Thursday, July 9, 2020

రాజధర్మం అంటే..... (భరతుడికి రాజధర్మం బోధించిన శ్రీరాముడు) : వనం జ్వాలా నరసింహారావు


రాజధర్మం అంటే.....
(భరతుడికి రాజధర్మం బోధించిన శ్రీరాముడు)
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రప్రభ చింతన (09 & 10-07-2020)
శ్రీరాముడి వనవాసం ఆరంభంలో, ఒకనాడు చిత్రకూటాన్ని, మందాకినీ నదిని గురించి సీతకు చెప్తున్నప్పుడు ఆకాశం బద్దలయ్యే ధ్వని, దూళి ఆయనకు వినిపించింది, కనిపించింది. ఆ ధ్వనికి కారణం కనుక్కోమని లక్ష్మణుడికి చెప్పాడు. కారణం కనుక్కున్న లక్ష్మణుడు, అలా సైన్యంతో వచ్చేది భరతుడని చెప్పి ఆయన్ను అనుమానించాదు. లక్ష్మణుడిని సరిదిద్దాడు అన్న శ్రీరాముడు. 

         ఇంతలో, అన్నను చూడాలన్న కోరికతో వస్తున్న భరతుడికి పర్ణశాలలో కూర్చున్న శ్రీరాముడు కనిపించాడు. దర్భాసనం మీద కూర్చున్న శ్రేరాముడిని చూసి పరుగెత్తుకుంటూ సమీపంలోకి పోయాడు భరతుడు. తనను చూడగానే దుఃఖిస్తున్న భరత-శత్రుఘ్నులను పట్టుకుని ఓదార్చి, వారి కన్నీళ్లను తుడిచాడు. కౌగలించుకున్నాడు. వారి మనస్తాపం తొలగించాడు. భరతుడిని కుశల ప్రశ్నలు వేశాడు. తండ్రి ఆజ్ఞప్రకారం నువ్వొచ్చావా? అని అడిగి ఆయన బతికున్నాడా అన్న సందేహాన్ని వెలిబుచ్చాడు. తండ్రి పోయిన వార్త విని ఎంతగానో దుఃఖించాడు. అంత్యక్రియలు చేశాడు. ఇక ఆతరువాత రాజ ధర్మాన్ని గురించి అనేక విషయాలు చెప్పాడు.    

         రాజ ధర్మాన్ని వివరిస్తూ ఇలా అడిగాడు: “దేవతలను యజ్ఞాలతో తృప్తి కలిగిస్తున్నావు కదా? శ్రాద్ధాదుల వల్ల పితృ దేవతలను తృప్తి పరుస్తున్నావా? ప్రజలను వాళ్లు చెప్పినట్లు విని సంతోషపరుస్తున్నావా? గురువులకు శుశ్రూష చేసి తృప్తి పరుస్తున్నావా? తండ్రితో సమానమైనవారికి, పెద్దలకు నమస్కారాలు చేసి తృప్తి పరుస్తున్నావా? విద్వాంసులను, ఆయుర్వేదం తెలిసినవారిని, బ్రాహ్మణులను, ధనం ఇచ్చి సంతోష పరుస్తున్నావా? నీ మంత్రులందరూ శౌర్యవంతులేకదా? నీతిశాస్త్రం చక్కగా చదివారా? బుద్ధిలో నీతో సమానమైనవారా? ఇంద్రియ నిగ్రహం వున్నవారేనా? ముఖం చూసి ఎదుటివారి అభిప్రాయం చెప్పగలరా? శాస్త్రాన్ని తెలిసిన మంత్రులు పని చేయడానికి ముందే నీ ఆలోచనలు బహిర్గతం చేయరు కదా?”

“రహస్యాలను ఇతరులతో ఆలోచిస్తావా నువ్వు? ఒకడితోనే పంచుకుంటే వాడికి ఎవరనుకూలంగా వుంటే వారికి చెప్పుతాడు, పదిమందితో పంచుకుంటే, వాళ్లలో ఒకరు కాకున్నా మరొకరు వేరేవారికి చెప్పొచ్చు. భిన్నాభిప్రాయాలవారైతే ఒకరితో ఒకరు కలహించుకుంటారు. నీ ఆలోచనలు ఏవిధంగా వున్నా, పనికి ముందే ఎవరికీ చెప్పవుకదా? నీతిశాస్త్రం ప్రకారం కార్యం చెడిపోయే విధంగా ఆలస్యం చేయవుకదా? నువ్వు ఆలోచించి నిర్ణయించిన కార్యక్రమం కావడానికి ముందే నీ సామంతరాజులకు ఆ విషయం తెలియదు కదా? నువ్వు, నీ మంత్రులు చేసే ఆలోచనలు ఇతరులు తెలుసుకోలేరు కదా? వేయిమంది మూర్ఖులకంటే కార్యం ఆలోచించి చేయగలవాడు ఒక్కడు చాలు. అలాంటివారున్నారా నీ దగ్గర?”

నీ మీద నిజమైన ప్రేమగలవారిని, అనేక పరీక్షల్లో నెగ్గినవారిని, ఆదినుండి వంశపరంపరగా సేవ చేస్తున్న వారిని, వాక్కు, మనసు, కర్మ మూడూ సత్యంగానే వుండేవారిని, ఏవిధమైన మాలిన్యం లేనివారిని, శ్రేష్ఠ కార్యాలలో శ్రేష్ఠులైన వారినే మంత్రులుగా నియమిస్తున్నావు కదా? భరతా! నీ దగ్గర, నిర్మలమైన మనసు లేనివారు, చెడునీతిని బోధించేవారు, ఇతరులమీద పిర్యాదులు చేసేవారు, రాజభయం లేనివారు, ధనాశ వున్నవారు లేరుకదా? నీ సేనానాయకుడు సుగుణాల వాడే కదా? శూరుడేనా? ధైర్యం వున్నవాడేనా? త్రికరణశుద్ధి కలవాడేనా? రాజంటే ప్రేమ వున్నవాడేనా? నీ సేనలోని ముఖ్యులు బలవంతులేకదా? పరాక్రమవంతులేకదా? యుద్ధంలో సమర్దులేనా?”

“ఇతర రాజుల విషయంలో 18 మంది  తీర్థులను నియమించావా? 18 మంది  తీర్థులంటే: మంత్రి (Minister), ఆలోచ చెప్పేవాడు; పురోహితుడు (Private Secretary); యువరాజు (Prince); సేనాపతి (Commander-in-Chief), సేనలకన్నిటికీ అధిపతి; దౌవారికుడు లేదా ద్వారపాలకుడు (Gate keeper), అంతఃపురంలాంటి వాటిదగ్గర వున్న ద్వారపాలకుల్లో మేటి;  అంతర్వంశికుడు లేదా అంతఃపుర కార్యనిర్వాహకుడు (Palace Controller); కారాగారాధిపతి (Superintendent of Jails); అర్థసంచయికుడు (Revenue officer Collector), ధనం సంపాదించేవాడు; కార్యనియోజకుడు, రాజాజ్ఞాలను వెల్లడించేవాడు; ప్రాడ్వివాకుడు (Judge), న్యాయ స్థానంలో న్యాయ విచారకర్త; సేనానాయకుడు, భటులకు జీతభత్యాలు ఇచ్చేవాడు; నగరాధ్యక్షుడు, రాత్రిపూట నగర ద్వార ప్రాకారాలలో ప్రహరీ తిరుగుతూ రక్షించేవాడు; కర్మాంతికుడు (Accountant General), పనులు చక్కబరుస్తున్న సైన్యేతర జీతగాళ్ళకు జీతాలు పంచిపెట్టేవాడు; సభ్యుడు, ప్రతిరోజూ సభను అలంకరించడం, రాజు, మంత్రి, ఇతర అధికారుల ఆసనాలు ఏర్పాటు చేయడం, సభలోకి అనుమతి ఉన్నవారిని రానీయడం, లేనివారిని నిరోధించడం, సభలో శబ్దం రాకుండా చూడడం, సభా రక్షకులను నియమించడం చేసేవాడు; ధర్మాధ్యక్షుడు (Munsiff), ఇరుపక్షాల వాదనలు విని ధర్మశాస్త్రం ప్రకారం పరిష్కారం చెప్పేవాడు; దండపాణి లేదా దండపాలుడు (Magistrate), జారులను, చోరులను ఇతర రకాల అపరాధం చేసిన వారిని దండించేవాడు; దుర్గపాలుడు, దుర్గాలను కాపాడేవారి మీద పై అధికారి; రాష్ట్రంతపాలుడు, రాష్ట్రాన్ని పరరాజులు ఆక్రమించకుండా పొలిమేరలను ఎల్లప్పుడూ కాపాడేవారి మీద అధికారి. వీరిలో మొదటి ముగ్గురు, అంటే, మంత్రి, పురోహితుడు, యువరాజు స్వపక్షం వారు కాగా, మిగతావారు పరపక్షం వారు. వీరిమీద వేగులుండాల్సిన అవసరం లేదు. కారణం ఈ ముగ్గురూ ఎప్పుడూ రాజు సమక్షం లోనే వుంటారు కాబట్టి.


“బ్రాహ్మణులు కదా అని నాస్తికవాదులైన చార్వాకులను, గౌరవించడం లేదుకదా? వాళ్లను చేరదీస్తే ఈ లోకానికి, పరలోకానికి వాళ్లు కీడు చేస్తారు. వారి మనసులు యదార్థానికి విరుద్ధంగా విపరీతార్థాలు చెప్తాయి. వాళ్లు పండితులు కాకపోయినా తమను తాము పండితులమని అనుకుని సర్వజ్ఞత్వం తమ మీద వేసుకుని, విపరీత బుద్ధులు నేర్పుతూ, తమను నమ్మినవారిని ఉభయ లోకాల్లో చెడగొడతారు. సత్సంప్రదాయపరంగా చదవాల్సినవి చదవకుండా, ధర్మశాస్త్రాలను విపరీత బుద్ధితో వక్రభాష్యం చెప్తూ, నిస్సారమైన, నిరర్థకమైన తర్క, యుక్తి వాదాలు చేసుకుంటూ వుండే చార్వాకులతో స్నేహం కీడు కలిగిస్తుంది”.

“భూమి దున్ని జీవించేవారి విషయంలో, పశువులను మేపి జీవించేవారి విషయంలో, వారు కష్ట జీవులైనందున వారికి కావాల్సిన పదార్థాలకు సంబంధించి సహాయం చేస్తున్నావా? ప్రజలు తమ ఆహార పదార్థాల విషయంలో వీరిమీదే ఆధారపడ్డారు. అలాగే వాణిజ్యంలో జీవిస్తూ నిన్ను ఆశ్రయించేవారికి శుభమే కదా? కృషి, గోరక్షణ, వాణిజ్యం చేసేవారికి రాజు సహాయం అత్యంత అవశ్యం కాబట్టి, వారికి కావలసిన సహాయం చేస్తూ, వారి బాధలు తీరుస్తున్నావా? రాజైన వాడు సమస్త వర్ణాశ్రమ ధర్మాలవారిని శాస్త్రప్రకారం రక్షించాలి. అలా చేస్తున్నావు కదా? స్త్రీలను గౌరవిస్తున్నావు కదా? ఏకాంతంలో కూడా నువ్వు వారికి రహస్యాలు చెప్పడం లేదు కదా? ఎందుకంటే వాళ్లు చపల చిత్తులు కాబట్టి రహస్యాలను దాచలేరు”.

“ప్రతిరోజూ సభలో ఉదయాన ప్రజలకు దర్శనం ఇస్తున్నావు కదా? కొన్ని రోజులు సభకు రాకపోతే నీకేదో రోగం వచ్చిందని ప్రజలు సందేహిస్తారు. సేవకులు ఇష్ఠానుసారంగా వచ్చి-పోతుంటే అతిపరిచయం వల్ల నిన్ను చులకనగా చూస్తారు. అందుకే వాళ్లను అసలే చూడకుండా వుండకూడదు. అలాగే, ఎప్పుడో ఒకసారి చూసి వారి స్థితిగతులు విచారించాలి. నీ జలదుర్గాలు, గిరిదుర్గాలు, వనదుర్గాలు అన్నీ ధనధాన్యాలతో, జలాలతో, ఆయుధాలతో కూడి వున్నాయికదా? వీరులైన భటులు, విలుకాళ్లు రక్షిస్తున్నారు కదా? పనులు చేయడానికి శిల్పులున్నారు కదా?”

“వ్యయం కంటే మించి ఆదాయం వుంది కదా? ఆదాయంకంటే తక్కువగానే వ్యయం చేస్తున్నావు కదా? అయోగ్యులకు అనవసరంగా ధన సహాయం చేయడం (అపాత్రదానం) లేదు కదా? బ్రాహ్మణులకు, స్నేహితులకు కావాల్సిన ధనం ఇస్తున్నావా? దేవతా కార్యాలు, పితృ కార్యాలు, చేసేవారికి ధన సహాయం చేస్తున్నావా? అన్ని కార్యాలు మనమే చేయలేం కాబట్టి పుణ్యకార్యాలు చేసేవారికి సహాయం చేస్తే మనకూ పుణ్యం వస్తుంది. ధనవంతుడికి, పేదవాడికి తగాదా వచ్చినప్పుడు నీ మంత్రులు కుటిలబుద్ధితో ధనికుడికి మద్దతివ్వకుండా జాగ్రత్త పడాలి. నేరం చేసినవాడిని వదిలిపెట్టడం వల్ల కలిగే పాపం కంటే నేరం చేయనివాడిని దండించడం వల్ల కలిగే పాపం ఎక్కువ అని తెలుసా?”

“గురువులకు, వృద్ధులకు, తాపసులకు, బ్రాహ్మణులకు, నాలుగు వీధులు కలిసే ప్రదేశంలో వున్న దేవతల్లాంటి చెట్లకు, అతిథులకు, మోక్షలాభం సిద్ధించినవారికి, దేవతలకు, భక్తితో, నిర్మల మనసుతో నమస్కారం చేస్తున్నావా? ధనం కోసం ధర్మాన్ని వ్యర్థం చేయడం లేదుకదా? ధనం సంపాదించాల్సిన సమయంలో ధర్మ విచారం చేస్తూ కాలయాపన చేయవద్దు. రాత్రి అనుభవించాల్సిన కామాన్ని పగలు చేయడం తప్పు. ధర్మ, అర్థ, కామాలను ఏవేళకు ఏది చేయాలో అదే చేయాలి. ధనం మీది ఆశతో లోభివై ధర్మకార్యాలు చేయడం మానలేదుకడా? సుఖాబిలాషతో ధర్మ, అర్థాలను ధ్వంసం చేయడం లేదుకదా?”

“ధర్మ పద్ధతిన రాజ్యపాలన చేస్తున్నావుకదా? అసత్యం పలకడం, దేవుడు లేదనడం, పని చేయకుండా ఎప్పుడూ ఆలోచనే చేస్తూ కాలం గడపడం, కోపం రానివారి మీద కోపం తెచ్చుకోకూడని సమయంలో కోపగించుకోవడం, బుద్ధిపొరపాటు, బుద్దిమాంద్యం, శ్రేయస్కరమైన జ్ఞానుల దర్శనం మనం పోయి చేసుకోక పోయినా వారొచ్చినప్పుడు కూడా చేయకపోవడం, పంచేంద్రియాలకు లోబడి వుండడం, రాచకార్యాలను ఒక్కడే ఆలోచన చేయడం, నీచులను గౌరవించడం లేదా ఒకే సమయంలో అనేకమంది శత్రువులమీద దండెత్తడం, నిర్ణయించబడిన పని చేయక పోవడం, అనర్థజ్ఞులతో కలిసి ఆలోచన చేయడం, ఆలోచనలను దాచుకోకుండా బయట పెట్టడం, శుభకార్యాలలో నిర్లక్ష్య భావం, ఈ పద్నాలుగు దోషాలు రాజుకు వుండకూడదు. ఇవి లేకుండా రాజ్యం చేస్తున్నావు కదా?”

“దశవర్గం, పంచవర్గం, చతుర్వర్గం, అష్టవర్గం, త్రివర్గం, విద్యాత్రయం అనే వాటి లక్షణాలు తెల్సుకుని, వాటిలో ఏవి అవసరమో, ఏవి కావో ఆలోచించి, అలాగే ఆచరిస్తున్నావా? ఇంద్రియాలను చక్కగా వశపర్చుకున్నావా? దైవ వ్యసనాల గురించి, మానుష్య వ్యసనాల గురించి, కృత్యం గురించి, ప్రకృతి, మండలం, వింశతి వర్గాలు, షడ్గుణాలలో ముఖ్యమైన సంధి-విగ్రహం-యాత్ర-దండం గురించి, ఆలోచించి వాటిని విడిచి, గ్రహించాల్సిన వాటిని గ్రహిస్తున్నావా?”

“ఆలోచించి చేయాల్సిన పనులను ముగ్గురికి తక్కువ కాకుండా, నలుగురికి ఎక్కువ కాకుండా, అది కూడా మొదట ఒక్కొక్కరితో వేర్వేరుగా, తర్వాత అందరిని కలిపి ఒక్కటిగా, ఆలోచిస్తున్నావా? ఆలోచించి వారి అభిప్రాయాలను అర్థం చేసుకుంటున్నావా? ఆ తరువాత వారు చెప్పినదాంట్లో మంచి-చెడు నువ్వు స్వతంత్రంగా ఆలోచన చేస్తున్నావా? ఇద్దరితోనే కలిసి ఆలోచన చేస్తే, వారిరువురు వేరేవేరే అభిప్రాయం చెప్తే ఏం చేయాలనే సందిగ్ధం కలగొచ్చు. ముగ్గురైతే ఇద్దరు ఒక విధంగా, ఒకరు వేరే విధంగా చెప్తే ఎక్కువమంది అభిప్రాయం ప్రకారం నిర్ణయం తీసుకోవచ్చు. అప్పుడూ సందేహం వస్తే నాలుగో వ్యక్తీ అభిప్రాయం తీసుకోవచ్చు. అంతకన్నా ఎక్కువైతే, ఐకమత్యం కుదరక వారిలో వారు కలహించుకునే ప్రమాదం వుంది. రహస్యం చెడిపోవచ్చు. రహస్య విషయాలు ఎక్కువ మందితో ఆలోచన చేయరాదు. కొందరు సలహా అడిగినప్పుడు, వారితో ఆలోచన చేసినప్పుడు, ఒంటరిగా ఒక విధంగా, నలుగురిలో మరో విధంగా చెప్తారు. అలాంటి వారి సలహాలు నమ్మకూడదు. ఎవరెన్ని చెప్పినా విని స్వయంగా ఆలోచించి తన మనసును సమాదానపర్చుకుని సరైన విధంగా నిర్ణయం తీసుకోవాలి”

“నేను నీకు చెప్పినవన్నీ ధర్మార్థ కామాలతో కూడినవి. ఇహ-పరలోక సుఖం కలిగించేవి. మోక్షార్థికి కావాల్సిన దీర్ఘాయువు ఇచ్చేవి. ధర్మార్థ కామాలలో ధర్మానికే ప్రాధాన్యం ఇస్తున్నావుకదా? రాజైనవాడు ధర్మ మార్గాన నడుచుకుంటూ ప్రజలను పాలిస్తే మరణించిన తరువాత స్వర్గానికి పోయి అక్కడ దివ్యభోగాలను అనుభవిస్తాడు. ఎలాంటి సందర్భంలోనైనా, ప్రాణాపాయ స్థితిలో కూడా ధర్మాన్ని విడువకూడదు. ధర్మం శాశ్వతం”.
(వాసుదాసు గారి ఆంధ్రవాల్మీకి రామాయణం మందరం ఆధారంగా)

No comments:

Post a Comment