Sunday, July 19, 2020

"నమ" శ్శబ్ద నిర్వచనం - స్థూల-సూక్ష్మార్థాలు .... శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-17 :వనం జ్వాలా నరసింహారావు


"నమ" శ్శబ్ద నిర్వచనం - స్థూల-సూక్ష్మార్థాలు
శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-17
వనం జ్వాలా నరసింహారావు
సూర్యదినపత్రిక (20-07-2020)
నమ శ్శబ్దం అఖండమైనప్పుడు  "నమస్కారం"  అనీ, సఖండమైనప్పుడు (న+మః) "నాకొరకు కాదు" అని అర్థం. అంటే నమస్కారం నాకొరకు కాదని అర్థం. అలానే ఏ జీవుడికొరకూ కాదు. రామచంద్రమూర్తికి మాత్రమే అని అర్థం."నేను-నాది" అనే పదాలు విషంతో సమానం."నీవు-నీది-నాదికాదు" అనేవి అమృతంతో సమానం. శ్రీమద్రామాయణానికి శ్రీ సీతాదేవి ప్రాణమని విజ్ఞులు చెప్తారు. అదే విధంగా శ్రీమద్రామాయణం దీర్ఘశరణాగతి అని కూడా అంటారు. అట్టి శరణా గతికి నమశ్శబ్దం ప్రాణం. నమశ్శబ్దం లేందే శరణాగతి లేదు. భక్తుల, ప్రపన్నుల చేతిలోని సుదర్శన చక్రంలాంటిదే మనస్సు. భగవంతుడు సుదర్శన చక్రంతో సర్వ లోకాలను జయించినట్లే, భక్తులు-ప్రపన్నులు నమస్సుతో భగవంతుడిని వశపర్చుకుంటారు.
తమకంటే ఉత్కృష్టుడైన ఇతరులను ఉద్దేశించి, వినయంగా దేహాన్ని వంచడాన్నే "నమస్కారం" అంటారు. నమస్కరించేవాడు శేషుడు-జీవుడు. నమస్కరించబడేవాడు శేషి పరముడు. జీవుడిని తన ఇష్టప్రకారం వినియోగించుకునేవాడు భగవంతుడు. అతడే ఉపాధి రహితుడు."నేను" ఉపాధిసహితుడను. భగవంతుడు సర్వదా శ్రేష్టుడు. భక్తవత్సలుడైన భగవంతుడు, తన భక్తులను అణకువతో వంగేటట్లు ప్రేరేపిస్తాడు. అందుకే దానికి "నమస్సు" అని పేరు. త్రికరణ శుద్ధిగా నమస్కారం చేస్తేనే పూర్ణ  ఫలితం కలుగుతుంది. దీన్నే కరణపూర్తి అంటారు. ఇక అంగపూర్తి ఆరు రకాలు. ఆత్మ నిక్షేపం, మహా విశ్వాసం, కార్పణ్యం, అనుకూల్య సంకల్పం, ప్రాతికూల్య వర్జనం, గోప్తృత్వ వరణం. ఇలా చేస్తే "సాంగోపాంగ నమస్కారం" అవుతుంది. ఇది స్థూలార్థం.
ఈ వస్తువులు నావి-నావారివి అనే మమత్వాన్ని "మమ్య" అంటారు. సర్వం విష్ణ్వాత్మకం. ఆయనే అంతా, అనే జ్ఞానం, నమస్సుతో కలుగుతుంది. ఇది సూక్ష్మార్థం. నమశ్శబ్దంలో "న" కారానికి మార్గం అని అర్థం."మ" కారంతో ప్రధానం నిరూపితం. విసర్గం పరమేశ్వరుడిని తెలుపుతుంది. కాబట్టి అనాదైన పరమేశ్వరుడనేవాడు శక్తిమంతుడు-పురుషోత్తముడు. ఆ భగవంతుడి ప్రాప్తికి నమస్సు ప్రధానోపాయం. ఇది పరమార్థం. ఈ విధంగా నమశ్శబ్దానికి మూడర్థాలున్నాయి.
సమస్త ప్రపంచాలనూ ఆశ్రయించి, తనను ఆశ్రయించిన వారికి అండగా వుండి, తనను నమస్కరించిన వారి దీనాలాపాలను దయతో వింటూ, వారిని రక్షించాల్సిందిగా భర్తతో అంటూ, అట్టి రక్షణకు వారి దోషాలను అపహరించి పవిత్రులను చేస్తూ, అత్యంత శక్తి-మహిమ కలదై, భగవంతుడిని ఆశ్రయిచి ఆయనకు ప్రతిఫలాపేక్ష లేక అత్యంత ప్రేమతో సేవ చేస్తూ, శ్రీ అనే సార్థకమైన పేరు కలిగి, మెత్తని మనస్సుతో భర్తకు పరతంత్రురాలిగా వుంటూ, దయ, క్షమలనే కల్యాణ గుణాలు కలదై, ప్రపంచానికంతా తల్లైన సీతాదేవి భక్తులకు శాశ్వత సుఖాలు ప్రసాదించాలి.

తమ-తమ ఉజ్జీవాలను కోరుకునే వారి ద్వారా ఆశ్రయించబడి, వారు కోరుకున్న విధంగా ఉజ్జీవించ చేసేందుకు, స్వయంగా సర్వేశ్వరుడిని ఆశ్రయించేదే "శ్రీ". తన ఆజ్ఞ మీరి ప్రవర్తించే జీవులమీద భగవంతుడు కోపగించినప్పుడు, తల్లైన లక్ష్మీదేవి, తనను ఆశ్రయించిన వారిని రక్షించమని భగవంతుడిని వేడుకుంటుంది. అలాంటి సమయంలో "కరుణా సాగరా, సర్వేశ్వరా, ఎందుకిలా కోపగించారు? పిచ్చుకమీద ఎందుకీ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు? నువ్వే కోపిస్తే వీరి గతేంటి? వీరిని రక్షించేదెవరు? ఇలాంటి వారిపై నీ దయా గుణం చూపకపోతే ఇంకెవరిమీద చూపిస్తావు? అపరాధం చేసిన వారందరినీ శిక్షించాలంటే చేయని వారెవరైనా వుంటారా?" అని భగవంతుడిని ప్రార్థించేదే "శ్రీ". అమె ఇలా ప్రార్థించి-బోధించి భగవంతుడిని శాంతపరుస్తుంది. అలా చేయడాన్నే "పురుష కారం" అనంటారు. ఎవరికైనా-ఏదైనా పని కావాల్సినప్పుడు, అది జరిగేందుకు, తనకిష్ఠమైన వేరొకరిని ఆశ్రయిస్తే, అట్లా ఆశ్రయించబడినవారిని  "పురుష కారం" అనాలి. విభీషణుడు రామానుగ్రహం కొరకు వానరులను ఆశ్రయించాడు. సీతాదేవిని ఆశ్రయించిన రాక్షస స్త్రీలను సంహరించకుండా వదిలాడు హనుమంతుడు.
మూర్తీభవించిన భగవత్కరుణారసమే లక్ష్మీదేవి. ఆమె వాత్సల్యం-సౌలభ్యం-స్వభావం కల తల్లి. భగవతి కాబట్టి భగవంతుడి మీద వాలభ్యం కలది. ఆమె మాటను ఆయన తిరస్కరించడు-నిరాకరించడు. అందుకే లక్ష్మీదేవి అనుగ్రహం కొరకు ఇతరులను ఆశ్రయించాల్సిన అవసరంలేదు.
భగవంతుడు లక్ష్మీ విశిష్టుడయ్యే లోకాలను సృష్టిస్తాడు-రక్షిస్తాడు-హరిస్తాడు. దీనంతటికీ కారణం దయా గుణం మాత్రమే. భగవంతుడు కరుణా స్వరూపైన లక్ష్మీదేవిని కూడి రక్షకుడవుతున్నాడని సర్వ సిద్ధాంతాలు-వేదాంతాలు చెప్తున్నాయి. "శ్రీ" తనను ఆశ్రయించిన వారి శ్రేయస్సును కోరుతూ విరోధులను నశింపచేస్తుంది. శ్రీరామచంద్రమూర్తి పురుషుడు కనుక తాను పూనిన కార్యాల రక్ష కాని, శిక్ష కాని, స్వతంత్రించి తానే చేస్తాడు. సీతాదేవికి శిక్షించడం అంటే తెలియదు. అపరాధం చేయనివాడే లేడని ఆమె నమ్మకం. అందుకే శత్రువులనైనా రక్షించమని ఆమె అంటుందెప్పుడూ. భక్తులకింతకంటె సేవించతగువారెవ్వరుంటారు? ఈ కారణాన్నే, శ్రీ సీతాదేవి అపరాధులైన వారికి వశ పడి, కష్టమైనా వారిని రక్షించే ప్రయత్నం చేస్తుంది. తన మాట వింటే సంతోషిస్తుంది. వినక పోతే వారిమీద కోపం తెచ్చుకోదు. వారి పాపం వారినే హరిస్తుందని వూరుకుంటుంది. రావణాసురుడి విషయంలోను, రాక్షస స్త్రీల విషయంలోను, అలానే ప్రవర్తించింది. ఋషుల రక్షణార్థం రాక్షసులను సంహరించాలనుకున్న రాముడిని వారించే ప్రయత్నం చేసింది. అందుకే, సీతతో కూడిన శ్రీరామచంద్రమూర్తిని సేవిస్తేనే శుభాలు కలుగుతాయని పెద్దలంటారు. సీత మాత-తల్లి అయినందువల్ల, శీఘ్రంగా, నమస్కార మాత్రాన్నే అనుగ్రహిస్తుంది.
ఎవరి వాక్యం సత్యమో, ఎవరుండే లోకం సత్యమో, ఎవరి రాత సత్యమో, ఎవరి భార్య సత్య అయిన సరస్వతో, అట్టి బ్రహ్మదేవుడు ఈ కృతికి తన పరిపూర్ణ ఆయువు ఇవ్వడానికి ప్రతిదినం ప్రార్థన చేద్దాం.
(శ్రీరామకథా శ్రవణం వల్ల, పఠనం వల్ల లోకాన్ని తరించ చేయదలిచి బ్రహ్మదేవుడు వాల్మీకి ద్వారా రామాయణాన్ని పలికించాడు. అది సంస్కృత భాషలో వుంది కనుక, సంస్కృత భాషా జ్ఞానం క్షీణించినందున బ్రహ్మ సంకల్పం సార్థకం కాదేమోనని, గ్రంథకర్త భావించి, ఆయన సంకల్పాన్ని సార్థక పర్చేది ఈ ఆంధ్ర వాల్మీకి రామాయణమొక్కటే అని అంటాడు. అందుకే సంస్కృత రామాయణం పైగల అనుగ్రహ బుద్ధి దీని మీదుంచాలని బ్రహ్మను ప్రార్థించారు వాసుదాస స్వామి).
గ్రంథకర్త నిమిత్తమాత్రుడని, పలికింది సరస్వతేననీ ఆయన నమ్మకం. బ్రహ్మ పనుపున సరస్వతీ దేవి వాక్కున నిలిచినందున వాల్మీకితో పలికించింది శ్రీమద్రామాయణం. తన తీవ్ర రోగబాధ, దుర్బలత్వం, అల్ప పాండిత్యం,సహాయహీనత లాంటి కారణాలవల్ల,ఈకృతి భగవత్సంకల్పంతోమాత్రమే నెరవేరగలదని కవి భావన.

No comments:

Post a Comment