హైదరాబాద్ లో సారథీ
స్టూడియో నిర్మాణం
స్వర్గీయ కేబీ తిలక్
జ్ఞాపకాలు-అనుభవాలు
వనం జ్వాలా నరసింహారావు
ప్రజాతంత్ర, సంపూర్ణ స్వతంత్ర వారపత్రిక
(జూలై 16-22, 2000)
క్రమేపి
తిలక్ వ్యాపకాలు పెరగసాగాయి. ఆ కారణాన ప్రసాద్ గారింట్లో వుండటం కన్నా వేరేచోట
వుండటం మంచిదన్న అభిప్రాయంతో ఓ ఇల్లు అద్దెకు కూడా తీసుకున్నారాయన. దాంతో పాటే
సివివిఆర్ ప్రసాద్, ఎస్ వి నర్సయ్యగార్లతో సంబంధాలు వృద్దిచేసుకోవటం, అందరూ కల్సి
అభ్యుదయ భావాలున్న కళాకారుల బాగోగులు గురించి ఆలోచించటం మొదలు పెట్టారు.
సారథి
ఫిల్మ్స్ వ్యవహారం గురించి ఇంతకు ముందే కొంత వరకు తెల్పుకున్నాం గదా. చల్లపల్లి
రాజాగారి సోదరుడు, రామకృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలోకి, కారణాలు ఏవైతేనేమి ఆ సంస్థ వెళ్లింది.
అప్పట్లో
ప్రజానాట్యమండలి అభ్యుదయ బావాలకు ఆకర్షితులైన అనేక మంది కళాకారులను ఓ వేదికపై
తీసుకువచ్చే ప్రయత్నం చేసేవారు. సీవీవీఆర్ ప్రసాద్, ఎస్ వి నర్సయ్యగార్లు. శాంతినికేతన్లో విద్యనభ్యసించి
సినీరంగంలో టెక్నీషియన్‌గా కెమేరా ఫీల్డ్ లోకి ప్రవేశించిన ప్రసాద్ గారు చాలా
మందికి పరిచయస్తులే. శాంతినికేతన్ నుండి బొంబాయి వెళ్లడం వలన అక్కడ సీవీవీఆర్ కు
ఎల్ వి గారితో కూడ పరిచయం అయింది. ఆభ్యుదయ కళాకారులందరూ ఒక వేదికపై ఎందుకు
జమకూడారో కాని ఆ రోజుల్లో జరిగిన ఆ కలయిక భవిష్యత్ సినీరంగ ఆభివృద్ధిలో ఓ కీలకమైన
ఘట్టానికి పరోక్షంగా అతి ముఖ్యమైన మైలురాయిగా మిగిలిపోయింది.
‘సారథి
ఫిల్మ్స్' బ్యానర్ క్రింద ఐక్యవేదికనేర్పాటు చేసుకున్న కళాకారుల తొలి ప్రయత్నం ‘అంతా
మనవాళ్లే' అనే చిత్ర నిర్మాణం, సహకార వ్యవస్థ, సహకార ఉద్యమం ప్రధాన ఇతివృత్తంగా తీసిన ఆ చిత్రానికి కథా
రచియిత శ్రీ కొండేపూడి లక్ష్మినారాయణ.
'అంతా మనవాళ్లే’
సినీ దర్శకుడిగా పూర్తిగా కాకపోయినా ఆయన కనుసన్నలలోనే, అధ్వర్యంలోనే ఈ సినీ
నిర్మాణం జరిగిందనే భావన (పేరుపొందిన దర్శకుడైనందున) ప్రేక్షకుల్లో కలగాలనే
ఉద్దేశ్యంతో ఎల్ వి ప్రసాద్ గారి పేరు వాడుకునేందుకు రామకృష్ణ ప్రసాద్ ఆసక్తి
కనపర్చారట అప్పుడు ప్రథమంలో. దానికి కారణం ఇంకోటి కూడా ఉంది. కలిసి ఉన్న రోజుల్లో
ఎల్ వి ప్రసాద్ గారి దర్శకత్వంలోనే సారథి ఫిల్మ్స్ సినిమాలు తీసేవారు. అయితే, అభ్యుదయ భావాల
కుర్రకారు నుండి ఎల్ వి పేరు వాడుకోవటానికి తగినంత మోతాదులో వ్యతిరేకత
వ్యక్తమయిందట. ఆలా వ్యతిరేకించిన వారిలో ముందున్న వ్యక్తి శ్రీ తాపి చాణక్య. ఈయన తాపీ ధర్మారావుగారి మూడో కుమారుడు. చివరకు
అయనే చిత్ర దర్శకులయ్యారు. ప్రఖ్యాత దర్శకులుగా తెలుగు సినీరంగ ప్రేక్షకులకు ఆయన
సుపరిచితులే.
ఇదిలా
ఉండగా, నేపథ్యంలో కథనడిపిస్తున్న తిలక్ గారికి, ఎక్కడా ఎటువంటి స్పర్థలుండకూడదనే ఆలోచన కలగడంతో ఆ సమస్యకో
పరిష్కారం కుదిరింది, పరిష్కార దిశగా వారంరోజులు లేవనెత్తి, చర్చించి, రాజీకొచ్చిన విషయాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఎల్ వి ప్రసాద్
ఎటూ తెగ బిజీమనిషి కాబట్టే, ఆయన తన పూర్తి కాలం ఎట్టి పరిస్థితుల్లోనూ సెట్స్ పై గడపలేరు. ఆయన బిజీ కారణాన
సినీ నిర్మాణం జరగడంలో జాప్యం కావటం అంత మంచిది కాదు. జాప్యం మూలాన ‘క్రియేటివిటీ' దెబ్బతినకూడదు.
వీటన్నిటికి తోడు రామకృష్ణ ప్రసాద్ గారు తాను లోగడ ఎల్ వి గారి కిచ్చిన డబ్బు
మళ్ళీ వెనక్కు తీసుకోవడం ఆచరణయోగ్యం కాదు కూడా. చివరకు, ఇవన్నీ చర్చించి, తిలక్ గారు తన
మేనమామగారిని ఓ కోరిక కోరారు. తాము తీయదల్చిన సినిమా స్టోరీ లైన్ వినమనీ, ఆయన పేరు
ఉపయోగించుకున్నా, లేకపోయినా అభ్యుదయ భావాలున్న వారందరు కల్సి చేస్తున్న ప్రయత్నాలను ఓ గొప్ప
వ్యక్తిగా ప్రోత్సహించమని అడిగారు. అందుకాయన అంగీకరించడంతో తెలుగు చలన చిత్ర రంగ
అభివృద్దిలో ఎన్నెన్నో ఫిల్మ్ సంస్థలు నెలకొనడానికి బాటలు వేసిన ఓ మహామనిషిగా ఎల్ వి
ప్రసాద్ గారు మిగిలిపోయారు.
ఆ సినిమా ఎడిటర్ కేబీ
తిలక్. ఆయనకు ఆదో అనుభూతి. 'అంతా మనవాళ్లే' చిత్ర నిర్మాణం మరో ఆధ్యాయానికి ఆరంభమే కాని అంతం కాదు, ఆ తర్వాత ఆ బృందం
సారథి బ్యానర్ క్రింద తీసి, తెలుగు చలన చిత్ర రంగంలో మరో మలుపు, మైలు రాయిని చేసిన మేటి చిత్రం 'రోజులు మారాయి’.
తాపీ ధర్మారావు, కొండేపూడి ఆక్ష్మీ నారాయణల కలం నుండి తెలంగాణోద్యమ ప్రభావం
ప్రస్ఫుటించే కథగా వెలువడింది చిత్రం. బంజరు భూముల సమస్య ప్రధాన ఇతివృత్తం.
కొసరాజు రచించిన ‘ఏరువాకా సాగేరోరన్నా... చిన్నన్నా.. నీ కష్టమంతా తీరే....’ అనే ఆ
సినిమాలోని పాట నాటి నుండి నేటి వరకూ పల్లె ప్రజలకు మళ్ళీ మళ్లీ వినాలనిపించే పాట, వారు పాడుకుంటూ
పనిచేసే పసందైన పాట.
హిందీ చలన చిత్ర రంగాన్ని దశాబ్దాల తరబడి
కథానాయికగా శాసించిన వహీదా రెహ్మాన్ 'రోజులు మారాయి' సినిమా ద్వారానే సినీరంగ ప్రవేశం చేసారు. సినీ దర్శకుడు
శ్రీ తాపీ చాణక్య, ఎడిటర్ తిలక్,
డాన్స్ డైరెక్టర్ శ్రీ వెంపటి సత్యం, మ్యూజిక్
డైరెక్టర్ శ్రీ వేణు (ప్రఖ్యాత సినీ కళాకారుడు శ్రీ భానుచందర్ తండ్రి) రోజులు
మారాయి సినిమా కథానాయకుడిగా శ్రీ అక్కినేని నాగేశ్వర రావు, నాయికగా శ్రీమతి
జానకి నటించారు. శ్రీ సిఎస్ఆర్ తదితరులు కూడా నటించారు.
ఈ
సినిమాకు కూడా ఎడిటర్ గా పనిచేసిన శ్రీ తిలక్ ఆ రంగంలో నిలదోక్కుకోవటమే కాకుండా
మంచి పేరు కూడా తెచ్చుకున్నారు.
'రోజులు మారాయి' శతదినోత్సవ
వేడుకలు హైదరాబాద్ నగరంలో ఘనంగా జరిగాయి. హైదరాబాదు కు తెలుగు చలన చిత్రరంగం
తరలిరావడానికి, ప్రప్రథమంగా సినీ స్టూడియో నిర్మాణం జరగడానికి ఆ శతదినోత్సవ వేడుకలు
వేదికయ్యాయి. ఆదో చారిత్రక సంఘటన అని అంటారు తిలక్.
నాటి
రాష్ట్ర మంత్రి స్వర్గీయ కొండా వెంకట రంగారెడ్డి ఆవేడుకలకు ముఖ్య అతిథిగా వచ్చి, సాహితీ సంస్కృతీ
రంగాల అభివృద్ధికి చలన చిత్రరంగ ప్రముఖులు అగ్రభాగాన నిల్చి తోడ్పడాలని తమ
ఉపన్యాసంలో సందేశమిచ్చారు. తదనుగుణంగానే 'రోజులు మారాయి' సినిమా యూనిట్ కు చెందిన ప్రముఖులందరూ కలిసికట్టుగా ఆలోచించి
హైదరాబాద్ నగరంలో ‘సారథి స్టూడియో' స్థాపనకు, నిర్మాణానికి ప్రయత్నాలు ప్రారంభించారు.
చిరకాలంలోనే అది కార్యరూపం దాల్చింది. అమీర్ పేటలో స్టూడియో వెలసింది.
సారదీ
స్టూడియో నిర్మాణం కొరకు స్థలం కావాలని ఆ రోజుల్లో ప్రభుత్వాన్ని అర్థించ లేదు
దాని యజమానులు. ప్రయివేటు వ్యక్తుల వద్ద నుండి కొనుగోలు చేసిన భూమిలోనే స్టూడియో
నిర్మాణం జరిగింది. స్టూడియో వున్న అమీర్ పేట ప్రాంతానికి రెండు-మూడు మైళ్ల దూరంలో
ఉన్న ఖైరతాబాద్ సమీపంలో సారథీ యూనిట్ కళాకారులందరూ నివసించటానికి ఇళ్ల స్థలాలు
కొనుక్కునే ఏర్పాటు చేసారు. అలా కొన్న స్థలంలో నిర్మించిన ఇంట్లోనే నివాసముండేవారు
శ్రీ సివివిఆర్ ప్రసాద్.
ఇదే
సారథి స్టూడియోలో విశ్వవిఖ్యాత 'నటసార్వభౌములు', 'నటసామ్రాట్టులు', 'పద్మశ్రీ'లుగానూ, పద్మభూషణ్ లుగానూ గౌరవ పురస్కారం అందుకొన్న నటీనటులెందరో, ఎన్నో చిత్రాల్లో
నటించటానికి షూటింగ్ లో ఎన్నో సార్లు పాల్గొన్నారు. వీరిలో ఎన్టీఆర్, అక్కినేని, భానుమతి... ఇలా
వ్రాసుకుంటూ పోతే అందరూ ఉన్నారు..
కాకపోతే
ఆ తర్వాతి కాల గమనంలో, సినీ కాలగమనంలో, ఎవరికి వారే వేరై ఎవరి ‘సినీ కుంపటి’ వారే పెట్టుకుని
పరోక్షంగానో, ప్రత్యక్షంగానో సినీరంగ అభివృద్ధికి కృషి చేసారు. స్వర్గీయ కొండా వెంకట
రంగారెడ్డి ఆశయం నెరవేరిందనే చెప్పుకోవాలి.
సారథీ
యూనిట్ పరిణామ క్రమంలో ఇలా పురోగమిస్తుంటే, అదే స్పీడ్ లోనూ, ఒక్కొక్కసారి అంత కంటే కొద్ది తేడాతోనూ మరిన్ని సంస్థలు
వెలిసాయి. వాటిలో ప్రముఖమైనవిగా చెప్పుకోవాలంటే పీపుల్స్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్, ప్రసాద్
ప్రొడక్షన్స్, నవయుగ ప్రొడక్షన్స్, తిలక్ గారి అనుపమ ఫిల్మ్స్.
పీపుల్స్
ఆర్ట్స్ ప్రొడక్షన్స్ వారి తొలి చిత్రం 'పల్లెటూరు'.
తాతినేని ప్రకాశ్ రావు గారు 'దర్శకుడుగా' సినీరంగ ప్రవేశముయిన ఆ చిత్రంలో కథానాయకుడు శ్రీ ఎన్టీ రామారావు
కాగా శ్రీమతి సావిత్రి కథానాయిక పాత్ర పోషించారు. ఈ చిత్ర కథారచయితలు సుంకర-వాసిరెడ్డి, కొడవటిగంటి కుటుంబరావు గారికి కూడా ఆ చిత్రంలో అనుబంధముంది. తాతినేనిగారు
మాత్రం, అప్పటి వరకూ ఎల్ వి గారికి అసిస్టెంట్ గా మాత్రమే వుంటూ వుండేవారు. ఆదే
విధంగా డాక్టర్ గరికపాటి రాజారావు (ప్రజానాట్య మండలి ముఖ్యుల్లో ముఖ్యుడు) గారు
స్థాపించిన మరో ప్రోగ్రెసివ్ సంస్థ 'రాజా ఆర్ట్స్'.
జమున కథానాయికగా తీసిన చిత్రం ‘పుట్టిల్లు’ దీనికి
ప్రోత్సాహం సహాయసహకారం అందించింది నెల్లూరుకు చెందిన ప్రముఖ వైద్యులు డాక్టరు రాము,
ఆయనే స్వర్గీయ కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్యగారి సోదరుడు స్వర్గీయ పుచ్చలపల్లి
రామచంద్రారెడ్డిగారు. ప్రజా వైద్యునిగా ఆయన్ను ఇప్పటికీ నెల్లూరు ప్రజలు
గుర్తుచేసుకుంటుంటారు.
అభ్యుదయ
భావాలు, అభ్యుదయ భావాల వేదికలు భారత స్వాతంత్ర్య సమరంలోనూ, తెలంగాణ విమోచన
ఉద్యమాలలోనూ ఆ తర్వాత మరికొంతకాలం వరకూ యువతను ఎంతగానో ఆకర్షించాయి. ఆ యువతను, కమ్యూనిస్టులుగానూ, సోషలిస్టులు గానూ, కాంగ్రెసు
పార్టీలో అతివాదులుగానూ మలచాయి. అంతమాత్రాన వారంతా ఆ భావాలకే జీవితాంతం కట్టుబడి
వున్నారని చెప్పటానికి వీల్లేదని అంటారు తిలక్. కారణాలు ఏమైతేనేమి, ఏదో
వ్యాపకంపేరుతో వారిలో పలువురి భావాలు ‘అభ్యుదయమే' అయినప్పటికీ, ఆశయాలు మంచివే అయినప్పటికీ, ఆచరణలో మాత్రం 'అంతస్తులు' పెంచుకునే
వ్యవస్థలోకి లాగాయంటారు తిలక్. కాలమహిమా? సినీ ప్రభావమా? తననుతానే
ప్రశ్నించుకున్నారు. కేబీ తిలక్.
(మరిన్ని విశేషాలు
మరోసారి)
No comments:
Post a Comment