ముద్దుబిడ్డ-రిలీజ్ కాని
మొదటి ఎనిమిది రీళ్లు
స్వర్గీయ కేబీ తిలక్
జ్ఞాపకాలు-అనుభవాలు
వనం జ్వాలా నరసింహారావు
ప్రజాతంత్ర, సంపూర్ణ స్వతంత్ర వారపత్రిక
(ఆగస్టు 27 - సెప్టెంబర్
2,2000)
శరత్
బాబు నవల ఆధారంగా ఆరుద్ర స్ర్కిప్ట్ తయారు చేసిన రెండింటిలో ‘దీక్ష’ను ప్రకాశరావు
గారు ఎంచుకోగా, మరోటి ‘ముద్దుబిడ్డ'ను తిలక్ గారు సెలెక్ట్ చేసుకున్నారు తన సినిమాకు కథావస్తువుగా. ముద్దుబిడ్డ సినిమాను తీసే ఆలోచన రాకమునుపే
ఖమ్మం జిల్లాకు చెందిన మన్నెగుడం వెంకటరెడ్డి, నాగులవంచ ఉపేంద్రరెడ్డి, వరంగల్ జిల్లాకు చెందిన ఆర్ సురేంద్రరెడ్డి (మాజీ ఎంపి)
గార్లతో తిలక్ కు వున్న సాన్నిహిత్య పరిచయం వల్ల, అందరూ
కల్పి హైదరాబాద్ లో ఒక స్టూడియో నిర్మిస్తే బాగుంటుందన్న ఆలోచన వైపుగా మల్లింది.
దరిమిలా హైదరాబాదు రావడం,
హైదరాబాద్ వరంగల్ రహదారిపైనే ఉప్పల్ సమీపంలో మాజీ ఐఎఎస్.
అధికారి రామిరెడ్డిగారి స్థలాన్ని చూడటంకూడా జరిగింది. కారణాలు ఏమైతేనేమి, స్టూడియో మాత్రం
రూపుదిద్దుకోలేదు.
శ్రీయుతులు
వెంకటరెడ్డి, సురేంద్రరెడ్డి, ఉపేంద్రరెడ్డితో పాటు మద్రాసు రేసు కోర్సులో మెంబరైన అపోలో ఆసుపత్రుల అధినేత
శ్రీ పిసి రెడ్డితో కూడ తిలక్ కు పరిచయం. ఆయనా రేస్ క్లబ్ మెంబరే. ఓసారి ఉపేంద్రరెడ్డి ఇంట్లో తిలక్ ప్రోద్బలంతో
ఉపేంద్రరెడ్డి సోదరితో తెలంగాణా పాటలు పాడించారు. ఆమే శ్రీ పిసిరెడ్డి భార్య.
స్టూడియో
ప్రయత్నాలు మానేసి ‘ముద్దుబిడ్డ'
సినిమా తీసే కార్యక్రమం ప్రారంభించారు తిలక్. తన
దర్శకత్వంలో అనుపమా ఫిల్మ్స్ సమర్పణ క్రింద తన ప్రయత్నాలకు ఎందరో దోహదపడ్డారని
అంటారు తిలక్. ఆరోజుల్లోనే, అప్పట్లో
ఆకాశవాణిలో పనిచేస్తున్న కొంగర జగ్గయ్యని ప్రముఖ నవలా రచయిత శ్రీ గోపీచంద్ తిలక్
కు పరిచయం చేసారు. తాపీ ధర్మారావు - ఆరుద్ర గార్ల ‘కలెక్టివ్ స్పిరిట్’ తో
డైలాగులు రూపు దిద్దుకున్నాయి.
స్క్రిప్టుకు ముందు తాపీని సంప్రదించగా, మొదట్లో ‘ముడి’ వుండాలి నాయనా అని ఆయన ఇచ్చిన సూచన మేరకు
కథను మలచారు.
అప్పట్లో
తిలక్ గారి సంస్థ ప్రభాత్ ఫిల్మ్స్ లో ఆయనతో పాటు ఉపేంద్రరెడ్డి, వెంకటరెడ్డి, సురేంద్రరెడ్డిలు
భాగస్వాములు. ఆంధ్ర ప్రాంతానికి తన ప్రభాత్ ఫిల్మ్ నే డిస్ట్రిబ్యూషన్ కంపెనీగా
నిర్ణయించుకున్నారు. అదే విధంగా,
ఆలిండియా పూరిగారి ‘ఆల్ ఇండియా ఫిల్మ్స్’ సంస్థకు చెందిన
హిందీ సినిమాలకు మాత్రమే డిస్ట్రిబ్యూషన్ కంపెనీగా పనిచేసే ‘నవయుగ ఫిల్మ్స్’
హైదరాబాద్ లో వుండేది. నవయుగ ఫిల్మ్స్ వారు ఓం ప్రథమంగా నిజాం ప్రాంతానికి
డిస్ట్రిబ్యూషన్ కంపెనీగా వ్యవహరించింది తెలుగు చిత్రాలకు సంబంధించినంత వరకు
‘ముద్దుబిడ్డ' సినిమానే. ఇక రాయలసీమకు చెందినంతవరకు మంగరాజు ఆధ్వర్యంలోని ‘పూర్ణ పిక్చర్స్'ను ఎంపిక
చేసుకున్నారు. ఇలా మూడు ప్రాంతాలకు మూడు డిస్ట్రిబ్యూషన్ కంపెనీలను సెలెక్ట్
చేసుకుని సినిమా తీసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
ఇక
ప్రధాన భూమికను ఎవరు పోషించాలన్న విషయంలో కొంత తర్జన భర్జన జరిగింది.
తిలక్-ప్రకాశరావుతో శ్రీమతి జి వరలక్ష్మి చాలా సన్నిహితంగా వుండేవారు. ఆ కారణానో
లేక ఓ వినూత్నమైన కారెక్టర్ తీసుకోవాలన్న కోరికో.... ప్రధాన భూమిక తనకే ఇవ్వాలన్ని
ప్రతిపాదన చేసారు వరలక్ష్మి. అయితే తాను ఊహిస్తున్న ఆ కారెక్టర్ కు ఓ రకమైన
వైవిధ్యం అవపరమనీ, 'గర్వం' 'స్వాభిమానం' సమతూకంలో చూపించగల మనిషి ఒక్క ‘జమున’ మాత్రమేననీ, ఆమెనే ఆ పాత్రకు
ఎంపిక చేసామనీ అన్నారు తిలక్. జమున తోటి కోడలుగా (వదినగారి పాత్రను) యాక్టు చేసారు
శ్రీమతి వరలక్ష్మి, రిలీజ్ చేయని మొదటి ఎనిమిది రీళ్ల సినిమాలో.
జమున-జగ్గయ్యల
కాంబినేషన్ లో ఓ నాటక బృందం ఉండేదారోజుల్లో.
ఆపాటికే జమున పుట్టిల్లు సినిమాలో నటించారు. అయితే కళాకారిణిగా పేరు
తెచ్చుకుని స్థిరపడిపోయేందుకు ముద్దు బిడ్డ సినిమానే కారణమని చెప్పాలి. సినిమాలోని
జమున కారెక్టర్ మొదట్లో, ఓ బొమ్మతో ఆటపాలతో కాలం గడిపే ఆమాయక ‘రాధ’ పాత్ర.
మొదటి
షాట్లోనే జమున తనే రాధ పాత్రలో బొమ్మను పట్టుకుని పాడుతుందీపాట. “చిట్టి పొట్టి
వరాల మూట- గుమ్మడి పండు గోగు పువ్వు- నీకూ నాకూ ఏవేళైనా ఎడబాటే లేదమ్మా- ఏమంటావే
బొమ్మా- ఎవరూ లేరనిపాటి- పోటీ ఎవరేనీతోటి- ఆటాపాటా, అల్లన మెల్లన - ఆడుకుందామమ్మా- ఏమంటావే బొమ్మా-కాళ్లాగజ్జా
కంకాళమ్మ- వేగులచుక్కా వెలగాముగ్గా- మీకూ నాకూ ఏవైళైనా ఎడబాటేలేదమ్మా...”.
అలా పాడుకుంటూ, బొమ్మతో
ఆడుకుంటున్న రాధను (జమున) పలహారానికి పిలుస్తే రాలేదని కినుక వహించిన అత్త
సుభద్ర ఆమె చేతిలోని బొమ్మ లాక్కోవటంతో
మూర్చపోతుంది జమున.
మూర్చజబ్బు గల ఆమెను డాక్టర్ గా పనిచేసే జగ్గయ్యకు ఇచ్చి
పెళ్లిచేస్తే మంచిదన్న ఆలోచన కలగటమే తాపీగారు సూచించిన 'ముడి’. కథ అలా
కొనసాగి జగ్గయ్య సోదరుడు నాగయ్య గారి బిడ్డనే ముద్దుబిడ్డ'గా జమున ఆమె
తోటికోడలు (మొదలు శ్రీమతి జి. వరలక్ష్మి - ఆ తర్వాత రిలీజైన సినిమాలో శ్రీమతి
లక్ష్మీరాజ్యం) పెంచుకుంటారు.
ప్రజానాట్య
మండలికి చెందిన పలువురు కళాకారులు యీ సినమాలో నటించారు. నటీనట వర్గంలో శ్రీయుతులు
నాగయ్య, జగ్గయ్య, లక్ష్మిరాజ్యం, జమున, పెరుమాళ్ళు, రమణారెడ్డి, కుటుంబరావు, వర్మ, సూర్యకాంతం, విజయలక్ష్మి, సిఎస్ఆర్, పేకేటి వున్నారు. ఆరుద్రపాటలకు సంగీత దర్శకత్వం పెండ్యాల వహించారు. ఎడిటర్
శ్రీ ఎమ్ వి రాజన్.
సినిమా
ఎనిమిది రీళ్ల షూటింగ్ అయిపోయిన తర్వాత జరిగిందో అనుకోని సంఘటన, ఓ సన్నివేశంలో
వదిన పాత్రలో నటిస్తున్న నాటిమేటి హీరోయిన్ శ్రీమతి జి వరలక్ష్మి తాను చెప్పాల్సిన
ఓ డైలాగును మార్చమని కోరింది. తానూ, తాపీ-ఆరుద్రలు కల్సి ఆలోచించి తయారు చేసిన స్క్రిప్ట్
మార్చే సమస్యలేదని తిలక్ స్పష్టంచేశారు. అర్టిస్టుగా తాను చెప్తే మార్చవలసిందేనని
పట్టుబట్టిన వరలక్ష్మిని టాప్ హీరోయిన్ అని కూడా ఆలోచించకుండా సెట్లోంచి బయటకు
వెళ్లమని చెప్తూ “గెటవుట్” అన్నారు తిలక్. అంతటితో ఆగకుండా షూటింగ్ పాకప్ అని
ఆర్చారు. అందర్నీ ఆశ్చర్యపర్చిన ఆ సంఘటనపై కామెంట్ చేసిన కొందరు ‘డైరెక్టర్ అంటే
అంత పొసెసివ్ నేచర్’ వుండాలని అన్నారు. కెవి రెడ్డి గారి లాంటివారు అభినందనలనూ
అందుకున్నారు తిలక్ ఆమె విషయంలో చేసిన పనికి.
ఇక
ఆ తర్వాత ఏంటే అనే మీమాంస వచ్చిపడింది. లోగడ ‘హరిశ్చంద్ర' సినిమాను ఎవరు
తీయాలన్న విషయంలో జి వరలక్ష్మితో పోటీపడి చివరకు ఆమే ప్రొడ్యూస్ చేసిన శ్రీమతి
లక్ష్మీరాజ్యం గారిని వరలక్ష్మి స్థానంలో ఎంచుకున్నారు తిలక్. హరిశ్చంద్ర సినిమాకు
తిలక్ ఎడిటర్ గా పనిచేశారు.
షూటింగ్
పూర్తి చేసిన ఎనిమిది రీళ్లను ప్రక్కన పెట్టి తిరిగి మొదటి నుండి ప్రారంభించారు.
అయితే మరో సందర్భంలో ముద్దుబిడ్డ సినిమా తోటికోడళ్లు జమున, లక్ష్మీరాజ్యం ఏదో
విషయంలో సెట్లో కీచులాడుకున్నారు. కోపంతో గదిలోకి వెళ్లిన జమునకు సర్ది
చెప్పటానికి సూర్యకాంతంగారిని పురమాయించారు తిలక్. రాయబారం ఫలించింది. తోటికోడళ్లు
సర్దుకుపోయారు. షూటింగ్ కంటిన్యూ అయింది.
ముద్దుబిడ్డలో
జ్యోతి అనే నూతున డ్యాన్సర్ ను పరిచయం చేశారు తిలక్. ఆవిడే పాపులర్ హీరో సాయికుమార్‌కు, అయ్యప్పన్ కు
తల్లి. అదే విధంగా ప్రజానాట్యమండలితో సంబంధమున్న కృష్ణా జిల్లా వాస్తవ్యులు
ఏసుదాసు, అమృతయ్య గార్లతో డప్పులు వాయించారు. అది తొలి అనుభమే. సౌండ్ ఇంజనీర్ జెమిని
కోటేశ్వర్రావుగారు డప్పులు వాయించే సన్నివేశాన్ని రికార్డు చేసారు. మిగతా అన్ని
వాయిద్యాలలో వుండే కంట్రోల్ డప్పుల్లో వుండదు. ఎప్పటికప్పుడు డప్పులను మంటల్లో
వేడిచేస్తూ రెండు మంచి పాటలను రికార్డు చేస్తారు. పులి వేషం వేయించటం మరో
ప్రత్యకత. ఆ వేషాన్ని వేసేనతన్ని బెజవాడ నుండి తెప్పించి శిక్షణ ఇప్పించారు.
డప్పులు
వాయించేవారిగా తిలక్ సినిమాలో పరిచయమైన ఏసుదాసు, అమృతయ్య గార్లు
పరిశ్రమలోనే స్థిరపడగా,
అమృతయ్య కుమారుడు డాక్టరయ్యారు.
(మరిన్ని విశేషాలు మరోసారి)
No comments:
Post a Comment