Wednesday, July 29, 2020

భూసంస్కరణల అమలుకు స్పూర్తినిచ్చిన ‘ఎమ్మెల్యే’ సినిమా .... స్వర్గీయ కేబీ తిలక్ జ్ఞాపకాలు-అనుభవాలు : వనం జ్వాలా నరసింహారావు


భూసంస్కరణల అమలుకు స్పూర్తినిచ్చిన ‘ఎమ్మెల్యే’ సినిమా
స్వర్గీయ కేబీ తిలక్ జ్ఞాపకాలు-అనుభవాలు
వనం జ్వాలా నరసింహారావు
ప్రజాతంత్ర, సంపూర్ణ స్వతంత్ర వారపత్రిక
(సెప్టెంబర్ 17-23, 2000)
         సమాజంలోని వాస్తవాలను తన దర్శకత్వంలోని ఎమ్మెల్యే సినిమా ద్వారా కొంత మేర ప్రేక్షకులకు తెలియచెప్పాలన్న వుద్దేశ్యంతోనే తానా సినిమా తీసానన్న తిలక్ జవాబుతో, సంతృప్తి చెందిన చల్లపల్లి రాజాగారు క్వాలిటీ బార్ నుండి సౌమ్యంగా నిష్ర్కమించినా, తిలక్ మాత్రం అక్కడే కూర్చొని ఆలోచనల్లో పడిపోయారు. తనకప్పుడూ, ఇప్పుడు అర్ధంకానిది, జూదం, వ్యభిచారం, మధ్యపానం అనే మూడు విషయాల్లో అసమానతలు ఎందుకు చోటుచేసుకోవనే సంగతి. మద్యపానానికి అలవాటుపడ్డ వ్యక్తి, తోటి మరో వ్యక్తికి అంతరాలు గురించి ఆలోచించకుండా పెగ్గు మందు 'ఆఫర్' చేస్తాడు. వాడడిగినప్పుడు రూపాయి కావాలంటే ఇవ్వకపోయినా పదిరూపాయల పెగ్గు ఇవ్వటంలోని ఆంతర్యం, బహుశా వాడెప్పుడన్నా అలానే తనకివ్వకపోతాడా అన్న ఆలోచనే కావచ్చు.
అలానే ఇరువురు జూదగాళ్లు ఒకరికొకరు జూదమాడే సమయంలో అప్పుపెట్తారేమో కానీ, జీవనోపాధికి అడిగితే, వారు తిరిగి ఇవ్వలేడేమోనని అనుమానంతో కాణీ కూడా ఇవ్వడు. ఇక వ్యభిచారం విషయంలో తారతమ్యాల గురించి ఆలోచించే వ్యవధే వుండదు. సమాజంలో అసమానతలు ఎలా తొలగించాలోనని ఆలోచించాల్సిన ప్రభుత్వాలు, ప్రస్తుతం చేస్తున్న పని, చేయకూడని పని, సమాజానికి, జీవితానికి అక్కరకురాని మూడు వ్యసనాలను ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రోత్సహించటమే. ప్రభుత్వాలను నడిపేది కూడా ఆ వ్యసనోపాకులేనని. చివరకు బాధలు పడేది బీదా బిక్కీ జమేనని తిలక్ ధృఢనమ్మకం. క్వాలిటి బార్ నుండి ఎప్పుడు బయత పడింది మటుకు ఆయనకు జ్ఞాపకం లేదు.
         ఈ మూడు వ్యసనాల ప్రసక్తి పలు సందర్భాల్లో చేస్తూ, వాటినెలా అడ్డుకోవాలో తెలియపర్చే చిత్రం ‘ఎమ్మెల్యే’. కుయుక్తులు, బంతి వడ్డన రాజకీయాలు, సంధాన రాజకీయచతురతలు ఆ సినిమా చూసిన వారికి కొంత వరకు బోధపడ్తాయి.  ‘ఎమ్మెల్యే’ సినిమా ప్రిప్యూను స్వర్గీయ కామరాజ్ నాడార్ కు ఆయన తమిళనాడు ముఖ్యమంత్రిగా వున్న రోజుల్లో చూపించారు మద్రాసులో.  నాడక్కడకు వచ్చిన ప్రముఖుల్లో బి నాగిరిడ్డి కూడా ఉన్నారు. సినిమా తమిళం డబ్బింగును ఒకాయన చేసారు. ఆయనే ఎయిర్ లైన్స్ లో అప్పట్లో పనిచేస్తుండే వెంకటేశ్వరరావు,
         ఖమ్మం-వరంగల్ సరిహద్దు గ్రామం మన్నెగూడెంలో ఔట్ డోర్ షూటింగ్ చేసిన తర్వాత ఒక ఎన్నికల పాటను చిత్రీకరించటానికి ఖమ్మం పట్టణానికి వచ్చారు సినిమా యూనిట్. ఎలక్షన్ల ఊరేగింపులో ఇరు పార్టీలు కలుసుకున్న దృశ్యం ఇప్పుడు ఖమ్మం ఫ్లైఓవర్ వున్న స్తలంలో చిత్రీకరించారు. పాట ముందర సినిమాలోని వీరయ్య-పాపయ్య  క్యారెక్టర్ల సంభాషణ నాటి నేటి ఎన్నికల రాజకీయాలకు అద్దం పట్టేవిధంగా వుంటుంది.
         “ఏమండి పాపయ్యగారూ, దాసు ( జగ్గయ్య) ముఠావాళ్లు బ్రహ్మండంగా ప్రచారం చేస్తున్నారు. మరి ప్రజలకు మన వాగ్ధానాలు ఏమిటి” అని వీరయ్య ప్రశ్నిస్తాడు. జవాబుగా పాపయ్య: “ఇది కూడా నేను చెప్పాలయ్యా పాడిన పాటే పాడండి. పాత కాపులమే కదా, బావులు తవ్విస్తాం, బంజర్లు పంచిపెడతాం, మద్దిరావమ్మకు, మండపం కడతాం” అంటారు.
         మరో సీన్ లో ఇంకో పార్టీకి చెందిన రామన్న డాన్సు ప్రారంభానికి ముందు చెప్పిన డైలాగులు కూడా అసలు సిసలైన ఎన్నికల డైలాగులే. ఆయన సోదర సోదరీమణులారా ఇవి ఎలక్షన్ రోజులు కాండిడేట్లకు కొదవాలేదు. వారిచ్చే వాగ్ధానాలకు రేషన్లేదు. డప్పులతో ఎవరెన్ని సభలను భగ్నం చేసినా ప్రజలను మోసపుచ్చగల రోజులు పోయాయి. తెలివిమీరిన ప్రజలు ఆ కేండిడేట్లకు ఇచ్చే సమాధానాన్నే నాటకదళం వారు కళారూపంగా ప్రదర్శిస్తున్నారు చిత్తగించండి అని చెప్తారు.
         ఇక ఆ డ్యాన్సు పాట (కోగంటి గోపాలకృష్ణయ్యరచన) చరణాలు ఇలా వుంటాయి.... (సినిమాలో సావిత్రి తన బృందంతో పాడిన పాటలు):
“కోటలో  నీసీటెక్కడున్నాది బసవన్నా నా ఓటేవరికో తెలుసు పాపన్నా..ఓయ్ పాపన్న ఓయ్ బసవన్నా.. డూడూ బసవన్నలు పంగనామాలెట్టి రంగుపూతలు పూయ... గజగోకర్ణ గారడీలేనేర్చినా-లయ బ్రహ్మలంతాను-సైసై అన్న.. కోటిలో....కోటప్పకొండపై గోపుంబెక్కినా నూటక్కలింగాల ఓటుకై గాలించినా... కోటలో ఓనమాల్  రాని నీకూనిరాగం- పానకాల స్వామి పూనికబురంపినా కిలమిలేములు లేని- కామేరావాలి-  గాంధీజీ చెప్పింది కావ్యమై తీరాలి కోటలో...”


         ఆ సమయంలో ప్రత్యర్ధి వర్గం  పాపయ్య పార్టీ వారొచ్చి పాడుకుంటూ ఓటడుగుతారు.
         “గుట్టుగా మా మాట వినవయ్య- పెట్టెలో ఓటేసి పోవయ్యా - మాట నిలబెట్టవా- ఓటిచ్చి పంపవా-పాత కావును గనక పరువు నిలబెట్టవా-బల్ గుట్టుగా మామాట వినవయ్యా....”
         మరో దిక్కు నుండి అక్కడకు వచ్చిన దాసు పార్టీ వారు పాపయ్య ఎద్దేవా చేస్తూ పాటరూపంలో ఇచ్చిన సమాధానం:
          ‘లోగుట్టు తెలుసుకో బాబయ్య-లో తెరిగి ఓటేసిపోవయ్యా’
         మాపెట్టెలో ఒటేసిపోవయ్యా ఓటిచ్చినాకమీమాట మరిచాడయా- పదవి కోసం తిరిగి పలుకరించాడయా- లో గుట్టు.. మరో సందునుండి వచ్చిన పాపయ్య పార్టీ వారు.
         బావులు బాటలు బాగు చేయిస్తాను- మద్దీ రావమ్ము కే మండపం కడతాను- గుట్టుగా ఓటేసి పోవయ్య...." అని అరుస్తారు. ఇదంతా బూటకం అని చెప్పారు దాసు (జగ్గయ్య) పార్టీ వారు.
         బంజర్లు కండ్రికలు ప్రజల పరమంటాడు -బంధుకోటికేతాను పంచుతూ వుంటాడు- దేవుడే కలనైన దర్శనంబిస్తాడు-ఆయ్యగారో మరి ఆనవాలుకు రాడు లోగుట్టు తెలుసుకో...
         ఇలా ఇరు పార్టీల వారు ఎదురై పాటల్తో- డాన్సులతో డీకొన్న సీన్ ను చిత్రీకరించటానికి షూటింగు సమయంలో తిలక్ గారి యూనిట్ వాడిన కెమెరా ‘ఐమో’. పాటను చిత్రీకరించడానికి అవసరమైన ప్లేబ్యాక్ మిషన్ లేనందున ‘గ్రండిగ్’ టేప్ రికార్డర్ సహాయంతో, ఏ ఇంటి ముందు చిత్రీకరిస్తే ఆ ఇంట్లో నుండే కనెక్షన్ తీసుకుంటూ చిత్రీకరించారు. అలాగే ఈ కాంబినేషన్ తో, హైదరాబాద్ గండిపేట ఉద్యానవనంలో రమణమూర్తి - గిరిజలపై కూడా ఓ పాటను షూట్ చేసారు.
         ప్రజా ప్రతినిధి-ఎమ్మెల్యేగా గెల్చిన దాసు (జగ్గయ్య) తో పాడించిన మరోపాటలో చరణాలు ఈనాటి రాజకీయ నాయకులు తప్పని సరిగా తెల్సుకోవాలి. ఊరేగింపుకు అగ్రభాగాన నిల్చి ఆయన ఇలా పాడుతారు. “మాతృదేశముకు పరీక్షదినమీది దీక్ష బూనేవరా రత్నగర్భయై భారతదేశం రంజల్లానరా స్వార్ధపరులలో చోటేలేదనరా గౌతమ బుద్ధుడు, అక్భరశోకులు గీసినగిటులు మాసిపోవని చాటిచెప్పవేరా ఆ బాటనే రమ్మనరా మాతృ దేశము - శాంతి సమతల కాంతిని జూపి అందరు ఒకటై ముందడుగేయ రామరాజ్య మదిరా మహాత్ముని కామితార్థమిదిరా- మాతృదేశముకు -- బంగరు సీమలో పంటలు పండు పరిశ్రమలో దేశం నిండ- శంకమునూరమురా - జయభేరి గొట్టమురా...”. ఆరుద్ర వ్రాసిన ఆ పాట అప్పట్లో ఎంతో జనాదరణ పొందింది.
         ఎమ్మెల్యే దాసు (జగ్గయ్య) పోటీ చేసిన, గెల్చిన పార్టీ ఎన్నికల చిహ్నం  ఆవు -దూడ. 1967 ఎన్నికల్లో (ఎమ్మెల్యే సినిమా తీసిన పదేళ్లకు) భారత జాతీయ కాంగ్రేసు, ఇందిరాగాంధి సారధ్యంలో, ఎన్నికల బరిలోకి దిగి, అఖండ విజయం సాధించినప్పుడు, ఆ పార్టీ ఎంచుకున్న గుర్తు కూడా ఆవు దూడే.  యాదృచ్చికమో, మరేమా, కాని సినిమాలో ఏ గుర్తుతో పోటీ చేసి గెల్చాడో, అదే గుర్తుతో కాంగ్రెసు పార్టీ తరపున పోటీ చేసిన కొంగర జగ్గయ్య ఒంగోలు లోకసభ సభ్యుడుగా ఎన్నికయ్యారు. అదే గుర్తుతో పోటీ చేసిన మరో సిని కళాకారుడు శ్రీ కోనప్రభాకర్ రావు శాసనసభ్యునిగా గెలుపొందారు.
         ఆరుద్ర కలం నుంచి వెలువడిన మరో చక్కటి పాటను హైదరాబాద్ గండిపేట ఉద్యానవనంలో రమణమూర్తి-గిరిజలపై చిత్రికరించారు. ఎంతో చక్కగా వుందంటూ ఆ పాటను పాడారు తిలక్  జ్ఞాపకం చేసుకుంటూ.
         ‘జామిచెట్టు మీద నున్న జాతిరామచిలుక-ఎంతో ముచ్చట పడినా నాపై ఎందుకునీకీ అలుక పొన్న చెట్టు మీద నున్న పోకిరి గోరువంక- చాలునులే నీ సంగతి తెలిసి- చూడకమానవంక- చెప్పిన మాట వినదే మనను నిన్నే చూస్తాయి కళ్లు.
         ఎమ్మెల్యే సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు తనకు కావాల్సిన కొన్ని సన్నివేశాలు కొరకు - ఆ సన్నివేశాల్లో నటించే వ్యక్తుల కొరకు ఎక్కడెక్కడో తిరిగేవారు తిలక్ . అలా ఓ సారి హైదరాబాద్ లోని మెహందీ ప్రాంతానికి వెళ్ళారు. అక్కడ ఆయన ‘చోటి ఖుర్షిద్’ అనే ఓ చక్కటి అమ్మాయిని చూస్తారు. సినిమాలో ఆ అమ్మాయితో కవ్వాలి పెట్తే బాగుంటుందనే ఆలోచకొచ్చి, ఆమెను ఒప్పించి, డాన్సు మాస్టారు శ్రీ వేణుగోపాల్ వద్ద శిక్షణను ఇప్పించి, కవ్వాలి కనుగుణంగా నాట్యం చేయిస్తారు. ఎందరో మెచ్చుకున్న ఆ కవ్వాలిని గుర్తుచేసుకున్నారు తిలక్.
         “సరసులు, చతురులు, సాహాసవంతులు, చదువుల, పదవుల పారంగతులు. ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు-వందనాలు చెయ్యాలి అందరికీ - వంకదణ్ణం  పెట్టాలి కొందరికి మీలో కొందరికి అందరాని పదవి కోసం - అందమైన పడతి కోసం - కొంగజపం చేసేదది కొందరు- దొంగవేశం వేసేది ఎందరో... వందనాలు... చేసే ఖర్చు ఒకటి రాసే పద్దువేరొకటి-పైకాన్ని దాచేది కొందరు- పన్నులు ఎగవేసేది ఎందరో... వందనాలు... ఇల్లాలివిడి వెలయాలి జేరి-- బ్రతుకంతయూవెతలో... నాగరికతమితిమీరి-నవవిలాసాలు మరిగి.. బాగోగులే తెలియరు-సీతాకోకచిలుకలు-తొలి చూపుకలయికలోనే వలపు.. కలిగేను మలిచూపులోనే మరపు...”
         ఆవిధంగా కవ్వాలీ పాట డాన్సు ద్వారా సంఘంలోని మంచి చెడులను, ముఖ్యంగా  ఎన్నికలు జరుగుతున్న సమయంలో, చాలా చక్కగా విమర్శించటం జరిగింది. ‘ఎమ్మెల్యే’ సినిమాలోని ఈ కవ్వాలి పాటును చాలా మంది చాలా బాగుందని మెచ్చుకున్నారు. రష్యన్ సాంస్కృతిక కళాకారుల బృందం మద్రాసుకు వచ్చినప్పుడు ప్రకాష్ స్టూడియోలో ఎమ్మెల్యే సినిమాను చూసి, ప్రత్యేకించి ఈ పాటను మెచ్చుకున్నారు. సినిమా ఫ్రింట్ ని రష్యాకు పంపమని కోరారు. పంపటం కూడా జరిగింది. అయితే ఇంగ్లీషు తర్జుమా మటుకు దక్షిణ ఎమెన్ కు మాత్రమే పంపగలిగారు. శ్రీశ్రీ స్వహస్తాలతో స్వదస్తూరితో వ్రాసిన ఇంగ్లీషు తర్జుమా తిలక్ జాగ్రత్తగా భద్రపరిచారు. అయితే కవ్వాలీ డాన్సు చేసిన ‘చోటి ఖుర్షీద్’ ఆ తర్వాత ఎమైందో కాని, మరే సినిమాలో  నటించనట్లులేదు. నటించిన దాఖలాలు లేవు. ఎమ్మేల్యే సినిమాలో జగ్గయ్యతో పాటు సూర్యశ్రీ (గుమ్మడిగారి మేనకోడలు) గిరిజ, విజయలక్ష్మీ, రమణమూర్తి, గుమ్మడి,రమణారెడ్డి, పెరుమాళ్లు, కుటుంబరావు, నాగభూషణం ప్రభృతులు నటించారు.  సావిత్రి బాగా నటించింది ఆ సినిమాలోనే అంటారు తిలక్.
         తాపి ధర్మారావు డైలాగులు ఎంతోక్క గా వున్నాయని పదేపదే మెచ్చు కున్నారు తిలక్. మనమంతా ఇప్పటికీ  వింటుండీ-తింటుండీ ఎమ్మేల్యే పెసరట్టు గురించిన ఓ డైలాగుందా సినిమాలో.   ఎమ్మెల్యే ‘దాసు’ ఓ సందర్భంలోఈ ఉప్మా పెసరట్ల జోడింపంటే నాకు బలే ఇష్టం అని భార్య నిర్మల (సావిత్రి) నుద్దేశించి అనిపిస్తారు. వేరే సందర్భంలో ఎన్నికల గురించి కూడా ఓ చక్కటి డైలాగుంటుంది.  ఎన్నికల ‘వాతావరణం’ ఎలాగుందమ్మ అని ప్రచారానికి వెళ్లిన ఓ కార్యకర్త ముసలమ్మనొకామేను అడగుతాడు.   జవాబుగా ఆమె ‘వాత’ వాళ్లకు (ప్రత్యర్థి వర్గం వారికి)  ‘వరణం’ మనకు అంటుంది. ఆలానే ఎమ్మెల్యేగా జగ్గయ్య (దాసు)ను పోటీ చేయించిన జమీందారు దామోదరం (గుమ్మడి) అత్తగారితో, భోజనాల టేబుల్ వద్ద ఓ డైలాగు అనిపిస్తారు. 'ఉన్నవాళ్లు ఏంతిన్నారు, ఏం వండారు’ అని పదిమందికి తెలియాలంటే ‘వేస్ట్’ వుండాలి. అది బయట ‘పారెయ్యాలి' అని దాని సారాంశం.
         శాసనసభలో భూసంస్కరణల బిల్లు ప్రవేశపెట్టే పూర్వరంగంలో, చర్చల సమయంలో ఆసక్తికరమైన డైలాగులున్నాయి. ఉదాహరణకు కొన్ని బంజర్లూ పోరంబోకులు-ఊరి పొలమంతా నాదే అని కొందరు అనకుండా, వీళ్లను అరికట్టటానికి భూమి పరిమితి సీలింగ్ పెట్టాలనే ఆందోళన, మహాత్ముడు చెప్పినట్టు మన రైతుల పాలిటి సర్వరోగ నివారిణి--రైతు సంఘాలు, కౌలుదార్ల సంఘాలు అదేకోరుతున్నాయి. ఆది జరగనంతవరకు సన్నరైతులకు జీవనం లేదు. భూస్వాములు ఇంకా తికమక పెడుతూనే వుంటారు'.
         భూసంస్కరణల ఆలోచన ప్రభుత్వానికి కానీ, అభ్యుదయ భావాల రాజకీయ నాయకులు ఒకరిద్దరికోకాని, వచ్చినప్పుడు ‘ప్రెషర్స్ గ్రూప్స్’ ఎలాంటి వత్తిడులు తెస్తారో,  సంస్కరణలను ఎలా తమకనుకూలంగా మలచుకునే ప్రయత్నం చేస్తారో తెలియచేసి డైలాగులు కూడా తాపి గారు చాకచక్యంగా చొప్పించారీ సినిమాలో.
         ఎమ్యెల్యేగా దాసు (జగ్గయ్య) ను గెలిపించిన జమీందారు దామోదరం (గుమ్మడి) తో ఓ డైలాగు చెప్పిస్తాడు.  ఈ విషయాన్ని నేను కాదు, నువు కాదు, ఆ బ్రహ్మదేముడు కూడా పలేడు.  భూ సంస్కరణల ఉద్యమం పెద్ద తుఫానులాగా దేశాన్ని ఉపేస్తుంది. ఇపుడెదరీతకు ప్రయత్నించటం శుద్ధ తెలివితక్కువ. బిల్లు సెలెక్టు కమిటీ ముందుకు వెళ్లినప్పుడు ‘దాను'నుపయోగించుకుందాం. భూమి పరిమితిని చాలినంతెక్కువగా పెట్టించటానికి శాయశక్తులా పాటుపడదాం. ఈ లోపల మన పనులు మనం చేశేద్దాం. మనం పంచదార ఫ్యాక్టరీనో సిగరెట్టు ఫ్యాక్టరీనో పెడితే దానికి కావాల్సిన చెరుకు, పుగాకు పండించుకోవటానికి ఎంత భూమైనా వుండవచ్చు. దానికి పరిమితిలేదు. ఆదనపు భూములన్ని షేరుధనం క్రింద రాసేసుకుందాం. షేర్లన్నీ మనవే కాబట్టి భూములన్నీ మనకిందే వుంటాయి'.
         బహుశా ఇలాంటి ఆలోచనలు నాటికి నేటికీ, దామోదరం లాంటి వాళ్లకు సహజంగానే వస్తూనే వుంటాయి. ఇలాంటి వాస్తవాలతో కూడిన డైలాగులు ఎన్నో వున్నాయా సినిమాలో.
         ఎమ్మెల్యే సినిమాలో గిరిజ (సినిమాలో కమల) చెప్పే ప్రతి డైలాగులో ‘చచ్చాంపో' అనే మేనరిజం చెప్పించారు. సావిత్రి 'ఏంటమ్మా ఎప్పుడూ చచ్చాంపో అంటావు’ అని అడిగితే-ఆలా అంటూ చావును దూరం చేసుకుంటున్నాను అని జవాబిస్తుంది. తాపీగారు చాలా చిన్న చిన్న అక్షరాలతో చిన్నచిన్న కాగితాల మీద డైలాగులు వ్రాసిచ్చేవారట. పెండ్యాల సంగీత దర్శకత్వంలో ఆరుద్ర కలం నుండి వెలువడిన ప్రతిపాట పదుగురు మెప్పుపొందినవే.
         ఎమ్మెల్యే సినిమాను నాగపూర్ ఆంధ్రా ఆసోసియేషన్ వారు ప్రదర్శనలు ప్రత్యేకంగా తెప్పించుకున్నారు. ఆ సందర్భంగా నాగపూరకు తిలక్ తో పాటు జగ్గయ్య, వరలక్ష్మి వెళ్లారక్కడకు. ఇందిరా గాంధీ ఎన్నికల ప్రచారం సందర్భంగా పరిచయస్తులైన మిత్రుడొకరు ‘ఎమ్మెల్యే' సినిమా ప్రింట్ ను బొంబాయి తీసుకుని పోయారని, ప్రస్తుతం దాని జాడ తెలియదని దక్షిణ ఏమెన్ లో మాత్రం ఉందనీ అన్నారు తిలక్. ఇప్పుడంటే 'ఎమ్మెల్యే’ పదవి అందరికీ తెలిసిందే అయినా తాను సినిమా తీసిన రోజల్లో చాలా కొద్దిమందికే తెలుసననీ, ఆ విధంగా తన సినిమా ద్వారా ఎమ్మెల్యే పదాన్ని కూడా ప్రచారం చేసానని అంటారు తిలక్.
ఎందుకో కాని ఎమ్మెల్యే సినిమాను మహిళా ప్రేక్షకులు ఎక్కువగా ఆదరించిట్లులేదు. స్త్రీలు ఎక్కువగా ఆ సినిమా చూడలేదని అన్నారు తిలక్. ఇవన్నీ ఒక రకమైన తృప్తినిస్తే, వీటన్నిటికీ మించిన తృప్తి వచ్చింది సుందరయ్యగారి ప్రశంస. హైదరాబాద్లో ప్రివ్యూ సందర్భంగా ఏర్పాటు చేసిన సభల్లో ప్రసంగించిన భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) మాజీ ప్రధాన కార్యదరి, స్వర్గీయ కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య, ఎమ్మెల్యే సినిమా ద్వారా అభివృద్ధి కర భావాలను ప్రజల దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నంలో తిలక్ ఎంతో కృషి చేసారన్నారు. నీలం సంజీవరెడ్డి కూడా ఎంతగానో మెచ్చుకున్నారా సభలోనే. ఎమ్యెల్యే సినిమా తర్వాత తిలక్ దర్శకత్వంలో రిలీజైన మరో మంచి సినిమా ‘అత్తా ఒకింటి కోడలే’.
(మరిన్ని విశేషాలు మరోసారి)

No comments:

Post a Comment