కావ్యాలలో అగ్రస్థానం
రామాయణానిదే
శ్రీ మదాంధ్ర వాల్మీకి
రామాయణం బాలకాండ మందర మకరందం-15
వనం జ్వాలా నరసింహారావు
సూర్య దినపత్రిక
(06-07-2020)
ఏదో ఒక ప్రయోజనం
కోరకుండా,
ఎంత తెలివి తక్కువ వాడైనా, ఏ పనీ మొదలు పెట్టడని అందరికీ తెలిసిందే. అలాంటప్పుడు కవి అనేవాడు కూడా అలానే
కదా! ఇదే నిజమైతే కావ్య రచన వలన కలిగే ప్రయోజనం ఏదైనా వుందా? కీర్తికొరకో,
ధనం కొరకో, వ్యవహార జ్ఞానం
తెలుసుకునేందుకో,
అశుభ పరిహారానికో, కావ్యాలు రాయాలంటాడు
కావ్యప్రకాశకారుడు. ఓ గద్యాన్నో, పద్యాన్నో, గద్య-పద్య మిశ్రమాన్నో (చంపువు) కావ్యం అనవచ్చు. కావ్యం ప్రియురాలి పలుకుల్లా
తియ్యగా వుండాలేకాని,
రాజాజ్ఞలా శాసించే విధంగా వుండకూడదు. అప్రియమైంది కూడా
కాకూడదు.
ఇలాంటి కావ్యాలలో
అగ్రస్థానంలో నిలిచింది,
వాల్మీకి సంస్కృతంలో రచించిన శ్రీమద్రామాయణం.
శ్రీమద్రామాయణంలో నాయిక సాక్షాత్తు శ్రీదేవైన సీతా దేవి. నాయకుడు మహావిష్ణువైన
శ్రీరామచంద్రమూర్తి. వీరిరువురు త్రేతాయుగంలో దుష్ట శిక్షణ-శిష్ట రక్షణ చేసి, ధర్మ సంస్థాపన చేసేందుకు అవతరించారు. ఇహ-పర సాధకంబులైన "స్వధర్మాలలో, స్త్రీ ధర్మం సీతని, పురుష ధర్మం శ్రీరామచంద్రమూర్తని లోకానికుపదేశించాడు వాల్మీకి. వారి చరిత్రను
వాల్మీకే రచించి వుండక పోతే, భవిష్యత్ తరాలవారు
అంధకారంలో పడిపోయి దురాచార పరులై పోయేవారేమో! అట్టి మహోపకారం లోకానికి చేసిన
వాల్మీకి మహర్షిని ఎంత పొగిడినా తక్కువే.
బ్రహ్మర్షి
వాల్మీకి రచించిన రామాయణం సంస్కృత భాషలో వున్నందువల్ల చాలామందికి దురవగాహమై
పోయింది. చాలామంది తెలుగులో అనువదించి నప్పటీకీ అవి కేవలం కథాంశం తెలియ
చెప్పడానికే పరిమితమై పోయాయి. తప్పకుండా అర్థం చేసుకోవాల్సిన సూక్ష్మ విషయాలను
అనువాదకులు వదిలిపెట్టారు. వాసుదాస స్వామి శ్రీరామ భక్త కోటిలో చేరి, దాసోభావంతో పరమ భక్తో-ప్రపత్తో మోక్షోపాయానికి మార్గమని భావించాడు. త్రికరణ
శుద్ధిగా తన ఇష్టదేవతా గ్రంథాన్ని, కైంకర్య రూపంలో, ఆ దేవతకే అంకితమివ్వాలన్న నెపంతో-ఆయన నామస్మరణ మననం ఎల్ల వేళలా లభించేలా
వుండాలన్న వుద్దేశంతో,
అనన్యుడై, ఈ కృతి రచించాలని
అనుకున్నాడు. వాసుదాసుగారు దీర్ఘ రోగి-దుర్బలుడు-అశక్తుడు (అని ఆయనే భావించేవారు).
జీవచ్ఛవంలా బ్రతుకు కొనసాగిస్తున్నానంటూ, శ్రీరామానుగ్రహం
వల్ల-భక్త కోటుల ఆశీర్వాద బలం వల్ల-పూర్వ జన్మ సుకృతం వల్ల, ఎలానో గ్రంథ రచన పూర్తి కావించ గలిగానని చెప్పుకుంటారాయన.
ఇది వెలువడిన
కొత్తలో,
ఒకనాడు, చెన్నైలో, హైకోర్టు ముందునుండి నడుచు కుంటూ పోతున్నాడు గ్రంథకర్త. ఆ రోజున న్యాపతి
సుబ్బారావు పంతులు గారు ఆయన్ను కలిశాడు. "మూల రామాయణానికి సరైన రీతిలో
అనువాదం చేసావు. నువ్వు రాసిన రామాయణానికి సరైన వ్యాఖ్యానం వుంటేనే పాఠకులకు
ఉపయోగంగా వుంటుంది. ఆ వ్యాఖ్య రాయడానికి నువ్వే సమర్థుడవు" అని సూచించారు.
కొన్నాళ్లకు కలిసిన వావిలాల శివావుధానులవారూ అదే మాటన్నారు. వారి సూచన గ్రంథకర్త
హృదయంలో నాటుకు పోయింది. ఫలితంగా వెలువడిందే ఈ "మందరం" అనే ఈ వ్యాఖ్యానం
(అదే ఇప్పుడు "మందర మకరందం" గా వెలువడింది).
గ్రంథకర్త
ప్రపితామహుడైన వావిలికొలను రత్నాజీ పంతులు "రత్నాజీయము" అనే పేరుతో రామాయణానికి
వ్యాఖ్యానం రచించారట. అయితే అది లభ్యం కాలేదు. తన వ్యాఖ్యానానికి, సర్వ భారం శ్రీసీతారామచంద్రుల పైన వేసి, రచనకు పూనుకున్నానని, శ్రీరామచంద్రుడి దయవల్ల పూర్తి చేయగలిగానని అంటారు వాసుదాసుగారు.
బాల కాండ: శ్రీరామచంద్రుడు బాలుడుగా వున్నప్పుడు జరిగిన సంగతులు తెలిపేది
కాబట్టి దీనికి "బాల కాండ" అని పేరు."కాండం"అంటే జలం-నీరు.
శ్రీ రామాయణం మహార్ణవంగా చెప్పడంవల్ల, అందులోని జలం
కాండమనబడింది. శ్రీ రామాయణంలోని ఏడు కాండలలో "ఏడు వ్యాహృతుల" అర్థం
నిక్షిప్తమైంది. బాల కాండలో "ఓం భూః" అనే వ్యాహృత్యర్థం వుంది. అది
గ్రంథ పఠనంలో తెలుస్తుంది. ఈ కాండలో శ్రీరామచంద్రమూర్తైన విష్ణువే "జగజ్జనన
కారణభూతుడు" అని, రెండో కాండలో ఆయనే
"హేతువు" అని,
మూడో కాండలో ఆయనే "మోక్ష దాత" అని, నాలుగో కాండలో ఆయనే "గుణ సంపత్తి" అని, అయిదులో "సర్వసంహార కర్త" అని, ఆరవ కాండలో "వేదాంత వేద్యుడు" అని, ఏడో కాండలో ఆయన బ్రహ్మకు "హేతువు" అని, ఇలా,
శ్రీరామచంద్రమూర్తిగా అవతరించిన విష్ణువే
"పరతత్వం" అని తెలుస్తుంది.
జననం మొదలు ఇరవై
అయిదు ఏళ్లు వచ్చేవరకూ రాముడు చేసిన చర్యలు ఈ కాండలో వున్నాయి. పన్నెండో ఏట
పెళ్లైనప్పటినుండి పట్టాభిషేక ప్రయత్నం జరిగే వరకు చెప్పుకోదగ్గ విశేషం ఏమీలేదు.
No comments:
Post a Comment