భారత్ - చైనా బంధం
మళ్లీ గురు - శిష్య సంబంధం కావాలి
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రపత్రిక, విజయవాడ (14-07-2020)
ఇటీవల చైనా దేశపు
సైన్యం వాస్తవాధీన రేఖ (ఎల్.ఓ.సి)ని దాటి భారత భూభాగంలోకి చొరబడిన వార్తలు
వచ్చాయి. వాస్తవాధీన రేఖ వెంబడి చైనా సైనిక దళాలు భారీ సంఖ్యలో మోహరించాయని మన దేశ
రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అంగీకరించారు. భారతదేశం ఇతర దేశాల సార్వభౌమత్వానికీ నష్టం కలిగించబోదని, అదే సమయంలో భారత సార్వభౌమత్వానికి మరే దేశం ద్వారా కూడా ఆపద రానివ్వబోమని
రక్షణ మంత్రి స్పష్టం చేశారు.
రెండు వేర్వేరు
భూభాగాల విషయంలో సార్వభౌమాధికారం గురించి భారత, చైనా దేశాల మధ్య వివదాలు
ఉన్నాయి. అక్షయ్ చిన్ ప్రదేశం, తమ భూభాగమైన లదాఖ్ లో
అంతర్భాగమని భారత్,
కాదు అది తమ స్వతంత్ర ప్రతిపత్తి గల గ్జిన్ జియాంగ్ ప్రాంతంలో అంతర్భాగమని చైనా
ప్రకటించుకోవడం కశ్మీర్ వివదంలో ఒక భాగం అయింది. భారత భూభాగంలోని లదాఖ్ కేంద్ర
పాలిత ప్రాంతానికి,
ఇంకా అరుణాచల్ ప్రదేశ్ కి చెందిన 38 వేల చదరపు కిలోమీటర్ల
భూమి చైనీయుల ఆక్రమణలో ఉంది. అరుణాచల్ ప్రదేశ్ లోని చాలా భాగం తమ దేశపు దక్షిణ
టిబెట్ ప్రాంతానికి చెందినదని చైనా పేర్కొంటోంది, అయితే అది భారత పాలనలో ఉంది.
1962 యుద్ధానికి
పూర్వం, అక్షయ్ చిన్ భారత ప్రభుత్వం ఆధీనంలోనే ఉండేది. చైనీయులు టిబెట్ ని
ఆక్రమించున్న సమయంలో వారు లదాఖ్ లో భాగమైన అక్షయ్ చిన్ ని కూడా ఆక్రమించారు. అది
చైనా లేదా టిబెట్ లో అంతర్భాగమని చైనీయులు అంటున్నారు. ఈ వివాదాన్ని
పరిష్కరించుకోవాలని రెండు దేశాలూ 1996లో ఒక
అంగీకారానికి వచ్చాయి. "విశ్వాసం పెంపొందించుకునే చర్యలు" చేపట్టడం, ఇంకా వాస్తవాధీన రేఖను గుర్తించే విషయంలోనూ రెండు దేశాలు ఒప్పందం
కుదుర్చుకున్నాయి.
ఇద్దరు భారతీయ
సీనియర్ ప్రభుత్వ అధికారులు ఎం.కె. నారాయణన్ (మాజీ జాతీయ భద్రత సలహాదారు) ఇంకా
విజయ్ గోఖలే (జనవరి 2020 వరకూ విదేశాంగ కార్యదర్శి) అభిప్రాయాల ప్రకారం ప్రస్తుతం వాస్తవాధీన రేఖ
వెంబడి ఏర్పడిన భారత,
చైనా ఘర్షణలు మరింత పెరిగే అవకాశం లేదు. ఈలోగా, భారత,
చైనా విదేశాంగ మంత్రులు చర్చలు జరిపి ఒక ఏకాభిప్రాయానికి
రావాలని,
వివాదాల విషయంలో శాంతియుతంగా వ్యవహరించాలని, అవి వివాదాలుగా మారకుండా చర్యలు చేపట్టాలని అంగీకరించారు.
భారత విదేశాంగ
మంత్రిత్వ శాఖ వర్గాల ప్రకారం, రెండు దేశాల అధినేతల
మార్గదర్శకత్వంలో,
ద్వైపాక్షిక ఒప్పందాల ప్రాతిపదికన సరిహద్దు వివాదం
పరిష్కారానికి సైనిక, దౌత్య చర్చలు కొనసాగించాలని అంగీకరించాయి. రెండు దేశాల సైనిక దళాలు వివాద
భూభాగం నుండి నిష్క్రమణ ప్రక్రియ ప్రారంభించాయన్న భారత ప్రకటనకు స్పందిస్తూ
భారతదేశంతో తమ దేశం ఒక అంగీకారానికి వచ్చిందని చైనా కూడా ప్రకటించింది. ఎట్టకేలకు, మనకు అందిన వార్తల ప్రకారం, సైనిక దళాలు ఉపసంహరణ
సాధ్యమయింది. ఇది స్వాగతించ తగ్గ పరిణామం!
భారత, చైనా దేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలు చాలా ప్రాచీన కాలం నుండి ఉన్నాయి. మన
సంస్కృత రచనల్లో చైనా ప్రస్తాననలు అసంఖ్యాకంగా ఉన్నాయి, కానీ వాటి కాలక్రమం అస్పష్టంగా ఉంది. మహాభారతంలో కూడా చైనా ప్రస్తావన
చాలాసార్లు జరిగింది,
ముఖ్యంగా పాండవులు నిర్వహించిన రాజసూయ యాగంలో చైనీయులు
కానుకలు బహూకరించారనే ప్రస్తావన ప్రముఖమైనది. అర్ధశాస్త్రం ఇంకా మనుస్మృతి లో కూడా
చైనా ప్రస్తావనలు ఉన్నాయి.
హైందవ మతాన్ని ఎన్
సైక్లోపీడియా బ్రిటానికా వివరిస్తూ ఈ మతం ప్రపంచంలోనే ప్రముఖమైన మతం అని పేర్కొంటూ
ఇది భారత ఉపఖండంలో ఉద్భవించిందని ఉద్ఘాటించింది. ఇంకా ప్రపంచంలోనే ఇది అతి
ప్రాచీనమైన మతంగా పేర్కొంది. సంస్కృతంలో, ఇంకా అనేక ప్రాంతీయ
భాషలలో హైందవానికి సంబంధించి చాలా పవిత్ర గ్రంథాలు ఉన్నాయని పేర్కొంటూ, అవి ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు హైందవ మత ప్రచారానికి ఎంతో దోహదం చేశాయని ఎన్
సైక్లోపీడియా బ్రిటానికా వివరించింది. ఈ ప్రచారంలో ఆచారాలు, దృశ్య,
లలిత కళలు కూడా ప్రముఖ పాత్ర పోషించాయని పేర్కొంది. హైందవ
మతాన్ని ప్రపంచవ్యాప్తంగా వంద కోట్ల మంది ఆచరిస్తున్నారని, భారత జనాభాలో 80 శాతం మంది ఈ మతానికి చెందిన వారే అని చెబుతోంది. ప్రపంచవ్యాప్తంగా
విస్తరించినా,
ప్రాంతీయ ప్రామాణికతల ఆధారంగానే ఈ మతం గురించి మరింత అవగాహన
ఏర్పడుతుందని పేర్కొంంటోంది.
"హైందవానికి
ప్రశంస: ఖండాంతరాలలో,
కాలక్రమంలో విస్తరించిన భారతదేశం ఇంకా భారత సంస్కృతి
గురించిన విశేషాలు,
జ్ఞానము" అనే సుష్మా లోంధే రచించిన గ్రంథంలో ప్రపంచ
ప్రసిద్ధ సిద్ధాంతకర్తలూ,
మేధావులు, శాస్త్రవేత్తలు, ఇంకా నాయకుల అభిప్రాయాలు సేకరించి ప్రచురించబడ్డాయి. ఈ గొప్ప వ్యక్తలు
దృష్టిలో హైందవ మతము ఇంకా దాని ఎన్నో సంప్రదాయాల గురించి ఈ గ్రంథం తాజా
దృక్కోణాన్ని ఆవిష్కరిస్తోంది.
పశ్చిమ, ఇంకా తూర్పు దేశాల మేధావులు అనేక మంది హైందవ మతాన్ని గురించి పురాతన కాలం
నుండి చాలా గ్రంథాలు రచించారు. కానీ, ఈ అందమైన వర్ణచిత్రాలతో, దృశ్యాలతో ఈ గ్రంథం హైందవ మతానికి సంబంధించిన అనేక పార్శ్వాల గురించి
కూలంకషమైన సమాచారాన్ని అందిస్తోంది.
ఈ గ్రంథ రచయిత్రి
సుష్మా లోంధే,
భారతీయురాలు అయినా గ్రాడ్యుయేషన్ కోసం అమెరికా వెళ్లారు.
హిందూ మతం గురించి ఇంటర్నెట్ లో సరైన సమాచారం అందుబాటులో లేకపోవడాన్ని గమనించి, ఆమె ఒక సరళమైన విద్యా సంబంధమైన వెబ్ పేజీని ప్రారంభించారు. అప్పటి నుండి, భారతీయ ఆధ్యాత్మిక సంపదని ప్రచారం చేయాలనే తపన కారణంగా అది ఇప్పుడు హిందూయిజం
గురించిన అతి ప్రముఖమైన వెబ్ సైట్లలో ఒకటిగా, విస్తారమైన విశేషాలు ఉన్న
వెబ్ సైట్ గా ప్రపంచ ప్రసిద్ధి పొందింది. సుష్మా లోంధే రాసిన గ్రంథంలో ఎన్నో
ప్రముఖమైన విశేషాలను పేర్కొన్నప్పటికీ, భారత-చైనా సంబంధాల
గురించి విస్తారంగా చర్చించారు.
ఇటీవలి కాలం వరకూ, అంటే దాదాపు రెండు వేళ్ల సంవత్సరాల పాటు భారత-చైనా దేశాల మధ్య సంబంధాలు ఎంతో
శాంతియుతంగా కొనసాగాయి. చారిత్రక, బౌద్ధమత సంబంధమైన అంశాల
కారణంగా ఈ స్నేహపూర్వక అనుబంధం ఎప్పుడూ పరిఢవిల్లుతూ సాగింది. చైనాకు బౌద్ధ
మతాన్ని తొలినాళ్లలో భారతీయ యోగులు పరిచయం చేశారని చెబుతారు, అయితే అంతకు పూర్వమే చైనీయులతో భారతీయుల అనుబంధం ఉన్నట్లు అక్కడక్కడ
ప్రస్తావనలు కనిపిస్తాయి.
హిందూమతము ఇంకా బౌద్ధ మతము, ఈ రెండూ చైనా సాంస్కృతిక యవనిక మీద ప్రగాఢమైన ప్రభావం చూపాయి. చైనీయుల పూర్వపు
మతాచారాలు ప్రకృతి ఆధారితంగా ఉండేవి ఇంకా వైదిక హైందవ ఆచారాలతో పోలిస్తే ఎన్నో
అంశాలు కలిసేవి. ముఖ్యంగా దేవతల ఆరాధన విషయంలో కూడా పోలికలు కనిపించేవి.
డి.పి. సింఘాల్
విరచించిన ఇండియా అండ్ వరల్డ్ సివిలైజేషన్ అనే గ్రంథం ప్రకారం: "చైనా
అంతకుపూర్వం ఎప్పుడూ ఒక సుసంపన్నమైన సదృశ్యమైన మతాన్ని చూసి ఉండలేదు, ఎంతో అందమైన,
ఆకర్షణీయమైన ఆచార వ్యవహారాలను, చాలా ఘనమైన అంతరిక్ష,
ఆదిభౌతిక అంచనాలను కని ఉండలేదు. ఒక దేదీప్యమైన అద్భుతమైన
మెరిసిపోయే వజ్రవైఢూర్యాలతో కట్టిన అత్యద్భుతమైన నిర్మాణాన్ని చూసి... ఒక నిరుపేద
భిక్షువు హఠాత్తుగా చూసి అబ్బురంతో ఆగిపోయిన విధంగా, చైనా కూడా భారతీయ ఆచార వ్యవహారాలను కని ఉద్వేగభరితమై, ఆశ్చర్యచకితమై సంబరపడిపోయింది. ఈ భూరి దాత నుండి ఈ ఆధ్యాత్మిక సంపదను ఉచితంగా
ఇమ్మని ప్రాధేయపడి గ్రహించింది. మొదటగా భారతీయ ఆధ్యాత్మిక జీవనాన్ని గ్రహించింది.
అందుకు చైనా భారత దేశానికి ఎప్పటికీ, ఎంతైనా రుణపడి
ఉండాలి."
లిన్ యుటంగ్
విరచిత 'ది విజ్డమ్ ఆఫ్ చైనా అండ్ ఇండియా' గ్రంధం ప్రకారం, "మతం ఇంకా సృజనాత్మక విషయాలలో భారతదేశం చైనాకు గురువు, ట్రిగనామిట్రీ,
క్వాడ్రాటిక్ ఈక్వేషన్లు, గ్రామర్,
ఫొనెటిక్సు, అరేబియన్ నైట్సు, జంతువుల కథలు,
చదరంగం వంటి విషయాలలోనూ, ఇంకా బొకాషియో, గోథే,
హెర్డర్, స్కోపెన్ హోవర్, ఎమర్సన్,
ఇంకా ప్రాచీనమైన యేసోపు తదితర మహా మేధావులకు స్ఫూర్తిని
అందించిన భారతీయ ఆథ్యాత్మిక చింతన... వీటి విషయాలలో భారత దేశం ప్రపంచానికే గురువు."
"ది విజ్డమ్ ఆఫ్
చైనా అండ్ ఇండియా" అనే గ్రంథంలో భారతీయ, చైనా బౌద్ధ మత గ్రంథాలు, రిగ్వేదం,
ఉపనిషత్తులు, రామాయణం, పంచతంత్రం,
ధమ్మపాదం, తావో, కన్ఫూషియస్,
వంటి అనేక గ్రంథాలలోని అంశాల గురించి ప్రస్తావనలు ఉన్నాయి.
హిందూ పరిభాషా పదాలు,
చైనీయుల పేర్లను పలికే విధములు, చైనీయుల రాజవంశపు పట్టిక వంటి విశేషాలు ఉన్నాయి.
"భారతదేశం
మతప్రబోధకులను పంపింది,
చైనా తిరిగి యాత్రికులను పంపించింది. ఈ రెండు నాగరకతల మధ్య
ఉన్న అన్ని అనుబంధాలను పరిశీలిస్తే, గోచరించే విశేషమైన
వాస్తవం ఏమిటంటే,
చైనీయులు ఎప్పుడూ స్వీకరించే వారు గానూ, భారతదేశం దాత గానూ ఉండటమే. చైనీయులపై భారతీయ ప్రభావం గాఢంగా ఉండేది. గొప్ప
ఆధ్యాత్మిక,
మత సంబంధమైన జ్ఞానం కారణంగా పెంపొందిన సాంస్కృతిక ఆధిపత్యం
భారతదేశాన్ని ఉన్నతంగా నిలబెట్టేది" అని 'ద సోల్ ఆఫ్ ఇండియా' అనే పుస్తకంలో రచయిత ఆమౌరీ డి రెయిన్ కోర్టు వ్యాఖ్యానించారు. భారతీయ చరిత్రకు
సంబంధించిన సైద్ధాంతిక అధ్యయనం దాదాపు అయిదు వేల ఏళ్ల నాటి ప్రాచీనమైన హరప్ప ఇంకా మొహెంజుదారో నాగరకతల
నుండి మొదలుకొని,
భారతీయ సంస్కృతి జననం ఇంకా గమనం, ఇతర ఆసియా నాగరకతలతో విస్తారమైన అనుబంధం, గత రెండు శతాబ్దాలుగా
పశ్చిమ దేశాల దాడి ప్రభావాల గురించి విపులంగా ఈ గ్రంథంలో చర్చించడం జరిగింది.
భారత, చైనా దేశాల మధ్య ఆర్థిక, సాంస్కృతిక సంబంధాలు
ప్రాచీన కాలం నుండి కొనసాగాయి. భారత, చైనా దేశాల మధ్య వాణిజ్య
వారధిగా సిల్కు రోడ్డు వ్యవహరించడమే కాకుండా, భారతదేశం నుండి బౌద్ధ మతం
తూర్పు ఆసియా దేశాలకు విస్తరించేందుకు కూడా వినియోగపడింది. చైనీయుల గురించిన
ప్రస్తావనలు ప్రాచీన భారతీయ సాహిత్యంలో కనిపిస్తాయి. భారతీయ ఇతిహాసమైన మహాభారతంలో
చైనా గురించి ప్రస్తావనలు ఉన్నాయి.
ఈ కారణంగా, అలనాటి స్వర్ణయుగపు రోజులు తిరిగి రావాలి, ఇంకా భారత, చైనా దేశాల మధ్య సంబంధాలు ఎప్పటి లాగే గురువు-శిష్యుల అనుబంధం స్ఫూర్తిగా
ఎప్పటికీ కొనసాగాలి.
As long as China is in the grip of Marxist communists, the world is in danger. Leftists are hell-bent on destroying all religions.
ReplyDelete