గ్రంథ పీఠిక…గ్రంథకర్త
వాసుదాసు ఇష్టదేవతా నమస్కారం
శ్రీ మదాంధ్ర వాల్మీకి
రామాయణం బాలకాండ మందర మకరందం-16
వనం జ్వాలా నరసింహారావు
సూర్య దినపత్రిక
(13-07-2020)
శ్రీ సీతాదేవి
వల్లభుడు,
చేతన-అచేతనాలకు ఆధారం, పోషణ కర్త కాగలిగే వాడు, సాధువులపాలిటి కల్పవృక్ష మనదగినవాడు, మదించిన శత్రువులను
సంహరించే స్వభావం కలవాడు,
భక్త సమూహానికి మోక్షమిచ్చేవాడు, హస్త కమలంలో కోదండం ధరించే వాడు, ఏక శిల పేరుతో వ్యవహరించే
ఒంటిమిట్టలో వుండేవాడు,
వంచనలేని నడవడి కలవాడైన శ్రీరామచంద్ర పర బ్రహ్మం, నా నమస్కారాలను ప్రేమతో అంగీకరిస్తాడని ఆశిస్తున్నాను.
“శ్రీం. ఓం. రాం.
రామాయనమ" అనే బీజాక్షర యుక్తమైన రామ షడక్షర మంత్రాన్ని గ్రంథకర్త తన 22వ ఏట కంప సముద్ర వాస్తవ్యుడైన శ్రీమాన్ చేట్లూరి నరసింహాచార్య దేశికులవలన
ఉపదేశం పొంది,
అప్పటినుంచి సబీజంగా జపం చేస్తున్నారు. శ్రీరామ మంత్రోపదేశం
కాకుండా శ్రీమద్రామాయణం పారాయణం చేయరాదని పూర్వుల నియమం. ఇది ఆంధ్ర గ్రంథం
కదా-దీన్ని పారాయణం చేయ వచ్చా, అన్న సందేహం కలగొచ్చు.
దక్షిణాది వారు వేదాంతార్థాలను తమ భాషలో రాసుకుని, దానికి ద్రావిడామ్నాయం అని పేరు పెట్టుకుని, పఠిస్తున్నారు. సంస్కృతం కంటె ఎక్కువగా గౌరవిస్తున్నారు. ఆంధ్రులకు మాతృభాష ఆంధ్రం.
మాతా మహి భాష సంస్కృతం. అది తులసిలా పూజ్యమే కాని, పూలను శిరస్సుమీద ధరించవచ్చు కాని తులసిని కాదుకదా! వెంట్రుకలపై తులసిని
ధరించే బ్రాహ్మణుడు శూద్రుడితో సమానమైన వాడని పూర్వీకుల అభిప్రాయం.
మంత్రంగా
నేర్చుకొనేటప్పుడు,
మొదలు ప్రణవం, తర్వాత శ్రీ బీజం వుండాలికదా!
ఈ పద్దతిని తారుమారు చేయాల్సిన అవసరం వుందా అని అనుమానం రావచ్చు. రహస్య మంత్రాలు
ఉపదేశించేటప్పుడు సక్రమంగా చెప్పొచ్చు కాని, రాసేటప్పుడు చెప్పడం
మాంత్రికాచారం కాదు. గరుడ మంత్రం చెప్పేటప్పుడు "పక్షి" బదులుగా
"క్షిప" అని చెప్పబడింది. వేద మంత్రాలకు "ఓం" కారంలా, ఆంధ్ర కృతులలో "శ్రీ" కారమే ప్రధానంగా గ్రహించడం ఆంధ్ర కవి
సంప్రదాయమైంది.
శ్రీమద్రామాయణం
"సీతాయా శ్చరితం మహత్"- అంటే, సీతా దేవి మహాచరిత్రేనని
వాల్మీకి చెప్పారు. మామూలు రామాయణం అనలేదాయన-శ్రీమద్రామాయణం అని పేరుపెట్టారు. జనక
రాజు కూతురు ఎవరిదవుతుందో-వాని తేజం అపరిమితమనినదా రామాయణం చెప్తోంది. రాముడు
శ్రీరాముడవడానికి ఇదే కారణం కదా. శ్రీరామచంద్రమూర్తి కూడా ఇది అంగీకరించాడు.
తండ్రి కంటే తల్లి పదింతలు ఎక్కువ పూజ్యురాలు. సీతాదేవి అనుగ్రహం లభిస్తే
రామానుగ్రహం కలిగినట్లే. అందుకే "శ్రీ"
శబ్దం మొదలు వాడబడింది. మంత్రోచ్ఛారణలో ప్రణవం మొదలు రావాలి. ఆరక్షరాల రామ
మంత్రంలో ప్రణవం లెక్కకురాదు. ఎందుకంటే, "రా" మనేదే ప్రణవార్ధవాన్ని బోధిస్తుంది. అందువల్లే ప్రణవోచ్ఛారణానికి
అధికారం లేనివారు కూడా శ్రీరామ మంత్రానికి అధికారులవుతున్నారు.
"నారాయణ" మంత్రంలో ఎన్ని అక్షరాలు వున్నవన్న చర్చ, కొందరు విమర్శకులకు కలిగింది పూర్వం. చివరకు "ఎనిమిది" అక్షరాలని
నిర్ధారించారు. ఆ న్యాయాన్ననుసరించే "రామ" మంత్రం "ఏడు"
అక్షరాల మంత్రమని గ్రహించడమే సరియైన పద్దతి.
ప్రణవం లేకుండా
ఉచ్ఛరిస్తే ఫల లోపం ఏ మాత్రం కలగదు. మంత్ర లోపమూ లేదు. నారాయణ పరాయణుడైన
పుండరీకుడు "నమో నారాయణాయ" అనే అష్టాక్షరీ మంత్రాన్ని జపించి
ముక్తుడయ్యాడు. కూర్చున్నా-పడుకున్నా, ఎక్కడున్నా "నమో
నారాయణాయ" అనే మంత్రం శరణ్యమని ఎవరు భావిస్తారో వారికి మంత్రఫలం లభించడం
వాస్తవం."ఓం రామాయ" అన్నప్పుడు, ప్రణవం రామాయ అనడానికి
విశేషణంగా గ్రహించాలి. శ్రీరామ షడక్షర మంత్రం మోక్ష సాధకులు మాత్రమే జపించాలనీ, ఐహిక కాంక్ష కలవారు ఆపదల్లో ఉచ్చరించరాదని, ఆంజనేయుడు రామ రహస్య
ఉపనిషత్తులో అన్నట్లు చెప్తారు.
తక్కినవారందరు
"రామాష్టాక్షరి" జపించడం మంచిది కాబట్టి, రామ భక్తులందరూ "శ్రీరామాయ నమ" అని కాని, "రాం రామాయ నమ" అని కాని, "రామాయ నమ" అని కాని, "రామ" అని కాని జపించవచ్చు. శ్రద్ధాభక్తులకొలది ఫలమందరికీ
సమానమే."రామ" అనే రెండక్షరాలలోనే సర్వ శక్తులున్నాయి. అందుకు వాల్మీకే
సాక్షి."శ్రీం రామాయ నమ" అని జపించేవారు, ఈశ్వర యుక్తయై,
దుఃఖాలను హరించి, తుష్టిని-సంపత్తును కలిగించమని
శ్రీదేవిని ధ్యానం చేయాలి.
శ్రీమద్రామాయణమంతా
ప్రణవార్థాన్నే చెపుతుంది. రామచంద్రమూర్తి సాక్షాత్తు శ్రీమహవిష్ణువని
వాల్మీకంటాడు. లక్ష్మణ,
భరత,
శత్రుఘ్న, హనుమంత, సుగ్రీవ,
విభీషణులు తాము దాసులమనే చెప్పుకుంటారు. దాసత్వం తమ
స్వరూపమని తెలుసుకున్నవారందరు బాగుపడ్డారు. అది మరిచిన రావణాది రాక్షసులందరు
అహంకారంతో చెడిపోయారు. సీతాదేవి పురుషకారాన్ని తెలుసుకున్న కాకాసురుడు బ్రతికి
పోయాడు-తెలుసుకోలేని మూఢుడు రావణాసురుడు హతమయ్యాడు.
No comments:
Post a Comment