మునివృత్తిలో ఆయుధాలెందుకు?
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రప్రభ చింతన (23 & 24-07-2020)
సీతారామలక్ష్మణులు
వనవాసం చేస్తున్న తొలిరోజుల్లో ఆసక్తికరమైన సంఘటన జరిగింది. ఒకనాడు, తెల్లవారుఘాము
కాగానే లక్ష్మణుడు ముందుగా లేచి, స్నానం చేసిన తరువాత,
సీతాదేవి, శ్రీరామచంద్రమూర్తి కూడా తటాకజలాలలో స్నానం చేసి,
దైవ ప్రార్థన చేసి, సూర్యోదయం కాగానే దండకారణ్యంలో
మునుల రక్షణకు బయల్దేరారు. అప్పుడు సీత విల్లంబులను, ఇతర
ఆయుధాలను అంబులపొదులను రామలక్ష్మణులను తీసుకొమ్మని చెప్పి ఇచ్చింది. వాళ్లు వాటిని తీసుకుని తమదగ్గర వుంచుకుని ఎక్కుపెట్టారు. రామలక్ష్మణులు విండ్లు ధరించిన విధం చూసి ఆయుధాల పట్టువిడుపులు తెలిసిన
సీతాదేవి వారు యుద్ధ సన్నద్ధులైనారని గ్రహించి ఇలా అన్నది శ్రీరాముడితో:
"ప్రాణేశ్వరా! నువ్వు ధర్మ
నిరతుడవు కాబట్టి నీలో ఏ పాపాలు కనబడవు. నువ్వు సత్యం, ధర్మం తప్పని వాడివి కాబట్టే తండ్రి వాక్యాన్ని పాలించడానికి ఇంత శ్రమ
పడ్తున్నావు. సత్యం, ధర్మం
నీలో ఏ కొరతా లేకుండా వున్నాయి. ఇంత సత్యం, ధర్మం విజితేంద్రియులకు తప్ప ఇతరులకు లభించవు.
నువ్వెంత జితేంద్రియుడివో నాకు తెలుసు. రామచంద్రా! మిథ్యాభిభాణం పరదార సంగమాభిలాష నీలో లేవు. ఆ
విషయం గురించి నేనేం చెప్పను”.
“ఇకపోతే, జ్ఞానహీనులు పగలేకపోయినా ఇతరుల
ప్రాణం తీస్తారు. అది అలాంటివారికి తగునుకాని నీకు తగదు. అది నాకెలా తెలుసంటావా? మునీశ్వరుల కొరకు
దండకారణ్య వాసులైన రాక్షసులను చంపుతానని ప్రతిజ్ఞ చేశావు. అందుకోసమే ఇక్కడకు వచ్చావు. మునిలాగా
తిరగాలనుకుంటున్న నీకు, నీ తమ్ముడికి విల్లు
బాణాలెందుకు? అవి హింసించే సాధనాలే కదా? ఆత్మరక్షణ కోసమని అనుకోవచ్చుకదా అంటావేమో? ఈ
మునులందరూ ఆత్మరక్షణ కొరకు ఏ ఆయుధాలు ధరించారు? నువ్వు
సాయుధుడవై వచ్చినందున మునులు వచ్చి నిన్ను రక్షించమని అడిగారంటావా? అలాగే నిన్ను రాక్షసులు హింసించడానికి వస్తే క్షత్రియుడవైన నువ్వు ఎవరిని
ప్రార్థించాలంటావా? అలా వారు వస్తే నువ్వు ఆయుధాలు
పట్టవచ్చు. కాని, ఇప్పుడు
మీరు విల్లు-ఆయుధాలు పట్టిన తీరు చూస్తే యుద్ధానికి
పోతున్నట్లున్నది. అందువల్ల మీ శుభం, హితం కోరినదాన్నైన నేను, నిష్కారణ విరోధంతో మీకేం
అశుభం కలుగుతుందో అని భయపడుతున్నా. నువ్వు సత్యం, ధర్మం పాటించేవాడివి. ఇంతదాకా ఆ రెంటినీ సమంగా
కాపాడుకుంటూ వస్తున్నావు. సంతోషమే! ఇప్పుడు రెంటికీ విరోధం వచ్చేట్లున్నది.
సత్యంతో విరోధించే ధర్మం, ధర్మం కాదు. ధర్మంతో విరోధించే
సత్యం, సత్యం కాదు”.
“మీరు ఇప్పుడు అడవులకు ప్రయాణమై పోవడం సమ్మతమైన కార్యం కాదు. పోతే ఏమైతుందంటావా? కారణం చెప్తా విను. మీరు యుద్ధానికి పోయే విధంగా చేతులో విల్లంబులు, కత్తులు ధరించి పోతున్నారు. తోవలో ఎవరైనా
రాక్షసుడు కనిపిస్తే ఇదిగో రాక్షసుడు దొరికాడని వాడిమీద బాణం వేస్తారు. ఆ దెబ్బకు వాడు చస్తాడు. అదే రాక్షసులకు, మనకు విరోధ కారణమవుతుంది. రాక్షసులు మనకు
ప్రత్యక్షంగా అపకారం చేస్తే వారిని చంపవచ్చు కాని, ఎవరో
ఋషీశ్వరులు చెప్పారని రాక్షసులను చంపి మనం కయ్యానికి కాలు త్రవ్వడం నాకిష్ఠం లేదు. రాక్షసులమీద బాణం నువ్వు ప్రయోగిస్తావని నేనెలా ఊహించానంటావా? నువ్వు రాక్షసులను చంపుతానని ప్రతిజ్ఞ చేశావు. నువ్వు
సత్య ప్రతిజ్ఞుడవు. కాబట్టి చంపక మానవు. భయపడవద్దు. నిష్కారణంగా నువ్వెవరినీ చంపనని అంటావా? హింసించవచ్చే వారినే హింసిస్తానంటావా? అలా
ధైర్యం చెప్తావా? అలా అయితే నీ ప్రతిజ్ఞ ఎలా
నెరవేరుతుంది? దానికి సరైన కారణం కావాలి. నువ్వు ఆయుధాలతో అరణ్యానికి పోవడం నాకిష్ఠం లేదు. క్షత్రియులకు చేతిలో ఆయుధం వుంటే బలాన్ని, తేజాన్ని వృద్ధి చేస్తుంది.
కాబట్టి మీ ఆయుధాలను ఇక్కడే వుంచి పోదాం".
"ప్రాణేశ్వరా! రామచంద్రా! శస్త్ర సంయోగం వల్ల కలిగే కీడు అంతా-ఇంతా కాదు. అగ్నిహోత్రుడు దేనిని (కట్టెలను) ఆశ్రయిస్తాడో, దాన్నే దహించి వేస్తాడు. అలాగే శస్త్రం కూడా తన్నెవరు ధరిస్తారో వారికే కీడు చేస్తుంది. ఇదంతా నీకు తెలియదని, నువ్వు అజ్ఞానివనీ, నేను నేర్పడం లేదు. నాకు స్వభావసిద్ధంగా మీమీద
స్నేహ భావం వుండడం మూలాన, నేను మీరు మరచిన దానిని
జ్ఞప్తికి వచ్చేట్లు చెప్పాను. నన్ను క్షమించు. నేనెంత దూరం ఆలోచించినా ఇప్పుడు, ఇక్కడ, మీ ప్రయత్నం నాకిష్ఠం కావడం లేదు. మునివృత్తిలో
వుండే వారికి ఆయుధాలతో పనిలేదు. కాబట్టి ఆయుధాలను మీరు
ధరించడం సరైన పని కాదు. అడవుల్లో మునులు తిరగడానికీ, శస్త్రాలను ధరించడానికీ ఏం సంబంధం? మునివృత్తి
శాంతి ప్రధానం. ఆయుధ ధారణ కౌర్య ప్రధానం. ఒకటి శుద్ధ సాత్త్వికం, ఇంకొకటి శుద్ధ
తామసం. నువ్వు చేయబోయే ఈ పని పరస్పర విరుద్ధ గుణాలున్నది. కాబట్టి రెండింటిలో ఒకటి
వదలు. శస్త్రాన్నైనా వదలు, లేదా, క్షాత్రమైనా వదలు”.
"శస్త్రాన్ని ధరించడమే జరగుతే, దాన్ని ఉపయోగించాలన్న పాపపు బుద్ధి పుట్తుంది. కాబట్టి
నువ్వు అడవుల్లో వున్నన్నాళ్లు శస్త్రం ధరించవద్దు. శస్త్రాన్ని
ధరించాలనుకుంటే, అయోధ్యకు నువ్వు మరలిపోయిన తరువాత, మళ్లీ గృహస్థ ధర్మంలో వున్నప్పుడు, ధర్మ
సంరక్షణార్థం శస్త్రాన్ని ధరించవచ్చు. అనుభవించాల్సిన
ఐశ్వర్యం, పాలించాల్సిన భూమి, వదలిపెట్టి, మునిలాగా అడవుల్లోకి వచ్చిన నువ్వు, మునిలాగానే తపస్సు చేస్తే, మంచిది. ధర్మంతో ధనం లభిస్తుంది. ధర్మం వల్ల సుఖం
కలుగుతుంది. ధర్మంతో చేసే సత్కర్మలు మంచి ఫలితాలను
ఇస్తాయి. ధర్మహీనుడు చేసే సత్కర్మలు ఫలించవు. ధర్మం చెడితే జగమంతా చెడుతుంది. నువ్వు
అడవుల్లో తిరిగినంత కాలం హింసా వ్యాపారం లేకుండా వుండకూడదా? ఇదే నేను కోరేది. రాముడు క్రూరుడు అంటారేమోనని విచారిస్తున్నాను. కాబట్టి, నువ్వు, నీ తమ్ముడు ఆలోచించి ఏది మేలని తోస్తే
అదే చేయండి". జవాబుగా శ్రీరామచంద్రమూర్తి ఇలా అన్నాడు సీతాదేవితో:
"దేవీ! అహింసాపరులైన ఋషులు రాక్షసులకు భయపడి వారంతట వారే, నా ప్రయత్నం లేకుండా, కడు దుఃఖంతో
నాదగ్గరకు వచ్చి, నేనే దిక్కని శరణుజొచ్చారు. ఇలా నేనే
దిక్కని నమ్మిన ఆ ఆశ్రితులను ఎలాగైనా పాడైపొమ్మని తిరస్కరించడం ధర్మమా? హింస నిషేధం అని నువ్వన్నావు. అది నేను అంగీకరిస్తా. హింస అంటే ఎలాంటిది?
నిరపరాధులైన సాధువులను హింసించడాన్ని హింస అంటారు కాని అసాధువులను
హింసించడాన్ని హింస అనరు కదా? రాక్షస వధమీద నాకున్న ఉద్దేశం
ఏంటి? అదేమన్నా వినోద క్రీడా నాకు? వాళ్లను
నేను, కామంతో కాని, క్రోధంతో కాని,
లోభంతో కాని, మదమాత్సర్యాలతో కాని, మోహంతో కాని చంపాలనుకోవడం లేదు కదా? సాధువుల
మేలుకొరకై చేసే పనిలో దోషముందా? దేవీ ఈ మునులు అడవుల్లో,
అక్కడొక కాయ, ఇక్కడొక కూర తెచ్చుకుని దాంతోనే
కడుపు నింపుకుని దేహయాత్ర చేస్తారు. ఇక రాక్షసులంటావా, మృగాలనే కాకుండా మనుష్యులను
కూడా పీక్కుని తిని భోగాలనుభవిస్తారు. మునులు ధర్మపద్ధతిన నడుస్తే, వారు దయాదాక్షిణ్యాలు లేకుండా క్రూరపద్ధతిన నడుస్తారు. ఇలాంటి నిష్కారణ
హింసాపరాయణులైన రాక్షసులను వధించి శిష్ట రక్షణ చేయడం అధర్మమా చెప్పు?”
"దండకారణ్యంలో నివసిస్తున్న మునీశ్వరుల సమూహాలు మా దగ్గరకు వచ్చి, అనేకవిధాలుగా తాము పడుతున్న దుఃఖాలను చెప్పి, తమను రక్షించాలని ప్రార్థించారు. ఏకవాక్యంగా వారంతా ఒక్కటే చెప్పారు.
దండకలో వున్న రాక్షసులు తమపై పగ బూని, తాము హోమం చేస్తున్న
సమయంలో తమను బాధపెట్తున్నారని, ఆ బాధ పడలేక తమకు రక్షకుడు
ఎవరు వస్తారో అని విచారపడ్తుండగా, తమ పుణ్యఫలం వల్ల నేను
దొరికానని అన్నారు. తపస్సు చేయడం సులువు కాదనీ, అది మిక్కిలి
కష్టకార్యమనీ, అంత కష్టపడి చేద్దామంటే మధ్య-మధ్యలో విఘ్నాలు
కలుగుతున్నాయనీ, తమ తపశ్సక్తి పోగొట్టుకోదల్చుకోలేక వారిని
శపించడం లేదనీ, ఎంతమందిని అలా శపించగలమనీ, ఒక వేళ శపించినా తమకింక ఏ శక్తి మిగుల్తుందనీ, జీవించినా
వ్యర్థమే కదా అనీ, వాళ్లన్నారు”.
వాళ్లింకా ఇలా చెప్పారు: "తమ స్థితిగతులను ఆలోచించమనీ, రాక్షసులు చేసే పనులు ఆపుచేయించమనీ,
వారి తపస్సులు సాగేట్లు చేయమనీ, వారిమీద దయచూపి రక్షించమనీ, నేనే వారికి దిక్కనీ, వేరే రక్షించేవారెవరు ఎవరూ
లేరనీ, రాక్షసుల బారి నుండి కాపాడమనీ అన్నారు. వాళ్లిలా చెప్పగా వారిని కాపాడాలని
ప్రతిజ్ఞ చేశాను. వట్టి మాటలు చెప్పి కన్నీళ్లు తుడిచి పంపలేదు. నాకు సత్యం
అన్నింటికంటే ముఖ్యం కాబట్టి ప్రాణాలున్నంతవరకు ఆడినమాట తప్పను. నువ్వే దిక్కని
నన్ను ఆశ్రయించి, ఎప్పుడుకూడా ఇతరులకు హాని కలిగించే వాటి
జోలికి పోకుండా, దిక్కులేనివారిగా వున్న మునులను, రాక్షసులు పనిగట్టుకుని వధించారు. ఇంతకంటే విరోధమైన పని ఏమన్నా వుందా
చెప్పు? నన్ను ఆశ్రయించేదాకా ఎవరేపాపాలు చేసినా వారి పాపఫలం
వాళ్లే అనుభవిస్తారని, వారిని నేను రక్షించే ప్రయత్నం చేయను.
ఒకసారి నన్ను ఆశ్రయిస్తే, నేనే దిక్కని వారి రక్షాభారం నామీద
వేస్తే, పాపకార్యాలు చేయకుండా వుండే దిక్కులేనివారిని
రక్షించడమే నాపని. దానికి నేను కట్టుబడి వున్నాను. అలాంటి వారిని, నా రక్షణలో వున్నవారిని, నా ఆశ్రితులను, రాక్షసులు చంపుతున్నారు. నా భక్తులు నాప్రాణంతో సమానం. నా భక్తులను
భాదించడమంటే నన్ను బాధించడమే. కాబట్టి పగకు దీనికి మించిన కారణం ఏం కావాలి?
దీనికి జవాబు చెప్తే, సుమతీ, నువ్వు చెప్పినట్లే చేస్తా. ఇక నా మనోనిశ్చయం విను. సత్యాన్ని
రక్షించేందుకు ప్రాణాలైన విడుస్తాను. ప్రాణాలకంటే ఇష్టమైన నిన్నైనా విడుస్తాను. నీ
కంటే ప్రియమైన తమ్ముడినైనా విడుస్తాను. కాని సామాన్య విషయమైన ప్రతిజ్ఞ విడువను.
అందునా, ముఖ్యంగా, బ్రాహ్మణులకు ఇచ్చిన
మాట తప్పను".
శ్రీరాముడు సీతతో ఇంకా ఇలా అన్నాడు: "ఆశ్రిత రక్షాభారాన్ని వహించిన
నేను ఆ ఆశ్రితులై, నా పరతంత్రులై, వుండే మునుల కార్యాన్ని రక్షించడం నా విధి. ఒక్క సారి వాళ్లు నాతో మేము నీ
ఆశ్రితులం అని చెప్తే చాలదా? గడియ-గడియకు చెప్పాలా? నేనంత మరిచేవాడినా? వారి యోగక్షేమాలు నేను
విచారించాల్సినవాడిని. అలాంటిది, వారు వచ్చి, నేను చేయాల్సిన పనిని గుర్తుచేసిన తరువాత, వారికి
ప్రతిజ్ఞ చేసికూడా ఎలా నెరవేర్చకుండా వుంటాను? నువ్వు జనకరాజు
కూతురువు కదా! ఇది నీకు తెలియని విషయమా? అప్పు తీసుకున్నవాడు
మళ్లీ-మళ్లీ అడిగించుకోవచ్చా? అడిగించుకుని ఇవ్వడం శ్లాఘ్యమా?
ఇవ్వకపోవడం శ్లాఘ్యమా? రెండూ కావు. నన్ను
నమ్మి, నన్ను స్మరించి, నన్ను
ధ్యానించి, అర్చించి, జపించి, సేవించి, వర్ణించి, కీర్తించి
నాపై ఋణమెక్కించిన వారి ఋణం నేను తీర్చుకోవద్దా? నా
భక్తుడిని నేను స్మరిస్తాను. నేను చెప్పిన మాట నెరవేర్చడం ఆలశ్యమైందని నేను
విచారపడుతుండగా వారి కార్యం నెరవేర్చకుండా ఎలా వుండగలను?”.
“నాకు నీమీద, నీకు నామీద, స్నేహం-మోహం
వున్న కారణాన, నువ్వు మంచి మనసున్నదానివైనందున, ఇదంతా చెప్పాను. రక్షోవధకు పూనుకున్నప్పుడు నాకు నీమీద, నీకు నామీద కల స్నేహానికి, మోహానికి విఘ్నం కలుగొచ్చునేమో అన్న నీ అనుమానం
గ్రహించాను. అది సహించైనా కార్యం నెరవేర్చాలి. నువ్వు ఉత్తమ స్త్రీవికాబట్టి,
నీకిలాంటి మంచిమాటలు చెప్పగలిగాను. స్నేహం-మోహం భర్తకు తమ మీద
లేకపోయినా, భర్తలమీద తమకు లేకపోయినా చెప్పగలరా? చెప్పరు. కాబట్టి నువ్వు ఉత్తమగుణ సంపన్నవనీ, నిష్కపటవ్యాపారవనీ
మెచ్చ్హాను. నువ్వు పుట్టిన జనక వంశానికి, నీ శీలానికి
తగినవిధంగా చెప్పాను. ఇందేం దోషం వుంది? నువ్వు
సహధర్మచారిణివి. ప్రాణాలకంటే ఎక్కువ ప్రియమైన దానివి", అని చెప్పి లక్ష్మణుడు,
సీత తోడురాగా శ్రీరాముడు విల్లు ధరించాడు. (వాసుదాసుగారి
అరణ్య కాండ మందరం ఆధారంగా)
No comments:
Post a Comment