Thursday, July 16, 2020

అనంతం....అపూర్వం : వనం జ్వాలా నరసింహారావు


అనంతం....అపూర్వం
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రజ్యోతి నవ్య, నివేదన కాలమ్ (17-07-2020)
తిరుమల వేంకటేశ్వరుని కన్నా సంపన్నుడు అనంత పద్మనాభుడు. కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురం పేరు కూడా ఆ స్వామి నామధేయం మీదనే వచ్చింది. ‘తిరు-అనంత-పురం’ అంటే, ‘అనంత పద్మనాభ స్వామి నిలయమైన పవిత్ర స్థలం’ అని అర్థం. కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో కొలువైన అనంత పద్మనాభస్వామి ఆలయం  నిర్వహణ హక్కులపై ట్రావన్‌కోర్‌ రాజకుటుంబానికి అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఈ ఆలయం మరోసారి చర్చలలోకి వచ్చింది.
వైష్ణవుల ఆరాధ్యదైవం పద్మనాభుడు. పౌరాణిక విశిష్టత సంతరించుకున్న, చారిత్రక నేపథ్యం కలిగిన సుప్రసిద్ధ వైష్ణవ క్షేత్రం తిరువనంతపురం. శ్రీమహావిష్ణువు యోగనిద్రా మూర్తిగా దర్శనం ఇచ్చే ఆ ఆలయం అపురూప శిల్పకళకు నిలయం. శ్రీమహావిష్ణువు కొలువైన 108 పవిత్ర క్షేత్రాల్లో అనంత పద్మనాభ క్షేత్రం ఒకటి. ‘పద్మనాభ’ అంటే పద్మం ఆకారంలో ఉన్న నాభి కలిగిన వాడని అర్థం. యోగ నిద్రామూర్తిగా శయనించి ఉండగా, నాభి నుంచి వచ్చిన కమలంలో బ్రహ్మ ఆసీనుడై ఉన్న అనంత పద్మనాభ స్వామి దివ్య మంగళ రూపం భక్తులకు నయనానందం కలిగిస్తుంది. శేషుడు మీద శయనించిన శ్రీ మహావిష్ణువు చేతి కింద శివ లింగం కూడా ఉంటుంది. ఈ విధంగా ఈ ఆలయం త్రిమూర్తులకు నిలయం. గర్భగుడిలో మూలవిరాట్టు వెనుక, కుడి, ఎడమ గోడల మీద అపురూపమైన దేవతామూర్తుల చిత్రాలు ఉంటాయి. శ్రీదేవీ, భూదేవీ సమేత శ్రీమహావిష్ణువు ఉత్సవ మూర్తుల విగ్రహాల్ని కూడా భక్తులు దర్శించుకోవచ్చు.
చెట్టుపక్కన దాక్కున్న నల్లనయ్య
పద్మనాభస్వామి దేవాలయం పుట్టు పూర్వోత్తరాల గురించి కేరళ ప్రాంతంలో ఎన్నో కథలు చెప్పుకుంటూ ఉంటారు. వాటిలో ప్రధానమైనది ‘విల్వ మంగళతు స్వామియార్‌’గా ప్రసిద్ధికెక్కిన దివాకర ముని కథ. ఆ ముని శ్రీకృష్ణ భగవానుడి దర్శనం కోసం ప్రార్థన చేశాడు. ఆయనను కరుణించేందుకు భగవంతుడు మారు రూపంలో, ఒక అల్లరి పిల్లవాడిగా దివాకర ముని వద్దకు వచ్చాడు. ముని పూజలో ఉంచిన ఒక సాలగ్రామాన్ని తీసుకొని ఆ పిల్లవాడు మింగేశాడు. కోపంతో ఆ పిల్లవాడిని ముని తరిమికొట్టగా, బాల రూపంలో ఉన్న శ్రీ కృష్ణుడు సమీపంలో వున్న ఒక చెట్టు పక్క దాక్కున్నాడు. మరుక్షణమే ఆ చెట్టు పడిపోయి, విష్ణుమూర్తిగా మారిపోయింది. శయన భంగిమలో- అనంత శయనంగా- యోగ నిద్రా మూర్తి తరహాలో స్వామి దర్శనమిచ్చాడు.
 మూడు ద్వారాలలో... మూడు భాగాల దర్శనం
అప్పుడు స్వామి రూపం-ఆకారం ఎంతో పెద్దగా ఉందట! అంత పెద్ద ఆకారాన్ని పూర్తిగా, తనివి తీరా దర్శించుకోలేక పోతున్నాననీ, దాంట్లో మూడో వంతుకు తగ్గమనీ దివాకర ముని ప్రార్థించాడు. ఆయన ప్రార్థనలను అంగీకరించిన భగవంతుడు, అలాగే తగ్గిపోయాడు. మూడు ద్వారాల గుండా మాత్రమే తన దర్శనానికి వీలుంటుందని చెప్పాడు. ఆలయంలో ఇప్పుడున్న ఆ మూడు ద్వారాలు రావడానికి అదే కారణమంటారు. ఏడు పరశురామ క్షేత్రాలలో ఒకటైన పవిత్ర స్థలంలో ఈ పద్మనాభ స్వామి దేవాలయం ఉందని మరొక నమ్మకం. కేరళ రాష్ట్రంలోని పదకొండు దివ్య ప్రదేశాలలో అనంత పద్మనాభ స్వామి దేవాలయం ఒకటని తమిళ ఆళ్వార్‌ ప్రబంధ గ్రంథాలు చెబుతున్నాయి. బ్రహ్మ, వాయు, వరాహ, పద్మ, స్కాంద పురాణాలలో ఈ దేవాలయం ప్రస్తావన వుంది. ఎనిమిదవ శతాబ్దపు ఆళ్వార్‌ కవి నమ్మాళ్వార్‌ ఈ పద్మనాభ స్వామి దేవాలయాన్ని పొగుడుతూ, నాలుగు శ్లోకాలనూ, ఒక ఫలశ్రుతినీ తన రచనలలో పొందుపరిచారు.
అంతా బంగారమే...
మరో విశేషం ఏమిటంటే, పద్మనాభస్వామి విగ్రహం ముఖం, ఛాతీ మినహా పూర్తిగా బంగారమే! విగ్రహానికి ఆయుర్వేద మిశ్రమాన్ని వాడారు. ముస్లిమ్‌ రాజుల దండయాత్రలలో విగ్రహాలను ధ్వంసం కాకుండా కాపాడుకోవడానికి దాన్ని ఉపయోగించి ఉండొచ్చు. స్వామి కిరీటం, చెవులకు ఉన్న కుండలాలు, ఛాతీని అలంకరించిన భారీ సాలగ్రామ మాల, శివుడి విగ్రహం వున్న చేతికున్న కంకణం, కమలం పట్టుకున్న ఎడమ చేయి, నాభి నుండి బ్రహ్మ ఉన్న కమలం వరకూ కనిపించే తీగ, స్వామి పాదాలు కూడా బంగారుమయమే!

పురాతన ఆలయాలన్నింటికీ అపారమైన సంపదలు ఉన్నాయి. ఆస్తులు, వేలాది ఎకరాల భూములు, నగదు ఉండడం మామూలే. అయితే అనంత పద్మనాభుడి ఆస్తులు ఇతర దేవాలయాలతో పోల్చదగినవి కాదు. తిరుమలేశుని సంపద కంటే ఎక్కువే! ఇటీవల ఈ దేవాలయంలోని నేలమాళిగలో బయట పడిన నిధులు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.
అనంతపద్మనాభస్వామి ఆలయంలో ఉన్న నేల మాళిగల్లో ఆరు గదులు ఉన్నాయి. 2011లో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అయిదు గదులు తెరిచారు. వాటిలోని సంపదను లెక్కించి, దాని విలువ రూ. 90 వేల కోట్లుగా తేల్చారు. నాగబంధం ఉన్న ‘బి’ గదిని మాత్రం తెరవలేదు.
ఆ రాజులు... దేవుని సేవకులు
తిరువనంతపురం అనంత పద్మనాభ స్వామి ఆలయం అనాదిగా ట్రావన్‌కోర్‌ రాజ కుటుంబీకుల అధీనంలోనే ఉంది. ఈ రాజులు తమను తాము ‘పద్మనాభ సేవకులు’గా భావించుకుంటూ, దేవాలయం నిర్వహణ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 1750 ప్రాంతంలో ట్రావన్‌కోర్‌ను పరిపాలించిన మార్తాండ వర్మ తన రాజ్యాన్ని అనంతపద్మనాభ స్వామికి రాజ్యాన్ని అంకితం చేశాడు. ఇక నుంచి రాజులు అనంత పద్మనాభుని సేవకులుగా మాత్రమే రాజ్యాన్ని పరిపాలిస్తారని ప్రకటించాడు. అప్పటి నుంచి ట్రావన్‌కోర్‌ రాజులకు ‘అనంత పద్మనాభ దాస’ అనే బిరుదు కూడా వచ్చింది. ఒక్క ట్రావన్‌కోర్‌ రాజు మినహా ఎవరికీ సాష్టాంగపడి ప్రణామం చేసే అర్హత లేదక్కడ! ఆ రాజులను మాత్రమే ‘పద్మనాభ సేవకులు’గా పిలుస్తారు. రాజకుటుంబంలో పుట్టిన మగపిల్లలు స్వామికి దాసులుగా, ఆడపిల్లలు సేవికలుగా ఉంటారు.
ఇది సాలగ్రామ విష్ణు మందిరం
అనంత శయనుడి విగ్రహాన్ని రూపొందించడానికి వాడిన సాలగ్రామాలను నేపాల్‌లోని గండకీ నది ఒడ్డు నుంచి తెప్పించారు. వాటిని ఏనుగులపై ఊరేగిస్తూ తీసుకువచ్చారట! మొత్తం 10,008 సాలగ్రామాలతో ఈ ఆలయం రూపుదిద్దుకుంది.
ప్రతి సాలగ్రామంపైనా అతకడానికి వీలయ్యే ప్లాస్టర్‌లా ప్రత్యేకమైన ఆయుర్వేద మిశ్రమంతో తయారుచేసిన పదార్థాన్ని ఉపయోగించారట. క్రిమి కీటకాల నుంచి విగ్రహాన్ని కాపాడడం కోసం అలా చేశారంటారు.
అనంత పద్మనాభ స్వామి ఆలయంలోకి హిందువులను మాత్రమే అనుమతిస్తారు. పురుషులు పంచె, ఉత్తరీయం, స్త్రీలు చీర ధరించి స్వామి దర్శనం చేసుకోవాలి. ఈ ఆలయంలో ఈ సంప్రదాయాన్ని విధిగా పాటిస్తారు.
గర్భ గుడి ముందుండే ఎత్తైన ప్రదేశాన్ని ‘ఒట్టక్కళ్‌ మండపం’ అంటారు. పూజ చేయాలన్నా, దర్శనం చేసుకోవాలన్నా, ఆ మండపం ఎక్కాల్సిందే. దర్శనం కావాలంటే, మూడు ద్వారాలు దాటాల్సిందే.
నిత్యం జరిగే పూజా కార్యక్రమాలకు పుష్పాలను ఉపయోగిస్తారు. అభిషేకాన్ని ఉత్సవ విగ్రహాలకే చేస్తారు. 
ఇక్కడ దీర్ఘ చతురస్రంగా ఉండే వరండా నిర్మించడానికి నాలుగు వేల మంది తాపీ పనివారు, ఆరు వేల మంది నిపుణులు పని చేశారనీ,  వంద ఏనుగులను ఉపయోగించి, ఏడు నెలల్లో పూర్తి చేశారనీ అంటారు.
ఈ దేవాలయ ప్రాంగణం ఏడు ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. ప్రత్యేకమైన టేకుతో, బంగారు కవచంతో తయారు చేసిన ధ్వజ స్తంభం ఎత్తు ఎనభై అడుగులు.
ఆలయం తూర్పు దిక్కుగా ఉన్న ప్రధాన ద్వారం సమీపంలో, గోపురం కింది భాగాన ఉన్న మొదటి అంతస్తును ‘నాటకశాల’ అని పిలుస్తారు. మలయాళ పంచాంగం ప్రకారం మీనం, తుల మాసాల్లో నెలల్లో...  ప్రతి సంవత్సరం రెండు పర్యాయాలు ఆలయ ప్రాంగణంలో నిర్వహించే పది రోజుల ఉత్సవాలలో భాగంగా, దేవాలయ కళకు సంబంధించిన ‘కథకళి’ కార్యక్రమాన్ని ఈ నాటకశాలలోనే ప్రదర్శిస్తారు.

No comments:

Post a Comment