బృహత్తర విద్యా సంస్కరణలు
వనం జ్వాలా నరసింహారావు
మన తెలంగాణ దినపత్రిక
(01-08-2020)
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన
నూతన జాతీయ విద్యా విధానం చర్చనీయాంశమైంది. ఈ విద్యావిధానంలో భాగంగా పలు మార్పులకు శ్రీకారం
చుట్టేందుకు కేంద్రం నడుంబిగించింది. కొన్ని ఆశించతగినవే అయినప్పటికీ, పూర్తిగా అమలయ్యే నాటికి, ఈ నూతన విద్యా
విధానం ఏవిధంగా ఉండబోతోంది, పిల్లల చదువులు ఏవిధంగా
సాగుతాయనే అంశాలపై పలు అనుమానాలు కలుగుతున్నాయి.
ఈ నేపధ్యంలో తెలంగాణా
రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కొద్ది రోజుల క్రితం రాష్ట్రంలోని
విద్యారంగం పనితీరును సమీక్షిస్తూ, నేటి సమాజంలో నిరంతరం
వస్తున్న మార్పులకు అనుగుణంగా బృహత్తరమైన సంస్కరణలు చేపట్టాలనే అభిప్రాయం, ఆవశ్యకత
వెలిబుచ్చారు. ముఖ్యంగా ప్రభుత్వ
విద్యాసంస్థలలో పాఠ్యాంశాలు, పరీక్షా విధానాలు, పరిపాలన, మొదలైనవి సమూలంగా సంస్కరించాలని ముఖ్యమంత్రి
సూచించారు.
అటు జాతీయ
విద్యావిధానం భావిస్తున్నట్లు, ఇటు తెలంగాణ
ముఖ్యమంత్రి సూచిస్తున్నట్లు, సమగ్ర ప్రక్షాళన తక్షణ అవసరమే. ఇవన్నీ పరిగణలోకి
తీసుకుని సుమారు పదిహేను సంవత్సరాలు రాష్ట్ర-కేంద్ర పాతశాలల్లో పనిచేసిన అనుభవంతో
అధ్యయనం చేస్తే కొన్ని సూచనలు చేయాలని అనిపించింది. పర్యవసానమే ఈ వ్యాసం.
ప్రస్తుతం
భారతదేశంలో 50% జనాభా 25 సంవత్సరాలకంటే తక్కువ వయసు వారు ఉన్నారు.
65% కంటే ఎక్కువ జనాభా 35 సంవత్సరాలకంటే తక్కువ వయసు వారు. ఈ
సంవత్సరం (అంటే 2020)
చివరకల్లా భారతదేశ జనాభా సగటు వయస్సు 29 సంవత్సరాలు ఉంటుందని ఒక అంచనా. 2030 నాటికి అక్షరాశ్యులు 75 శాతం వరకూ ఉండవచ్చు. అందుబాటులో ఉన్న గణాంకాలనుబట్టి చూస్తే పెరుగుతున్న
జనాభా, అధికమౌతున్న విద్యాసంస్థలూ సామాజిక విధానాలలో గణనీయమైన మార్పు తీసుకువచ్చే
శక్తి కలిగి ఉండడం తప్పదని అర్థమౌతోంది. ఈ
పరిస్థితిని అనుకూలంగా, ఒక సదవకాశంగా మార్చుకోవడం అత్యవసరం. అందుకే విద్యారంగంలో భారీ మార్పుల ఆవశ్యకత
ఎంతైనా ఉన్నది.
ప్రాథమిక పాఠశాల
స్థాయినుంచి విశ్వవిద్యాలయాల స్థాయి వరకు ఇప్పుడు అమల్లో, ఆచరణలో ఉన్న
విద్యావిధానం,
విద్యార్థులను పరీక్షలు మాత్రం రాసేందుకు తగ్గట్టుగా, ఎక్కువ మార్కులు ఎదో విధంగా సంపాదించుకునేలా తయారు చేస్తోంది తప్ప వాస్తవిక
ప్రపంచానికి అనుగుణంగా సిద్ధపరిచే విధంగా లేదు. దురదృష్టవశాత్తు మనమింకా ఆంగ్లేయుల
పరిపాలనా కాలంలోని బోధనా పద్ధతులనే యధాతథంగా కాకపోయినా, ఏదోవిధంగా అనుసరిస్తున్నాము. లార్డ్ మెకాలే ఆలోచనలకు
అనుగుణంగా రూపుదిద్దుకున్న ఆ విద్యావిధానం బ్రిటీష్ ప్రభుత్వానికి కావాల్సిన గుమాస్తాలను
తయారుచేయడానికి,
బ్రిటన్ రాణీగారిని సేవించడానికి మాత్రమే అనుకూలంగా ఉన్నాయి
తప్ప స్వతంత్ర్యదేశానికి,
మారుతున్న పరిస్థితులకీ
అవసరమైనట్లుగా లేవు. అలాగే
పాఠ్యాంశాలూ,
పరీక్షావిధానాలూ కూడా పాత మూస పద్ధతిలోనే నడుస్తున్నాయి.
కొఠారీ కమీషన్ లాంటివి ఎన్ని నియమించినా పరిస్థితిలో మార్పులేదు.
అందుకే ప్రాథమిక
పాఠశాల స్థాయినుంచి విశ్వవిద్యాలయాల స్థాయి వరకు ఇప్పుడున్న పాఠ్యాంశాలనూ, ఇతర వ్యాసంగాలనూ,
వ్యాపకాలనూ, పరీక్షా
పద్ధతులను సమూలంగా ప్రక్షాళణ చెయ్యవలసిన అవసరం ఎంతైనా ఉంది. 60వ దశకంలో ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థులకు వారాంతంలో రకరకాల చేతి పనులలో
శిక్షణ ఇచ్చేవారు. అలాగే నైతిక విలువలు
బోధించేవారు. అప్పట్లో ఆనాటి పియుసి (ప్రీ
యూనివర్సిటీ కోర్స్) లోనూ,
డిగ్రీకంటే కిందిస్థాయిలోనూ ఉండే వివిధ కోర్సులలో జనరల్
ఎడ్యుకేషన్ (సామాన్య శాస్త్రం) అనబడే అంశం తప్పనిసరిగా బోధించేవారు. దానివల్ల ఐచ్చికంగా
విద్యార్ధి తీసుకునే సబ్జక్టులకు అదనంగా అన్ని విషయాలలోనూ స్థూల అవగాహన, అంతో-ఇంతో
లోక జ్ఞానం కలిగేది. అలాగే 70వ దశకం తొలినాళ్లలో ఇంటర్మీడియేట్ తరగతుల్లో లెక్కలు ముఖ్యాంశంగా
ఎన్నుకున్నవారికి జీవ-జంతుశాస్త్ర పరిచయం కలిగేలా ఒక తరగతి ఉండేది. అలాగే జీవ-జంతు శాస్త్రం చదువుకునేవారికి
లెక్కలు పరిచయం చేసేవారు. కేంద్రీయ
విద్యాలయాల్లో ‘సోషల్లీ యూజ్ఫుల్ ప్రొడక్టివ్ వర్క్’ (సమాజానికి ఉపయోగపడే ఉత్పాదక అంశాలు)
అనే సబ్జెక్ట్ ఉండేది. అంటే సామాజిక అవసరాలకు అనుగుణంగా ఉండే విషయాలపై కొంత అవగాహన,
ప్రయోగాత్మకంగా పరిచయం కల్పించేవారు. అవన్నీ ఏమైనాయో ఇప్పుడు?
తలపెడుతున్న సంస్కరణలలో
భాగంగా ప్రభుత్వ, ప్రభుత్వేతర, గుర్తంపు పొందిన
ప్రైవేట్ పాఠశాలలలో ప్రాథమిక పాథశాల స్థాయిలో, అంటే నర్సరీ నుంచి నూతన విద్యావిధానం సూచించినట్లు ఐదవ తరగతి వరకు
పరీక్షావిధానాన్ని పూర్తిగా రద్దుచేయాలి.
విద్యార్థులకు వివిధ భాషలు, గణితశాస్త్రం, సైన్సు,
పరిశుభ్రత, మంచి అలవాట్లు మొదలైనవి బోధించాలి. పాఠ్యాంశాలు సరదాగా, ఆటపాటలతో,
పదిమందితో కలసి పనిచేసే విధంగా ఉండాలి. ఐదారు తరగతులలోకి వచ్చిన పిల్లలను బయటి
ప్రపంచంతో పరిచయం ఏర్పడే విధంగా స్థానిక మార్కెట్లకీ, దుకాణాలకీ,
వ్యవసాయ క్షేత్రాలకీ, రాబోయే రోజుల్లో జీవితాసరాలకు
పనికొచ్చే ప్రదేశాలకూ తీసుకువెళ్లాలి.
లలిత కళలలో ప్రవేశం కలిగేలా చూడాలి. అలా చెయ్యడం వలన వారికి ప్రకృతి, ప్రజా జీవితం,
తోటివారి గురించి అలోచించడం, సహాయపడటం మొదలైన విషయాలు బోధపడతాయి.
హోమ్ వర్కు సాధ్యమైనంత తక్కువ వుండాలి.
కంప్యూటర్ యుగంలో విద్యార్థులే స్వయంగా నేర్చుకునే ఈ రోజుల్లో హోమ్ వర్క్
కు కేటాయించే సమయాన్ని వారు కంప్యూటర్ మీద కూర్చుని నేర్చుకునే అవకాశం ఇవ్వాలి. నిజానికి
అసలు హోమ్ వర్క్ లేకపోయినా ఫరవాలేదు.
మాధ్యమిక స్థాయికి
వచ్చేటప్పటికీ (అంటే ఆరునుంచి తొమ్మిదవ తరగతి వరకు) పిల్లలకు వివిధ రకాలైన వృత్తి
విద్యలతో పరిచయం కలిగించాలి. అంటే వడ్రంగిపని, చేనేత, టైలరింగు,
భవననిర్మాణం, ఎలెక్ట్రీషియన్, మొదలైనవన్నమాట. దానివల్ల వారికి శ్రమ యొక్క విలువ తెలుస్తుంది. వారంలో ఒక తరగతి నైతిక విలువలు నేర్పడం కోసం
కేటాయించాలి. ఇప్పటిలా పొద్దున్న 9 గంటలనుంచీ సాయంత్రం 5 గంటల దాకా తరగతి బోధనల పద్ధతికి స్వస్తి చెప్పాలి, బోధన అన్నది కేవలం లంచ్
పూర్వం క్లాసులకే పరిమితం చేయాలి.
మధ్యాహ్న భోజన విరామం తరువాత ప్రయోగాత్మక విషయాలలో శిక్షణ ఇవ్వాలి. కంప్యూటర్
రంగంలో ప్రవేశం ఇక్కడే ప్రారంభం కావాలి. ఇలా చెయ్యడం వలన పదవతరగతి పాసై బయటికి
వచ్చేసరికి పిల్లలకి పరిపక్వత వస్తుంది.
కొద్దిపాటి మార్గదర్శకత్వం ఉంటే తమకు అనువైన దారి ఎన్నుకోగలరు. భవిష్యత్
ప్రణాళికల గురించి ఆలోచించే సామర్థ్యం వారికి స్వయంగా వస్తుంది. తల్లితండ్రుల, గురువుల సలహాలతో, తమ స్వంత తెలివితేటలతో
భవిష్యత్ ప్రణాలికను రూపొందించుకోగలరు.
ఇంటర్మీడియేట్
స్థాయికి వచ్చేసరికి మామూలుగా అలవాటైన ఎంపీసీ (గణిత శాస్త్రం, భౌతికశాస్త్రం,
రసాయన శాస్త్రం కాంబినేషన్), బైపీసీ (జీవ-జంతుశాస్త్రం, భౌతికశాస్త్రం, రసాయన శాస్త్రం),
సీఇసీ (పౌరశాస్త్రం, అర్థశాస్త్రం, వాణిజ్య శాస్త్రం),
ఎంఇసీ (గణిత శాస్త్రం, అర్థశాస్త్రం, వాణిజ్య శాస్త్రం) మొదలైన మూసలో పోసిన కాంబినేషన్ విద్యలే కాకుండా
విద్యార్థికి నచ్చిన విధంగా రకరకాల సబ్జెక్ట్లను మిళితం చేసుకునే సౌలభ్యం కూడా
ఉండాలి. చరిత్ర-జీవశాస్త్రం, గణితం-జీవశాస్త్రం,
భౌగోళిక శాస్త్రం-రసాయన శాస్త్రం వంటి అరుదైన కలయికలు కూడా
విద్యార్థులు కోరవచ్చు. వ్యవసాయ శాస్త్రం, ఉద్యానవన శాస్త్రం,
అటవీ శాస్త్రం, కృత్తిమ మేధస్సు, యంత్రాలపై పనిచేయడం మొదలైనవి కూడా పాఠ్యాంశాలుగా చేర్చవచ్చు. పాలిటెక్నిక్ డిప్లమోలను
ఇంటర్మీడియేట్ తో అనుసంధానం చెయ్యాలి.
దీనివల్ల,
అవసరమైన వారికి ఇంటెర్మీడియేట్ అవగానే పని సంపాదించే అర్హత
వస్తుంది.
ఉన్నత విద్యలో
భాగంగా, పరిశ్రమలకు,
వ్యాపార వాణిజ్య అవసరాలకు, సాంప్రదాయ విద్యలకు పనికివచ్చే విషయాలు చేర్చాలి. సామాజిక శాస్త్రం, ఆర్ట్స్ వంటి విషయాలు ఏకకాలంలో
నేర్చుకునే వెసలుబాటు ఉండాలి. ఉదాహరణకి
బిట్స్ పిలానీలొ చూడండి. విద్యార్థి
సాంకేతిక శాస్త్రాలతో పాటు సామాజిక శాస్త్రాలు, ఆర్ట్స్ మొదలైనవి
నేర్చుకొనవచ్చు. అలాగే ఆర్ట్స్ చడువుకునే విద్యార్థి సైన్స్ నుంచి కూడా ఒక సబ్జెక్ట్
నేర్చుకోవచ్చు. జీవశాస్త్ర విద్యార్థి
ఎలెక్ట్రానిక్స్ లో నిష్ణాతుడై, చివరికి ఎలెక్ట్రానిక్
రంగంలో పరిశ్రమలు స్థాపించిన సందర్భాలూ లేకపోలేదు.
కళాశాలలనూ, విశ్వవిద్యాలయాలను పరిశ్రమలతో, వ్యాపార, వాణిజ్య సంస్థలతో అనుసంధానం చెయ్యాలి.
దానివలన భవిష్యత్తులో పరిశోధనారంగంలో అవకాశాల గురించి తెలుస్తుంది. భారీ కంపెనీలూ, పరిశ్రమలూ,
వ్యాపార, వాణిజ్య సంస్థలు కూడా
సమాజంపట్ల తమ బాధ్యతగా కొంత వనరులను పరిశోధన వైపు మళ్లించాలి.
ప్రపంచంలోని
శాస్త్రీయ రంగంలో మనదేశానికి చెందిన వారు ఎంతోమంది ఉన్నారని ఘనంగా చెప్పుకుంటాము
కానీ వారిలో విషయ పరిజ్ఞానం లోతుగా
ఉన్నవాళ్లు తక్కువ. మన పరీక్షా విధానాలు, మార్కులు ఇచ్చే పద్ధతి,
పరిశీలన, విద్యార్థి యొక్క సృజనాత్మతకు, సమస్యా పరిష్కారంలో నేర్పుకూ, కొత్త విషయాలు
ఆవిష్కరించే శక్తికీ అద్దం పట్టేవిగా ఉండాలి.
సృజనాత్మక శక్తి కలవారిని, సమస్య ఏదైనా వాస్తవ
పరిస్థితి గ్రహించి న్యాయం చేసే సామర్థ్యం కలవారినీ, వృత్తి పట్ల అంకితభావంతో పని చేసేవారినీ తీర్చిదిద్దేందుకు వీలుగా
విద్యావిధానాన్ని పునరుద్ధరించాలి.
ప్రపంచంలోనే అధిక శాతం ఇంజనీర్లు మనదేశంలో ఉన్నా సాంకేతికపరమైన ఆవిష్కరణలు
చేసే సామర్థ్యం ఉన్నవాళ్లు తక్కువ. మన
పట్టభద్రులూ,
పోస్ట్ గ్రాడ్యుయేట్లూ (అందరూ కాకపోయినా కొందరైనా) కాల్
సెంటర్లలోనూ,
ఎటువంటి ప్రాముఖ్యతా లేని చోట్లా పనిచేస్తున్నారు. ఇది ఏమాత్రం అభిలషణీయం కాదు.
విద్యారంగలో
నిష్ణాతులైన వారి అభిప్రాయం ప్రకారం, మన
విద్యావిధానం వ్యవస్థాపకులను, సృజనాత్మకత కలవారినీ, కళాకారులను,
శాస్త్రవేత్తలను, రచయితలనూ తయారుచేసే
విధంగా మారినప్పుడే వారు దేశ ఆర్థిక వ్యవస్థకు గట్టి పునాది వెయ్యగలరు. అంతేగాని, ఇప్పటిలా కేవలం కింది
తరగతి ఉద్యోగులను మాత్రమే తయారుచేసే దేశంలా ఉండడం మన లక్ష్యం కాకూడదు. విధాన రూపకర్తలు
బోధనాపద్ధతులలో నాణ్యత పెంచడం మీద దృష్టి పెట్టాలి.
విదార్థుల
మేధస్సుకు మెరుగులు దిద్దే క్రమంలో వారి హృదయంలో, ఆలోచనావిధానంలో మంచి పరివర్తన వచ్చేలా చూడాలి. మన దేశంలోని విద్యా విధానం తప్పు దారి
పట్టిందంటే మనకున్న మానవ వనరులు సత్ఫలితాలను ఇవ్వకపోగా సమస్యగా మారిపోతాయి. ముఖ్యంగా మన దేశం లాంటి దేశంలో నిరుద్యోగ
యువతలో నిరాశ పెరిగితే వారు తీవ్రవాదులుగా, సంఘ విద్రోహక శక్తులుగా
మారటానికి,
మాదకద్రవ్యాలకు అలవాటు పడటానికీ అవకాశం ఎక్కువ.
ఏది ఏమైనప్పటికీ
ఆదర్శవంతమైన అధ్యాపకులు మాత్రమే ఈ విద్యారంగ పునరుద్ధరణకు దోహదం చెయ్యగలరు. కనుక అటువంటివారిని ఎన్నుకోవటం మీదే విద్యా
వ్యవస్థ ఆధారపడి ఉంటుంది.
మన తెలంగాణ ప్రాంత
మహాకవి బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన శ్రీమహాభాగవతం ప్రారంభంలో ఆయన చేసిన సరస్వతీ
స్తుతిలో పోతనగారు భారతీయ విద్యా వ్యవస్థలో (అలనాడు) ఉండే విశిష్టతను చూపించారు.
“క్షోణితలంబు నెన్నుదురు సోకగ మ్రొక్కి నుతింతు.......శుక వారిజ పుస్తకరమ్య
పాణికిన్” అన్న ఆ పద్యంలో నిగూఢమైన అర్థం ఉన్నది. బహుశా ఆయన చెప్పిన మాటలు అక్షర
లక్షల విలువ చేస్తాయనడంలో అతిశయోక్తి లేదేమో!
సరస్వతీదేవి తన చేతుల్లో జపమాల, చిలుక, పద్మం, పుస్తకం ధరించి ఉంటుందని చెప్పారు పోతన. ఈ నాలుగూ మానవుడు తన జీవిత లక్ష్యాలుగా సాధించాల్సిన ధర్మార్థకామ మోక్షాలకు సంకేతాలు అని ఆయన అర్థం. పుస్తకం ధర్మానికీ, పద్మం అర్థానికీ, చిలుక కామ పురుషార్థానికీ, జపమాల మోక్ష పురుషార్థానికీ సంకేతాలు అవుతాయంటారు. ఎన్ని విద్యలు నేర్చినా, ఎంత పండితుడైనా పురుషార్థాలు సాధించకపోతే జీవితం వృధానే. ఈ విషయం గ్రహించిన మన ప్రాచీన విద్యావేత్తలు ఒకటవ తరగతి తెలుగు వాచకంలో అ-ఆ-ఇ-ఈ లు నేర్పడానికి అమ్మ, ఆవు, ఇల్లు, ఈశ్వరుడు, అనే నాలుగు మాటలు బొమ్మలతో సహా నేర్పేవారు. ఇవన్నీ జీవితంలో అవసరమైన మంచి చెడ్డలకు నిదర్శనాలు. ఆ రోజుల్లోలాగా మానవుడి జీవితాదర్శాన్ని విద్యాబోధనలో తెలియచేయాలి. భావి పౌరులు ఆదర్శవంతులుగా తీర్చి దిద్దే విద్యాబోధన ఎంతైనా అవసరం.
(లంక నాగరాజు సహకారంతో)
No comments:
Post a Comment