భారత గణతంత్ర వ్యవస్థ
పునరుజ్జీవనం
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రపత్రిక (19-07-2020)
“చాలామంది
భారతీయులకి,
అందునా యువతకి, మనం ఇప్పుడు అనుభవిస్తున్న
ఈ స్వాతంత్ర్య సౌధం ఎంతమంది త్యాగాల పునాది మీద నిర్మించబడిందో అవగాహన లేదు. వారికి స్వాతంత్ర్యం, గణతంత్రం,
రాజ్యాంగం వగైరాల ద్వారా ప్రయోజనాలు పొందడం మాత్రమే
కావాలి. నిజానికి ఇన్ని దశాబ్దాల కాలంలో
దేశ గణతంత్ర పరిస్థితి ఒకేలా స్థిరంగా లేదు.
మొదటి 25 సంవత్సరాలూ ఒకే పార్టీ పెత్తనం
నడిచింది. తరువాతి 25 యేళ్లలో సంకీర్ణ ప్రభుత్వాలు నడిచాయి.
ప్రస్తుతం ఒకే నాయకుడు-ఒకే పార్టీ అన్న లక్షణాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి”.
"ఇదే పంథా
మరొక 25 యేళ్లు సాగుతుందా?
అన్నది ప్రజల ఊహాగానాలకే వదిలేద్దాం. ప్రస్తుతం
ప్రజలు జనాకర్షణ పథకాల జోరులో ప్రభుత్వం మీద ఆధారపడి బతికడం మరీ
ఎక్కువవౌతోంది. కొత్త నాయకుడు వచ్చిన ప్రతిసారీ ‘నవ భారత నిర్మాణం’ అన్న పదం ఒక
నినాదంగా వినబడుతోంది. కొత్త పథకాలు ప్రవేశపెడతామనే హామీల వాక్చాతుర్యం మామూలై
పోయింది. ప్రజలు ఆ హామీల ఉచ్చులో
పడిపోతున్నారు. ఇలా ప్రజాకర్షణ పథకాల ఊబి
నుంచి బయటపడాలంటే గణతంత్ర వ్యవస్థ చైతన్యవంతం, పునరుజ్జీవనం కావాల్సిన ఆవశ్యకత
ఎంతైనా వున్నది” అని డాక్టర్ ఎన్ భాస్కర రావు అనే ఒక సామాజిక పరిశోథనా మార్గదర్శి, తాను రచించిన ‘రెజ్యువెనేటింగ్ ద రిపబ్లిక్’ అనే ఆంగ్ల పుస్తకంలో
చెప్పారు.
రాజకీయాలకు సంబంధించి
ఇదే మొదటి ఉహాగాన వాస్తవం కావచ్చు. ఇది ప్రస్తుతం ప్రచురణలో ఉంది. కొత్త దిల్లీకి చెందిన ‘స్పీకింగ్ టైగర్’ అనే ప్రచురణ కర్తలు దీన్ని ప్రచురిస్తున్నారు. డాక్టర్ రావు
గారు సమాచార రంగంలో సి ఎమ్ ఎస్ రావుగా సుపరిచితులు. ప్రజా సమాచారం లో అందెవేసిన చెయ్యి. సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ (సి ఎమ్ ఎస్.)
వ్యవస్థాపక ఛైర్మన్. ఆ సంస్థ ముఖ్య కార్య
నిర్వహణ అధికారిగా పనిచేస్తూ దాని నిర్మాణానికి, అభివృద్ధికి అమోఘమైన కృషి చేసారు. ప్రజాభిప్రాయ సేకరణ, విశ్లేషణ,
పరిశోధనా పద్ధతులను రూపొందించడం మొదలైన రంగాలలో ఆయన నిపుణులు. ఆపరేషనల్ రిసర్చ్ గ్రూప్ వ్యవస్థాపకుడు కూడా
ఆయనే.
‘స్పీకింగ్ టైగర్’
న్యూఢిల్లీ వారు ప్రచురిస్తున్న ఈ పుస్తకం తుది మెఱుగులు దిద్దుకుంటోంది. ఇందులో
వివిధ అంశాలను వివరిస్తూ తొమ్మిది అధ్యాయాలు ఉన్నాయి. మొదటి అధ్యాయం పర్యావలోకనం, రెండవది సందిగ్ధత,
మూడు గణతంత్ర విధానం గురించి వివరణ, నాలుగు ప్రాథమిక విధానాలలో అస్పష్టత, ఐదు ప్రజాప్రాతినిధ్యతను
కాపాడుకోవడం,
ఆరు మెఱుగైన గణతంత్ర విధానంలో ప్రజల పాత్ర, ఏడు గణతంత్ర వ్యవస్థను ఉత్తేజపరచడం, ఎనిమిది ప్రజలలో
తప్పనిసరిగా ఉండవలసిన చొరవ,
తొమ్మిది పరివర్తన(మార్పు)లో జోక్యం చేసుకోవడం గురించి
వివరించడం జరిగింది. క్లుప్తంగా చెప్పాలంటే, భారత గణతంత్ర విధానం, దాని లక్ష్యాలు,
రాజ్యాంగం మీద అంచనాలు, ఆశలు, భారతదేశం సాధించిన విజయాలు మొదలైన ఎన్నో విషయాల గురించి ఈ పుస్తకంలో వివరంగా
చర్చించడం జరిగింది.
గణతంత్ర వ్యవస్థ-విధానం
మీద మరొక పుస్తకం రాయాల్సిన ఆవశ్యకత ఏమిటని రావుగారిని అడిగితే ఆయన 'సమర్ధవంతమైన దేశంగా మారడానికి గణతంత్ర విధానం తోడ్పడాలనీ, కానీ అది నశిస్తూ,
కేవలం ఒక మొక్కుబాటుగా తయారైందనీ, రాజకీయ నాయకుల వాక్చాతుర్యానికే దానిని వాడుకునే పరిస్థితి తయారైందనీ
అన్నారు. అంతేకాదు, యువత ఈ గణతంత్ర వ్యవస్థను గురించి పెద్దగా పట్టించుకోదనీ, రాజకీయ పార్టీల హయాం నడుస్తున్న ఈ సమయంలో గణతంత్రం గురించి తెలుసుకోవలసిన సమయం
వచ్చిందనీ అన్నారు. పుస్తకం వ్రాయడం వెనుక
నేపథ్యం ఇదే అని చెప్పారు. 2050 నాటికి గణతంత్ర వ్యవస్థ మొదలై నూరు సంవత్సరాలు అవుతుంది. కనీసం అప్పటికి మన దేశం ప్రతి ఒక్కరికీ
అవకాశాలు చూపించగల స్థాయికి ఎదగాలనేది తన ఆశయం అనీ వివరించారు.
పరివర్తనలో జోక్యం
చేసుకోవడం గురించి వివరించిన అధ్యాయం పుస్తకానికి గుండెకాయ లాంటిది అనీ, దాని సారాంశం మొత్తం పుస్తకం యొక్క లక్ష్యాన్ని వివరంగా చూపిస్తుందనీ ఆయన
అభిప్రాయపడ్డారు. ఈ అధ్యాయంలోని ప్రతీ విషయం ఆలోచనలను రేకెత్తిచ్చేదిగా ఉంటుందనీ
అన్నారు. మచ్చుకి కొన్ని విషయాలు చూస్తే
ఇంకా చదవాలనే కుతూహలం పెరుగుతుంది.
గణతంత్ర
విధానాన్ని చైతన్యవంతం చేయడం ఒక మంచి అవకాశంగా తీసుకోవాలి. 2050 సంవత్సరంలో భారత
దేశం గణతంత్ర రాజ్యంగా మారి నూరు సంవత్సరాలు పూర్తి చేసుకోవడం ఒక రికార్డు. ప్రపంచానికి అది ఒక ఆదర్శం. జరిగే పరివర్తనలో
అనవసర జోక్యాలు ఎన్నో తీవ్ర పరిణామాలకు దారితీస్తాయి. ఈ 70 సంవత్సరాల అనుభవం చూస్తే
ఇది సముద్రం మీద అలలలా గందరగోళ పరిస్థితికి దారి తీయవచ్చు అనిపిస్తోంది. అందుకే ‘నూరు సంవత్సరాల గణతంత్ర విధానం’ అన్నది
చేరటానికి ఒక సక్రమమైన కార్యాచరణ పద్ధతి ఉండాలి. ఒక కమిటీ ఏర్పాటు చెయ్యాలి. కనీసం
ఉపరాష్ట్రపతి స్థాయి వ్యక్తి దానికి నాయకత్వం వహించాలి. ముఖ్యంగా మూడు విషయాలను ఆలోచించాలి. అవి
ఎలెక్ట్రానిక్ వోటింగ్ ప్రవేశపెట్టడం, పార్టీ గుర్తుల పద్ధతి
యొక్క ఔచిత్యం,
పార్టీరహిత ఎన్నికల విధానాన్ని ప్రయోగాత్మకంగా
ప్రవేశపెట్టడం.
రాజ్యాంగాన్ని
ఫెడరల్ వ్యవస్థగా గుర్తించాలి. ‘భారతదేశ
పౌరులమైన మేము’ అన్న అంశం ఎంతో ప్రాధాన్యత సంతరించుకోవాలి. ఇప్పటి కేంద్ర, రాష్ట్రాల పద్ధతి కేంద్రీకృత విధానం లాగా కాక, ‘యూనియన్’ పద్ధతిని ప్రవేశపెడితే అధికార వికేంద్రీకరణ జరగడం సులభమౌతుంది. రాష్ట్రాల బాధ్యత పెరుగుతుంది. తనిఖీలు, నిల్వలు ప్రోత్సహించి, అనుసరించాలి. దేశ స్థాయిలో రాష్ట్రపతి
తరహా పరిపాలనకు యే మాత్రం అవకాశం దొరికినా ఆ బాట పట్టాలి. అప్పుడే సరైన పరిపాలనకు అవకాశం ఉంటుంది.
సరైన పరిపాలనా
విధానం ఉండడమే గణతంత్ర విధానం యొక్క ముఖ్య లక్ష్యం. అదే ప్రజాస్వామ్యం, అభివృద్ధి,
పరిపాలన. దేశాన్ని
నిలబెట్టేవి మూడు స్తంభాలా లేక నాలుగా అన్న చర్చ పక్కనబెట్టి ప్రజాసమాజాన్ని ఐదవ
స్తంభంగా గుర్తించాలి. న్యాయ బద్ధంగా
యేర్పడని రాజకీయ పక్షాలను ఆరవ స్తంభంగా చూడాలి.
గణతంత్రం అంటే మూడుకాళ్ల పరుగు పందెం కాదు. ఇంకా చెప్పాలంటే పైన వివరించిన
ఆరు స్తంభాల మొత్తం కార్యకలాపాలే పరిపాలన.
స్వేచ్ఛ, స్వచ్చతా,
పారదర్శకత అన్నవి పరిపాలనలో తప్పకుండా వుండవలసిన
లక్షణాలు. గ్రామ, బ్లాక్,
జిల్లా స్థాయిలలోని పరిపాలనానాణ్యత లోనే ప్రజాస్వామ్యం
యొక్క వేళ్లు పాతుకున్నాయి. నాణ్యమైన
పరిపాలన అంటే కనీసం ఆరోగ్యం, విద్యా,
ఆహారం వంటి ప్రాథమిక రంగాల్లో లంచగొండితనం లేకుండా
చూడగలగడం. ఇటువంటి పరిపాలన రావాలంటే ప్రజా సంస్థలు, రాజకీయ పార్టీలు నిర్వహించే పాత్ర, వహించే బాధ్యత ప్రాముఖ్యత
వహిస్తాయి. మీడియా కూడా బాధ్యతాయుతమైన
పాత్ర పోషించాలి.
‘భారతీయ ప్రజలమైన
మేము’ అన్నది గణతంత్రానికి మూల సిద్ధాంతం.
ఈ ప్రాథమిక హక్కును గౌరవించి, కాపాడగలగడమే గణతంత్ర
విధానపు ఊపిరి కావాలి. రాజకీయ పార్టీలు
కూడా ప్రజల శ్రేయస్సు మీదే దృష్టి పెట్టాలి. వారి వారి రాజ్యాంగం ప్రకారం నిర్ణీత
కాలవ్యవధిలో,
ప్రజాస్వామ్య పద్ధతిలో అంతర్గత ఎన్నికలు నిర్వహిస్తేనే ఇది
సాధ్యమౌతుంది. అభ్యర్థుల నామినేషన్ కి ఇది అత్యంత ఆవశ్యకం. రాజకీయపార్టీల దృక్పథంలో, ప్రాముఖ్యతలలో సరైన అవగాహన ఉంటేనే గణతంత్ర వ్యవస్థ నాలుగు కాలాలపాటు
నిలబడుతుంది. ఎన్నికల ప్రచారంలో పార్టీ
మానిఫెస్టో ప్రముఖ పాత్ర వహిస్తుంది.
అందుకే ప్రచారానికి లభించే కాలం తక్కువ ఉండాలి, ఎన్నికల షెడ్యూల్ కుదించబడడం
మంచిది. ఎన్నికల ప్రక్రియ వేగవంతంగా
ఉండాలి. ఇటువంటి సమయంలో పెద్ద పెద్ద వ్యాపార
సంస్థల ద్వారా నిధుల రాకపోకలు ఒక హద్దు దాటకుండా అదుపులో పెడితే ఎన్నికలలో నిలబడ్డ
వాళ్లు నిధులు తీసుకుని,
మొహమాటమిలో పడే అవకాశం తగ్గుతుంది. ప్రజల అవసరాల గురించి అలోచించే అవకాశం
దొరుకుతుంది.
భవిష్యత్తులో
పరిపాలన రాజకీయ ప్రయోజనాలకోసం మాత్రమే కాకపోతే మంచిది. గణతంత్ర వ్యవస్థ మీదా, ప్రభుత్వం మీదా ప్రజలకు విశ్వాసం కలగాలంటే చట్ట సభల పని తీరు బాగుండాలి. రాజకీయ పార్టీల అవసరాలపై కంటే ప్రజాపయోగ పథకాలు
చేపట్టటం పై శ్రద్ధ పెరగాలి. వివిధ
అనుబంధాలున్న వారి దృష్టిలో ప్రభుత్వం అంటే ఒక వ్యక్తి మాత్రమే. విడివిడి మనుషుల
కలయిక కాదు. అందుకే మంత్రులు కూడా నియంత్రణలో ఉండాలి. ‘భారత ప్రభుత్వం’ గా అప్పుడే గుర్తించి
సంబోధిస్తారు. చట్ట సభల ప్రధాన నాయకుడు, అత్యధిక మెజారిటీ వచ్చిన పార్టీ వాడే కావాలి కానీ, సభలోని సభ్యులందరూ కలిసి ఎన్నుకోవాలి.
వివిధ రంగాలలో నిష్ణాతులైన వారు కూడా పార్లమెంట్ కమిటీలలో ప్రాతినిధ్యం
వహించాలి.
లోక్ సభ, శాసనసభ వంటి చట్ట సభలలో, ముఖ్యంగా ఎగువ సభలలో, కేవలం
పార్టీని దృష్టిలో పెట్టుకుని మాత్రమే చర్చలలో పాల్గొనడం మానాలి. న్యాయ వ్యవస్థకు స్వతంత్ర ప్రతిపత్తి కలిగించడం
అభిలషణీయం. కొత్తగా పైకి వస్తున్న రాజకీయ
నాయకులకు రాజ్యాంగం గురించి పూర్తి అవగాహన కలిగించాలి. అప్పుడే వారు న్యాయమూర్తులను, కోర్టులను,
కోర్టు ఇచ్చే
తీర్పులను విమర్శించడం తగ్గుతుంది. ఎన్నికల కమిషన్‍కు తనదంటూ ఒక గౌరవనీయమైన హోదా, బాధ్యతలు ఉన్నాయి. దానికి తగ్గ రీతిలో
అది ప్రవర్తించి,
ఇతర స్వతంత్ర సంస్థలకు ఒక ఉదాహరణగా, ఆదర్శంగా, రోల్ మోడల్ గా నిలవడమే కాక ఎప్పటికప్పుడు ఇంకా సమర్థవంతంగా
పనిచెయ్యడం మీద దృష్టి పెట్టాలి.
కేంద్ర, రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు నెలకొనేలా చూడడం, పబ్లిక్ సంస్థల స్వతంత్రతను, విలువలను నిలబెట్టడం, గవర్నర్లను నియమించేముందు ఆ రాష్ట్రంతో సంప్రదించడం, ప్రజాస్వామ్య పరిపాలన సవ్యంగా నడిచేలా చూడటానికి పౌరుల చొరవను, మనోగతాన్నీ పట్టించుకోవడం మొదలైనవి గణతంత్ర విధానాన్ని చైతన్యపరచడానికి,
ఉత్తేజపరచడానికి, పునరుజ్జేవనం కావడానికి దోహదపడతాయని డాక్టర్
ఎన్ భాస్కారరావు గారు అభిప్రాయపడ్డారు. ఆయన సలహా ఏమిటంటే, ప్రస్తుతం ప్రధాన మంత్రి ఏ విషయంలోనైన చొరవ తీసుకోవడానికి ముందుకొచ్చే వ్యక్తీ
కాబట్టి,
దానికి అవసరమైన బలంతో వున్నారు కనుక, మార్పు దిశగా అడుగు
వెయ్యటానికి,
నవభారత నిర్మాణానికీ ఇదే సరైన సమయమని.
రాజకీయాల మీదా, సామాజిక శాస్త్రం మీదా, ప్రావీణ్యం, అవగాహన కావాలని
కోరుకునేవాళ్ళంతా తప్పక చదవాల్సిన విలువైన పుస్తకం ‘రెజ్యువెనేటింగ్ ద రిపబ్లిక్’.
అనువాదం: లంక నాగరాజు
No comments:
Post a Comment