Thursday, July 30, 2020

అవసరానికి పనికొచ్చిన గుర్రప్పందాలు....స్వర్గీయ కేబీ తిలక్ జ్ఞాపకాలు-అనుభవాలు : వనం జ్వాలా నరసింహారావు

అవసరానికి పనికొచ్చిన గుర్రప్పందాలు

స్వర్గీయ కేబీ తిలక్ జ్ఞాపకాలు-అనుభవాలు

వనం జ్వాలా నరసింహారావు

ప్రజాతంత్ర, సంపూర్ణ స్వతంత్ర వారపత్రిక

(సెప్టెంబర్ 24-30, 2000)

         పరిచయాలు వ్యసనాలకూ ఆ వ్యసనాలు మరిన్ని పరిచయాలకు దారి ఆసి, అడపాదడపా వద్దనుకున్నా అంతస్తుల సాలెగూట్లో ఇరుక్కుపోయే స్థితికి తీసుకెళ్తాయని అనుభవ పూర్వకంగా తెలుసుకున్నారు తిలక్. సినీరంగంలో, తోటి ప్రజానాట్య మండలి కళాకారులకు మల్లే తనకూ ఎందరో సన్నిహితంగా మెలగారనీ, తానూ తన వ్యాపకం ద్వారా ఎందరికో చేరువయ్యననీ, తన పరిచయాలను నెమరేసుకున్నారు.

         తెలంగాణా సాయుధ పోరాటంలో సాంస్కృతిక రంగం ద్వారా పరోక్ష పోరు సాగించి, తెలంగాణా విమోచనకు నడుం బిగించిన ప్రజా నాట్య మండలి సభ్యులు కమ్యూనిస్టు భావాలవారు కాగా, ఇంకో కోవకు చెందిన వారు కాంగ్రెసు పార్టీ అభిమానులు. వారు-వీరూ, వివిధ కారణాల వల్ల అందరూ కాకపోయినా, కొందరైనా సినీరంగానికి వచ్చి స్థిరపడ్డారు. ఇవన్నీ గుర్తు చేసుకుంటూ సెప్టెంబర్ 17 ప్రతి సంవత్సరం ‘తెలంగాణ విమోచన దినం'గా జరుపుకుంటారు గదా అన్నారు తిలక్.

కాంగ్రేసు భావాల నేపథ్యంలో సినీ రంగానికి వచ్చిన వారిలో ఇద్దరి గురించి జ్ఞాపకం చేసుకున్నారు తిలక్ ఈ సందర్భంగా. స్వర్గీయ హయగ్రీవాచారికి ఆప్తుడైన శ్రీ టి కృష్ణ ఒకరు కాగా, మరొకరు శ్రీ వి ఎస్ (సత్య)నారాయణ. కృష్ణగారు ఆదుర్తి దగ్గర సహాయ దర్శకుడుగా చేరగా, నారాయణగారు తిలక్ దగ్గర పనిచేసారు ఆదే హోదాలో. ఆయన్ను గురించి ఎంతో గర్వంగా చెప్పారు తిలక్. ఆలానే కృష్ణగారి గురించి కూడా. ఇద్దరూ దర్శకులయ్యారు. శ్రీ బిఎస్ నారాయణ మద్రాసులో తనకున్న ప్లాటు అమ్ముకొని కరీంనగర్ లో స్థిరబడి స్థానిక ఔత్సాహికుల సహకారంతో కుర్రకారును పోగుచేసుకుని, సినిమాలు తీసారు. కళ్లు కనిపించకుండా పోయిన తర్వాత కూడా అంబేడ్కర్ ఆశయాల థీమ్ తో ‘మార్గదర్శి’ అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. దానికంటే మొందు ఆ సిఎస్ రావు నాటకం ఆధారంగా 'ఊరుమ్మడి బ్రతుకులు', కె కేశవరావు నిర్మించిన ‘నిమజ్జనం' (ఆవార్డు పొందిన సినిమా) బిఎస్ నారాయణగారి దర్శకత్వంలో వచ్చినవే. అదే విధంగా మిర్యాలగూడకు చెందిన వెంకటేశ్వర్రావు, జానకి రామయ్యల శుభోదయా ఫిల్మ్స్ క్రింద నిర్మించిన 'ఆదర్శం' సినిమా.

         ముద్దుబిడ్డ సినిమా తీసిన తర్వాత ఎమ్మెల్యే సినిమా మొదలెట్టక ముందు 'భీమసేన' అనే చిత్రం తీయాలన్న తలంపుతో కొండేపూడి లక్ష్మి నారాయణ గారితో స్టోరీ థీమ్ తయారు చేయించారు. అందులో కథానాయకుడు పాండవ మధ్యముడు భీముడు. సినిమా తీస్తున్నట్లు ప్రకటించటం కూడా జరిగింది. సరిగ్గా  ఆ సమయంలోనే, తెనాలి సత్య నారాయణ టాకీసులో ‘ముద్దుబిడ్డ' రిలీజ్ అయింది. ఆ థియేటర్ మిత్రుడు వాసిరెడ్డి నారాయణగారిది. ఆ సందర్భంగా తెనాలి వెళ్లినప్పుడు, ఉన్నవ లక్ష్మీనారాయణ గారిని కలవాలని, 'మాలపిల్ల’ సినిమా తీయాలని వున్నదనీ, వాసిరెడ్డి గారితో అన్నారు తిలక్. ఆ సందర్భంగా ఆయన డాక్టర్ వెంకటేశ్వరరావు గారని తెనాలిలో పలుకుబడి వున్న ఒకరిని పరిచయం చేయటం, ఆయన ద్వారా ఉన్నవ లక్ష్మీనారాయణ గారిని కలవటం జరిగింది.

‘మాలపల్లి' నవల ఆధారంగా సినిమా తీసేటందుకు ఉన్నవ గారి వద్దనుండి అనుమతి-హక్కులు పొందటం జరిగింది. సినిమాలో కథకు సంబంధించి కొన్ని మార్పులు చేసుకుంటానని తిలక్ అంటే ‘నాయనా నువ్వు సినిమా కోసం ఏం చేసినా, ఏ భాషలో తీసినా, నాకే విధమైన అభ్యంతరం లేదు' అని జావాబిచ్చారు ఉన్నవ గారు. పుస్తకం కాపీరైట్ వరకు తన దగ్గరే వుంచుకున్నారు ఉన్నవగారు. మాలపల్లి నవలలోని ‘రామానాయుడు' పాత్ర విషయంలో ‘ఈస్టలిన్’ ఎలిమెంట్ వున్నదని, ఆయన భార్య ఎవరితోనో లేచి పోయే సన్నివేశం  సినిమాకు బావుండదనీ, తొలగిస్తానని తిలక్ చెప్పారు.

         తన ముందున్న 'భీమసేన', 'మాలపల్లి’, సినిమా ప్రతిపాదనల మధ్య, ఏం చేయాలన్న మీమాంసలో పడ్డారు తిలక్. ఆ సందిగ్దావస్థలో వున్న రోజుల్లో, గోగినేని వెంకటసుబ్బయ్య గారి అల్లుళ్లు సూరెడ్డి రాఘవయ్య, కడియాల వెంకటేశ్వర్రావు, అడుసుమల్లి ఆంజనేయులు, తిలక్ గారిని తరచూ కలుస్తుండేవారు. కలుస్తుండే స్థలం, కస్తూరి రంగయ్య రోడ్డులో వున్న గోగినేని చిన వెంకటేశ్వరరావు (చిన్నబ్బాయి) గారి థియేటర్ ఆవరణలో వున్న ఆయన ఇల్లు.  అక్కడకు ఎందరో సినీ రంగానికి చెందిన వారు వచ్చిపోతుండే వారా  రోజుల్లో. అందులో 'గౌరీపతిశాస్త్రి’ గారొకరు. ఆయన సినిమాల్లో వేషాలు వేసేవారు. ఆయనకు భీమసేన కథ ఎంతగానో నచ్చింది. ఈ సినీ పరిచయాలతో, అడుసుమల్లి ఆంజనేయులుగారు, కారంచేడుకు చెందిన కొందరి సహకారంతో ‘మాధవి ప్రొడక్షన్స్’ అనే సంస్థను స్థాపించారు. ఆ సంస్థ తరపున కమలాకర కామేశ్వరరావుగారి దర్శకత్వంలో, తిలక్- కొండేపూడి లక్ష్మినారాయణ గారి ‘భీమసేన’ థీమ్ ను పాండవవనవాసం సినిమాగా తీయటం జరిగింది. స్వర్గీయ నందమూరి తారకరామారావుగారు అందులో భీముడుగా నటించారు.

         పాండవ వనవాసం సినిమా ద్వారా, ఒకప్పటి జాతీయ చలన చిత్ర అభివృద్ధి సంస్థ అధ్యక్షురాలు శ్రీమతి హేమమాలిని, డాన్సర్‌గా సినీరంగ ప్రవేశం చేసింది. అప్పుడే, ఆమెను, అనంతస్వామి అనే ఓ అడ్వకేట్, హీరోయిన్ చేయిస్తానని చెప్పి, తన అదుపులో వుండే విధంగా ఓ ‘సినీ కాంట్రాక్ట్' కుదుర్చుకున్నారు. హేమమాలిని ఏ సినిమాలో నటించాలన్నా, ఎవరి సరసన నటించాలన్నా, అనంత స్వామితోనే కాంట్రాక్టు కుదుర్చుకోవాలన్న నిబంధన వుండేది. హేమమాలినిని, రాజ్ కపూరుకు పరిచయం చేసింది కూడా అనంతస్వామే. తర్వాత ‘డ్రీమ్ గర్ల్'గా ఆమె అందరికీ తెలిసిందే. కాంట్రాక్టు విషయంలో పేచీ తలెత్తినప్పుడు, తన సలహాకోసం వచ్చినప్పుడు, అనంతస్వామిని చీవాట్లు వేసారు తిలక్. హేమమాలిని కళాకారిణిగా పై కెదగాలి, నువ్వు చేసింది తప్పు అని మందలించి పంపారు. చివరకు ఆ వ్యవహారం కోర్టుకెక్కింది. హేమమాలినిని చూసినప్పుడల్లా 'అయ్యంగారి పిల్లి- చక్కటిది' అని తిలక్-కె.ఎస్. ప్రకాశరావు గార్లు అనుకుండేవారు.


         తిలక్ దర్శకత్వంలో రిలీజ్ అయిన ‘భూమికోసం’ సినిమా ద్వారా సినీరంగ ప్రవేశం చేసిన మాజీ రాజ్యసభ సభ్యురాలు శ్రీమతి జయప్రద విషయంలో ఇలాంటి సూచనే వచ్చింది. అనంతస్వామి-హేమమాలినిల కాంట్రాక్ట్ తరహాలోనే అగ్రిమెంటు కుదుర్చుకుందామని జయప్రదగారి తండ్రీ ఆయనతో అన్నారు. ‘పిచ్చి పిచ్చి షాలు వేయబోకండి. అటువంటి మనస్తత్వం కాదు నాది. హేమమాలిని విషయంలోనే దెబ్బలాడాను, ఆర్టీస్ట్ పై కెల్లాలి' అని ఆ ప్రతిపాదనను తిరస్కరించారు తిలక్. ‘భూమికోసం‘ సినిమా టైటిల్స్ లో ‘కాబోయే అనుపమ కథానాయిక' అని జయప్రద గురించి వేయటం కూడా జరిగింది.

         ఇలానే ఆనాటి సంగతులను-పరిచయాలను నెమరేసుకుంటూ తెనాలిలోని సత్యనారాయణ టాకీస్ యజమాని వాసిరెడ్డి నారాయణ గారి ప్రస్తావన తెచ్చారు తిలక్. సినీ పరిశ్రమకు వచ్చిన ఆదిలో ఆయన 'నీరా ఆవుర్ నందా’ అనే హిందీ సినిమాను ‘ఆహుతి’గా తెలుగులో తీసారు. శ్రీశ్రీ మాటలు రాయగా ఎస్ రాజేశ్వరరావు సంగీత దర్శకత్వం హించారు. 'బారిస్టర్ పార్వతీశం', 'బొండా పెళ్లీ' అనే రెండు హాస్య సినిమాలను తీసిన జగన్నాథ్ గారు తర్వాత కాలంలో ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో పాత్రికేయుడుగా చేరి ఫిల్మ్ రివ్యూస్ తరచూ చేస్తుండేవారని అంటూ ఆయనకు స్వర్గీయ పుచ్చలపల్లి సుందరయ్య గారితో సన్నిహిత సంబంధాలుండేవన్నారు.

         సినినటుడు హాస్యనటుడు, రమణారెడ్డి తిలక్ కు మంచి స్నేహితుడు. ఆయన మద్రాసు రేస్ క్లబ్ సభ్యుడు. ఆయన ద్వారా తిలక్, రేస్ క్లబ్ సభ్యుడయ్యి, స్టాండ్ మెంబర్ గా, రెగ్యులర్ మెంబర్ గా, బాక్స్ మెంబర్‌గా ఎదిగారు. రెస్ క్లబ్-ఆ పరిచయాలు.... ఆదో మలుపు.

         ‘రేస్ క్లబ్' పరిచయాలతో తిలక్ గారికి సన్నిహితమైన ప్రముఖుల్లో కొందరు: వికె రంగారావు గారి తండ్రి చిక్కవరపు జమీందారు, రాజాపర్లాకిమిడి, కస్తూరి నరసింహంగారు, కస్తూరి రంగరాజన్, రామ్ నాడీరాజా, సినీ పరిశ్రమకు చెందిన శ్రీ హెచ్ ఎమ్ రెడ్డి, హైదరాబాద్ నిజాం క్లబ్ ప్రెసిడెంట్‌గా పనిచేసిన నాటి పోలీస్ ఇన్స్పెక్టర్ జనరల్ శ్రీ శివకుమార్‌లాల్, మాజీ ముఖ్యమంత్రి శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి, పిఠాపురం రాజాగారి పెద్దకొడుకు, మీర్జాపురం రాజాగారి పెద్ద కొడుకు మొదలైనవారు.

         తిలక్ మొదట్లో రేసులకు వెళ్తుంటే ఆయన్ను 'టీజ్’ చేసిన కొందరు ప్రముఖులు దరిమిలా రేసు గుర్రాల స్వంత దారులుగానూ, బ్రీడర్స్ గానూ మారారు. ప్రజానాట్యమండలితో సంబంధాలుండి, అందులో నుండి సినీరంగానికి వచ్చిన తనలాంటి వారిలో పలువురు సమాజ పరంగా ఎలా అయిపోయారో ‘క్విక్ మనీ’ కొరకు ఏమేమి పనులు చేసారో తలచుకుంటే నవ్వోస్తుందన్నారు తిలక్.

         అయితే, రేసుల్లో తాను ‘బెట్టర్' కంటే శాస్త్రీయంగా అధ్యయనం చేసే ఓ వ్యక్తిగా ఎక్కువ శ్రద్ధ కనబరిచే వాడినంటారు తిలక్.  ఉదయాన్నే నిద్రలేచి, ట్రాక్ వర్క్ కు వెళ్తుండే తన్ను ఆ రోజుల్లో గైడ్ చేసింది, అప్పట్లో హిందూ విలేఖరి స్పోర్ట్స్ కరెస్పాండెంట్ శ్రీ పార్థసారధి. తెల్లవారుజామున ఐదుగంటలకే రేస్ కోర్సుకు వెళ్లి, నడకను బట్టి రేసు గుర్రం వ్యవహారం పసిగట్టే స్థాయికి చేరుకున్న తిలక్ కు ఎంతో మంది జాకీలు, ట్రెయినర్లు పరిచయం అయ్యారు. ట్రాక్ నుండి తిలక్ ఇంటికి వచ్చి ఆయనిచ్చిన ‘కాపీ-బ్రాందీ’ కాక్ టెయిల్ త్రాగి పోతుండేవారు. ఇలాంటివన్నీ సమాజంలో మనుషులను ప్రభావితం చేస్తాయని ఆ పరిచయాలు వ్యసనాలకూ, ఆ వ్యసనాలు మరిన్ని పరిచయాలకూ, ఆలా సాగుతూనే వుంటాయనీ తిలక్ అభిప్రాయం. ఏదేమైనా రేసుల్లో సంపాదన గురించి ఆయనెప్పుడూ పట్టించుకోలేదు.

         రేసు క్లబ్ పరిచయాలు ‘అవసరానికి’ కూడా వుపయోగపడ్డాయని, దానికి చెందిన ఓ సంఘటన చెప్పారు. మద్రాసులో ‘పెద్దబ్బాయి' గా అందరికీ తెల్పిన గోగినేని వెంకటేశ్వరరావు గారు చనిపోయినప్పుడు, అత్యవసరంగా కావాల్సిన డెత్ సర్టిఫికెట్ కొరకు నాటి పోలీస్ కమీషనర్ చేసిన సహాయం రేస్ క్లబ్ పరిచయం మూలాన్నే జరిగింది. ఆ పోలీస్ కమీషనర్ మామగారు రేసుగుర్రం యజమాని, తిలక్ స్నహితుడు అయిన శ్రీ ఎవి థామస్ అనే పెద్దమనిషి.  పేకేటికి ఫోన్ చేసి, ఆయన్ను పంపి సర్టిఫికెట్ తెప్పించారు. తిలకే స్వయంగా కారు నడుపుకుంటూ గోగినేనిగారి డెత్ బాడీని కృష్ణాజిల్లాలోని మానికొండకు తీసుకెళ్లారు. ఆయనకే తిలక్ తాను తీసిన 'అత్తా ఒకింటి కోడలు' సినిమాను అంకితం ఇచ్చారు.

ఆ తర్వాత, వివాహానికి ముందు, తిలక్ షామెర్స్ రోడ్డులో వుండేవారు, పొరుగునే, రేసుల పిచ్చివున్న తుని తాలూకు రాజాగారోకరుండేవాడు. ఆయన భావమరిది ‘మంత్రదండం’ సినిమాకు సహాయ దర్శకుడుగా పనిచేసారు. తిలక్ గారింటికి అప్పట్లో వచ్చిపోయే వ్యక్తుల్లో ‘నవయుగ ఫిల్మ్స్’ డిస్ట్రిబ్యూటర్స్ కు చెందిన కాట్రగడ్డ శ్రీనివాసరావు గారొకరు. ఈ ప్రాంతంలోనే జబ్బార్ అనే ఓ ముస్లిం  ‘జబ్బార్ బీడి’ తయారు చేస్తుండేవారు. ఆయనకు కొన్ని రేసు గుర్రాలుండేవి. వాటి ట్రేయినర్ మహ్మద్ లాహోరి. ‘జబ్బార్ బీడి’ గారి ఆడరేసు గుర్రం ఒకటి ‘డబుల్ చిమ్ - హీట్’ లో వున్నప్పుడు తప్పక గెల్చేది.  గుర్రం చాలా సెన్సిటివ్ జంతువనీ, మర్నాడు రేసు వుంటే అది చాలా మెంటల్ గా ఫీల్ అవుతుందని చెప్తూ, రేసు గుర్రానికి దెబ్బతగిలితే, అది కృశించి పోకుండా వుండేటందుకు దాన్ని షూట్ చేసి చంపుతారని  అన్నారు తిలక్ తనరేసుల పరిజ్ఞానంతో.

         రేసుల కారణాన అప్పుడప్పుడూ హైదరాబాద్ వచ్చి పోతుండేవారు తిలక్.  అప్పట్లో సికిందరాబాద్ పెరెడ్ మైదానంలో గుర్రపందాలు జరుగుతుండేవి. బయటనుండి కూడా వీక్షించేవీలుండేది.   ఆ రేసుల్లో పాల్గొంటుండే గోగినేని గారి గుర్రంపేరు ‘బేగం’. సర్ మీర్జా ఇస్మాయిల్  (దివాన్ గాచేసారు)  గారి సోదరుడు ఆస్కర్ ఆ గుర్రానికి ట్రెయినర్. ఓ పర్యాయం  బేగం గెలవద్దునుకుని దానికి బాగా తిండిపెట్టారు.  గెలవాలని వీరు కోరుకున్న గుర్రంపేరు ‘బెటర్ షైన్’  దాని ట్రెయినర్ బెంగుళూరుకు చెందిన శివన్. చివరకు గెల్సింది బేగం. అదే విధంగా మరోసారి బెంగుళూరు రేసుల్లో రాజారామ్ నాడి గుర్రం ‘మీనా’ గెలవదనుకుని వేరే గుర్రంపై పందెం కాచిన వారంతా నష్టపోయారు.  ‘హండర్సన్’ అనే ఓ జాకీకి విజయలక్ష్మి అనే ప్రేయసి వుండేది.   ప్రేయసి గ్యాలరీలో కనిపిస్తే చాలు గుర్రాన్ని జోరుగా తోలి గెలిచేవాడు. జాకీలంతా కౌబాయ్ లని  ఇలాంటి వివరాలు చెప్పారు తిలక్.

         తిలక్ రేసు క్లబ్ మెంబర్ గా వున్నరోజుల్లోనే హిందుస్తాన్ అంబాసిడర్ కార్లు అమ్మేరిలయన్స్ మోటార్ల సంస్థ అధిపతి ముత్తయ్యగారితో పరిచయమయింది. ఆయనే ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకుకూ అధిపతి ఆరోజుల్లో. మాజీ క్రికెట్ కంట్రోల్ బోర్డు చైర్మన్ ముత్తయ్య గారికి ఆయన తండ్రి. తిలక్ తన కార్లను అక్కడే కొన్నారు.  ముత్తయ్య గుర్రాల ట్రెయినర్ ‘చార్లెస్’ కు స్నేహితుడు. అయితే ఓ సారి తన కొత్త కారు సర్వీస్ కొరకు రిలయన్స్ కు ఇస్తే చాలారోజుల వరకు తిరిగి ఇవ్వలేదు.  ఓ రోజున ఏదో నెపంతో అదే కారును చార్లెస్ రేస్ కోర్సుకు వేసుకురావటాన్ని గమనించిన తిలక్ ఫోటో తీసి, గొడవ చేసి, కేంద్ర ప్రభుత్వ ఇండస్ట్రీయల్ వింగ్ కు ఫిర్యాదు చేసారు. విచారణ జరిగింది.  రిలయన్స్ వాళ్లు చివరకు నష్టపరిహారం చెల్లించాల్సి వచ్చింది తిలక్ కు.   ఇన్ని జరుగుతున్నారేసు కోర్సుల్లో ముత్తయ్య-తిలక్ లు కలవటం, ట్రెయినర్ ఛార్లెస్, జాకీలతో పాటు తిలక్ గారి ఇంటికి రావటం మాత్రం ఆగలేదు.

         నాటి ఇండియన్ బ్యాంకు అధిపతి శ్రీ ఎమ్ ఎ రామస్వామి ఆయన సోదరుడు ముత్తయ్య  శెట్టిగారు కూడా రేస్ క్లబ్ సభ్యులే. జాకీలు-ట్రెయినరులు స్నేహ పూర్వకంగా తిలక్ దగ్గరకు వచ్చి పోతుంటే రామస్వామికి కన్నుకుట్టింది. తిలక్ రేసులు మానిప్యులేట్ చేస్తున్నాడని ఆయనకు అనుమానం. కాకపోతే గుర్రాలను పందేలను, ట్రెయినర్లను అధ్యయనం చేసే ఉద్దేశ్యంతోనే జాకీలతో స్నేహం చేస్తుండేవారు తిలక్.  ఆయన దగ్గర ఆరేడు బైనాక్యులర్స్ వుండేవి.  తర్వాత వాటిని శ్రీకాకుళ సాయుధ పోరాటంలో పాల్గొన్న నక్సలైట్ నాయకుడు శ్రీ చౌదరి తేజేశ్వర్ రావు గారికి ఇచ్చారు.   ఆయన అడుగుతే రేసుల్లో ఎవర్నీ నమ్మకూడదనే సిధ్దాంతం ఆయనది. గుర్రాలను శ్రద్దగా పరిశీలించుకుంటూ పోతే, పందెం కట్టే సీజన్ లో గెల్వటం ఖాయం. జాకీలు కూడా ఆశ్చర్యపోయే రీతిలో గుర్రాల విషయం వారితో చర్చించే స్థాయికి ఎదిగారు తిలక్.

         డాక్టర్ మర్రి చెన్నారెడ్డి 1978లో ముఖ్యమంత్రి అయిన తర్వాత మద్రాసుకు వెళ్లినప్పుడు, సినీ పరిశ్రమ విజయాలను వివరించేటందుకు ఆయన వెంటున్నారు తిలక్. అపుడు ఓ సారి ఎమ్ఎ రామస్వామి తండ్రి రాజా చెట్టినాడు చెన్నారెడ్డి గారిని బ్రేక్ ఫాస్ట్ కు పిల్చి, ఆయనతో వచ్చిన తిలక్ కు కూడా స్వయంగా దోశ సర్వ్ చేసారు. అది చూసిన రామస్వామి ఆశ్చర్యపోయారు.

         ఇతర పరిచయాలగురించి  చెప్తూ కన్నాంబ గారి భర్త కళారి నాగభూషణంగారి ప్రస్తావన తెచ్చారు. రాజరాజేశ్వరి ఫిల్మ్స్ పేరిట ఆయనకు సంస్థ వుండేది. వారి కొడుకు వెంకటేశ్వరరావు అడ్వకేటు. ఆయనా కంపెనీ స్థాపించి తిలక్ గారిని దర్శకత్వ బాధ్యతలు స్వీకరించమని కోరారు. వారు తీద్దామనుకున్న సినిమాకు తాపీ గారు కధా రచయిత, ఘంటసాల వెంకటేశ్వరరావు గారు కూడా ఆయన్నో సినిమాను డైరెక్ట్ చేయమని అడిగారు. బయటివారికి డైరెక్ట్ చేయటం ఇష్టం లేని తిలక్  సున్నితంగానే తిరస్కరించారు.

         తిలక్ గారికి ఆదుర్తి గారితో వున్న అనుబంధం ఓ ప్రత్యేకమైంది. వారిద్దరూ కల్పిమెల్సి తిరిగే రోజుల్లో ఉదయశంకర్ హిందీలో 'కల్పన' సినిమా తీస్తే, ఆదుర్తి ఆ యూనిట్‌లో పని చేసారు. వీరంతా సాయంత్రాలు తరచూ కలుస్తుండేవారు. కల్పన సినిమా అంతర్జాతీయ స్థాయిలో ప్రదర్శనకు పంపాల్సిన అవసరం కలిగినప్పుడు తిలక్-ఆదుర్తి గార్లు కలిసి ఇంటర్నేషనల్ ఎడిషన్ రూపొందించారు. తాను హిందీలో పండితుడిని కాకపోయినా హిందీ భాషా పరిజ్ఞానం తగినంత మోతాదులో మాత్రం వుండేదని అంటారు తిలక్.

         ఆదుర్తికి, తనకూ వున్న సన్నిహిత పరిచయంలో తామెన్నో చిలిపి పనులు చేసే వారమని అంటూ ఒక సంఘటన గుర్తు చేసుకున్నారు తిలక్. పద్మనాభం అనే తమిళ నిర్మాత తాను తీసిన ఓ చిత్రం రీ రికార్డింగ్ చూడాలని వీరిని కోరారు. ఆర్కెస్ట్రా వాళ్లు కూడా వున్నారక్కడ. ఈ రికార్డింగ్ సంగతేమోకానీ, ఇద్దరూ బీడీల్లో గంజాయి కలుపుకుని ‘కొట్టేసి' గర్రుపెట్తూ నిద్రపోయారు. మరోసారి 80 శాతం ఆల్కహాల్ వుంటుంది, బాగా కిక్ ఇస్తుందని ‘ఉడుకులాం' బాటిల్  ఖాళీ చేసారు.

         వ్యసనం ఓ ఎత్తైతే వ్యసనంలో చిలిపితనం మరో ఎత్తు. ఆ ఎత్తుకు ఎదిగిన తిలక్ కు ఈ విధమైన జ్ఞాపకాలు తీపి - చేదు గురుతులే!

(మరిన్ని విశేషాలు మరోసారి)

No comments:

Post a Comment