Thursday, July 30, 2020

సీతానసూయ సంవాదం : వనం జ్వాలా నరసింహారావు

సీతానసూయ సంవాదం

వనం జ్వాలా నరసింహారావు

ఆంధ్రప్రభ, చింతన (30 & 31-07-2020)

చిత్రకూటం దగ్గర వున్న శ్రీరాముడికి, భరతుడు వచ్చి దుఃఖపడిన విషయం పదే-పదే గుర్తుకు రాసాగాయి. మనసు అన్యాక్రాంతం అవుతున్నందున ఇక అక్కడ వుండడం వనవాసానికి ఏమాత్రం మంచిది కాదనుకుంటాడు. వెంటనే, సీతారామలక్ష్మణులు ముగ్గురూ బయల్దేరి అత్రి మహామిని ఆశ్రమానికి చేరుకుంటారు. ఆయన తన భార్య, పరమ పతివ్రత అనసూయాదేవిని సీతాదేవికి పరిచయం చేశాడు.

         పరిచయం చేస్తూ అత్రి మహాముని సీతాదేవిని చూపిస్తూ అనసూయతో, “ఈ పతివ్రతా శిరోమణి భూదేవి కూతురు. ఈమెను నువ్వు గౌరవించు” అని చెప్పాడు. తరువాత అనసూయాదేవి గొప్పతనాన్ని అత్రి శ్రీరాముడితో ఇలా చెప్పాడు: “చినుకనేది కురవకుండా మనుష్యులు ఇతర జీవికోటులు మాడిపోతే, తన తపస్సుతో ఫలాలను, కందమూలాలను పది సంవత్సరాలుండేలా చేసింది. గంగానది ప్రవహించేదిగా చేసింది. పదివేల సంవత్సరాలు భర్త అనుమతితో విఘ్నం లేకుండా తీవ్ర నిష్ఠపూని తపస్సు చేసింది. దేవకార్యం నిర్వహించడానికి ఆమె పది దినాలు ఒక రాత్రిగా సూర్యోదయం అనేది లేకుండా చేసింది. వ్రతాలన్నీ సొంతం చేసి స్నాతక కర్మ జరిపింది. నువ్వు నీతల్లిలాగా ఈమెను పూజించు. నీపూజకు ఈమె యోగ్యురాలు. ఈమె సమస్త భూతాల నమస్కారాలకు యోగ్యురాలు. స్త్రీ ధర్మమైన పాతివ్రత్యానికి సంబంధించి ఇతరులకు సాధ్యంకాని కార్యాలు చేయడం వల్ల అసూయపడరానిదని కీర్తి పొందింది. నువ్వు సీతాదేవిని ఈమెకు నమస్కారం చేయమని చెప్పు”. అని అత్రిమహాముని చెప్పగా శ్రీరామచంద్రమూర్తి సీతాదేవిని చూసి మునీంద్రుడు చెప్పినట్లు అనసూయను దర్శించమని చెప్పి అలా చేస్తే ఆమెకు మేలు కలుగుతుందని అంటాడు.

          భర్త చెప్పినట్లే సీతాదేవి పోయి, వృద్ధురాలైన అనసూయను చూసింది. ఆమెను చూడగానే, పతివ్రతా ధర్మం ఈ రూపంలో వచ్చిందని అనే విధంగా వుందని అనిపించింది సీతకు. తన పేరు చెప్పి నమస్కారం చేసి రెండు చేతులు జోడించి నిలువబడి కుశలం అడిగింది అనసూయను. నిర్మలమైన మనసున్న అనసూయాదేవి సంతోషంతో ధర్మాత్మురాలైన సీతతో, “సీతా! నువ్వెంత పుణ్యచరిత్రవే! పాతివ్రత్యమే గొప్పదిగా భావించి చుట్టాలను, సంపదను, సౌఖ్యాన్ని వదిలి, మహారూజు కోడలినని కాని, మహారాజు కూతురునని కాని లక్ష్యపెట్టకుండా, తండ్రిని యదార్థవాదిని చేయాలన్న ఉద్దేశంతో అడవికి వస్తున్న భర్తతో  వచ్చావు. ఇలాంటి స్త్రీలు కూడా లోకంలో వుంటారా? పతివ్రతైన స్త్రీకి, భర్త ఎలాంటివాడైనా అతడే ఆమె పాలిటి దైవం. మగడి కంటే గొప్ప చుట్టం స్త్రీకి ఎవరూ లేరు. కుల ధర్మం పాటిస్తూ, మంచి పనులు చేసే పతివ్రతా రత్నానికి ఆమె ఇంకేమీ చేయకపోయినా, ధర్మాలన్నీ చేసినవారికి లభించే స్వర్గం లభిస్తుంది” అని చెప్పింది.

         అసూయలేని అనసూయ చెప్పిన మాటలు విని తన మీద ఎంతో ప్రేమ వుండబట్టే ఇలా హితం బోధించిందని సీతాదేవి సంతోషించింది. అనసూయతో ఇలా అంది.

          సీత అనసూయతో, “తల్లీ! నీ లాంటి పతివ్రత ఇలా చెప్పడం వింతకాదు. పతివ్రతలకు భర్తే దైవం అనే విషయం నాకూ తెలుసు. ధర్మం మీదే బుద్ధి నిలిపి, తల్లిలాగా, తండ్రిలాగా మేలెంచేవాడైన శ్రీరామచంద్రమూర్తి నాకు భర్త అయినప్పుడు సేవించడంలో ఆశ్చర్యం ఏముంది? నన్ను తప్ప మిగిలిన రాజస్త్రీలందరినీ ఆయన కౌసల్యను చూసినట్లు చూస్తాడు. వీరు తల్లుల లాంటి వారని సమదృష్టితో చూస్తాడు. నేను నా భర్తతో అడవులకు వచ్చేటప్పుడు నా అత్తగారు, పెళ్లి చేసుకున్నప్పుడు మా తల్లి, పాతివ్రత్యాన్ని గురించి చాలా మాటలు చెప్పారు.అవన్నీ మనసులో నాటుకున్నాయి. కాని పాతబడ్డాయి. ఇప్పుడు నువ్వు వాటిని కొత్తగా మనసుకు నచ్చేట్లు చెప్పి బలపర్చావు. తల్లీ! నా అభిప్రాయంలో స్త్రీలకు పతి శుశ్రూష తప్ప వేరే తపస్సు అక్కరలేదు”.

         ఆ మాటలకు అనసూయ సంతోషించి సీతను దగ్గరకు తీసుకుని శిరస్సు వాసనచూసి ఇలా అంది: “అమ్మా! ఇంపైన నీ మాటలతో నాకు చాలా సంతోషం కలిగింది. నీకేం కావాలో కోరుకో. నా తపోబలం వల్ల నీకు అది కలిగిస్తా”. అనసూయ మాటలకు ఆశ్చర్యపడ్డ సీత ఆమె తనను పరీక్షిస్తున్నదనుకుని, ఆమె దయవల్ల తనకే కొరత లేదనీ, తానేం కోరాలింకా అని అంటుంది.


సీతాదేవి అన్న మాటలకు అనసూయ ప్రీతి చెందింది. “ఈ పూల దండలు, ఈ వస్త్రం, ఈ సొమ్ములు, ఈ మైపూతలు, ఈ పరిమళ ద్రవ్యాలు అన్నీ దేవతా సంబంధమైనవే. భూలోకవాసులకు లభించవు. మనసుకు సంతోషం కలిగిస్తాయి ఇవన్నీ. ఈ పూలదండలు వాడిపోవు, వీడిపోవు, వాసన పోదు. నీకివి అందంగా వుంటాయి. వీటిని నువ్వు ధరిస్తే ప్రకాశిస్తూ, పూర్ణకాంతితో, మనోహర దేహంతో, లక్ష్మీదేవి విష్ణువును సంతోషపెట్టినట్లు సంతోషపెట్తావు” అని ప్రేమతో అనసూయ ఇవ్వగా, సీతాదేవి సంతోషించి, వాటిని తీసుకుని, నిర్మలమైన భక్తితో ఆ ముని భార్యకు కృతజ్ఞతా సూచకంగా నమస్కారం చేసి ఆమె పక్కన కూచుంది. ఇలా తన పక్కన కూచున్న సీతతో అనసూయ సరదాగా కబుర్లాడుతూ ఇలా అంది.

         “నిన్ను రామచంద్రమూర్తి తన పరాక్రమంతో స్వయంవరంలో పెళ్లి చేసుకున్నాడని మాటమాత్రంగా వినడమే కాని, అదెలా జరిగిందో వివరంగా వినలేదు. అ కథ వినాలని వుంది. జరిగినదంతా వివరంగా చెప్పు” అని అనసూయ అడిగింది.

జవాబుగా సీతాదేవి, “అమ్మా! చెప్తా విను. నా తండ్రి జనకుడు క్షాత్ర ధర్మం అంటే ప్రీతికలవాడు. విదేహ దేశానికి రాజు. ఒకనాడు యజ్ఞం చేయడానికి నేల దున్నిస్తుంటే నాగేటి కర్రు తగిలి నేల పెళ్లలు లేచివచ్చి నేను భూమిలోనుండి బయటకు వచ్చా. అప్పుడు ధాన్యం చల్లడానికి పిడికిట్లో గింజలు వుంచుకున్న జనకుడు నన్ను చూసి ఆశ్చర్యపడి తన కన్నకూతురులాగా నన్ను ఆయన తన కుడి తొడమీద కూర్చుండబెట్టుకుని తన కూతురని చెప్పాడు. ఆకాశవాణి కూడా నేను ఆయన కూతురునే అంది. ఆకాశవాణి మాటలకు సంతోషించిన జనకుడు నన్ను తన పెద్ద భార్యకు ఇచ్చాడు. ఆమె నన్ను తన కన్నబిడ్డలాగా చూసుకుంది. పెంచింది. నాకు వివాహయోగ్య దశ రావడం గమనించిన తల్లిదండ్రులు ఆ దిశగా ఆలోచన చేయసాగారు. ఈ కన్య ఇలాంటి గొప్ప గుణాలు కలది కదా! దీనికి తగిన వాడిని, సద్గుణ సంపత్తికలవాడిని, గొప్పవాడిని, ఏవిధంగా భర్తగా సంపాదించగలనని జనకుడు విచార సముద్రంలో మునిగిపోయాడు. తల్లిగర్భంలో పుట్టని సుందరినైన నాకు, దేవకన్యలాంటి నాకు, తగినవాడిని, మన్మథాకారుడిని, సమానుడైన వాడిని సంపాదించాలని వెతికాడు కాని ఎవరూ దొరకలేదు. అప్పుడు స్వయంవరం చాటిస్తే బాగుంటుందని ఆలోచనచేశాడు”.

“ఈ ప్రకారం ఆలోచించి, తాను చేసిన ఒక గొప్ప యజ్ఞంలో వరుణుడు తనకు ఇచ్చిన మనుష్యులు కదిలించ సాధ్యపడని వింటిని, రాజులు కలలో కూడా ఎక్కుపెట్టలేని వింటిని, అక్షయబాణాలను, తాను పిలిపించిన రాజులందరికీ చూపించాడు. ఆ విల్లెక్కుపెట్టిన వాడు తన కూతురుకు భర్త కాగలడని ప్రకటించాడు. అక్కడికి వచ్చిన రాజులు దానిని ఎత్తలేక, చూడగానే భయపడి, దానికి ఒక నమస్కారం చేసి పోయారు. చాలాకాలం ఇలాగే గడిచి పోయింది. రాజకుమారులెవరూ దానిని ఎక్కుపెట్టలేక పోయారు”.

“అప్పుడు విశ్వామిత్రుడు మా తండ్రి చేసే యజ్ఞం చూడడానికి రామలక్ష్మణులను తీసుకొచ్చాడు. మా తండ్రికి, మన్మథులలాగా వున్న సుకుమారులైన వారిద్దరినీ, దశరథరాజ పుత్రులను పరిచయం చేశాడు. చేసి, ఆయన దాచిపెట్టిన వింటిని శ్రీరామచంద్రమూర్తికి చూపించమని అన్నాడు. జనకుడలాగే చేశాడు. విశ్వామిత్రుడి మాట ప్రకారం శ్రీరాముడు వింటిని సమీపించాడు. ఆ వింటిని శ్రీరాముడు అనాయాసంగా ఎక్కుపెట్టి, అల్లెతాడు గట్టిగాపట్టి లాగగా చూసేవారు భయపడేట్లు, పిడుగుపడ్డ ధ్వనితో అది రెండుగా విరిగింది. విల్లు ఎక్కుపెట్టిన-విరిచిన వారికి తన కూతురును ఇచ్చి వివాహం చేస్తానని ప్రతిజ్ఞచేసిన మా తండ్రి తన మాట ప్రకారం శ్రీరామచంద్రమూర్తికి నన్ను కన్యాదానం చేయడానికి జలపాత్ర చేతిలో తీసుకున్నాడు. కాని తమ తండ్రి అభిప్రాయం తెలుసుకోవాలని చెప్పి శ్రీరాముడు దానం తీసుకోలేదు. అప్పుడు మా తండ్రి దశరథ మహారాజు దగ్గరకు దూతలను పంపాడు. మా తండ్రి ఆహ్వానాన్ని ఆదరించి దశరథమహారాజు వచ్చాడు. శ్రీరామచంద్రుడికి నన్ను, నా చెల్లెలు ఊర్మిళను లక్ష్మణుడికి దానం చేశాడు జనకుడు. ఈ విధంగా నేను శ్రీరామచంద్రమూర్తిని వివాహం చేసుకున్నా”.

         సీతాదేవి ఇలా చెప్పగా విన్న అనసూయాదేవి ఇలా అంది: “సీతాదేవీ, మధురంగా నీ స్వయంవర చరిత్ర చెప్పావు. సీతమ్మా! రాత్రి సంచరించే జంతువులు తిరగడం మొదలుపెట్టాయి. తపస్వులు, సాదుకునే జింకలతో శయనించారు. చూశావా? రాత్రి చాలా గడిచింది. చంద్రముఖీ! ఆకాశం నక్షత్రసమూహంతో ప్రకాశిస్తున్నది. వెన్నెల ముసుగేస్తుంటే చంద్రుడు ఉదయించాడు. అదిగో చూడు. ఇక నువ్వు శ్రీరామచంద్రమూర్తి దగ్గరకు పో. నిన్ను చూడడం వల్ల, నీతో మాట్లాడడం వల్ల నాకెంతో సంతోషం కలిగింది. నేను నీకిచ్చిన చీరెలు, సొమ్ములు, వాసన ద్రవ్యాలు నా ఎదుట ధరిస్తే సంతోషిస్తా”.

సీత అలాగే చేసి అనసూయకు నమస్కారం పెట్టి శ్రీరామచంద్రమూర్తి దగ్గరకు పోయింది. ఆయన సీతను చూసి సంతోషించాడు. అనసూయతొ తనకు జరిగిన సంభాషణ అంతా చెప్పి ముని భార్య తనకు చీరె, పూల దండలు, సువాసన ద్రవ్యాలు ఇచ్చిన విషయం చెప్పింది. మనుష్యులకు లభించని బహుమానాలను చూసి శ్రీరామలక్ష్మణులు సంతోషించారు. ఆ రాత్రి నిద్రపోయి సూర్యుడు ఉదయించగానే లేచి, సంధ్యావందనం లాంటి ప్రాతఃకాల కృత్యాలను తీర్చుకుని, మునీశ్వరుల దీవెనలు తీసుకుని సీతారామలక్ష్మణులు ప్రయాణమయ్యారు.

(వాసుదాసుగారి ఆంధ్రవాల్మీకి రామాయణం మందరం ఆధారంగా)

No comments:

Post a Comment