Thursday, July 30, 2020

శ్రీ మహాభాగవతము, పంచమ స్కంధం:వనం జ్వాలా నరసింహారావు

మహాకవి బమ్మెర పోతనామాత్య ప్రణీత

(రామకృష్ణ మఠం, హైదరాబాద్ ప్రచురణ)

శ్రీ మహాభాగవతము, పంచమ స్కంధం

భగవదనుగ్రహంతో చదవడం పూర్తయింది

వనం జ్వాలా నరసింహారావు

          కంII    చదివెడిది భాగవతమిది,

                   చదివించును కృష్ణు, డమృతఝరి పోతనయున్

                   చదివినను ముక్తి కలుగును

                   చదివెద నిర్విఘ్నరీతి ‘జ్వాలా మతినై

శ్రీ మహాభాగవతం అనే ఈ మహా పురాణాన్ని సహజ పాండిత్యుడు, బమ్మెర పోతనామాత్యుడు రచించాడు. వాస్తవానికి పంచమ స్కందాన్ని పోతన శిష్యుడు గంగానార్యుడు తెనిగించాడు. డాక్టర్ టి రాజగోపలబాలం గారు అనువదించారు. ఇది రెండు అశ్వాసాలుగా రాయబడింది. ప్రథమాశ్వాసం 77 పేజీలు, ద్వితీయాశ్వాసం 69 పేజీలు  ఉంటాయి. మొత్తం 146 పేజీల ఈ పంచమ స్కందంలో ప్రథమాశ్వాసంలో ప్రియవ్రతుడి చరిత్ర దగ్గరనుంచి, భరతుడి బోధతో రహగణుడి సంశయ నివృత్తి వరకు 12 అంశాలు; ద్వితీయాశ్వాసంలో మహారాజు సుమతి వంశ క్రమం దగ్గరనుండి నరలోక విషయాల వరకు మొత్తం ఆరు అంశాలు ఉన్నాయి. క్లుప్తంగా ఆ మొత్తం 18 అంశాల వివరాలు వివరంగా:

ప్రథమాశ్వాసం: ప్రియవ్రతుడి చరిత్ర, ప్రియవ్రతుడి సుజ్ఞాన దీక్ష, బ్రహ్మ దర్శనం, అగ్నీధ్రాదుల జననం, ఉత్తమ తామస రైవత మనువుల జన్మం, ప్రియవ్రతుడు వనాలకు పోవడం, అగ్నీధ్రుడి కథ, అగ్నీధ్రుడు అప్సర స్త్రీని చేపట్టడం, వర్శాదిపతుల పుట్టుక, అగ్నీధ్రుడు అడవికి వెళ్ళడం, నాభి ప్రముఖుల రాజ్యం, నాభి యజ్ఞం, ఋషభావతార గాథ,  ఋషభుడి ర్కుమారుడైన భరతుడి పేరుమీద “భరత వర్షం” అనే పేరు ప్రసిద్దికెక్కడం, ఋషభుడి జన్మ వృత్తాంతం, అతడి రాజ్యాభిషేకం, భరతుడి జననం, పుత్రులకు ఋషభుడి బోధ-కొడుకులకు సాటిలేని విజ్ఞానాన్ని ఉపదేశించడం, భరతుడి పట్టాభిషేకం, ఋషభూడి తపస్సు, భరతోపాఖ్యానం, భరతుడు అరణ్యానికి వెళ్ళడం, భరతుడు జింకపిల్లగా జన్మించడం, తిరిగి బ్రాహ్మణుడిగా పుట్టడం, కాళీబలికి భరతుడిని తీసుకునిపోవడం, బతికి బయటపడడం, భరతుడు పల్లకీ మోయడం, సింధురాజుకు బ్రాహ్మణుడికి (భరతుడు) జరిగిన సంవాదం, భరతుడు బోధతో రహగణుడి సంశయ నివృత్తి ఉన్నాయి.

  ద్వితీయాశ్వాసం: భరతుడి కొడుకైన సుమతికి రాజ్యాభిషేకం, మహారాజు సుమతి వంశక్రమం, పాషండ దర్శనం, సుమతి పుత్రుల జన్మ వివరణ, మహాపురుషుడు గయుడి చరిత్ర, శుకయోగి భూనైసర్గిక స్వరూపాన్ని వివరించడం, భూమండలం, ద్వీపాలు, వర్షాలు, నదులు, పర్వతాలు, అంతరిక్షం, ఖగోళ విషయ విస్తారం, సముద్రాలు, పాతాళ లోకాల వివరణ, దిక్కులు, నక్షత్రాలు, నరలోక విషయాలు ఉన్నాయి.


అగ్నీధ్రాదుల జననం’ అన్న అంశంలో అగ్నీధ్రాదుడి రథచక్ర తాకిడికి భూమిమీద ఎలా గోతులు ఏర్పడ్డాయో వివరించడం జరిగింది. అవే సప్త సముద్రాలయ్యాయి. ఆ సముద్రాల ఆమధ్య భాగం ద్వీపాలయ్యాయి. ఆ సప్త ద్వీపాలు: జంబూ ద్వీపం, ప్లక్ష ద్వీపం, శాల్మలి ద్వీపం, కుశద్వీపం, క్రౌంచ ద్వీపం, శాక ద్వీపం, పుష్కర ద్వీపం. ఇక సప్త సముద్రాలు: లవణ సముద్రం, ఇక్షు సముద్రం, సురా సముద్రం, ఘృత (నేతి) సముద్రం, పాల సముద్రం, దధి (పెరుగు) సముద్రం, జల సముద్రం. సముద్రాలు ద్వీపాలకు అగడ్తలలాగా ఉన్నాయి. సముద్రాలు, ద్వీపాలు ఒకదానితో ఒకటి కలిసి పోకుండా, సరిహద్దులు పెట్టినట్లు వరస తప్పకుండా వేర్పడడం చూసి జీవులు విస్తుపోయాయని పేర్కొనడం జరిగింది.

ఈ విషయాలతో పాటు మరెన్నో ఆసక్తికరమైన విషయాలు పంచమ స్కందంలో ఉన్నాయి.

ఇవన్నీ చదవగలగడం నా పూర్వజన్మ సుకృతం.  

 


No comments:

Post a Comment