అంతర్రాష్ట్ర
జల ఒప్పందాల్లో నూతన ఒరవడి
వనం జ్వాలా నరసింహారావు
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రజ్యోతి
దిన పత్రిక (03-09-2016)
ఆంధ్ర
భూమి దినపత్రిక (02-09-2016)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన
రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర
రావు,
మహారాష్ట్ర ప్రభుత్వం పక్షాన ఆ రాష్ట్ర
ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, మూడు అంతర్ రాష్ట్ర జల ఒప్పందాలపై 2016 ఆగష్టు 23న సంతకాలు చేయడంతో ఒక నూతన ఒరవడికి
శ్రీకారం చుట్టినట్లయింది. పెన్ గంగ, ప్రాణహిత, గోదావరి నదులపై, చనాఖా-కోరటా, తుమ్మిడిహట్టి, మేడిగడ్డ ప్రాజెక్టుల వద్ద బారేజీల
నిర్మాణానికి మార్గం సుగమమైంది. ప్రాణహిత పై తుమ్మిడిహట్టి బారేజీ ద్వారా ఆదిలాబాద్ జిల్లాలో 148 మీటర్ల సామర్థ్యం కలిగిన పూర్తిస్థాయి రిజర్వాయరు, కరీంనరగ్ జిల్లాలో మేడిగడ్డ వద్ద గోఫ్దావరి నదిపై 100 మీటర్ల సామర్థ్యం కలిగిన పూర్తి నీటి స్థాయి రిజర్వాయరు, ఆదిలాబాద్ జిల్లాలో పెన్ గంగ నదిపై చనాఖా–కోరటా రిజర్వాయరు వల్ల 213
మీటర్ల పూర్తి స్థాయి రిజర్వాయరు నిర్మాణం కానున్నాయి. ఒప్పందంలో భాగంగానే, మేడిగడ్డ వద్ద నిర్మించనున్న
రిజర్వాయర్ ఎత్తును మరో మీటరు ఎత్తుకు పెంచే అవకాశాన్ని, అవసరాన్ని- ఆవశ్యకతను పట్టి పరిశీలించాలని నిర్ణయించారు. ఈ మూడు రిజర్వాయర్ల నీటి నిల్వ సామర్థ్యం 1.8 టిఎంసీలు, 16.17 టిఎంసీలు, 0.85 టిఎంసిలు. గోదావరి నీటి నుండి తెలంగాణాకు కేటాయించిన 950 టిఎంసీల నీటి నుండి 200 టిఎంసీల నీటిని
వినియోగించుకునే విధంగా రిజర్వాయర్ల
నిర్మాణం జరుగుతుంది. ఈ బ్యారేజీల ద్వారా రాష్ట్రంలో రమారమి
40 లక్షల ఎకరాలకు సాగునీరందించేందుకు వెసులు బాటు కలుగుతుంది. చారిత్రాత్మకమైన ఈ ఒప్పందాల ద్వారా ప్రధానంగా ప్రస్తుత ఆదిలాబాద్
జిల్లాకు గణనీయంగా లాభం కలుగుతుంది.
తెలంగాణ, మహారాష్ట్ర ముఖ్యమంత్రుల నేతృత్వంలో
మార్చి 8,
2016న గోదావరి ప్రాజెక్టులపై అంతర్ రాష్ట్ర నీటి బోర్డును ఏర్పాటు చేసే
అంశంపై అవగాహన పత్రాలపై సంతకాలు జరిగిన నాడే మొన్న జరిగిన ఒప్పందాలకు బీజం పడింది. తద్వారా దశాబ్దాల కాలంగా బారేజీల నిర్మాణం విషయంలో చోటుచేసుకున్న
అనవసర జాప్యానికి,
అంతర్ రాష్ట్ర జల వివాదానికి తెరపడి, గోదావరి తదితర ఉప నదుల జల వినియోగానికి శ్రీకారం చుట్టబడింది. ఈ ఒప్పందాలను ఒక చారిత్రాత్మక
ఘట్టంగా,
కేంద్ర ప్రభుత్వం జోక్యం లేకుండా, కోర్టులను, ట్రిబ్యునల్స్ ను ఆశ్రయించకుండా, దశాబ్దాల కాలంగా నలుగుతున్న సమస్యకు అవగాహన ఒడంబడిక ఒక చరమ గీతం
పలికినట్లుగా,
ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సంతకాల అనంతరం
పేర్కొనడం విశేషం.
నేడు ప్రపంచం వ్యాప్తంగా చోటుచేసుకుంటున్న పరిణామాల నేపధ్యంలో, ప్రత్యేకించి, మరీ ముఖ్యంగా జలవనరుల వినియోగం విషయంలో, ఇరుగు-పొరుగున వున్న వివిధ దేశాల మధ్య స్నేహ సంబంధాలు
పెంపొందించుకునే దిశగా జరిగిన అనేక ఒడంబడికల నేపధ్యంలో, అప్పటి మహారాష్ట్ర ప్రభుత్వ పాలకులు గానీ, పూర్వ ఆంధ్రప్రదేశ్ పాలకులు గానీ ఏ విధమైన ఆలోచన చేయకపోవడం, చొరవ చూపకపోవటం విచారకరం. వాస్తవానికి
అప్పట్లో అటు కేంద్రంలోనూ, ఇటు ఉభయ రాష్ట్రాలలోనూ వున్నది
కాంగ్రెస్ ప్రభుత్వాల పాలనే! అలాగే పెన్
గంగ, ప్రాణహిత, గోదావరి నదులపై తలపెట్టిన ప్రాజెక్టుల
విషయంలో అంతర్ రాష్ట్ర వివాదాలు అనేకం చోటు చేసుకున్నా వాటి పరిష్కారానికి ఏ
విధమైనా చర్య తీసుకోలేదు. క్రమేపీ సమస్యలు పరిష్కారం కాకపోగా
మరింత జటిలం కాసాగాయి.
ఒక
మోడల్ డాక్యుమెంటుగా పేర్కొనాల్సిన ఈ అవగాహన ఒడంబడికలో, భవిష్యత్ లో, బారేజీల నిర్మాణ క్రమంలో ఇరు రాష్ట్రాలు చేయాల్సిన, చేయకూడని పలు
అంశాలు పొందుపరచడం జరిగింది. ప్రామాణికతలకు అనుగుణంగా పొందాల్సిన అనుమతులు, చేపట్టవలసిన చర్యలు, వరద నీటి సంబంధమైన అధ్యయనాలు, భూసేకరణలు, ప్లడ్ బ్యాంక్ ల నిర్మాణం, నీటి సామర్థ్యం పరీక్షలు, ఖర్చులు, నీటి బట్వాడా, తాగునీటి అవసరాలు, మత్స్యకారుల సమస్యలు, నావిగేషన్
హక్కులు లాంటివి ఇందులో ప్రధానంగా వున్నాయి. ఇరు రాష్ట్రాల
ప్రభుత్వాలు ఒడంబడిక మేరకు పనులను వేగవంతం చేసి బారేజీల త్వరితగతి నిర్మాణానికి
దోహదపడే చర్యలు చేపట్టాలని కూడా ఒప్పందంలో పొందుపర్చడం జరిగింది.
ఇరుగు పొరుగున వున్న
రాష్ట్రాలు కాని,
దేశాలు కాని, సమర్ధవంతంగా, సక్రమంగా జలాలను పంచుకునే విషయంలో దౌత్యం-రాజనీతి ప్రధానమనేది ప్రపంచ
వ్యాప్తంగా అనుభవం నేర్పిన పాఠం. అంతర్జాతీయంగా చరిత్రను నిశితంగా పరిశీలించినట్లయితే జలాల విషయంలో
ప్రపధమ ఒప్పందం క్రీస్తు పూర్వం 2500 లో మొదలయింది. అప్పట్లో నిరంతరం విభేదించుకుంటున్న మెసపోటేమియా పట్టణాలు–రాష్ట్రాలైన , లగాష్, ఉమ్మా
ప్రాంతాలు తొలి సంధి సంతకాలు చేపట్టడం ద్వారా టైగ్రిస్ నది నీటి వినియోగ పంపకాలకు
ఆస్కారం కలిగింది.
ఆ క్రమంలో దరిమిలా రమారమి 3600 జలవనరుల ఉపయోగ ఒడంబడికలు అంతర్జాతీయంగా చేపట్టడం జరిగింది. ఎన్ని విభేదాలు చోటు చేసుకున్నప్పటికీ, యుద్ధాలు
జరిగినప్పటికీ సంబంధిత దేశాలు, రాజ్యాలు, అందుకు బద్దులై ఆయా సంధి ఒడంబడికలను
తుచ తప్పక పాటించటం పరిపాటయింది. ఇందుకు చక్కని మచ్చుతునక “ఇండస్ రివర్
కమిషన్”. ఈ రివర్ కమిషన్ ఏర్పాటు
అనంతరం భారత పాకిస్థాన్ ల మధ్య మూడు మార్లు
యుద్ధాలు జరిగినప్పటికి నిలదొక్కుకోగలిగింది. ఇప్పటికీ
నిరంతరాయంగా సంప్రదింపులు, స్వల్ప సమస్యల పరిష్కార చర్యలు, సమన్వయం, పర్యవేక్షత, గణాంకాల పరిశీలనల ద్వారా కొనసాగింపబడుతోంది.
భారత పాకిస్థాన్ దేశాల మధ్య జరిగిన జలదౌత్య ఒప్పందం అంతర్జాతీయ
ఒప్పందాలలో అత్యంత ప్రనుఖమైందిగా పేర్కొంటారు. బ్రిటిష్ ఇండియా పునర్విభజన నేపధ్యంలో ఇండస్ బేసిన్ లో ఎక్కువ
స్థాయిలో జలాలు ఉండటం వివాదాలకు దారితీసింది. అప్పటి నూతన దేశాలు జల వినియోగం, సాగునీటి అవసరాల సర్దుబాట్లు ఏ విధంగా చేపట్టాలి అన్న దిశలో మొదట్లో
ఏక పక్షంగా వ్యవహరించాయి. ఏది ఏమైనప్పటికి “ఇండస్ వాటర్స్ ట్రీటీ” గా పేర్కోనబడ్డ జలదౌత్యం ప్రపంచ
బ్యాంక్ ద్వారా భారత, పాకిస్థాన్ దేశాల మధ్య కరాచీలో సంధి పత్రాలపై సంతకాలు చేసుకోవడానికి
ఊతమిచ్చింది.
నాటి భారత ప్రధాని దివంగత పండిట్ జవహర్ లాల్
నెహ్రూ, నాటి పాకిస్థాన్ అధ్యక్షులు దివంగత ఆయూబ్ ఖాన్ లు సెప్టెంబర్ 19, 1960లో సంతకాలు చేశారు. ఈ జల సంధి ఒడంబడిక ద్వారా తూర్పున ఉన్న
బీస్ నది, రవి,
సట్లెజ్ నదుల నియంత్రణ భారతదేశానికి, పడమటి దిక్కున వున్న ఇండస్, భిసాబ్, జేలమ్ నదుల నియంత్రణ పాకిస్థాన్ కు అప్పజెప్పటం జరిగింది. పాకిస్థాన్ నదులు తొలుత భారతదేశం మీదుగా ప్రయాణిస్థాయి కాబట్టి
సంధిలో మన సాగునీటి అవసరాల వినియోగానికి, ప్రయాణానికి, విద్యుత్ అవసరాలకు అనుమతించడం జరిగింది. దరిమిలా 1960లో జరిగిన “ట్రీటీ రాటిఫికేషన్” ద్వారా భారత, పాకిస్థాన్ దేశాల మధ్య నీటి యుద్ధాలకు పూర్తిగా ముగింపు
పలికినట్లయింది.
ఇదే తరహాలో ఇంకో చక్కని ఉదాహరణగా
చెప్పుకోదగ్గ విషయం భారత బంగ్లాదేశ్ ల మధ్య జరిగిన గంగా నదీ జలాల వినియోగ ఒప్పందం.
ఇరు దేశాల మధ్య పారే గంగానది ఉత్తర భారతం నుండి బంగ్లాదేశ్ కు ప్రవహిస్తుంది. ఈ విషయంలో 35 సంవత్సరాల పాటు వివాదం చోటు చేసుకుంది.
పలు రకాల అంతర్గత ఒడంబడికలు, సంప్రదింపులు పరిష్కారం చూపలేకపోయాయి. క్రమేణా సమగ్రమైన అంతర్గత సంధి ఒడంబడికకు సంబంధించిన సంతకాలు అప్పటి
భారత ప్రధాన హెచ్.
డి. దేవేగౌడ, నాటి బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా వాజేద్ ల మధ్య డిసెంబర్ 12, 1996న ఢిల్లిలో జరిగాయి. ఈ సంధి వల్ల 30 సంవత్సరాల సమస్యకు, జల పంపకాలకు ఒక అవగాహన కుదిరి గుర్తింపు పొందిన బంగ్లాదేశీయ హక్కుల
ఆధారంగా “ లోవర్ లెవెల్
రిపారియన్” పేరుతో పంపకం జరిగింది.
విజయవంతంగా నీటి వినియోగం, పంపకం, సర్దుబాట్లు అన్నవి ముఖ్యంగా నిర్దేశిత
ప్రామాణికతలపై,
కట్టుబాట్లపై, సమగ్ర
సంప్రదింపులపై ఆధారపడతాయి. పరస్పర సహకారం, సక్రమ వినియోగం, సరైన ఆలోచనలతో కూడిన అవగాహన ఒడంబడికలు
దీర్ఝకాలం మనుగడ సాగేందుకు దోహదపడతాయి. వీటిన్నింటి
సమ్మిళితమే తెలంగాణ మహారాష్ట్ర మధ్య జరిగిన ఒడంబడిక. ఈ దిశా నిర్దేశాలను తూచా
తప్పకుండా పాటించటంలో ఇరు రాష్ట్రాలూ విజయం
సాధించాయి. భవిష్యత్ లో ఇతరులకు మార్గదర్శికంగా కూడా వుండబోతున్నాయి.
భారత
దేశంలో అనేక నదులు అంతర్ రాష్ట్రంగా పారుతుంటాయి. కొన్ని
నదులు ఒక రాష్ట్రానికే పరిమితం కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ పారుతుంటాయి. నీటి అవసరాలు పెరుగుతున్న నేపథ్యంలో అంతర్ రాష్ట్ర కలహాలు ఏర్పడుతూ
ఉంటాయి. ముఖ్యంగా నీటి పంపకాల విషయంలో ఇది పరిపాటి. ఇందుమూలంగానే 1956లో “ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ట్రిబ్యూట్ యాక్ట్” పేరుతో ఆర్టికల్
262 లో పేర్కోన్న విధంగా భారత
రాజ్యాంగం రూపొందించింది. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు నేపధ్యంలో జల వివాదాలు
తలెత్తిన పక్షంలో తగు చర్యలు తీసుకోవటం కొరకు ఈ చట్టాన్ని
తెచ్చారు. తద్వారా నీటి వినియోగం, అంతర్ రాష్ట్ర సర్దుబాట్లు చేయాలన్న
ఆలోచన జరిగింది. ఈ చట్టంలో అనేక మార్పులు కూడా కాలానుగుణంగా చోటు చేసుకున్నాయి. ఈ చట్ట్ర
ప్రకారం ఎగువ ప్రాంతాలు, దిగువ ప్రాంతాలు వాటి సమస్యలు అన్నవి
పరిష్కరించటం అన్నవి ఒక అంశం.
కాకపోతే
ఎంతమేరకు ఈ చట్టం వల్ల అంతరాష్ట్ర సమస్యల పరిష్కారం జరిగింది అన్నది చర్చనీయాంశం.
నిజంగా ఆ చట్ట్రమే సక్రమంగా అమలయినట్లయితే గోదావరి నదిపై మహారాష్ట్ర ప్రభుత్వం 450 పైగా బ్యారేజీలను, చెక్ డ్యాంలను నిర్మించడం సాధ్యపడేదా? కేంద్ర “ఇంటర్ స్టేట్ రివర్ వాటర్
డిస్ట్రిబ్యూట్ యాక్ట్” ద్వారా చేయలేని
పని దౌత్య నీతి ద్వారా, రాజనీతి ద్వారా తెలంగాణ ముఖ్యమంత్రి
చంద్రశేఖర్ రావు చేయగలిగారు. ఫలితంగానే “మహారాష్ట్ర - తెలంగాణ”ల
మధ్య ఒడంబడిక జరిగింది.. ఇతర రాష్ట్రాలకు మార్గగామిగా
నిలబడగలిగింది.
తెలంగాణ ముఖ్యమంత్రి
కె. చంద్రశేఖర్ రావు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర
ఫడ్నవీస్ ల మధ్య కుదిరిన బారేజీల నిర్మాణాల ఒప్పందాలు, చరిత్ర పుటల్లో సువర్ణాక్షారాల్లో లిఖించబడతాయి అనటంలో సందేహం లేదు. ఇది ప్రప్రధమ అంతర్జాతీయ
ఒప్పందమైన "లగాష్ ఉమ్మా ట్రీటీ", భారత పాకిస్థాన్ ల మధ్య జరిగిన “ఇండస్ వాటర్స్
ట్రీటీ”, భారత్ బంగ్లాదేశ్ ల మధ్య జరిగిన “గేంజెస్ రివర్
వాటర్స్ ట్రీటీ” లకు ధీటుగా చరిత్ర పుటల్లోకి ఎక్కుతుందని అనడంలోనూ అతిశయోక్తి
లేదేమో! End