Friday, July 17, 2020

నర్సాపూర్ లేసుల మార్కెటింగ్ ..... స్వర్గీయ కేబీ తిలక్ జ్ఞాపకాలు-అనుభవాలు : వనం జ్వాలా నరసింహారావు


నర్సాపూర్ లేసుల మార్కెటింగ్
స్వర్గీయ కేబీ తిలక్ జ్ఞాపకాలు-అనుభవాలు
వనం జ్వాలా నరసింహారావు
ప్రజాతంత్ర, సంపూర్ణ స్వతంత్ర వారపత్రిక
(జూన్ 25-జులై 1, 2000)
         ఎల్ వి ప్రసాద్ గారు చెన్నపట్నం వెళ్ళిన తర్వాత కూడ మరి కొంతకాలం పాటు తిలక్ బొంబాయి నగరంలో వుండిపోయారు. కారణం పెద్దగా ఏమీ లేక పోయినా ఆయన సంబంధం పెట్టుకున్న కార్యకలాపాలు ఆయన్ను అక్కడుండేలా చేశాయి. ఎట్లాగూ వుండిపోయాడు కాబట్టి ఖర్చుల కొరకు మల్లిఖార్జునరావు గారి ప్రెస్ కు ఆర్డర్లు సంపాదించటం కొనసాగించారు. ఆ సంపాదన సరిపోయేది కాదు. కె ఎల్ ఎన్ ప్రసాద్ (ఆంధ్రజ్యోతి) సోదరుడు కానూరు రామానంద చౌదరి గారు నెలకొల్పిన దానామర్ అనే డిస్ట్రిబ్యూషన్ కంపెనీలో (ఫిల్మ్ ది కాదు)  సేల్స్ బోయ్ గా కూడ పనిచేసేవారు. దానామర్ సంస్థ కాస్మెటిక్స్ తయారీచేయటం, డిటర్జంట్ల ఏజెంటుగా వ్యవహరించటం చేస్తుండేది. సేల్స్ బోయ్ గా తిలక్ బొంబాయి చుట్టుప్రక్కల మున్సిపల్స్ లోనూ,  లోనావాలా ప్రాంతంలోనూ తిరుగుతూ కాస్మటిక్స్ డిటర్జెంట్సు వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తుండేవారు. అప్పట్లో బహుళ ప్రచారం పొందిన ఓ బాంబు పేలుడు సంఘటనలో (స్వాతంత్ర్య-తెలంగాణా ఉద్యమంలో భాగంగా) చౌదరి గారు ఇరుక్కునేలా చేసింది నాటి ప్రభుత్వం. అది వేరే సంగతి.
          బొంబాయిలో వున్నరోజుల్లోనే, ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లాలో వున్న నర్సాపూర్ ప్రాంతపు హస్తకళాకారులు తయారు చేస్తుండే ప్రపంచ ప్రఖ్యాత లేస్ ను తిలక్ గారు అక్కడనుండి తెప్పించుకుని మార్కెటింగ్ చేయిస్తూ అంతో, ఇంతో మిగుల్చుకునే వారు. బొంబాయిలో వుండాలన్న సోషల్ ఆర్జ్  కు అవసర మైన ఆర్థిక వనరులు (స్వల్ప మొత్తంలోనే కావచ్చు)   ఏదోవిధంగా కష్టపడి సమకూర్చుకునే తిలక్ నాడూ నేడూ (చనిపోయేంత వరకూ కూడా) కూడ ఒకరిపై ఆధారపడి జీవించే వ్యక్తిత్వం కాదు.
         ఎల్ వి ప్రసాద్ గారు సినిమా షూటింగుల్లో బిజీగా వున్న సమయంలోనూ, తనకు తీరిక దొరికిన సమయంలోనూ ఎల్ వి గారు వున్నప్పుడూ,  లేనప్పుడూ కూడ తిలక్ స్టూడియోలకు వెళ్తుండేవారు. అక్కడున్న వారందరూ అయన్ను ఆప్యాయంగా పలుకరించేవారు. కారణం, తాను ఎల్ వి మేనల్లుడిని కావడం కొంతమేర కైతే, తానెప్పుడూ ఇతరులతో స్నేహంగా వుండే మనస్తత్వం కావడం కూడా కారణం అంటారాయన. అయితే సినిమా రంగానికి చెందినంత వరకు తాను ఎల్ వి ప్రసాద్ మామయ్యకు ఏకలవ్య శిష్యుడిని మాత్రమేనని, తనకెప్పుడూ ఆయన ప్రత్యక్ష శిష్యరిక భాగ్యం లభించలేదని అన్నారు.


         ఇదిలా వుండగా, తిలక్ స్కూల్ హాకీ కెప్టెన్ గా ఎన్నిక కావడమే కాకుండా అప్పుడప్పుడు ఫుట్ బాల్ కూడ ఆడేవారు. తన ఈడు వాళ్లతోనూ, వయస్సులో పెద్దవారితోనూ కూడా తిలక్ సరదాగా గడిపేవాడు. తమ భూముల్లో కొన్ని పడావు పడివుండి బీడు నేలలుగా తయారైనందున వూళ్ళో పశువులకు ఉపయోగపడేవట అవి. ప్రతిపక్షవర్గానికి చెందిన తమ గ్రామంలోని ఓ పెద్ద మనిషి శ్రీ కొర్లిపర సుబ్బయ్య గారి విషయం చెప్తూ ఆయనకు ముగ్గురు కొడుకులుండేవారన్నారు. పెద్ద కుమారుడు వెంకట నారాయణ వూళ్ళో ఎటువంటి గొడవలు ఉండవద్దని భావించే మనస్తత్వం కలవాడు. ఆయన కూతురునే నటసామ్రాట్ పద్మభూషణ్ శ్రీ అక్కినేని నాగేశ్వర రావు వివాహమాడారు. ఆమే శ్రీమతి అన్నపూర్ణ గారు. సుబ్బయ్య గారి మరో కుమారుడు రామ్మోహనరావు ఆ వూర్లోని వటపర్తి కుటుంబానికి దత్తత పోయి వటపర్తి రామ్మోహన రావుగా దెందులూరి అసెంబ్లీ నియోజకవర్గం నుండి శాసన సభ్యునిగా ఎన్నికయ్యారు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత.
         రామ్మోహనరావు తిలక్ మంచి మిత్రులు. స్కూలు ఎగొట్టి పొలాల వెంట తిరిగేవారు. స్కూల్లో తినాల్సిన క్యారియర్ భోజనం పొలాల్లోనే తిని స్కూలు వదిలి ఇంటికి వెళ్లాల్సిన సమయంలోకల్లా గూటికి చేరుకొనేవారు పెద్దలకు అనుమానం రాకుండా. రామ్మోహనరావు కొడుకు ప్రసాద్ నాబార్డు బ్యాంకులో సీనియరు అధికారిగా పని చేస్తున్నట్లు తిలక్ గుర్తు చేసుకున్నారీ సందర్భంగా.
         ఆరోజుల్లో ఎలిమెంటరీ పాఠశాల విద్యార్థిగా వున్నప్పుడు తమ గ్రామంలో తాము వేసిన భక్త ప్రహ్లాద నాటకాన్ని గుర్తు చేసుకుంటూ, తానందులో నరసింహావతారం పాత్ర పోషించానన్నారు. తమ గ్రామం దెందులూరులో యూత్ లీగ్ కార్య కలాపాలు నిర్వహిస్తూ బాలానంద సంఘం స్థాపించామని అందులో శ్రీమతి అక్కినేని అన్నపూర్ణను కూడ సభ్యురాలిగా చేర్పించామని అన్నారు తిలక్. గ్రామంలో వున్న గ్రంథాలయానికి అవసరమైన పుస్తకాలను కూడా యూత్ లీగ్ తరపున సేకరించే వారు. బ్రతుకు తెరువు కోసం రాస్తుండే అశ్లీల సాహిత్యం మోస్తరు పుస్తకాలను వ్యతిరేకిస్తూ ఉద్యమం లేవదీశారు యూత్ లీగ్ పక్షాన. ఈ సందర్భంగా కొవ్వలి లక్ష్మీ నరసింహారావు గారు లాంటి రచయితలు రాస్తుండే రోజువారీ పుస్తకాలను ఉదహరిస్తూ అవి విరివిగా రైల్వే ప్లాట్ ఫామ్ ల మీద దొరికేవనీ వాటి అమ్మకాలను వ్యతిరేకిస్తూ అరసంలాంటి ఉద్యమాలకు నాంది ఆ రోజుల్లోనే పలికామన్నారు.
ప్రజా నాట్య మండలి, స్ఫూర్తితో కమ్యూనిస్టు భావాలు సంతరించుకున్న శ్రీ తిలక్ ఆదిలో తన గ్రామంలోని కమ్యూనిస్టులను వ్యతిరేకించే వారు. దానికి కారణాలున్నాయన్నారు. రెండవ ప్రపంచ యుద్ధం కాలంలో బ్రిటీష్ వారి పంథాను పరోక్షంగా సమర్థించి హిట్లర్‌కు వ్యతిరేకంగా అగ్ర రాజ్యాల కలయికను వారు ప్రజా యుద్ధంగా చిత్రీకరించడం కూడా అందులో ఒకటి. గ్రామంలో కమ్యూనిష్టుల ఇళ్ల బయట గొళ్లాలు పెట్టి వారు ఇళ్లొదలలేకుండా తాము చేసిన అకతాయి తనం గుర్తుకు తెచ్చుకుని నవ్వుకున్నారాయన. ఇలా ఎందుకు చేశారంటే క్విట్ ఇండియా ఉద్యమంలో తాము పాల్గొంటున్నందున అందులో భాగంగా ఉద్యమాలు నిర్వహిస్తుండే తాము, తత్ సంబంధ నినాదాలు గోడలపై వ్రాస్తున్న తమను వారు అడ్డుకోకుండా వుండాలనే ఆలోచన తమతో అలా చేయించిందనీ అన్నారాయన.
గ్రామంలోని మహిళలు, యువతులు, అశ్లీల సాహిత్యం చదవకుండా వుండేందుకూ, యూత్ లీగ్ తమ వంతు కర్తవ్యంగా మంచి సాహిత్యం సేకరించి వాళ్లతో చదివించేవారు. తన ప్రక్క గ్రామం సీతంపేటలో నివశిస్తున్న కాంగ్రెస్ వాది సీతారామస్వామి కుష్టువ్యాధి గ్రస్తుడైనందున ఆయన దగ్గరకు ఎవరూ వెళ్ళేవారు కాదనీ తాము అందుకు భిన్నంగా తమ యూత్ లీగ్ కార్యకలాపాలను విస్తరించి ఆయన ఇంటి నుండే పనిచేస్తుండేవారమనీ చెప్పారాయన. స్వాతంత్ర్య పూర్వపు రోజుల్లో మాజీ రాష్ట్రపతి డాక్టర్ బాబూ రాజేంద్ర ప్రసాద్ బీహార్ భూకంప భాధితుల కుటుంబాలకు చందాలు సేకరిస్తూ తమ గ్రామం మీదుగా పోయారనీ ఆ సందర్భంగా (1939 ప్రాంతంలో) తమ జట్టు ఆయన కారు ఆపుచేసి తమతో గొంతుకలిపి బోలో స్వతంత్ర భారత్ కీ జై అనిపించామని గర్వంగా చెప్పుకున్నారు తిలక్.                  
(మరిన్ని విశేషాలు మరోసారి)

No comments:

Post a Comment