సబ్జెక్ట్లను మిళితం చేసుకునే సౌలభ్యం కూడా ఉండాలి.  చరిత్ర-జీవశాస్త్రం, గణితం-జీవశాస్త్రం, భౌగోళిక శాస్త్రం-రసాయన శాస్త్రం వంటి అరుదైన కలయికలు కూడా విద్యార్థులు కోరవచ్చు.  వ్యవసాయ శాస్త్రం, ఉద్యానవన శాస్త్రం, అటవీ శాస్త్రం, కృత్తిమ మేధస్సు, యంత్రాలపై పనిచేయడం మొదలైనవి కూడా పాఠ్యాంశాలుగా చేర్చవచ్చు. పాలిటెక్నిక్ డిప్లమోలను ఇంటర్మీడియేట్ తో అనుసంధానం చెయ్యాలి.  దీనివల్ల, అవసరమైన వారికి ఇంటెర్మీడియేట్ అవగానే పని సంపాదించే అర్హత వస్తుంది.

ఉన్నత విద్యలో భాగంగా, పరిశ్రమలకు, వ్యాపార వాణిజ్య అవసరాలకు, సాంప్రదాయ విద్యలకు పనికివచ్చే విషయాలు చేర్చాలి.  సామాజిక శాస్త్రం, ఆర్ట్స్ వంటి విషయాలు  ఏకకాలంలో నేర్చుకునే వెసలుబాటు ఉండాలి.  ఉదాహరణకి బిట్స్ పిలానీలొ చూడండి.  విద్యార్థి సాంకేతిక శాస్త్రాలతో పాటు సామాజిక శాస్త్రాలు, ఆర్ట్స్ మొదలైనవి నేర్చుకొనవచ్చు. అలాగే ఆర్ట్స్ చడువుకునే విద్యార్థి సైన్స్ నుంచి కూడా ఒక సబ్జెక్ట్ నేర్చుకోవచ్చు.  జీవశాస్త్ర విద్యార్థి ఎలెక్ట్రానిక్స్ లో నిష్ణాతుడై, చివరికి ఎలెక్ట్రానిక్ రంగంలో పరిశ్రమలు స్థాపించిన సందర్భాలూ లేకపోలేదు.

కళాశాలలనూ, విశ్వవిద్యాలయాలను పరిశ్రమలతో, వ్యాపార, వాణిజ్య సంస్థలతో అనుసంధానం చెయ్యాలి.  దానివలన భవిష్యత్తులో పరిశోధనారంగంలో అవకాశాల గురించి తెలుస్తుంది.  భారీ కంపెనీలూ, పరిశ్రమలూ, వ్యాపార, వాణిజ్య సంస్థలు కూడా సమాజంపట్ల తమ బాధ్యతగా కొంత వనరులను పరిశోధన వైపు మళ్లించాలి.

         ప్రపంచంలోని శాస్త్రీయ రంగంలో మనదేశానికి చెందిన వారు ఎంతోమంది ఉన్నారని ఘనంగా చెప్పుకుంటాము కానీ వారిలో  విషయ పరిజ్ఞానం లోతుగా ఉన్నవాళ్లు తక్కువ.  మన పరీక్షా విధానాలు, మార్కులు ఇచ్చే పద్ధతి, పరిశీలన, విద్యార్థి యొక్క సృజనాత్మతకు, సమస్యా పరిష్కారంలో నేర్పుకూ, కొత్త విషయాలు ఆవిష్కరించే శక్తికీ అద్దం పట్టేవిగా ఉండాలి.  సృజనాత్మక శక్తి కలవారిని, సమస్య ఏదైనా వాస్తవ పరిస్థితి గ్రహించి న్యాయం చేసే సామర్థ్యం కలవారినీ, వృత్తి పట్ల అంకితభావంతో పని చేసేవారినీ తీర్చిదిద్దేందుకు వీలుగా విద్యావిధానాన్ని పునరుద్ధరించాలి.  ప్రపంచంలోనే అధిక శాతం ఇంజనీర్లు మనదేశంలో ఉన్నా సాంకేతికపరమైన ఆవిష్కరణలు చేసే సామర్థ్యం ఉన్నవాళ్లు తక్కువ.  మన పట్టభద్రులూ, పోస్ట్ గ్రాడ్యుయేట్లూ (అందరూ కాకపోయినా కొందరైనా) కాల్ సెంటర్లలోనూ, ఎటువంటి ప్రాముఖ్యతా లేని చోట్లా పనిచేస్తున్నారు.  ఇది ఏమాత్రం అభిలషణీయం కాదు.

విద్యారంగలో నిష్ణాతులైన వారి అభిప్రాయం ప్రకారం, మన విద్యావిధానం వ్యవస్థాపకులను, సృజనాత్మకత కలవారినీ, కళాకారులను, శాస్త్రవేత్తలను, రచయితలనూ తయారుచేసే విధంగా మారినప్పుడే వారు దేశ ఆర్థిక వ్యవస్థకు గట్టి పునాది వెయ్యగలరు.  అంతేగాని, ఇప్పటిలా కేవలం కింది తరగతి ఉద్యోగులను మాత్రమే తయారుచేసే దేశంలా ఉండడం మన లక్ష్యం కాకూడదు. విధాన రూపకర్తలు బోధనాపద్ధతులలో నాణ్యత పెంచడం మీద దృష్టి పెట్టాలి.

విదార్థుల మేధస్సుకు మెరుగులు దిద్దే క్రమంలో వారి హృదయంలో, ఆలోచనావిధానంలో మంచి పరివర్తన వచ్చేలా చూడాలి.  మన దేశంలోని విద్యా విధానం తప్పు దారి పట్టిందంటే మనకున్న మానవ వనరులు సత్ఫలితాలను ఇవ్వకపోగా సమస్యగా మారిపోతాయి.  ముఖ్యంగా మన దేశం లాంటి దేశంలో నిరుద్యోగ యువతలో నిరాశ పెరిగితే వారు తీవ్రవాదులుగా, సంఘ విద్రోహక శక్తులుగా మారటానికి, మాదకద్రవ్యాలకు అలవాటు పడటానికీ అవకాశం ఎక్కువ.

ఏది ఏమైనప్పటికీ ఆదర్శవంతమైన అధ్యాపకులు మాత్రమే ఈ విద్యారంగ పునరుద్ధరణకు దోహదం చెయ్యగలరు.  కనుక అటువంటివారిని ఎన్నుకోవటం మీదే విద్యా వ్యవస్థ ఆధారపడి ఉంటుంది. 

మన తెలంగాణ ప్రాంత మహాకవి బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన శ్రీమహాభాగవతం ప్రారంభంలో ఆయన చేసిన సరస్వతీ స్తుతిలో పోతనగారు భారతీయ విద్యా వ్యవస్థలో (అలనాడు) ఉండే విశిష్టతను చూపించారు. “క్షోణితలంబు నెన్నుదురు సోకగ మ్రొక్కి నుతింతు.......శుక వారిజ పుస్తకరమ్య పాణికిన్” అన్న ఆ పద్యంలో నిగూఢమైన అర్థం ఉన్నది. బహుశా ఆయన చెప్పిన మాటలు అక్షర లక్షల విలువ చేస్తాయనడంలో అతిశయోక్తి లేదేమో!

సరస్వతీదేవి తన చేతుల్లో జపమాల, చిలుక, పద్మం, పుస్తకం ధరించి ఉంటుందని చెప్పారు పోతన. ఈ నాలుగూ మానవుడు తన జీవిత లక్ష్యాలుగా సాధించాల్సిన ధర్మార్థకామ మోక్షాలకు సంకేతాలు అని ఆయన అర్థం. పుస్తకం ధర్మానికీ, పద్మం అర్థానికీ, చిలుక కామ పురుషార్థానికీ, జపమాల మోక్ష పురుషార్థానికీ సంకేతాలు అవుతాయంటారు. ఎన్ని విద్యలు నేర్చినా, ఎంత పండితుడైనా పురుషార్థాలు సాధించకపోతే జీవితం వృధానే. ఈ విషయం గ్రహించిన మన ప్రాచీన విద్యావేత్తలు ఒకటవ తరగతి తెలుగు వాచకంలో అ-ఆ-ఇ-ఈ లు నేర్పడానికి అమ్మ, ఆవు, ఇల్లు, ఈశ్వరుడు, అనే నాలుగు మాటలు బొమ్మలతో సహా నేర్పేవారు. ఇవన్నీ జీవితంలో అవసరమైన మంచి చెడ్డలకు నిదర్శనాలు. ఆ రోజుల్లోలాగా మానవుడి జీవితాదర్శాన్ని విద్యాబోధనలో తెలియచేయాలి. భావి పౌరులు ఆదర్శవంతులుగా తీర్చి దిద్దే విద్యాబోధన ఎంతైనా అవసరం. 

(లంక నాగరాజు సహకారంతో)

శ్రీ మహాభాగవతము, షష్ఠమ స్కందం:వనం జ్వాలా నరసింహారావు

మహాకవి బమ్మెర పోతనామాత్య ప్రణీత

(రామకృష్ణ మఠం, హైదరాబాద్ ప్రచురణ)

శ్రీ మహాభాగవతము, షష్ఠమ స్కందం

భగవదనుగ్రహంతో చదవడం పూర్తయింది

వనం జ్వాలా నరసింహారావు

          కంII    చదివెడిది భాగవతమిది,

                   చదివించును కృష్ణు, డమృతఝరి పోతనయున్

                   చదివినను ముక్తి కలుగును

                   చదివెద నిర్విఘ్నరీతి ‘జ్వాలా మతినై

శ్రీ మహాభాగవతం అనే ఈ మహా పురాణాన్ని సహజ పాండిత్యుడు, బమ్మెర పోతనామాత్యుడు రచించాడు. షష్ఠమ స్కందాన్ని సింగయ కవి తెనిగించాడు. డాక్టర్ విశ్వనాథం సత్యనారాయణమూర్తి గారు అనువదించారు. 168 పేజీల ఈ షష్ఠమ స్కందం లో కవి ప్రత్యేకంగా ఈ స్కందానికి రాసిన ఉపోద్ఘాతం నుండి మరుద్గణముల జననం వరకు 19 అంశాలున్నాయి. క్లుప్తంగా ఆ 19 అంశాల వివరమైన వివరాలు:

సింగయ కవి ఉపోద్ఘాతం, కృతిపతి నిర్ణయం, గ్రంథకర్త వంశ వర్ణన, షష్ట్యంతాలు, కథా ప్రారంభం, అజామీళోపాఖ్యానం, ప్రచేతసులను చంద్రుడు శాంతింప చేయడం, దక్షుడి జననం, సకల జీవరాశుల సృష్టి, దక్షుడు శ్రీహరిని గూర్చి తపస్సు చేయడం, అతడికి పరమేశ్వరుడు ప్రత్యక్షం కావడం, దక్షుడు చేసిన హంసగుహ్యం అనే సప్తరాజం, హర్యశ్వశబళాశ్వుల పుట్టుక, వారు నారదుడి వల్ల ఆకర్షితులై ఆయన మాటల ప్రకారం ప్రవర్తించి మోక్షం పొందడం, ఆ వృత్తాంతాన్ని నారదుడి వల్ల విన్న దక్షుడు శోకించడం, అనంతరం బ్రహ్మ వరంతో దక్షుడు శబళాశ్వులానే వేయిమంది పుత్రులను కనడం ఉన్నాయి.

ఇంకా: సృష్టి చేయాలనే కోరికతో దక్షుడి ఆజ్ఞానుసారం వారు తమ అన్నలు సిద్ధిపొందిన నారాయణ సరస్సుకు పోవడం, నారదుడు శబాలాశ్వులకు నివృత్తి మార్గాన్ని (వైరాగ్యాన్ని, బ్రహ్మజ్ఞానాన్ని) ఉపదేశించడం, వారు తమ అగ్రజుల అడుగు జాడల్లో నడచి మోక్షాన్ని పొందడం, ఈ విషయాన్ని దివ్యజ్ఞానం వల్ల తెలుసుకున్న దక్షుడు నారదుడిని శపించి ప్రజాసర్గం చేయడం, నారద మహర్షి దక్షుడి శాపాన్ని స్వీకరించడం, బ్రహ్మ వరం వల్ల సృష్టిని విస్తరించడానికి దక్షుడికి అరవై మంది కూతుళ్లు పుట్టడం, వారిలో కశ్యప ప్రజాపతికి  ఇచ్చిన పదముగ్గురు కూతుళ్ల సంతానం వల్ల సకల లోకాలు నిండడం, దేవతలు-రాక్షసులు-మృగాలు-పక్షులు మొదలైన వాటి జన్మము ఉన్నాయి.


ఇంకా: దేవేంద్రుడి తిరస్కారం సహించలేక బృహస్పతి అదృశ్యం కావడం, బృహస్పతి ఇంద్రాదులను తిరస్కరించడం, ఆ వృత్తాంతాన్ని రాక్షసులు విని శుక్రుడి ప్రేరణ వల్ల దేవతలమీడికి యుద్ధానికి పోవడం, దేవాసుర యుద్ధం ఆరంభం, గురు తిరస్కార ఫలంగా సురేంద్రుడు పరాజితుడై పారిపోవడం, దేవతలు బ్రహ్మ దగ్గరకు వెళ్లడం, బ్రహ్మ మాట ప్రకారం త్వష్ట కుమారుడైన విశ్వరూపుడిని గురుదేవుడుగా దేవతలు వరించడం, శ్రీమన్నారాయణ కవచం, విశ్వరూపుడి దయవల్ల ఇంద్రుడు “శ్రీమన్నారాయణ కవచం” ఆనే మంత్రాన్ని ధరించి రాక్షసులను జయించడం, పరోక్షంగా రాక్షసులకు అనుకూలుడైన విశ్వరూపుడిని ఇంద్రుడు వధించడం, విశ్వరూపుడిని చంపడం వల్ల ఇంద్రుడికి బ్రహ్మ హత్యాదోషం సంప్రాప్తించడం, ఆ పాపాన్ని దేవేంద్రుడు స్త్రీ-భూ-జల-వృక్షాలకు పంచి పెట్టడం ఉన్నాయి.

ఇవి కాక: విశ్వరూపుడిని చంపినందుకు త్వష్ట కోపించి ఇంద్రుడిని చంపడానికి మారణహోమం చేయడం, వృత్రాసురుడి జననం, వృత్రాసుర వృత్తాంతం, వృత్రాసురుడి చేతిలో ఓడిన దేవతలు ఇంద్రుడితో కలిసి శ్వేతదీపానికి పోవడం, శ్రీహరి దయ తలచి దధీచి మహర్షిని ప్రార్థించి ఆయన వల్ల వజ్రాయుధాన్ని తీసుకోమని దేవతలకు-ఇంద్రుడికి చెప్పడం, ఇంద్రుడు వజ్రాయుధం సంపాదించి దానితో వృత్రాసురుడిని సంహరించడం, ఇంద్రుడు మళ్లీ బ్రహ్మ హత్యా పీడితుడై మానస సరస్సులో ప్రవేశించడం, నహుషుడు నూరు అశ్వమేధ యజ్ఞాలు చేసి ఇంద్రపదవి పొందడం, అగస్త్యుడి శాపంతో నహుషుడు కొండ చిలువగా మారడం, ఇంద్రుడు స్వర్గంలో ప్రవేశించి అశ్వమేధ యాగం చేసి మళ్లీ త్రిలోకాధిపత్యాన్ని అందుకోవడం, చిత్రకేతూపాఖ్యానం, చిత్రకేతుడి తపస్సు-నారాయణుడి ఆగ్రహం, చిత్రకేతుడిని పార్వతీదేవి శపించడం, సవిత్రు వంశ ప్రవచనాది కథ, మరుద్గణాల జననం ఈ షష్ఠమ స్కందంలో ఉన్నాయి.   

షష్ఠమ స్కందంలో అత్యంత ప్రాముఖ్యమైనది శ్రీమన్నారాయణ కవచం గురించిన అంశం. మునినాధుడైన విశ్వరూపుడు ఇంద్రుడికి తెలియచేసిన నారాయణ కవచం విజయాలను చేకూర్చేది. ఊహకు అందని ప్రభావాన్ని కలిగించేది. మహా ఫలవంతమైనది, గోప్యమైనది. శ్రీహరి మాయా విశేషంతో కూడినది. దాన్ని పరీక్షిత్తుకు వినిపించిన శుక మహర్షి దాని మహాత్మ్యాన్ని గురించి చెప్తూ: ఎవరైనా పరిశుద్ధ అంతఃకరణతో అను నిత్యం దీన్ని చదువుతారో వారు అతి క్లిష్టమైన సంకటాల నుండి, గ్రహ దోషాల నుండి, కర్మ ఫలం నుండి, దుష్కర్మల నుండి విడుదలై వ్యాకులత్వం లేని మనస్సుతో సుఖంగా ఉంటారనీ, ఏ రోగం రాకుండా ఆరోగ్యంగా ఉంటారనీ అన్నాడు.

ఇవన్నీ చదవగలగడం నా పూర్వజన్మ సుకృతం.  

‘అత్తా ఒకింటి కోడలే’ బొమ్మల కథ.....స్వర్గీయ కేబీ తిలక్ జ్ఞాపకాలు-అనుభవాలు : వనం జ్వాలా నరసింహారావు

‘అత్తా ఒకింటి కోడలే’ బొమ్మల కథ

బాపు ఆర్ట్ గ్యాలరీలో చోటు చేసుకుంటున్న అనుపమ చిత్రం

స్వర్గీయ కేబీ తిలక్ జ్ఞాపకాలు-అనుభవాలు

వనం జ్వాలా నరసింహారావు

ప్రజాతంత్ర, సంపూర్ణ స్వతంత్ర వారపత్రిక

(అక్టోబర్ 1 - 7, 2000)

         'ముద్దుబిడ్డ' తర్వాత సెంటిమెంట్ కన్నా సమస్యాత్మక ప్రాధాన్యత కల చిత్రాలనే నిర్మించాలన్న ఆశయంతో తీసిన ఎమ్మెల్యే సినిమాకు అపురూపమైన ఆదరణ ప్రజాభిమానం లభించిందన్న తృప్తి కలిగినా, మహిళా ప్రేక్షకులను అంతగా ఆకర్షించలేదన్న అసంతృప్తి కూడా మిగిలి పోయింది. ఆ భావనతో,  స్త్రీల నుండి ఎక్కువ ఆదరణ లభించే రీతిలో, వాస్తవానికి చేరువగా వుండే, కుటుంబ పరమైన ఓ సమస్యాత్మక చిత్రాన్ని నిర్మించాలనుకోవటం, పర్యవసానంగా తన దర్శకత్వంలోనే అత్తా ఒకింటి కోడలే  అనే మరో సమస్యాత్మక చిత్రాన్ని తీయటం జరిగిందని చెప్పారు తిలక్.  

         ఈ సినిమాలో ఓ అత్తా - ఆ అత్తకో అత్త, అత్తకో కోడలు, ఆ కోడలుకో కోడలు, ఇలా అత్తా కోడలు, వారి సంవాదం ఇతివృత్తంగా వుంటుంది. ఈ లాంటి సినిమా తీయటానికి మరో బలవత్తరమైన కారణం - సంఘటన కూడా వుంది. అదే  బరంపురం కొల్లాడి  అనే ఒక ఒరియా రచయిత వ్రాసిన నాటకంలోని ఓ సీన్. దాన్ని ' బేస్' గా తీసుకుని నిర్మించిందే ఈ చిత్రం. ఒక గుడిలో ఇద్దరాడవాళ్లు పోట్లాడుకుంటుంటారు. వాళ్లను విడదీసే ప్రయత్నం చేస్తారు. అక్కడనే వున్న మరో ఇద్దరు-ఓ యువతి, మరో పెద్దావిడ. ఇంతకూ పోట్లాడుకుంటున్నది ఆత్తా-కోడలు అని తెలుసుకుని ఆశ్చర్యపోతారు ఈ మధ్యవర్తులు. బుద్దుందా లేదా, అత్తా కోడలు అంటే తల్లీ కూతుళ్లవలె వుండాలి కాని, ఇలా తగవులాడుకుంటారా అని మందలించుతారు నీతులు చెప్తారు. ఆ సందర్భంలోనే, ఎందుకు తామిద్దరం అత్తా కోడలు కాకూడదని అనుకుంటారు. చివరకు అలానే కావటం, వారూ అందరివలెనే కలిసి మెలిసి వుండలేకపోవటం ఆ నాటకంలోని ఇతివృత్తం. అదే ' అత్తా ఒకింటి కోడలే సినిమాకు స్ఫూర్తినిచ్చిన సంఘటన.

         చిత్రం ఇతివృత్తం, నటీ నటవర్గం, నిర్మాణ - దర్శకత్వం లాంటి వాటికన్నా, ఈ చిత్రానికి సంబంధించినంత వరకు, తిలక్ అత్యంత ప్రాధాన్యతను ఇచ్చింది, సమష్టి కృషిలో ఆరుద్ర ద్విపద రచనకు బాపు వేసిన బొమ్మల కథతో వెలువడిన ప్రచార కార్టూన్లు. ఆదో నూతన ఒరవడి!

         హైదరాబాద్ లో నిర్వహించిన ఒక పుస్తకావిష్కరణ సభలో తిలక్ గారు తన పాత మిత్రులు ముళ్లపూడి వెంకటరమణ గారిని, రామచంద్ర రావు గారిని కలవటం జరిగింది. రమణ గారిని గురించి అందరికీ తెలుసు, రామచంద్ర రావుగా మేటి టెన్నిస్ క్రీడాకారుడు భూపతికి కజిన్ - ఆయన లాగే గొప్ప టెన్నీస్ ప్లేయర్. పి పుల్లయ్య గారి సమీప బంధువు. పాటలంటే అమితంగా ఇష్టపడే ఆయన ఇంట్లో అపురూపమైన రికార్డులెన్నో వున్నాయి. ముగ్గురూ సభానంతరం, రామచంద్ర రావు గారింటికి వెళ్లారు. దారిలో రమణ గారు చెప్పిన విషయాలకు సంతోషం గర్వం కలిగించాయి తిలక్ కు.

         ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోటి రూపాయల ఖర్చుతో హైదరాబాద్ మాదాపూర్ ప్రాంతంలో, శిల్పారామం ప్రక్కన స్థాపించతలపెట్టిన బాపు ఆర్ట్ గ్యాలరీ లో ఎంపిక చేయబడిన అపురూపమైన కళాఖండాలు శాశ్వతంగా ప్రదర్శించబడతాయి. అందులో చోటుచేసుకోనున్న అత్యంత ప్రాధాన్యతగల వాటిలో 'అనుపమ చిత్రం-అత్తా ఒకింటి కోడలే – బొమ్మలకథ’ ఒకటి. దాని తాలూకు కాపీ ఇస్తానని కూడా అన్నారు రమణ గారు. అది విన్న తిలక్ ఎంతో ఆనందంతో అలనాటి, దానికి సంబంధించిన విషయాలను వివరంగా చెప్పారు. రమణ గారు ఇచ్చేటంత వరకు ఆగకుండా మిత్రుడు, ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్న శ్రీ ఆర్ వి వి కృష్ణారావు గారిని అడిగి, ఆయన దగ్గరనున్న బాపు - రమణల పుస్తకం తెచ్చి, అందులోని బొమ్మలకథ  కాపీలను తీసుకున్నారు.


         ఎప్పుడూ, ఏ సినిమాకు, ఎవరూ చేయనిరీతిలో పబ్లిసిటీ చేయాలన్న ఆలోచన కలిగింది తిలక్ గారికి.  సినిమా కథ ఆసాంతం, లోగడ ఎవరో రామాయణం కావ్యాన్ని వ్రాసిన విధంగా,  'ద్విపద'లో వ్రాయించి మంచి కార్టూన్లను వేయించి పబ్లిసిటీ ఇవ్వాలని అనుకున్నారు. ‘క్రియేటివిటీ' అనేది ఓ సృష్టి కార్యంలాంటిదనీ, అదెప్పుడూ సమాజ పరంగా ఉపయోగపడేదిగా వుండాలని, అలాంటి అవకాశాలు కూడా రావాలని తిలక్ భావన. అదే జరిగింది. 'తిలక్-ఆరుద్ర-బాపు-రమణ’ల కాంబినేషన్లో. రమణ గారు అప్పుడు ఆంధ్రపత్రికలో పనిచేస్తున్నారు. ఆరుద్రగారు వ్రాసిన సినిమా 'ద్విపద'కు అనుగుణంగా బొమ్మలు వేస్తే బాగుంటుందని రమణ సూచించారు. బొమ్మలు వేసేటందుకు ఆయన మిత్రుడు, అప్పట్లో ‘వాటర్ థామ్సన్' కంపెనీలో పనిచేస్తున్న బాపు గారిని రప్పించారు. నలుగురూ కల్సి సినిమా వీక్షించారు. చూస్తూ చూస్తూనే బాపుగారు ఓ కాగితంపై గబ గబా, రమణారెడ్డి, ఇతర నటుల బొమ్మలు గీసి చూపించారు. అవన్నీ ఎంతగానో నచ్చాయి. అందరికీ. అందరినీ మించి తిలక్ గారికి.

         వెంటనే ఆరుద్ర రచనతో బాపు బొమ్మలతో రూపుదిద్దుకొంది అనుపమ చిత్రం 'అత్తా ఒకింటి కోడలే’ బొమ్మల కథ. దాన్ని ఆంధ్రపత్రికలో, ఓ మళయాళీ మేనేజర్ సహాయంతో డబుల్ కలర్ లో ముద్రించారు, పంచిపెట్టారు. ఆంధ్రపత్రికలో కూడ వేయించారు. అలానే వారం వారం, పబ్లిసిటీలో భాగంగా, ఆరుద్ర గారు సామెతలు వ్రాయటం, ‘అత్తింటి కాపురం, కత్తిమీదసాము' లాంటివి, వాటికి బాపు ఇల్లస్ట్రేషన్ వేయటం జరుగుతుండేది.

         ఆ తర్వాత కాలంలో, అప్పటికే మంచి ఆర్టిస్ట్ గా పేరు తెచ్చుకున్న బాపు-రమణలు సినీ పరిశ్రమలో కూడా ఖ్యాతి తెచ్చుకున్నారు. కాకపోతే సినీ పరిశ్రమకు పరిచయమయింది 'అత్తా ఒకింటి కోడలే’ బొమ్మల కథా ద్వారానే. ఏదేమైనా బాపుకు సినీ పరిశ్రమ ఉపయోగపడింది. పరిశ్రమకు బాపు మరింత ఉపయోగపడ్డారు.

         అప్పటి నుండి బాపు-రమణల కాంబినేషన్ ఆరంభమైందనటంలో అతిశయోక్తి లేదు. మిత్రుడు ఆర్ వి వి కృష్ణారావు గారి సౌజన్యంతో లభించిన ఆ బొమ్మల కథ కాపీని యధాతథంగా ఫోటోలలో చూడవచ్చు.

(మరిన్ని విశేషాలు మరోసారి)

Thursday, July 30, 2020

సీతానసూయ సంవాదం : వనం జ్వాలా నరసింహారావు

సీతానసూయ సంవాదం

వనం జ్వాలా నరసింహారావు

ఆంధ్రప్రభ, చింతన (30 & 31-07-2020)

చిత్రకూటం దగ్గర వున్న శ్రీరాముడికి, భరతుడు వచ్చి దుఃఖపడిన విషయం పదే-పదే గుర్తుకు రాసాగాయి. మనసు అన్యాక్రాంతం అవుతున్నందున ఇక అక్కడ వుండడం వనవాసానికి ఏమాత్రం మంచిది కాదనుకుంటాడు. వెంటనే, సీతారామలక్ష్మణులు ముగ్గురూ బయల్దేరి అత్రి మహామిని ఆశ్రమానికి చేరుకుంటారు. ఆయన తన భార్య, పరమ పతివ్రత అనసూయాదేవిని సీతాదేవికి పరిచయం చేశాడు.

         పరిచయం చేస్తూ అత్రి మహాముని సీతాదేవిని చూపిస్తూ అనసూయతో, “ఈ పతివ్రతా శిరోమణి భూదేవి కూతురు. ఈమెను నువ్వు గౌరవించు” అని చెప్పాడు. తరువాత అనసూయాదేవి గొప్పతనాన్ని అత్రి శ్రీరాముడితో ఇలా చెప్పాడు: “చినుకనేది కురవకుండా మనుష్యులు ఇతర జీవికోటులు మాడిపోతే, తన తపస్సుతో ఫలాలను, కందమూలాలను పది సంవత్సరాలుండేలా చేసింది. గంగానది ప్రవహించేదిగా చేసింది. పదివేల సంవత్సరాలు భర్త అనుమతితో విఘ్నం లేకుండా తీవ్ర నిష్ఠపూని తపస్సు చేసింది. దేవకార్యం నిర్వహించడానికి ఆమె పది దినాలు ఒక రాత్రిగా సూర్యోదయం అనేది లేకుండా చేసింది. వ్రతాలన్నీ సొంతం చేసి స్నాతక కర్మ జరిపింది. నువ్వు నీతల్లిలాగా ఈమెను పూజించు. నీపూజకు ఈమె యోగ్యురాలు. ఈమె సమస్త భూతాల నమస్కారాలకు యోగ్యురాలు. స్త్రీ ధర్మమైన పాతివ్రత్యానికి సంబంధించి ఇతరులకు సాధ్యంకాని కార్యాలు చేయడం వల్ల అసూయపడరానిదని కీర్తి పొందింది. నువ్వు సీతాదేవిని ఈమెకు నమస్కారం చేయమని చెప్పు”. అని అత్రిమహాముని చెప్పగా శ్రీరామచంద్రమూర్తి సీతాదేవిని చూసి మునీంద్రుడు చెప్పినట్లు అనసూయను దర్శించమని చెప్పి అలా చేస్తే ఆమెకు మేలు కలుగుతుందని అంటాడు.

          భర్త చెప్పినట్లే సీతాదేవి పోయి, వృద్ధురాలైన అనసూయను చూసింది. ఆమెను చూడగానే, పతివ్రతా ధర్మం ఈ రూపంలో వచ్చిందని అనే విధంగా వుందని అనిపించింది సీతకు. తన పేరు చెప్పి నమస్కారం చేసి రెండు చేతులు జోడించి నిలువబడి కుశలం అడిగింది అనసూయను. నిర్మలమైన మనసున్న అనసూయాదేవి సంతోషంతో ధర్మాత్మురాలైన సీతతో, “సీతా! నువ్వెంత పుణ్యచరిత్రవే! పాతివ్రత్యమే గొప్పదిగా భావించి చుట్టాలను, సంపదను, సౌఖ్యాన్ని వదిలి, మహారూజు కోడలినని కాని, మహారాజు కూతురునని కాని లక్ష్యపెట్టకుండా, తండ్రిని యదార్థవాదిని చేయాలన్న ఉద్దేశంతో అడవికి వస్తున్న భర్తతో  వచ్చావు. ఇలాంటి స్త్రీలు కూడా లోకంలో వుంటారా? పతివ్రతైన స్త్రీకి, భర్త ఎలాంటివాడైనా అతడే ఆమె పాలిటి దైవం. మగడి కంటే గొప్ప చుట్టం స్త్రీకి ఎవరూ లేరు. కుల ధర్మం పాటిస్తూ, మంచి పనులు చేసే పతివ్రతా రత్నానికి ఆమె ఇంకేమీ చేయకపోయినా, ధర్మాలన్నీ చేసినవారికి లభించే స్వర్గం లభిస్తుంది” అని చెప్పింది.

         అసూయలేని అనసూయ చెప్పిన మాటలు విని తన మీద ఎంతో ప్రేమ వుండబట్టే ఇలా హితం బోధించిందని సీతాదేవి సంతోషించింది. అనసూయతో ఇలా అంది.

          సీత అనసూయతో, “తల్లీ! నీ లాంటి పతివ్రత ఇలా చెప్పడం వింతకాదు. పతివ్రతలకు భర్తే దైవం అనే విషయం నాకూ తెలుసు. ధర్మం మీదే బుద్ధి నిలిపి, తల్లిలాగా, తండ్రిలాగా మేలెంచేవాడైన శ్రీరామచంద్రమూర్తి నాకు భర్త అయినప్పుడు సేవించడంలో ఆశ్చర్యం ఏముంది? నన్ను తప్ప మిగిలిన రాజస్త్రీలందరినీ ఆయన కౌసల్యను చూసినట్లు చూస్తాడు. వీరు తల్లుల లాంటి వారని సమదృష్టితో చూస్తాడు. నేను నా భర్తతో అడవులకు వచ్చేటప్పుడు నా అత్తగారు, పెళ్లి చేసుకున్నప్పుడు మా తల్లి, పాతివ్రత్యాన్ని గురించి చాలా మాటలు చెప్పారు.అవన్నీ మనసులో నాటుకున్నాయి. కాని పాతబడ్డాయి. ఇప్పుడు నువ్వు వాటిని కొత్తగా మనసుకు నచ్చేట్లు చెప్పి బలపర్చావు. తల్లీ! నా అభిప్రాయంలో స్త్రీలకు పతి శుశ్రూష తప్ప వేరే తపస్సు అక్కరలేదు”.

         ఆ మాటలకు అనసూయ సంతోషించి సీతను దగ్గరకు తీసుకుని శిరస్సు వాసనచూసి ఇలా అంది: “అమ్మా! ఇంపైన నీ మాటలతో నాకు చాలా సంతోషం కలిగింది. నీకేం కావాలో కోరుకో. నా తపోబలం వల్ల నీకు అది కలిగిస్తా”. అనసూయ మాటలకు ఆశ్చర్యపడ్డ సీత ఆమె తనను పరీక్షిస్తున్నదనుకుని, ఆమె దయవల్ల తనకే కొరత లేదనీ, తానేం కోరాలింకా అని అంటుంది.


సీతాదేవి అన్న మాటలకు అనసూయ ప్రీతి చెందింది. “ఈ పూల దండలు, ఈ వస్త్రం, ఈ సొమ్ములు, ఈ మైపూతలు, ఈ పరిమళ ద్రవ్యాలు అన్నీ దేవతా సంబంధమైనవే. భూలోకవాసులకు లభించవు. మనసుకు సంతోషం కలిగిస్తాయి ఇవన్నీ. ఈ పూలదండలు వాడిపోవు, వీడిపోవు, వాసన పోదు. నీకివి అందంగా వుంటాయి. వీటిని నువ్వు ధరిస్తే ప్రకాశిస్తూ, పూర్ణకాంతితో, మనోహర దేహంతో, లక్ష్మీదేవి విష్ణువును సంతోషపెట్టినట్లు సంతోషపెట్తావు” అని ప్రేమతో అనసూయ ఇవ్వగా, సీతాదేవి సంతోషించి, వాటిని తీసుకుని, నిర్మలమైన భక్తితో ఆ ముని భార్యకు కృతజ్ఞతా సూచకంగా నమస్కారం చేసి ఆమె పక్కన కూచుంది. ఇలా తన పక్కన కూచున్న సీతతో అనసూయ సరదాగా కబుర్లాడుతూ ఇలా అంది.

         “నిన్ను రామచంద్రమూర్తి తన పరాక్రమంతో స్వయంవరంలో పెళ్లి చేసుకున్నాడని మాటమాత్రంగా వినడమే కాని, అదెలా జరిగిందో వివరంగా వినలేదు. అ కథ వినాలని వుంది. జరిగినదంతా వివరంగా చెప్పు” అని అనసూయ అడిగింది.

జవాబుగా సీతాదేవి, “అమ్మా! చెప్తా విను. నా తండ్రి జనకుడు క్షాత్ర ధర్మం అంటే ప్రీతికలవాడు. విదేహ దేశానికి రాజు. ఒకనాడు యజ్ఞం చేయడానికి నేల దున్నిస్తుంటే నాగేటి కర్రు తగిలి నేల పెళ్లలు లేచివచ్చి నేను భూమిలోనుండి బయటకు వచ్చా. అప్పుడు ధాన్యం చల్లడానికి పిడికిట్లో గింజలు వుంచుకున్న జనకుడు నన్ను చూసి ఆశ్చర్యపడి తన కన్నకూతురులాగా నన్ను ఆయన తన కుడి తొడమీద కూర్చుండబెట్టుకుని తన కూతురని చెప్పాడు. ఆకాశవాణి కూడా నేను ఆయన కూతురునే అంది. ఆకాశవాణి మాటలకు సంతోషించిన జనకుడు నన్ను తన పెద్ద భార్యకు ఇచ్చాడు. ఆమె నన్ను తన కన్నబిడ్డలాగా చూసుకుంది. పెంచింది. నాకు వివాహయోగ్య దశ రావడం గమనించిన తల్లిదండ్రులు ఆ దిశగా ఆలోచన చేయసాగారు. ఈ కన్య ఇలాంటి గొప్ప గుణాలు కలది కదా! దీనికి తగిన వాడిని, సద్గుణ సంపత్తికలవాడిని, గొప్పవాడిని, ఏవిధంగా భర్తగా సంపాదించగలనని జనకుడు విచార సముద్రంలో మునిగిపోయాడు. తల్లిగర్భంలో పుట్టని సుందరినైన నాకు, దేవకన్యలాంటి నాకు, తగినవాడిని, మన్మథాకారుడిని, సమానుడైన వాడిని సంపాదించాలని వెతికాడు కాని ఎవరూ దొరకలేదు. అప్పుడు స్వయంవరం చాటిస్తే బాగుంటుందని ఆలోచనచేశాడు”.

“ఈ ప్రకారం ఆలోచించి, తాను చేసిన ఒక గొప్ప యజ్ఞంలో వరుణుడు తనకు ఇచ్చిన మనుష్యులు కదిలించ సాధ్యపడని వింటిని, రాజులు కలలో కూడా ఎక్కుపెట్టలేని వింటిని, అక్షయబాణాలను, తాను పిలిపించిన రాజులందరికీ చూపించాడు. ఆ విల్లెక్కుపెట్టిన వాడు తన కూతురుకు భర్త కాగలడని ప్రకటించాడు. అక్కడికి వచ్చిన రాజులు దానిని ఎత్తలేక, చూడగానే భయపడి, దానికి ఒక నమస్కారం చేసి పోయారు. చాలాకాలం ఇలాగే గడిచి పోయింది. రాజకుమారులెవరూ దానిని ఎక్కుపెట్టలేక పోయారు”.

“అప్పుడు విశ్వామిత్రుడు మా తండ్రి చేసే యజ్ఞం చూడడానికి రామలక్ష్మణులను తీసుకొచ్చాడు. మా తండ్రికి, మన్మథులలాగా వున్న సుకుమారులైన వారిద్దరినీ, దశరథరాజ పుత్రులను పరిచయం చేశాడు. చేసి, ఆయన దాచిపెట్టిన వింటిని శ్రీరామచంద్రమూర్తికి చూపించమని అన్నాడు. జనకుడలాగే చేశాడు. విశ్వామిత్రుడి మాట ప్రకారం శ్రీరాముడు వింటిని సమీపించాడు. ఆ వింటిని శ్రీరాముడు అనాయాసంగా ఎక్కుపెట్టి, అల్లెతాడు గట్టిగాపట్టి లాగగా చూసేవారు భయపడేట్లు, పిడుగుపడ్డ ధ్వనితో అది రెండుగా విరిగింది. విల్లు ఎక్కుపెట్టిన-విరిచిన వారికి తన కూతురును ఇచ్చి వివాహం చేస్తానని ప్రతిజ్ఞచేసిన మా తండ్రి తన మాట ప్రకారం శ్రీరామచంద్రమూర్తికి నన్ను కన్యాదానం చేయడానికి జలపాత్ర చేతిలో తీసుకున్నాడు. కాని తమ తండ్రి అభిప్రాయం తెలుసుకోవాలని చెప్పి శ్రీరాముడు దానం తీసుకోలేదు. అప్పుడు మా తండ్రి దశరథ మహారాజు దగ్గరకు దూతలను పంపాడు. మా తండ్రి ఆహ్వానాన్ని ఆదరించి దశరథమహారాజు వచ్చాడు. శ్రీరామచంద్రుడికి నన్ను, నా చెల్లెలు ఊర్మిళను లక్ష్మణుడికి దానం చేశాడు జనకుడు. ఈ విధంగా నేను శ్రీరామచంద్రమూర్తిని వివాహం చేసుకున్నా”.

         సీతాదేవి ఇలా చెప్పగా విన్న అనసూయాదేవి ఇలా అంది: “సీతాదేవీ, మధురంగా నీ స్వయంవర చరిత్ర చెప్పావు. సీతమ్మా! రాత్రి సంచరించే జంతువులు తిరగడం మొదలుపెట్టాయి. తపస్వులు, సాదుకునే జింకలతో శయనించారు. చూశావా? రాత్రి చాలా గడిచింది. చంద్రముఖీ! ఆకాశం నక్షత్రసమూహంతో ప్రకాశిస్తున్నది. వెన్నెల ముసుగేస్తుంటే చంద్రుడు ఉదయించాడు. అదిగో చూడు. ఇక నువ్వు శ్రీరామచంద్రమూర్తి దగ్గరకు పో. నిన్ను చూడడం వల్ల, నీతో మాట్లాడడం వల్ల నాకెంతో సంతోషం కలిగింది. నేను నీకిచ్చిన చీరెలు, సొమ్ములు, వాసన ద్రవ్యాలు నా ఎదుట ధరిస్తే సంతోషిస్తా”.

సీత అలాగే చేసి అనసూయకు నమస్కారం పెట్టి శ్రీరామచంద్రమూర్తి దగ్గరకు పోయింది. ఆయన సీతను చూసి సంతోషించాడు. అనసూయతొ తనకు జరిగిన సంభాషణ అంతా చెప్పి ముని భార్య తనకు చీరె, పూల దండలు, సువాసన ద్రవ్యాలు ఇచ్చిన విషయం చెప్పింది. మనుష్యులకు లభించని బహుమానాలను చూసి శ్రీరామలక్ష్మణులు సంతోషించారు. ఆ రాత్రి నిద్రపోయి సూర్యుడు ఉదయించగానే లేచి, సంధ్యావందనం లాంటి ప్రాతఃకాల కృత్యాలను తీర్చుకుని, మునీశ్వరుల దీవెనలు తీసుకుని సీతారామలక్ష్మణులు ప్రయాణమయ్యారు.

(వాసుదాసుగారి ఆంధ్రవాల్మీకి రామాయణం మందరం ఆధారంగా)