పార్వతీ-పరమేశ్వరుల సమస్త
దేవతల స్తుతి
శ్రీ మదాంధ్ర వాల్మీకి
రామాయణం బాలకాండ మందర మకరందం-18
వనం జ్వాలా నరసింహారావు
సూర్యదినపత్రిక
(27-07-2020)
"రమణీ! విష్ణు
సహస్ర నామాలకు సరైంది రామ అనే నామం. ఇది జనన-మరణాలనే సంకటాలను వారించి శాశ్వత
నిత్యానందం కలిగిస్తుంది" అని పార్వతికి ఉపదేశించిన శంకరుడు తన కృతిని
రక్షించాలని కవి కోరుకుంటాడు."శ్రీరామ రామ రామేతి, రమే రామే మనోరమే సహస్ర నామ త స్తుల్యం, రామ నామ వరాననే".
రామ అనే రెండక్షరాలమంత్రం పన్నెండులక్షలసార్లు జపిస్తే సర్వాభీష్ట ఫలసిద్ధి
కలుగుతుందంటారు. ఈ రామ పదంతో ఉపాసించబడే మూర్తెవరు? రూప నామ క్రియలు లేని శుద్ధ చైతన్యమా? రావణాది రాక్షసులను
సంహరించిన అయోధ్యా వాసి శ్రీరామచంద్రుడా? జ్ఞాన మయుడై, హరియై,
మహావిష్ణువై, రఘువంశంలో దశరథుడికి
పుట్టి, సర్వ దాత అయిన వాడే రాముడని జ్ఞానులు ప్రకటించారు. ఎవరి చేతిలో రాక్షసులు
మరణించారో,
అతడే రామచంద్రమూర్తనీ-అభిరాముడనీ చెప్పబడింది. తన నడవడితో
ధర్మ మార్గాన్ని-పేరుతో జ్ఞాన మార్గాన్ని-ధ్యానంతో వైరాగ్యాన్ని-తనను పూజించిన
వారికి ఐశ్వర్యాన్ని ఇచ్చేవాడే శ్రీరామచంద్రమూర్తి.
దేవతల
కొరకు-లోకంకొరకు,
లోకాలను రక్షించేందుకు శివుడు సముద్ర మధనం చేసేటప్పుడు, హాలాహలాన్ని మింగుతాడు. ఫలితంగా శరీరం మొద్దుబారిపోతుంది. పార్వతికేమీ
పాలుపోలేదు. దేవతల శీతోపచారాలు వృధా అయ్యాయి. అప్పుడు రామ నామామృతాన్ని తాగించారు
శివుడితో. దాంతో తాపం హరించి, బలం పొంది శివుడు
మహేశ్వరుడయ్యాడు. పార్వతి సర్వమంగళ అయింది. ఇలా రామ నామంతో బాగుపడిన పార్వతీ-పరమేశ్వరులు తన రామాయణాన్ని
రక్షించాలని కవి ప్రార్థన చేశారు.
శ్రీరామచంద్రమూర్తి
చరణ ద్వయాన్ని హృదయంలో నిలిపి, విఘ్నాలను ఎదుర్కొంటూ
సముద్రాన్ని దాటిపోయి,
లంకలో ప్రవేశించి, సీతను వెతికి చూసి, ఆమెకు ధైర్యం చెప్పి,
సంతోష పరిచి, మరల వచ్చి, శ్రీరామచంద్ర పాదసేవ చేసిన పావన చరిత్రుడైన హనుమంతుడు తన ప్రబంధాన్ని
ప్రసిద్ధి చేయాలని కవి ప్రార్థించాడు.
పాలసముద్రంలో
ఆవిర్భవించిన అమృతాన్ని తాగిన దేవతలు స్వర్గంలో వుంటారు. అంతకు మించిన అమృతాన్ని
భూలోకంలోని మనుష్యులతో తాగించుదామన్న పరోపకార బుద్ధితో శ్రమించినవాడు వాల్మీకి
మహర్షి. ఆదికవి ఆయన. వాల్మీకికి ముందు కావ్యం రచించిన కవి లేడు. శ్లోకాలను
నియమబద్ధం చేసినవాడు కూడా వాల్మీకే. బ్రహ్మతో పోల్చదగినవాడు వాల్మీకి. ఇరువురికీ
సామ్యముంది. ప్రపంచ సృష్టిలో ప్రధమ కర్త బ్రహ్మైతే, కావ్య సృష్టిలో ప్రధమ కర్త వాల్మీకి. బ్రహ్మ పంపిన సరస్వతి వాల్మీకి నాలుకపై
నిలిచి రామాయణాన్ని రచింపచేసింది. బ్రహ్మ సృష్టి జీవకోటికి ఉపకరిస్తే, వాల్మీకి కృతి లోకాలనే ఉద్ధరించింది.
లక్ష్మీదేవికి
స్థానమై,
మంచినీరుండి, తీయని రసం-తెలియరాని
లోతు-విశేష ధ్వని కలిగినదే రామాయణం. మనోహరమైన పాలసముద్రాన్ని మథించిన దేవతలు ఎలా అమృతాన్ని
అనుభవించారో,
అలాంటి అనుభవమే కలుగుతుంది ఏడు కాండల సీతా చరితమైన
రామాయణాన్ని చదివితే. మనోహరమైన నవరస వర్ణనలతో, అర్థ గాంభీర్యంతో, నానా విధ ధ్వన్యర్థాలతో మళ్లీ-మళ్లీ చదవాలనిపించే కావ్యం రామాయణం. ఇట్టి
రామాయణాన్ని చదివినవారికి ఇహమందు సుఖం-పరమందు మోక్షం కలుగుతుంది.
జ్ఞానహీన మానవులను
ఇహ-పరాలలో రక్షించేందుకు,
వేదం వినే అధికారం లేదని భావించే స్త్రీలను, శూద్రులను,
అధమ బ్రాహ్మణ, క్షత్రియ, వ్యైశ్యులను ధర్మ-అధర్మాలు తెలుసుకొని బాగుపర్చేందుకు, శ్రీ మహాభారతాన్ని రచించిన వ్యాసమహర్షిని స్తుతించారు కవి. సరస్వతీ దేవిని
నూతన తాళాల ప్రకారం ఆడించి,
తన ‘వాదనాపటిమతో తార్కికులనే ఏనుగులకు సింహగర్జనమై, రామానుజాచార్యులు స్థాపించిన విశిష్టాద్వైతాన్ని (శ్వేత వరాహ మూర్తి భూదేవిని
ఉద్ధరించినట్లు) ఉద్ధరించి,
కవి తార్కిక సింహ బిరుదు పొంది, సాదువులతో పొగడబడి,
కీర్తి కలిగిన, వైష్ణవ శ్రేష్టుడైన
వేదాంత దేశికులకు నమస్కరిస్తారు కవి. ఆ తర్వాత, రఘువంశం రచించిన కాళిదాస
కవిని, మహా వీరచరిత్ర-ఉత్తర రామ చరిత్ర రాసిన భవభూత కవిని, ప్రసన్నరాఘవం రాసిన జయదేవ కవిని, బాల రామాయణం రచించిన
రాజశేఖర కవిని,
అనర్ఘవ రాఘవం రాసిన మురారి కవిని స్తుతించారు కవి.
ఆంధ్ర భాషకు తొలుత
లక్షణ లక్ష్య భిక్ష పెట్టిన నన్నయ భట్టారకుని, ఆయన మార్గాన్నే
అవలంబించిన ఎర్రాప్రగడ,
తిక్కనలను స్తోత్రం చేస్తారు కవి. సంస్కృత గ్రంథాలను
తెనిగించడంలో సర్వజ్ఞులైన పలువురిని మించినవాడు, భగద్విషయం కావడంతో ఇంపైన కవిత్వం అందించిన వాడు, భక్తి రసం ఇమిడిన వర్ణనలు చేసిన వాడు, భక్తి పారవశ్యంతో
భగవంతుడిని వర్ణిస్తూ తన దేహాన్నే మరిచిపోయేవాడు, కవి శ్రేష్ఠుడు,
దేవతోపాసకుడు, గురు శిక్షణ లేకుండానే
పండితుడైన వాడు,
శ్రీ భాగవతం తెనిగించి జన్మ సాఫల్యం కలిగించిన కార్యం
చేసినవాడు,
సత్యవ్రతం కలవాడు, బుద్ధిలో బృహస్పతి, బమ్మెర పోతనామాత్యుడిని కొలుస్తారు కవి.
రామాభ్యుదయం
రచించిన అయ్యలరాజు రామభద్రుడిని, ఉత్తర రామాయణ కర్త
తిక్కనను,
నిర్వచన ఆంధ్ర రామాయణం రాసిన తిమ్మనను, మల్లమ్మను,
భాస్కర కవిని, కంకంటి పాపరాజును, రంగనాథుని స్తుతిస్తారు కవి. శ్రీమద్రామాయణం బాల కాండ నుండి యుద్ధ కాండ తుది
వరకు ఆంధ్రీకరించిన రామ భక్తుడు గోపీనాథం వేంకయ్య కవిని శ్లాఘిస్తూ నమస్కరిస్తారు
గ్రంథకర్త. అల్పజ్ఞుడనని,
అపండితుడనని, దీర్ఘ శ్వాస రోగినని, పరాధీన జీవినని,
పారతంత్ర్య నరక నివాసినని, తన గ్రంథమందెన్నో దోషాలుండవచ్చునని, ఆ కారణం వల్ల దాన్ని నిరసించక
దయతో ఆదరించాలని సత్కవి శ్రేష్ఠులను, ఇతరులకు మేలుచేసే
గుణాలున్న వారిని,
తన కాలపు ఉత్తమ కవులను కోరుతారు కవి. గ్రంథంలో సారం
లేకపోయినా,
రామాయణం అన్న గౌరవ బుద్ధితోనన్నా, తన కృతిని దయతో అంగీకరించాలని భావితరాల పండితులకు నమస్కరిస్తూ కోరుతారు కవి.
సీతమ్మ-రాఘవయ్యల
తనయుడు, కుప్పమ్మ భర్త,
హూణాంధ్ర-ద్రావిడ-కన్నడ-మరాఠి-హింది భాషలను ఎరిగినవాడు, కారణం లేని దయకలవాడు,
లోకంలో లేని ప్రతిభ కలవాడు, మృధు-మధుర వాక్కులతో కవిత చెప్పగలవాడు, కౌశిక గోత్రీకుడు, లంకలపల్లె ఇంటి పేరుకలవాడైన వేంకట సుబ్బార్యుడిని కవి ప్రశంశిస్తాడు. జ్యోతిష్కుడు
వేంకటనరసయ్య- సరమ్మల కుమారుడు, అన్నపూర్ణమ్మ భర్త, హరితస గోత్రీకుడు,
కోలంక-వీరవరం గ్రామాల జమీందారైన శ్రీరాజారావు
చెల్లమాంబారావు గారి ఆశ్రితుడు, రామకృష్ణ శాస్త్రి
తమ్ముడు,
క్రొత్తపల్లె ఇంటి పేరున్నవాడు, సద్గుణాలు-సన్మార్గ ప్రవర్తన గలవాడైన పద్మనాభ శాస్త్రిని తలచుకుంటారు కవి.
తనకాయన ఎల్లవేళలా శ్రేయస్సులను కలిగించారనీ, తాను పోషించిన తన సమీప
బంధువులు తన కష్టకాలంలో వదిలిపెట్టి పోతే శాస్త్రిగారు మందులిచ్చి ప్రాణాలు
కాపాడారనీ,
పూర్వ జన్మ పుణ్యం లేకుండా అట్లాంటి స్నేహితులు దొరకరనీ
గుర్తుచేసుకుంటారు. తన ఈ మిత్రులు సత్కావ్యాలు రచించేందుకు తనను ప్రేరేపించారనీ, రచనా సమయంలో క్షయ వ్యాధికి గురైతే ఆదుకుని ప్రోత్సహించారనీ, రచన పూర్తయిన తదుపరి ప్రచురించి లోకంలో కీర్తి తెచ్చారనీ, అటువంటి మిత్రులు లభించడం తన అదృష్టమని రాసుకుంటారు. రాముడి కరుణతో మిత్రులైన
పద్మనాభశాస్త్రి,
వేంకట సుబ్బయ్యలకు సంపత్తు-సంతతి కలిగి, తన రామాయణం ముద్రించిన తర్వాత చాలాకాలం జీవించి వున్నారని అంటారు.
“జయన్తినో సుకృతినో రస సిద్ధాః కవీశ్వరామ్ః
నాస్తితే షాం యశః కాయే జర మరణజం
భయమ్"
No comments:
Post a Comment