Saturday, July 18, 2020

“కామ్రేడ్స్ తో కలిసి” .... స్వర్గీయ కేబీ తిలక్ జ్ఞాపకాలు-అనుభవాలు :వనం జ్వాలా నరసింహారావు


“కామ్రేడ్స్ తో కలిసి”
స్వర్గీయ కేబీ తిలక్ జ్ఞాపకాలు-అనుభవాలు
వనం జ్వాలా నరసింహారావు
ప్రజాతంత్ర, సంపూర్ణ స్వతంత్ర వారపత్రిక
(జూలై 2-8,  2000)
         క్విట్ ఇండియా ఉద్యమ సందర్భంగా అరెస్టయిన తిలక్ ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించటానికి ముందర ఓ రెండు వారాలు ఏలూరు సబ్ జైలులో వుంచారని చెప్పుకున్నాం గదా. అక్కడున్న రోజులను గుర్తుచేసుకుంటూ, ఉద్యమాల ఊపిరి తీసే ప్రయత్నాలు అప్పట్లో ఎలా జరిగేవో సూచన ప్రాయంగా చెప్పారు. తన కంటే వయస్సులో పెద్దవారైన మోతె నారాయణ రావుగారు, కార్వంచి రామ్మూర్తి గారు తిలక్ తో పాటు జైల్లో వున్నారు. అప్పటి పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ శ్రీ శేషాద్రి సీనియర్ ఐసియస్ అధికారి. ఆయనోమారు సబ్ జైలుకు వచ్చి వీరిని పరామర్శించారు. 'ఎందుకీ కుర్రవాడిని (తిలక్) మీరు చెడగొడ్తున్నారు' అని మోతె-కార్వంచిలను ఆయన ప్రశ్నించినప్పుడు సమాధానం ఇచ్చింది వారుకాదు, కాని తిలక్. తనను వాళ్లు చెడగొట్టటం అనేది తప్పు అనీ, మహాత్మాగాంధీ పిలుపు మేరకు తానే స్వచ్ఛందంగా స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొంటున్నాననీ ఎదురు జవాబు చెప్పారు తిలక్.
         ఉద్యమాలను నీరుకార్చే, కౌన్సిలింగ్ లాంటి వ్యవహారాలు ఈనాటివి కావు అన్నారు తిలక్. తన జైల్ మేట్స్. మోతె-కార్వంచిలను కలెక్టర్ వేసిన ప్రశ్నలు దీనికో చక్కని ఉదాహరణ అని ఆయన అభిప్రాయం. ఇలా నీతులు చెప్పటం మన సంస్కృతిలో ఓ అంతర్భాగం అనీ, మన రక్తంలో అవి జీర్ణించుకుపోయాయనీ అంటూ, ఒకవేళ శేషాద్రి మాటలకు తానులొంగిపోయినట్లైతే తన ఆశయాలకు అంతటితోనే తిలోదకాలు ఇచ్చినట్లే కదా అన్నారు. పోరాట పటిమను, ఈ ఉద్యమాల స్ఫూర్తిని నీరు కార్చే ప్రయత్నం అనాది ఆచారమే, అని గుర్తుచేసుకున్నారు తిలక్.
         తిలక్ మేనమామ ఎల్ వి  ప్రసాద్ గారి తండ్రి అవధులెరుగని ఔత్సాహికుడు. ఏదో, ఎప్పుడూ చేయాలన్న తపన ఆయన గుణం. స్వగ్రామం నుండి తరలివచ్చి, పశ్చిమగోదావరి జిల్లా ‘పెదవేగి'లో సెటిలయ్యారు. అక్కడి, చల్లపల్లి జమిందారు గారికి చెందిన అటవీ భూమిని నరికించి వ్యవసాయం చేయించటంతో సహా పళ్ల తోటలు కూడా వేయించారు. ఆరోజుల్లోనే పట్టు ఉత్పత్తి (సెరీకల్చర్) ఆయన వ్యాపకాల్లో ఒకటి. తిలక్ గారి తల్లి ఆయన ఏకైక కూతురు. అందుకే, ఆమెగారి పేరు మీద కూడా ఓ పళ్లతోట వుంచారాయన. దెందులూరుకు సమీపంలో వున్న ఆ తోటకు వేసవి శెలవుల్లో నడచుకుంటూ వెళ్లి-వస్తూ సరదాగా గడుపుతుండేవారిమని గుర్తుచేసుకున్నారు తిలక్.
         ఏలూరు సబ్ జైల్లో వున్నప్పుడు, ప్రతి రోజూ ఉదయం తననూ, తోటి ఖైదీలను కొంత సేపు ఆరుబయటకు తీసుకొచ్చి తిప్పేవారట అధికారులు. ఆరోజుల్లో ఎల్ వి ప్రసాద్ గారి భార్య తన మేనత్త-పెదమామ బస్వయ్య గారితో తనకు టిఫిన్ పంపేదట. ఎల్వీగారి కుటుంబం ఏలూరులోనే కాపురం వుండేదారోజుల్లో, మద్రాసులో వుండగా, హెచ్ ఎమ్ రెడ్డిగారి వద్ద ఆయన తీసిన 'హానెస్ట్ రోగ్' అనే సినిమాకు పనిచేసిన  అనుభవంతో, తానే స్వతంత్రంగా ఓ సినీ కంపెనీ స్థాపించే ప్రయత్నంలో తలమునకలై వున్న శ్రీ ఎల్ వి ప్రసాద్ ఆ పనిమీద పలుచోట్లకు వెళ్ళోస్తుండేవారు. 'సత్యమేజయం' అనే తెలుగు నాన్ డిటేయిల్డ్ పుస్తకం ఆధారంగా నిర్మించిన చలన చిత్రం హానెస్ట్ రోగ్.
         మొత్తం మీద ఎల్ వి గారెళ్ళిన కొన్నాళ్లకు మద్రాసు చేరుకున్నారు తిలక్. సారధి బ్యానర్ క్రింద కె ఎస్ ప్రకాశరావు గారు తన 'మోడల్ ప్రొడక్షన్స్' సంస్థ తరఫున నిర్మిస్తున్న 'గృహప్రవేశం' సినిమాలో భానుమతి సరసన నటించటంతో పాటు, సినిమా దర్శకత్వం కూడా వహిస్తున్నారు శ్రీ ఎల్ వి ప్రసాద్ అప్పట్లో. త్రిపురనేని గోపీచంద్ గారు ఆ సినిమా రచయిత.

         'మోడల్ ప్రొడక్షన్స్' తాలూకు డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ‘ప్రీమియర్ ఫిల్మ్స్’ ఒక దానిని నెలకొల్పారు. అప్పట్లో, శ్రీ కోవెలమూడి భాస్కర్ రావుగారు. దాంతో సంబంధమున్న మరో ప్రముఖ వ్యక్తి రామనాథబాబు అనే, చల్లపల్లి రాజాగారి బావమరిది. ప్రీమియర్ ఫిల్మ్స్ రిప్రెజెంటేటివ్ గా తరచు ఆంధ్ర ప్రాంతంలోని వివిధ ప్రదేశాలకు వెళ్లవల్సి వస్తుండేది తిలక్ గారికి. ఆ పని ఆయనకిష్టం లేదు. అయినా తప్పలేదు. అందుకే కొంతకాలమే అలా పనిచేసారు. రిప్రజెంటేటివ్ గా తన తోడు తీసుకెళ్లిన సినిమా బాక్సుల్లో ‘వీర కునాల్' అనే హిందీ సినిమా కూడా ఉన్నట్లు గుర్తు చేసుకున్నారాయన.
తన అభిరుచులకూ, ఆశయాలకు అనుకూలంగా వున్న వ్యక్తులతో ఎక్కువ పరిచయం పెంచుకునే మనస్తత్వం తిలక్ గారికి నాటికీ, నేటికీ (చనిపోయేదాకా). ఆ బాటలోనే ఎమ్ వి రాజన్ తో దోస్తీ కుదిరింది. అప్పటికే పేరు పొందిన సినీ ఎడిటర్ ఆయన. ఎల్ వి గారికి సన్నిహితుడూ- ఆయన 'బ్యాచ్' కు చెందిన వ్యక్తి. గృహప్రవేశం సినిమాకు కూడా ఆయనే ఎడిటర్. హెచ్ఎమ్ రెడ్డిగారితో కలిసి పనిచేశారు. ఎల్ వి ప్రసాద్ గారు భక్త ప్రహ్లాద సినీ నిర్మాణం చేస్తున్న రోజుల్లో, రాజన్ గారితో సాన్నిహిత్యం పెంచుకుంటూ, ఎడిటింగ్ లైన్లో పట్టుసంపాదించుకునే ప్రయత్నాలు కొనసాగించారు తిలక్.
         అందరికీ తెల్సిన విషయమే భక్త ప్రహ్లాద తెలుగులో మొదటి టాకీ చిత్రం. ప్రసాద్ గారందులో నటించారు. మొదటి హిందీ టాకీ చిత్రమైన 'ఆలమ్ ఆరా'తో కూడా ప్రసాద్ గారికి సంబంధముంది. భక్త ప్రహ్లాద రిలీజ్ అయిన రోజుల్లో ఏలూరులోని పాండురంగ థియేటర్ లో తిలక్ ఆయన అమ్మమ్మగారి (ప్రసాద్ గారి తల్లి) తో కల్సి సినిమా చూసిన సందర్భాన్ని గుర్తుచేసుకున్నారు. అందులోని ఓ సన్నివేశానికి స్పందిస్తూ ఆమెగారు, తన కుమారునికి నిజంగా ఏమన్నా జరుగుతున్నదో అన్న రీతిలో ఆందోళన చెందారని నవ్వుకున్నారు!
          ఏదేమైనా తెలంగాణా ఉద్యమంతో తన ప్రత్యక్ష-పరోక్ష సంబంధాలను మాత్రం కొనసాగిస్తూనే ఉండేవారు తిలక్. ఆయన తన సహచరులతో కలిసి జైలు నుండి విడుదలై బెయిల్ పై వస్తుండే ఉద్యమకారులను ఎగ్మూర్‌ రైల్వేస్టేషన్లో కల్సుకుని, ఇంకో కంటికి తెలియకుండా అజ్ఞాతవాసానికి, వారి వారికి నిర్దేశించిన స్థలాలకు తరలిస్తుండేవారు. ఎస్ వి నర్సయ్య గారు అప్పట్లో కమ్యూనిస్టు పార్టీ కో ఆర్డినేటర్ గా వుంటూ అజ్ఞాత కార్యకలాపాల వ్యవహారాలు నడపటానికి 'కాంటాక్టు పాయింట్'గా వుండేవారు.
         అలనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు తిలక్. 'పలనాడు, వెలలేని మాగాణిరా' అనే విప్లవ గీతంతో అనుబంధమున్న పల్లనాడు పులేపుల్ శివయ్యగార్ని గురించి చెప్పారు. కమ్యూనిస్టు వుద్యమ ఆరంభంలోనే ఆయన వినుకొండలో ఇంటర్న్ ఖైదీ. కొంతకాలం కండెమ్న్డ్ సెల్ లో ఖైదీకూడా. జైల్లో వున్న రోజుల్లో రాయలసీమ కరువు గాథలు, కండెమ్న్డ్ సెల్ ఖైదీల వ్యధలు వ్రాసారు. అవన్నీ ఆయన తిలక్ కు చెప్పటంతో సహా స్క్రిప్ట్ కూడా ఇచ్చారట. తన వద్ద అవన్నీ వున్నాయని వెలికితీయాలని చెప్పారు తిలక్.  పులేపుల్ శివయ్యగారు వార్థక్యం కారణంగా, అనారోగ్యం మూలాన్న అజ్ఞాత వాసంలో ఉండలేకపోయినప్పుడు, వేరే మార్గంలేక తీలక్ గారి సహాయంతో ప్రభుత్వానికి లొంగిపోయారు.
          పులేపుల్ శివయ్యగారు కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతల్లో ప్రముఖులు. రచనానుభవం, పుస్తకపఠనం ఆయన వ్యాపకాలు. తిలక్ గారు 'భూమికోసం' చిత్ర నిర్మాణం చేస్తున్న రోజుల్లో ఆయన్ను వినుకొండలో కలిసి ఆయన ఆశీర్వాదం పొందారు.
         తిలక్ సన్నిహితంగా మెలిసిన మరో వ్యక్తి, తన ద్వారా అజ్ఞాత వాసంలోకి వెళ్లే ఏర్పాట్లు చేసిన అతను ప్రఖ్యాత అభ్యుదయ రచయిత కంభం పాటి సత్యనారాయణగారు. ఆయన రచన 'కమ్యూనిస్టు ఉద్యమ చరిత్ర' పాపులర్ పుస్తకాల్లో ఒకటి.
         మరో వ్యక్తి కామ్రేడ్ మద్దుకూరి చంద్రశేఖర్ రావుగారు. ఆ రోజుల్లో మోహనకుమార్ మంగళం తండ్రి డాక్టర్ సుబ్బరాయన్ గారింట్లో ఆర్ పి శాస్త్రిగారు అనే కమ్యూనిస్టు అభిమాని అద్దెకుండేవారు. తిలక్ గారు ఆయన్ను ఎరుగుదురు. ఓసారి శాస్త్రి గారి కార్లో ముద్దుకూరిని తీసుకుని, మద్రాసు నుండి బెంగుళూరు వెళ్ళి, అక్కడి నుండి మారుపేర్లతో విమానంలో హైదరాబాద్ కు చేరుకున్నారు. హైదరాబాద్ స్టేట్ లో కమ్యూనిస్టు పార్టీని నిషేధించారు. అప్పట్లో, తనకంటాక్ట్ వ్యక్తి కామ్రేడ్ గోళ్ల రాధాకృష్ణమూర్తికి అప్పగించారు. తిలక్ ఆయన్ను.
          ఆ రాత్రి తిలక్ గారు బస చేసిన హోటల్ పేరు ‘పెర్సీస్' ఇప్పుడు ప్యారడైజ్ వున్న ప్రక్కస్థలంలో వుండేదట అది. హోటల్ గదిలో వున్న తిలక్ సిగరెట్ తాగుతూ ఆర్పకుండా పడవేయటంతో తివాచీకి అంటుకుని పొగలొచ్చాయి. కొంత సేపు గందరగోళం అయింది. ఎట్లా అయితేనేం, ఆ మర్నాడు, రైల్లో బయలుదేరి మద్రాసు చేరుకున్నారు. తిలక్ తన ప్రస్థానంలో మరో మలుపు వైపుగా.
(మరిన్ని విశేషాలు మరోసారి)

No comments:

Post a Comment