“పీపుల్స్ వార్” పేపర్
బాయ్
స్వర్గీయ కేబీ తిలక్
జ్ఞాపకాలు-అనుభవాలు
వనం జ్వాలా నరసింహారావు
ప్రజాతంత్ర, సంపూర్ణ స్వతంత్ర వారపత్రిక
(జూన్ 18-24,
2000)
మేనమామ ఎల్ వి
ప్రసాద్ గారితో మద్రాసు చేరుకున్నప్పటికీ తిలక్ గారి మదిలో బొంబాయి జ్ఞాపకాలు, అక్కడి అనుభవాలు,
అనుభూతులు అహర్నిశం మదిలో మెదుల్తూనే ఉన్నాయి. స్వగ్రామం
దెందులూరులో స్వతంత్ర సంగ్రామానికి చెందిన కార్యకలాపాల్లో యూత్ లీగ్ ఆర్గనైజర్ గా
పాల్గొంటున్న తనను మేనత్త బొంబాయికి తీసుకెళ్లి
మేనమామగారి ఆలనా పాలనలో వుంచినందుకు, ఆయనకు ఎలా ఆసరాగా ఉండగలనా
అని ఆలోచించేవారు ఆయన. దానికి తోడు సినీరంగంలో పట్టు సంపాదించాలన్న కోరిక ఓ వైపు, స్వాతంత్ర్య ఉద్యమంలో ఏదో విధంగా తన వంతు పాత్ర నిర్వహించాలన్న తపన మరో వైపు
తిలక్ గారిని వేధించసాగాయి. అన్నిటికన్నా ముఖ్యమయింది కొద్దో గొప్పో తనంతతాను, దినసరి ఖర్చులకన్నా అంతో ఇంతో సంపాదించుకోవటం ఎలా అనేది.
బొంబాయి నగరంలోని
గ్రాంట్ రోడ్,
ప్రాంతంలో వున్న ‘ఒపేరా హౌస్' అనే సినిమా టాకీసు ఆ రోజుల్లో వామపక్ష
వేదికయిన ప్రజానాట్యమండలి సమావేశాలకు ప్రధాన కూడలి. కన్నడ, తెలుగు, హిందీ విభాగాలకు అక్కడ వేర్వేరు
సెక్షన్లుండేవట. తెలుగు విభాగంలో తిలక్ గారు, పాల్గొంటుండేవారు. ఎల్ వి ప్రసాద్ గారుంటున్న ఇల్లు కూడా గ్రాంట్ రోడ్డులోనే
వుండేది. ఓ బెడ్రూమ్,
కిచన్, కామన్ బాత్ రూమ్ వున్న ఆ
ఇంట్లో తిలక్ గారుండటానికి కూడా కొంత చోటుండేది. ఉండటానికైతే ఆ జాగా చాలు కాని
దినసరి ఖర్చు మామయ్యగారిని అడుగలేదు కదా! అదే సమయంలో తిలక్ గారికి పరిచయమయ్యారు, కృష్ణా
జిల్లా నుండి వచ్చి బొంబాయిలో ప్రింటింగ్ ప్రెస్ నడుపుకుంటున్న మల్లికార్జునరావు గారనే
పెద్ద మనిషి. మేనమామ ప్రసాద్ గారుంటున్న
ఇంటి క్రింద భాగంలో ఉంటున్న ఓ సింధీ వ్యాపారస్తుడితో కూడా స్నేహం కుదిరింది. ఆ
సింధీ వ్యాపారస్తుడు 'లోటస్'
అనే పేరుతో ‘తంబోలా’ కూపన్లను అచ్చువేయించి బొంబాయిలోని
మిలిటరీ క్లబ్బులకు అమ్ముతుండేవాడు. ఆ ప్రింటింగ్ ఆర్డరును తిలక్ గారు చాకచక్యంగా
మల్లికార్జునరావు గారి ప్రెస్ కు ఇప్పించటంతో ఆ కూపన్లు అచ్చు వేసినప్పుడల్లా ఆయనకు
కొంత కమీషన్ రూపేణా ముట్టుతుండేది.
ఆ రోజుల్లోనే, ఎల్ వి ప్రసాద్ గారి పొరుగింట్లో, అప్పట్లో ప్రఖ్యాత సినీ
కళాకారుడు,
అంతో ఇంతో చెప్పుకోదగ్గ ప్లేబ్యాక్ సింగర్ డబ్ల్యు ఎమ్ ఖాన్
ఉంటుండేవారు. ఆయన దగ్గరకు వస్తూ పోతుండే
సింథీకమెడియన్ 'గోపి'
తో కూడా తిలక్ కు స్నేహం అయింది. ఆ తర్వాత రోజుల్లో తిలక్
గారు సినీరంగంలో ప్రవేశించటానికి, రాణించడానికి గోపీ స్నేహం
దోహదపడింది. ఎల్ వి ప్రసాద్ గారి వద్ద తన 'ఏకలవ్య" శిష్యరికం కూడా తోడ్పడింది. ఆది వేరే సంగతి.
అప్పట్లో ఎల్ వి ప్రసాద్ గారు ప్రఖ్యాత
సినీ దర్శక-నిర్మాత ఎస్ ఎమ్ యూసఫ్ దగ్గర
సహాయకుడిగా పనిచేసేవారు. ‘ఐనా', 'లేడీ డాక్టర్’ లాంటి
కుటుంబ కథాచిత్రాలను ఎన్నో రూపొందించారు యూసఫ్.
సినీరంగంలో
అప్పుడప్పుడే అడుగిడి,
బిజీగా వుంటుండే ఆ ప్రసాద్ గారికి అదనపు ఆదాయం సమకూర్చేది
ఆయన ‘బాతుగుడ్ల’ వ్యాపారం. ఆ వ్యాపారాన్ని
నిర్వహించేటందుకు ఆయనకు ఓ స్వంత మనిషి అవసరమయ్యా డు. అది గ్రహించిన తిలక్ గారు ఆ
రంగంలోకి దిగారు. స్వాతంత్ర్యోద్యమం ప్రథమకర్తవ్యంగానూ, సినిమా రంగంలోకి దిగటం ద్వితీయ కర్తవ్యంగానూ భావించిన తిలక్, బాతుగుడ్ల వ్యాపారంలోకి దిగటం యాధృచ్చికమే అయినప్పటికీ, ఆ వ్యాపారం ద్వారా బొంబాయి మహానగరంలో నివసిస్తున్న తెలుగు కార్మికులకు, కూలీలకు చేరువయ్యారు. తిలక్ సీనియర్‌గా, ప్రసాద్ గారి బాతుగుడ్ల
వ్యాపారాన్ని చూస్తున్న వ్యక్తి ‘ఇమామ్'. ఆ కార్యక్రమానికి ఆయన
మస్జీద్ పరిసరాలను వాడుకునేవారు. ఎక్కడి
దెందులూరు పెద్దింటాయన,
ఎక్కడా ఎలాంటి పనిచేయాల్సివచ్చిందో..... సరే అది విధి రాత?
అనుకున్నాడు.
కృష్ణా జిల్లా
కైకలూరు నుండి,
పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు నుండి, ఇతర ప్రాంతాలనుండి బాతుగుడ్లను ఉత్పత్తిదారులు, మధ్య దళారులు బొంబాయి రైల్వే స్టేషన్‌కు చేర్చేవారు పెద్దపెద్ద గంపల్లో. గుడ్ల
బేరానికి పెద్ద పోటీ వుండేది. గంపలను చేజిక్కించుకోవటానికి కొంత చాకచక్యం కూడా
చూపాల్సి వచ్చేది. గంపలను తెచ్చిన వ్యక్తికి షేక్ హ్యాండ్ ఇచ్చినట్లు ఇచ్చి, చేయి చేయి కలిపినప్పుడు పైన రుమాలు వేసి చేతులను కప్పేవారట తిలక్ గారు. తన
చేతివేలితో,
ఆతని చేతి మీద సైగల ద్వారా బేరం కుదుర్చుకుని, అలా కొన్న గుడ్లను బేకరీలకు, ఇరానీ హోటళ్లకు ఉదయం
పదిగంటలలోపే సరఫరా చేసి పని ముగించుకునేవారు, ఆరోజుకు. ఇక ఆ తర్వాత, షరా మామూలే.
ఓ పర్యాయం గుడ్లను
ఓ బజారులోని బేకరీలో అమ్ముతుండగా అకస్మాత్తుగా మత కలహాలు చేలరేగాయట. ఫలితంగా రెండు
మూడు రోజుల వరకు అక్కడక్కడ తలదాచుకుని ఆ తర్వాత ఇంటికి చేరుకున్న తిలక్ ను చూసి
విలపించింది ఆయన మేనత్తగారు. తల్లి కన్నా మిన్నయిన ఆమె గారంటే తిలక్ గారికి ఎంతో
గౌరవం.
ఇదిలా ఉండగా...
ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొంటున్న తిలక్ గారు బాగా పాడుతారన్న పేరుకూడా
తెచ్చుకున్నారు. మీటింగులు ఏర్పాటు చేయటం, నిర్వహించటంలో ఆయన
కార్యదక్షతను గమనించుతున్న పెద్దలు ఆయన్ను'టాస్క్ మాస్టర్' అని పిలవటం మొదలెట్టారు. బొంబాయిలోని తెలుగు కార్మికులు నివసిస్తున్న
వాడల్లో 'ఆయన గొంతెత్తి 'లేవరా.... లేవరా... కార్మికుడా...' అని పాడిన పాటను గుర్తుచేసుకున్నారు
తిలక్. మీటింగులు జరుగుతున్నప్పుడు, గిట్టనివారు, ఇళ్ల చాటునుండి రాళ్లు రువ్విన సందర్భాలు ఎన్నో వున్నాయన్నారు. రాళ్ల బారి
నుండి రక్షించుకోవటానికి,
మీటింగులకు వెళ్లేటప్పుడు తమ వెంట మడత కుర్చీలను
తీసుకెళ్లేవారట. ఎందుకంటే వాటిని మడిచి తలపై పెట్టుకోవటానికని జవాబిచ్చారు తిలక్.
కమ్యూనిస్ట్
అగ్రనాయకులైన కామ్రేడ్ బి టి రణదివె, విమలారణదివె, వైద్య,
అధికారి లాంటి వారితో పాటు కానూరు రామానంద చౌదరి (కె ఎల్ ఎన్
ప్రసాద్ సోదరుడు),
అట్లూరి జయరామ్, రమేష్ చంద్రలతో తిలక్ తన
సాన్నిహిత్యాన్ని గుర్తుచేసుకున్నారు. అందరికన్నా ఆయన గొప్పగా చెప్పుకున్నది మోహనకుమారమంగళంతో
తనకు ఏర్పడ్డ పరిచయం.
కమ్యూనిస్ట్
పార్టీ ఆ రోజుల్లో ప్రచురిస్తుండే 'పీపుల్స్ వార్' అనే పత్రికకు పేపర్ బోయ్ గా పని చేసారు తిలక్. పి సి జోషి గారో లేక అధికారి
గారో అప్పట్లో ఆ పత్రిక కు ఎడిటర్ గా పనిచేసేవారు. బొంబాయి కమ్యూనిస్టు పార్టీకి చెందిన
సెంట్రల్ స్క్వాడ్ లో పనిచేసేవారందరూ ఇలా
ఏదో ఒక పార్టీ కార్యకలాపాలలో పాల్గొనటం ఆనవాయితీ అప్పుడు. అదో డ్యూటీగా
భావించేవారందరూ. అయితే అంతో ఇంతో పైకం కూడా లభించేది తద్వారా తిలక్ గారికి. దాంతో
తన 'చాయ్’ ఖర్చులు వెళ్లేవట.
అప్పట్లో మోహన్
కుమార మంగళంతో ఏర్పడ్డ పరిచయం పెరిగి, ఆయన తండ్రి డాక్టర్
సుబ్బరాయన్ గారితో సాన్నిహిత్యానికి దారి తీసింది. మద్రాసులో ఆయన గారింట్లో ఆ
తర్వాత కాలంలో అజ్ఞాత కార్యక్రమాలు నిర్వహించటానికి ఆ పరిచయాలు ఉపయోగపడ్డాయని
గుర్తుచేసుకున్నారు తిలక్.
సెంట్రల్
స్క్వాడ్లో పనిచేస్తున్న రోజుల్లోనే, ప్రపంచ శాంతి సంస్థకు
దీర్ఘకాలం పనిచేసిన రమేష్ చంద్రగారితో కూడా పరిచయం కలిగింది తిలక్ గారికి.
తనకు కమ్యూనిస్టు
పార్టీతో ఉన్న సంబంధాలను,
దిన ఖర్చులకు తాను చేస్తున్న అరకొరా పనులను ఏనాడూ మేనమామ
ప్రసాద్ గారికీ,
మేనత్త గారికీ తెలియకుండా జాగ్రత్త పడ్డారు తిలక్.
బొంబాయి డాక్
యాడ్లో తానున్న రోజుల్లో తలెత్తిన 'నేవీ విప్లవం' సందర్భంగా తన వంతు పాత్రను గూడా నెమరేసుకున్నారు తిలక్.
బొంబాయ్ జ్ఞాపకాల
ఊపిరితో మద్రాసు చేరుకున్నాను అన్నారు తిలక్.
(మరిన్ని విశేషాలు మరోసారి)
No comments:
Post a Comment