Monday, July 20, 2020

మహాకవి బమ్మెర పోతనామాత్య ప్రణీత.....శ్రీ మహాభాగవతము, దశమ స్కందం-ఉత్తర భాగం


మహాకవి బమ్మెర పోతనామాత్య ప్రణీత
(రామకృష్ణ మఠం, హైదరాబాద్ ప్రచురణ)
శ్రీ మహాభాగవతము, దశమ స్కందం-ఉత్తర భాగం
భగవదనుగ్రహంతో చదవడం పూర్తయింది
వనం జ్వాలా నరసింహారావు
          కంII    చదివెడిది భాగవతమిది,
                   చదివించును కృష్ణు, డమృతఝరి పోతనయున్
                   చదివినను ముక్తి కలుగును
                   చదివెద నిర్విఘ్నరీతి ‘జ్వాలా మతినై
శ్రీ మహాభాగవతం అనే ఈ మహా పురాణాన్ని సహజ పాండిత్యుడు, బమ్మెర పోతనామాత్యుడు రచించాడు. డాక్టర్ పులిగడ్డ విజయలక్ష్మి గారు అనువదించారు. 392 పేజీల ఈ దశమ స్కందం ఉత్తర భాగంలో శ్రీకృష్ణావతార ఘట్టంలో భాగంగా, ప్రద్యుమ్నకుమార చరిత్ర దగ్గరనుండి మృతులైన విప్రసుతులను శ్రీకృష్ణుడు తీసుకుని రావడం వరకు 48 అంశాలున్నాయి. చివరగా పద్దేనిమంది రుక్మిణీ-కృష్ణ తనయుల  క్లుప్త వివరాలతో కూడిన అంశం కూడా వుంది. క్లుప్తంగా ఆ 48 అంశాల వివరాలు:
ప్రద్యుమ్న జననం, సత్రాజిత్తుకు సూర్యుడు శమంతకమణిని ఇవ్వడం, దాన్ని అపహరించడానికి ఒక సింహం సత్రాజిత్తును చంపడం, ఆ సింహాన్ని జాంబవంతుడు చంపి మణిని కొనిపోవడం, మణిని కృష్ణుడే దొంగిలించాడని సత్రాజిత్తు నిందవేయడం, కృష్ణుడు తనమీద పడ్డ నిందను మాపుకోవడానికి జాంబవంతుడిని గెలిచి మణిని-ఆయన కూతురు జాంబవతిని తీసుకు రావడం, జాంబవతిని కృష్ణుడు వివాహమాడడం, సత్రాజిత్తుకు మణి ఇవ్వడం, సత్యభామతో పరిణయం ఉన్నాయి.
పాండవులు లక్క ఇంటిలో దగ్దమైనారన్న వార్తా విని బలరామకృష్ణులు హస్తినాపురానికి పోవడం, వారి క్షేమ సమాచారాలు తెలుసుకోవడం, అక్కడున్నప్పుడే శతధన్వుడు సత్రాజిట్టుని చంపి శమంతక మణిని తీసుకెళ్ళాడన్న వార్త వినడం, కృష్ణుడు ద్వారకకు వచ్చి శతధన్వుడుని చంపడం, మణికొరకు అతడిదగ్గర వెతకడం, మిథిలానగారానికి పోయిన బలరాముడి దగ్గర దుర్యోధనుడు గదా విద్య నేర్వడం, అక్రూరుడి దగ్గర మణిని కనుగొనడం, ఖాండవ దహనం, అగ్నిపురుషుడు అర్జునుడికి అక్షయ తూణీర గాండీవం ఇవ్వడం, మయుడు ధర్మరాజుకు సభ నిర్మించి ఇవ్వడం ఉన్నాయి.
కాళిందిని, మిత్రవిందను, నాగ్నజితీ, భద్రామద్ర కన్యలను శ్రీకృష్ణుడు వివాహం చేసుకోవడం, నరకాసుర వధ, అతడితో యుద్ధంలో సత్యభామ పాల్గొనడం, నరకుడు బంధించిన పదహారువేల మంది రాజకన్యలను విడిపించి కృష్ణుడు వివాహం చేసుకోవడం, పారిజాతాపహరణం, ప్రద్యుమ్నుడి వివాహం, అనిరుద్ధుడి జననం, రుక్మి-బలభద్రుల జూదం, రుక్మి వధ, బాణాసురుడి కూతురు ఉషాకన్య అనిరుద్ధుడిని కలలో చూసి మోహించడం, ఉషాకన్య స్నేహితురాలు చిత్రరేఖ అతడిని తెచ్చి ఆమె అంతఃపురంలో వుంచడం, అనిరుద్ధుడిని బాణాసురుడు నాగపాశ బద్ధుడిని చేయడం, కృష్ణ-బాణాసుర యుద్ధం, అందులో భాగంగా శివ-కేశవుల యుద్ధం, బాణాసురుడి ఓటమి, ఉషా-అనిరుద్ధుల వివాహం ఉన్నాయి.          
బలభద్రుడి ఘోషయాత్ర, కాశీపురంలో కృష్ణుడు క్రుత్యను సంహరించడం, బలరాముడి చేతిలో ద్వివిడుదు అనే వానరవీరుడి చావు, సాంబుడు దుర్యోధనుడి కూతురు లక్ష్మణను ఎత్తుకుని రావడం, అతడిని బంధించిన కౌరవాదులు, బలరాముడు వారిమీద కోపగించి హస్తినాపురాన్ని గంగలో వేయడానికి సంసిద్ధంకావడం, కౌరవులు భయంతో సాంబుడిని లక్ష్మణ సహితంగా అప్పచెప్పడం, నారదుడి శ్రీకృష్ణుడిని ఒకేసారి పదహారు వేల మంది భార్యలతో ఒకే రూపంలో చూసి ఆశ్చర్యపోవడం, ధర్మరాజు రాజసూయ ఆరంభం, దిగ్విజయం, భీముడి చేతిలో జరాసంధ వధ, రాజసూయ యాగం నెరవేర్చడం, శిశుపాల వధ, సుయోధనుడు మయ నిర్మిత సభా భవనంలో పరాభవం మొదలైనవి ఉన్నాయి.
ఇంకా: సాళ్వుడు అనేవాడు తపస్సు చేసి సౌంబక మనే విమానం సంపాదించి దానిమీద ద్వారక మీదకు దండయాత్రకు పోవడం, యాదవ-సాళ్వ యుద్ధం, కృష్ణుడు సాళ్వుడిని చంపడం, శిశుపాలుడి తమ్ముడు దంతవక్త్ర వధ, కౌరవ-పాండవ యుద్ధం ఉహించి బలరాముడు తీర్థయాత్రలకు పోవడం, అందులో భాగంగా నైమిశారణ్యం పోవడం, అక్కడ సూత మహర్షి మీద కోపం వచ్చి చంపడం-తిరిగి బతికించడం, మహేంద్ర నగ ప్రవేశం, పరశురామ సందర్శనం, అగస్త్యుడి దర్శనం, తీర్తయాత్రాలలో ఉన్నప్పుడే బలరాముడు భీమ-దుర్యోధన ద్వంద యుద్ధం గురించి విని హస్తినాపురం పోవడం, వారిని నివారించలేక ద్వారకకు పోవడం ఉన్నాయి.


ఇంకా: కుచేలోపాఖ్యానం, శ్రీకృష్ణుడు పరివారంతో కలసి శ్యమంతపంచక తీర్థానికి పోయి కృత స్నానం చేసి అక్కడ కొన్నాళ్లు ఉండడం, పాండవ-కౌరవాది సమస్త రాజ లోకం అక్కడికి రావడం, కుంతీదేవి దుఃఖం, నంద-యశోదా సహితులై గోపా-గోపికా జనం అక్కడికి రావడం, మద్ర కన్యా ద్రౌపదీ సంభాషణ, వచ్చినవారంతా శ్యమంతపంచక తీర్థంలో స్నాలు చేయడం, మరలి తమ ప్రదేశాలకు పోవడం, కృష్ణుడిని దర్శించడానికి మునీంద్రులు రావడం, వారి అనుమతితో వసుదేవుడు యాగం చేయడం నంద-యశోదాది గోపిఅకా పరివారం తమ స్వస్థలాలకు  పోవడం, అర్జునుడు సుబధ్రను వివాహమాడడం, శ్రుతదేవజనకుల చరిత్ర, శ్రుతి గీతాలు, హర-హరి-బ్రహ్మల తారతమ్య చరిత్ర, కుశస్థలి లోని బ్రాహ్మణ చరిత్ర, అతడి కొడుకులను కృష్ణార్జునులు పరలోకానికి యోగబలంతో పోయి తేవడం, ద్వారకలో అర్జునుడు పోయిన తరువాత కృష్ణుడు భార్యలతో విహరించడం, యాదవ సృష్టి భోజాందక వంశ చరిత్ర మొదలైన అంశాలు ఈ దశమ స్కందంలో ఉత్తర భాగంలో ఉన్నాయి.
రుక్మిణీ-శ్రీకృష్ణులకు పద్దెనిమిది మంది తనయులనే విషయం ఉండీ స్కందంలో. వారి పేర్లు వరుసగా: ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు, దీప్తిమంతుడు, భానుడు, సాంబుడు, మిత్రుడు, బృహద్భానుడు, మిత్రవిందుడు, వృకుడు, అరుణుడు, పుష్కరుడు, దేవబాహుడు, శ్రుతదేవుడు, సునందనుడు, చిత్రభానుడు, వరూధుడు, కవి, న్యగ్రోధుడు. వాస్తవానికి శ్రీకృష్ణ పుత్రుల సంఖ్య (పదహారు వేల నూటా ఎనిమిది మంది భార్యలకు) లెక్కపెట్టడానికి పదివేల సంవత్సరాల కాలమైనా చాలదు. శ్రీకృష్ణ పుత్రులు అంతా మహావీరులై, చిరంజీవులై, బ్రహ్మజ్ఞాన సంపన్నులై కీర్తికెక్కారు. వారికి విద్యాబుద్ధులు నేర్పించడానికి నియమితులైన గురువులే మూడు కోట్ల ఎనబై ఎనిమిది వేలమంది!!!
ఇవన్నీ చదవగలగడం పూర్వజన్మ సుకృతం.  

No comments:

Post a Comment