వెలుతురు ఉండగానే జాగ్రత్తపడాలి
స్వర్గీయ డాక్టర్ అయితరాజు
పాండు (ఎపి) రంగారావు
మనతెలంగాణ దినపత్రిక
(16-07-2020)
జీవితంలో
సాయంసంధ్యకి చేరుకున్నవాళ్లని సమాజం మర్యాదగా పెద్దవాళ్లనీ, సీనియర్ సిటిజెన్లనీ (వయోదిక వృద్ధులు) సంభోదిస్తారు. వారికి కొన్ని సహజ లక్షణాలు ఉంటాయి.
వాళ్ల పుట్టినరోజు
వేడుకకు కేక్ ఖరీదు కంటే కొవ్వొత్తుల ఖరీదు ఎక్కువవుతుందనడంలో
విడ్డూరమేంలేదు. వయసునిబట్టి కదా
కొవ్వుత్తులు పెట్టేది. కారు కంటే
పడకకుర్చీ సదుపాయంగా ఉండాలని అనుకుంటారు.
ఎన్ని హామీలు వాళ్లు ఇచ్చినా, నిలబెట్టుకునేందుకు శరీరం
సహకరించదు. అసలు మతిమరుపు ఎప్పుడు
మొదలైందో కూడా మరిచిపోతారు. రంగుపులిమితే తప్ప, జుట్టు వెండిలా
నెరిసిపోతూంటుంది. అసలంటూ ఉండవలసిన నెత్తిమీదకంటే ముక్కు, చెవులు వంటి ఇతర ప్రదేశాల్లో జుట్టు ఎక్కువ వుంటుంది. ఇంతకుముందు నవ్వు కనిపించే ముఖంలో ఇప్పుడు
ముడతలు కనిపిస్తాయి. ఒకప్పుడు ఇంట్లో
అవసరం కొద్దీ అలవాటు చేసుకున్న చెముడు, ఇప్పుడు నిజమై
కూర్చుంటుంది. మూడోకాలు అని ముద్దుగా
పిలుచుకునే చేతికర్ర తోడు వచ్చేస్తుంది.
నోట్లో పళ్లు వుంచుకుని నిద్రపోయే రోజులు ముగిసిపోతాయి. దృష్టి లోపిస్తుంది. ఎంతగా అంటే, అక్కడ నిలబడ్డది భార్యో
లేక ముద్దుగుమ్మో తేడా తెలుసుకోలేనంత. ఇంకా చెప్పాలంటే దూరంగా పేపర్ పెట్టుకుని
చదవాలంటే చేతుల పొడుగు సరిపోనంత. మూత్ర విసర్జన ఆపుకోలేక నాలుగేళ్ల పిల్లాడిలా
బట్టలు తడిపేసుకోవడం మామూలే. అన్నీ తెలిసినట్టే
ఉంటాయి కానీ ఒక్కటీ గుర్తుకి రాదు. ఎక్కడ
ధృఢంగా ఉండాలనుకుంటారో అక్కడ తప్ప మిగతా ఒళ్ళంతా బిగుసుకుపోయి ఉంటుంది.
ఇవండీ సమాజం గౌరవంగా పెద్దవాళ్లని పిలిచే ముసలివాళ్ల లక్షణాలు.
అంతే కాదండోయ్, ఇంకా కొన్ని సమకూర్చుకునే అవకాశం ఉంది.
బ్లడ్ ప్రెషర్,
డయాబెటిస్, థైరాయిడ్ సమస్య మొదలైనవాటితోపాటు
కొన్ని ప్రమాదకరమైన వ్యాధులు కూడా ఆ కోవలోకే వస్తాయి. ముఖ్యంగా వయసు మళ్లినవాళ్లలో
వ్యాధి నిరోధక శక్తి లేకపోవడం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది, కాన్సర్,
మతి స్థిమితం లేకపోవడం, క్రమంగా ఆరోగ్యం
క్షీణించడం వగైరాలు ఎక్కువగా కనిపిస్తాయి.
ముందే చెప్పినట్లు వినికిడి శక్తి తగ్గడం, దృష్టి లోపించడం,
కీళ్ల నెప్పులు వగైరాలు సరేసరి. వీటికితోడు శరీరం పట్టు తప్పడంవల్ల కింద
పడిపోయే ప్రమాదం,
దానిమూలంగా దెబ్బలు తగలడం, ఎముకలు విరగడం,
అంగవైకల్యం రావడం కూడా సాధారణంగా ఎదురౌతూంటాయి.
ఇంతకు ముందు
రోజుల్లో అయితే ఈ సమస్యలన్నీ అరవై యేళ్లు దాటాక మొదలయ్యేవి. ఇప్పుడు ఇంకా చిన్నవయసు వాళ్లలో కూడా
కనిపిస్తున్నాయి. అంటే వృద్ధాప్యానికి
నిర్వచనం మార్చాలేమో! జీవితంలో సాయం
సంధ్యాసమయం పెరుగుతుందేమో!
దానికి కారణం
ఏమిటంటే ఫాన్లు,
ఎయిర్ కండీషనర్లు మొదలైన అధునాతన సౌకర్యాలు పెరిగేకొద్ది
కొన్ని సమస్యలూ పెరిగాయి. సహజంగా ఒంటికి
పట్టవలసిన చెమట పట్టడం తగ్గిపోయింది.
అందువల్ల చెమట ద్వారా శరీరంలోంచీ బయటకు వచ్చే వ్యర్థాలు లోపలే
పేరుకుపోతున్నాయి. కార్లు, బైకులూ వగైరా వాహనాల మీద ఆధారపడటం ఎక్కువయ్యేకొద్ది నడక తగ్గింది. శారీరకంగా
చుఱుకుదనం తగ్గింది. శరీరం ధృఢంగా ఉండటం
లేదు. ఇంకా చెప్పాలంటే, మనిషి తన భౌతిక సామర్థ్యాన్ని సరిగా వినియోగించకపోవడం వలన, ఆధునిక సదుపాయాలమీద ఎక్కువగా ఆధారపడటం వల్ల, కాలుష్యం వల్లా ఆరోగ్యం దెబ్బతింటోంది.
అయితే, ఆధునిక కాలంలో పెరిగిన వైద్య సదుపాయాల మూలంగా, ఆరోగ్య రక్షణ మూలంగా జీవన ప్రమాణం పెరుగుతోంది. ఎన్నో చికిత్సా విధానాల వల్ల పెద్దతనంలో వచ్చే
జబ్బుల నుంచి,
వైకల్యాల నుంచి ఉపశమనం లభిస్తోంది. కానీ దీనివల్ల చివరి
రోజులు ఇంకా దుర్భరంగా తయారౌతున్నాయి.
ఆధునిక వైద్యవిదానం జబ్బులతో సహజీవనం చేసేందుకా అన్నట్లు జీవిత (చరమ)
కాలాన్ని పొడిగి స్తోంది.
అంతేకాదు, కుటుంబ నియంత్రణామార్గాల పుణ్యమా అని ఒకళ్లో లేదా ఇద్దరో పిల్లలు మాత్రమే
పుట్తున్నారు. మొదట పుట్టిన ఇద్దరు అన్ని రకాలుగా ఆరోగ్యవంతులవుతారా? కాదా? చెప్పలేం. కాకపోతే వారు అలా ఉండే విధంగా సదుపాయాలు పెరిగాయి. ఇద్దరు దాటకుండా జాగ్రత్త పడుతున్నారు.
దీనిమూలంగా యువతకీ,
వృద్ధులకీ మధ్య నిష్పత్తి పెరిగిపోతోంది. యవత తగ్గిపోవడంతో
వృద్ధులను పట్టించుకునేవారూ తగ్గుతున్నారు.
గత కొన్ని
దశాబ్దాలుగా పెరిగిన శాస్త్రీయ పరిశోధనల వలన రవాణా, సమాచారం,
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మొదలైన రంగాల్లో వస్తున్న అభివృద్ధి
మూలంగా జీవన విధానాల్లో చాలా మార్పు వస్తోంది.
దర్జాగా ఆఫీసులో కూర్చుని, బట్టలు నలగకుండా
ఉద్యోగాలు చెయ్యాలనుకునే వాళ్లు పెరిగారు.
ధానితో వలసలు పెరిగి, తరాల మధ్య భౌతిక దూరం
ఎక్కువౌతోంది. ఇంతకుముందు రక్షణకవచంలా
ఉన్న ఉమ్మడికుటుంబ వ్యవస్థ
కనుమరుగౌతోంది. ఒకరి మీద ఒకరు
ఆధారపడే అవకాశాలు సన్నగిల్లుతున్నాయి.
పిల్లాపాపలతో దగ్గరితనం పోయి, దూరం రానురాను
పెరిగిపోతోంది.
మరి పెద్దవారి
పరిస్థితి ఏమిటి?
పిల్లల విషయంలో ఐతే ఎప్పుడు బోర్లపడతారో, ఎప్పుడు కూర్చుంటారో,
ఏ వయసులో పాకుతారో, నడుస్తారో, పరుగులు తీస్తారో షుమారుగా చెప్పవచ్చు.
మాట్లాడలేకపోవడం,
నడవలేక పోవడం మొదలైనవి చిన్నపిల్లలలో లోపాల క్రింద లెక్క
రావు. ఏది రావలసిన వయసులో అది
వస్తుంది. కానీ పెద్దతనంలో అలా కాదే! ఏ
అంగం ఎప్పుడు పనిచెయ్యడం మానేస్తుందో ముందుగా వూహించలేము.
ఈ లోటుపాట్లు
ఒక్కొ వృద్ధునిలో ఒక్కొక్క వయసులో వస్తాయి.
ఎప్పుడైతే సమస్యలలో సారూప్యం వుండదో, దాని నివారణ, చికిత్స మార్గాలలో కూడా పోలిక ఉండదు.
అది వ్యక్తికి,
వ్యక్తికి మారిపోతూంటుంది.
అలంటి సమయాల్లోనే వారికి తోడు అవసరం.
ఆ తోడు దైనందిన కార్యక్రమాల కోసం కావచ్చు, కాలక్షేపం కోసం కావచ్చు, యొగక్షేమాలు చూసేందుకు
కావచ్చు. అంతేకాదు. ఆస్తిపాస్తులు చూసుకునేందుకు, చిన్న చిన్న సపర్యలకు,
ప్రయాణాలలో సహాయంగా ఉండేందుకు, మంచం పట్టినప్పుడు సేవలకు తోటి మనిషి అవసరం ఉంటుంది.
ఇంతేకాకుండా
వయోవృద్ధులు ఉమ్మడి కుటుంబాలలో, సంఘంలో కీలక పాత్ర
పోషించేవారు. మనుషుల మధ్య విభేదాలు
వచ్చినప్పుడు పెద్దవాళ్లు వారి అనుభవ జ్ఞానంతో మధ్యవర్తిత్వం వహించి రాజీకి కృషి
చేసేవారు. చిన్నవాళ్లలో నైతిక విలువలు
పెరగడంలో వీరి పాత్ర ఎంతో ఉండేది.
సాధారణంగా తరతరాలుగా వ్యవసాయం, కులవృత్తి, మొదలైనవాటిలో ఉండడం వల్ల, అందరూ ఒకేచోట కూర్చుని
పిచ్చాపాటీ మాట్లాడుకుంటూ కాలక్షేపం చెయ్యడం వల్ల, ఇది సాధ్యమయ్యేది. ఇప్పుడు
అలాకాదు. కొడుకు పనిచేస్తున్న రంగంలో
తండ్రికి బొత్తిగా పరిజ్ఞానం ఉండటంలేదు.
కనుక తాను చిన్నప్పటినుంచీ సమకూర్చుకున్న అనుభవం ఇక్కడ పనికి రాదు. ఒకేచోట ఉండడం కూడా అరుదే.
ఇప్పుడు కుటుంబంలో
పెద్దవాళ్ల పాత్ర చాలా అయోమయంగా ఉంది. వాళ్లు కష్టపడి సంపాదించుకునే స్థితిలో
ఉండరు. రిటైర్మెంట్ వయసు వచ్చేప్పటికి
ఉద్యోగ జీవితం ముగిసిపోతుంది. చాలా
తక్కువమందికి మాత్రమే పెన్షన్ సదుపాయం ఉంటుంది. లాయర్లు, డాక్టర్లు,
రాజకీయవేత్తలూ, వ్యాపారస్తులు మొదలైన
అదృష్టవంతులు భౌతికంగానూ,
మానసికంగానూ ఓపిక ఉన్నంతకాలం సంపాదించుకోగలరు. ఏది ఏమైతేనేం ఒక వయసు దాటాక ఒక కొత్త
"రక్షణ కవచం" అందరికీ కావాలి.
ధనిక వర్గాలకు
చెందిన వాళ్లు తమకు అవసరమైన రక్షణ కవచాలు తామే ఏర్పాటు చేసుకునే అవకాశం
ఎక్కువ. ఆరోగ్యం గురించి జాగ్రత్త
పడగలరు. సంపాదించిన ఆస్తిపాస్తులతో జీవితం
సాఫీగా నడిచిపోతుంది. ముందే భాగస్వామి
మరణించివుంటే,
మరీ ఒంటరితనం అనిపిస్తే మళ్లీ పెళ్లి చేసుకోగలరు. ఎంత ఖర్చైనా వెనుకాడకుండా మనుషులను పెట్టుకుని, తమ అవసరాలకు తగిన సేవలు పొందగలరు.
అవసరమైన వైద్య సదుపాయాలు పొందగలరు. అదే పేదలైతే చాలా దేశాల్లో ప్రభుత్వాలు
వృద్ధుల తిండితిప్పలకు లోటు లేకుండా ఆర్థిక సహాయం అందిస్తాయి. సబ్సిడీలు ఇస్తాయి.
ఎటూకాని పరిస్థితి
మధ్యతరగతి వాళ్లదే. వాళ్ల కోరికలకు హద్దు
ఉండదు. ఆదాయం వంటి మరొక రక్షణ కవచం ప్రయత్నిస్తారు కానీ ఫలితం ఉండకపోవచ్చు. తలరాతని
తిట్టుకుంటూ,
నిస్సహాయ స్థితికి కుమిలిపోతూ, తమకంటే మంచి స్థితిలో ఉన్నపక్కవాళ్లని చూసి అసూయ పడుతూ బతుకుతారు. వాళ్లు సంపాదించే రోజులలో దాచుకున్నది, విదేశాలకు వెళ్లో లేక దేశంలోనే వుద్యోగాల ద్వారానో సంపాదించి, పిల్లలు పంపించినది,
సాధారణంగా తాత్కాలిక వైద్యానికి ఖర్చైపోతాయి. మిగిలిన జీవితం హాస్పిటల్ మెట్లు ఎక్కి దిగడంలో
గడిచిపోతుంది. చికిత్స లేని కాన్సర్ వంటి
ప్రాణాంతక వ్యాధుల విషయానికొస్తే తాత్కాలిక ఉపశమనం కోసం చూడక, ఖరీదైన చికిత్స వైపు మొగ్గు చూపుతారు.
అలాంటి
పరిస్థితిలోనే వాళ్లకి అవసరమైన సేవలు, సపర్యలు అందించేందుకు, సంఘటిత పరిచేందుకూ వీలుగా ఏక గవాక్ష (సింగిల్ విండో) సదుపాయం
అవసరమౌతుంది. ఐతే ముఖ్యంగా వారు
“డాక్టర్స్ డైలెమా” అన్న నాటకంలో బెర్నార్డ్ షా అన్న "శాశ్వతంగా బతకాలని
ప్రయత్రించకు. సాధించలేవు" అన్న
మాటలు గుర్తుంచుకోవాలి.
నిజమే. మరణం నుంచి
ఎవరూ తప్పించుకోలేరు. దానికి సిద్ధంగా
ఉండవలసినదే.
తనకి చేతనైన
జాగ్రత్తలు ఎన్ని తీసుకున్నా మరణాన్ని జయించలేని మనిషి, ఇంకెవరో ఏదో చేసి తనను శాశ్వతంగా బతికిస్తారనుకోవడంలో అర్థం లేదు. ఆరోగ్యం
సహకరించినంత కాలం ఉన్న శక్తిని ఉపయోగించుకోవడమే. అంతే మనం చేయగలిగినది. మరణించాక మనతో ఆరోగ్యాన్ని తీసుకువెళ్లలేము
కనుక బతికి ఉన్నన్నినాళ్లు ఉపయోగించుకోవడమే మనం చెయ్యవలసినది.
మన శక్తిని మించి
అలోచించకూడదు. వాస్తవానికి దగ్గరగా
ఉండాలి. ఉమ్మడికుటుంబాలలో మునుపు ఉన్న
భద్రత, రక్షణ కవచం ఇవాళలేవు. గతం గతః. మనమే మనవంటివారిని నలుగురిని కలుపుకుని, పరస్పర సహకారంతో మనచుట్టూ మనమే రక్షణ కవచం ఏర్పాటు చేసుకోవడమే ఈ చరమదశలో మనం
చెయ్యగలిగినది. వెలుతురు ఉన్నప్పుడే మనం
జాగ్రత్త పడాలి.
(దీని మూల రచయిత స్వర్గీయ
డాక్టర్ ఎపి రంగారావు గారు ఇంగ్లాండ్ లో చాలాకాలం వైద్య వృత్తిలో ఉండి, భారతదేశానికి తిరిగివచ్చారు. వీరే 108, 104 వంటి ఆంబులెన్స్ సేవలకు, టెలిమెడిసిన్ సేవలకు
రూపశిల్పి. వారు ఈ ఆర్టికల్ ఆంగ్లంలో రచించారు.
దీనికి వనం జ్వాలా నరసింహారావు మెరుగులు దిద్దారు)… అనువాదం: లంక నాగరాజు
No comments:
Post a Comment