మహాకవి బమ్మెర పోతనామాత్య
ప్రణీత
(రామకృష్ణ మఠం, హైదరాబాద్
ప్రచురణ)
శ్రీ మహాభాగవతము, షష్ఠమ స్కందం
భగవదనుగ్రహంతో చదవడం
పూర్తయింది
వనం జ్వాలా నరసింహారావు
కంII చదివెడిది
భాగవతమిది,
చదివించును
కృష్ణు, డమృతఝరి పోతనయున్
చదివినను
ముక్తి కలుగును
చదివెద
నిర్విఘ్నరీతి ‘జ్వాలా’
మతినై
శ్రీ మహాభాగవతం అనే
ఈ మహా పురాణాన్ని సహజ పాండిత్యుడు, బమ్మెర పోతనామాత్యుడు రచించాడు. షష్ఠమ స్కందాన్ని సింగయ కవి తెనిగించాడు.
డాక్టర్ విశ్వనాథం సత్యనారాయణమూర్తి గారు అనువదించారు. 168 పేజీల ఈ షష్ఠమ స్కందం లో
కవి ప్రత్యేకంగా ఈ స్కందానికి రాసిన ఉపోద్ఘాతం నుండి మరుద్గణముల జననం వరకు 19
అంశాలున్నాయి. క్లుప్తంగా ఆ 19 అంశాల వివరమైన వివరాలు:
సింగయ కవి ఉపోద్ఘాతం, కృతిపతి నిర్ణయం,
గ్రంథకర్త వంశ వర్ణన, షష్ట్యంతాలు, కథా
ప్రారంభం, అజామీళోపాఖ్యానం, ప్రచేతసులను
చంద్రుడు శాంతింప చేయడం, దక్షుడి జననం,
సకల జీవరాశుల సృష్టి, దక్షుడు శ్రీహరిని గూర్చి తపస్సు చేయడం, అతడికి పరమేశ్వరుడు ప్రత్యక్షం కావడం, దక్షుడు
చేసిన హంసగుహ్యం అనే సప్తరాజం, హర్యశ్వశబళాశ్వుల పుట్టుక, వారు నారదుడి వల్ల ఆకర్షితులై ఆయన మాటల ప్రకారం ప్రవర్తించి మోక్షం
పొందడం, ఆ వృత్తాంతాన్ని నారదుడి వల్ల విన్న దక్షుడు శోకించడం, అనంతరం బ్రహ్మ వరంతో దక్షుడు శబళాశ్వులానే వేయిమంది పుత్రులను కనడం
ఉన్నాయి.
ఇంకా: సృష్టి
చేయాలనే కోరికతో దక్షుడి ఆజ్ఞానుసారం వారు తమ అన్నలు సిద్ధిపొందిన నారాయణ సరస్సుకు
పోవడం, నారదుడు శబాలాశ్వులకు నివృత్తి మార్గాన్ని (వైరాగ్యాన్ని,
బ్రహ్మజ్ఞానాన్ని) ఉపదేశించడం, వారు తమ అగ్రజుల అడుగు జాడల్లో
నడచి మోక్షాన్ని పొందడం, ఈ విషయాన్ని దివ్యజ్ఞానం వల్ల
తెలుసుకున్న దక్షుడు నారదుడిని శపించి ప్రజాసర్గం చేయడం, నారద మహర్షి దక్షుడి
శాపాన్ని స్వీకరించడం, బ్రహ్మ వరం వల్ల సృష్టిని
విస్తరించడానికి దక్షుడికి అరవై మంది కూతుళ్లు పుట్టడం, వారిలో
కశ్యప ప్రజాపతికి ఇచ్చిన పదముగ్గురు
కూతుళ్ల సంతానం వల్ల సకల లోకాలు నిండడం,
దేవతలు-రాక్షసులు-మృగాలు-పక్షులు మొదలైన వాటి జన్మము ఉన్నాయి.
ఇంకా: దేవేంద్రుడి
తిరస్కారం సహించలేక బృహస్పతి అదృశ్యం కావడం, బృహస్పతి ఇంద్రాదులను తిరస్కరించడం, ఆ
వృత్తాంతాన్ని రాక్షసులు విని శుక్రుడి ప్రేరణ వల్ల దేవతలమీడికి యుద్ధానికి పోవడం, దేవాసుర యుద్ధం ఆరంభం, గురు తిరస్కార ఫలంగా సురేంద్రుడు
పరాజితుడై పారిపోవడం, దేవతలు బ్రహ్మ దగ్గరకు వెళ్లడం, బ్రహ్మ మాట ప్రకారం త్వష్ట కుమారుడైన విశ్వరూపుడిని గురుదేవుడుగా దేవతలు
వరించడం, శ్రీమన్నారాయణ కవచం,
విశ్వరూపుడి దయవల్ల ఇంద్రుడు “శ్రీమన్నారాయణ కవచం” ఆనే మంత్రాన్ని ధరించి
రాక్షసులను జయించడం, పరోక్షంగా రాక్షసులకు అనుకూలుడైన
విశ్వరూపుడిని ఇంద్రుడు వధించడం, విశ్వరూపుడిని చంపడం వల్ల
ఇంద్రుడికి బ్రహ్మ హత్యాదోషం సంప్రాప్తించడం, ఆ పాపాన్ని దేవేంద్రుడు
స్త్రీ-భూ-జల-వృక్షాలకు పంచి పెట్టడం ఉన్నాయి.
ఇవి కాక: విశ్వరూపుడిని
చంపినందుకు త్వష్ట కోపించి ఇంద్రుడిని చంపడానికి మారణహోమం చేయడం, వృత్రాసురుడి జననం, వృత్రాసుర
వృత్తాంతం, వృత్రాసురుడి చేతిలో ఓడిన దేవతలు ఇంద్రుడితో
కలిసి శ్వేతదీపానికి పోవడం, శ్రీహరి దయ తలచి దధీచి మహర్షిని
ప్రార్థించి ఆయన వల్ల వజ్రాయుధాన్ని తీసుకోమని దేవతలకు-ఇంద్రుడికి చెప్పడం, ఇంద్రుడు వజ్రాయుధం సంపాదించి దానితో వృత్రాసురుడిని సంహరించడం, ఇంద్రుడు మళ్లీ బ్రహ్మ హత్యా పీడితుడై మానస సరస్సులో ప్రవేశించడం, నహుషుడు నూరు అశ్వమేధ యజ్ఞాలు చేసి ఇంద్రపదవి పొందడం, అగస్త్యుడి శాపంతో నహుషుడు కొండ చిలువగా మారడం,
ఇంద్రుడు స్వర్గంలో ప్రవేశించి అశ్వమేధ యాగం చేసి మళ్లీ త్రిలోకాధిపత్యాన్ని
అందుకోవడం, చిత్రకేతూపాఖ్యానం,
చిత్రకేతుడి తపస్సు-నారాయణుడి ఆగ్రహం, చిత్రకేతుడిని పార్వతీదేవి
శపించడం, సవిత్రు వంశ ప్రవచనాది కథ,
మరుద్గణాల జననం ఈ షష్ఠమ స్కందంలో ఉన్నాయి.
షష్ఠమ స్కందంలో
అత్యంత ప్రాముఖ్యమైనది శ్రీమన్నారాయణ కవచం గురించిన అంశం. మునినాధుడైన విశ్వరూపుడు
ఇంద్రుడికి తెలియచేసిన నారాయణ కవచం విజయాలను చేకూర్చేది. ఊహకు అందని ప్రభావాన్ని
కలిగించేది. మహా ఫలవంతమైనది, గోప్యమైనది. శ్రీహరి మాయా విశేషంతో కూడినది. దాన్ని
పరీక్షిత్తుకు వినిపించిన శుక మహర్షి దాని మహాత్మ్యాన్ని గురించి చెప్తూ: ఎవరైనా
పరిశుద్ధ అంతఃకరణతో అను నిత్యం దీన్ని చదువుతారో వారు అతి క్లిష్టమైన సంకటాల నుండి,
గ్రహ దోషాల నుండి, కర్మ ఫలం
నుండి, దుష్కర్మల నుండి విడుదలై వ్యాకులత్వం లేని మనస్సుతో సుఖంగా ఉంటారనీ, ఏ రోగం రాకుండా ఆరోగ్యంగా ఉంటారనీ అన్నాడు.
ఇవన్నీ చదవగలగడం నా పూర్వజన్మ సుకృతం.
No comments:
Post a Comment